పేదరికానికో అడ్డుగోడ(కవిత )-బి.రమేష్

తరతరాలుగా మన సింబల్ గా ఉన్న
పేదరికాన్ని సడన్ గా మారుస్తారా!
అందనంత ఎత్తులో ఉన్న పేదరిక స్థాయి
వరకూ గోడలు నిర్మస్తారా!
నమ్మలేకపోతున్నాను…?
ఆకాశమంత ఎత్తు వరకూ విగ్రహాలు
నిర్మించిన వాళ్లకి గుడిసెలు కనిపించకుండా
మూసేయడం పెద్ద పని కాదు
కలివిడిగా బతుకుతున్న మనుషుల మధ్య
కనబడని గోడలు కట్టిన వాళ్లకి
మురికి బతుకుల్ని కూల్చడం అదొక పనే కాదు
అవునూ…!
ఎన్నడూ ఏ దేశాధినేత, స్వదేశాధినేత
పర్యటల్లో రాని పేదరికపు వాసన
నేడు పచ్చికొంపు కొడుతుందా
పేదరికం నుండి వచ్చానని చెప్పుకునే ప్రభుత్వాధినేతకు
నేడు పేదరికం మురికి వాసన
ముక్కుపుటల్లోకి చొరబడుతోందా
దేశంలో పేదరికాన్ని తరిమేయ లేని ప్రభుత్వం
తన చేతకానితనాన్ని కప్పుకోవడానికి
అడ్డుగోడలు కట్టుకుంటోందా
భారతదేశం పేదరిక రహిత దేశమని ఎలుగెత్తి

కాదు…కాదు…గోడెత్తి చెప్పాలనుకుంటోందా
కట్టండి…కట్టండి…
అగ్రదేశాధినేత కళ్లకు కనిపించకుండా
భారతదేశ గ్రామ గ్రామంలో గోడలు నిర్మించండి
వారి కార్ల టైర్ల సున్నితత్వం కోసం
ఊరి ఊరికీ రోడ్లు వేయించండి
నెల నెలా ఓ దేశాధినేతను భారత దేశ మురికివాడ
పర్యటనకు పిలిపించండి
పల్లెల్లో పట్టణాల్లో మురికివాడల రూపురేఖలు మార్చేయండి
అవునూ…!
గుడిసెలు కనిపించకుండా గోడలు కడుతున్నారు
ఆ గుడిసెల్లోంచి వచ్చే వాసన పీల్చకుండా ఉండడానికి

అతని నాసికానికి ఏం కడుతున్నారు?

బి. రమేష్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

2 Responses to పేదరికానికో అడ్డుగోడ(కవిత )-బి.రమేష్

  1. రాఘవ says:

    నిజం చెప్పారు…అండీ…

  2. రాఘవ says:

    రమేష్..గారు…మీ కవిత చాలా బాగుంది..ఆలోచింప జేసే విధంగా ..రాశారు..ధన్యవాదాలు