*బ్రతకడమిప్పుడు ముఖ్యం* – వెంకట్ కె

దేవుడా రక్షించు నాదేశాన్ని

అగ్నిశిఖలు విరజిమ్ముతూ

లావాలా ఉప్పొంగుతూ నలుదిశలా విస్తరిస్తూ

మృత్యువు వీర విహారం చేస్తోంది

ఎక్కడో ముసలం పుట్టింది

నేడిక్కడ కరాళ నృత్యం చేస్తోంది

గట్టుమీద పడ్డ చేపపిల్ల 

గిలాగిలా కొట్టుకున్నట్లు

ఆకలిబాధ తాళలేక

బడుగు బలహీనులు అలమటిస్తున్నారు

ఎడారిలో నీటి చెలమ కోసం వెతికి వెతికి విసిగి వేసారినట్లు

తినడానికి కూడులేక నకనకలాడుతున్నారు

వలసజీవుల వెతలు వర్ణనాతీతం

కార్మికలోకం కష్టాల కొలిమిలో కరిగిపోతుంది

వలసపక్షుల్లా ఖండాలు దాటెళ్లిన వారి జీవితాలు

ఆ మాయా మహమ్మారి విసిరిన వలలో చిక్కుకొని

ఉండేలు దెబ్బకి విలవిలలాడే ఉడత పిల్లలా గిలాగిలా కొట్టుకుంటున్నాయి

గుప్పెడు తిండిగింజలు దొరక్క రైతుకూలీ

ఊరపిచ్చుకలా గుమ్మగుమ్మానికీ తిరుగుతున్నాడు

పొత్తిళ్లలో బిడ్డకు

గుక్కెడు పాలకోసం

తన పొట్టలో పిడికెడు బువ్వపడక వట్టిపోయి స్థనాల

నుండి పాలచుక్క రాక

రోధించే ఆ తల్లిపడే ఆవేదన నివేదన ఆలకించయ్యా

ఎందరో అనాథలు ఆకలితో అలమటిస్తున్నారు

ఆలకించి ఆదుకోవయ్యా

కవికోకిల ‘గబ్బిలం’లా 

ఈ అన్నార్తుల ఆవేదన మోసుకురాలేను

ఆనాడు కాకులకాజ్ఞ ఇచ్చి ఆహారం పంపావే

నేడిక్కడ ఆపన్నహస్తం కోసం

ఎదురు చూసే బడుగుల కోసం 

జీవాహారం అందించయ్యా

అలల తాకిడికి నిలబడలేని నావను లంగరువేసి నిలబెట్టినట్లు

సకల జీవరాశిని తన మృత్యుకుహరంలో బంధించి ప్రాణాలను హరిస్తున్న

ఆ రాకాసి కబంధహస్తాల నుండి విముక్తి కలిగించయ్యా

బ్రతకడమిప్పుడు ముఖ్యం.

           

– వెంకట్ కె

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.