అరణ్యం -5 భాగం  వృక్ష సాక్ష్యం – దేవనపల్లి వీణావాణి

అడవి గురించి రాయడమంటే సముద్రాన్ని తవ్వడమే. ఎన్నో చిత్రాల అడవి …తెలుసుకున్న కొద్దీ తెలుసుకున్నంత … అది అనంతం  కూడా …నీలో ఉన్న బ్రహ్మండమే  బయట ఉన్నది ..బయట ఉన్నదే నీలో ఉన్నది అన్న తాత్విక సత్యం తెలుసుకోవడానికే మన జీవన విధానంలో  వానప్రస్థాశ్రమాన్ని కల్పించి ఉంటారు మన పూర్వీకులు..మా సుకృతం కొద్దీ శక్తి ఉడిగి పోక ముందే మేము వానప్రస్థం చేస్తూనే జీవికను పొందే భాగ్యం కలిగింది. రోజువారీ పనులు అటుంచితే ఒక్క అటవీ అధికారి మాత్రమే పొందగల అలౌకిక ఆనందం ఇదే అని అనుకుంటాను.  ఒక సారి అటవీ శిక్షణా సంస్థలో  పాఠం చెప్పడానికి అనుభవంలో పెద్దాయన ..వయసులో చాలా చిన్నాయన ఒకరు వచ్చారు…ఆయనని మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకమేది అనడిగాను. అలా అడిగి ఆయా పుస్తకాలను సేకరించుకోవడం నాకు అలవాటు. అందుకు ఆయన ” Nature is my Best Book ..Whenever I want to learn something, I will go to Forest ” అన్నారు.నిజానికి ఆయన భౌతిక శాస్త్రంలో ఆచార్యులు. మరొక మానసిక వైద్యుడిని ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన కూడా ” మనోవ్యాధికి గురైన ఎంతో మందికి ఉపశమనం కలిగించాక నాకు ఎంతో ఒత్తిడి కలుగుతుంది..అప్పుడు నేను అడవికి మాత్రమే వెళ్తాను ” అన్నారు. ఇంకా  మీకు తెలిసన ఏవైనా ప్రకృతి రమణీయ ప్రాంతాల గురించి చెప్పండి అనికూడా అడిగారు.   నా మటుకు ఈ మాటలు ఎంతో నిజం..అడవి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది..అంతకు మించిన ఆనందం కూడా..

ప్రతి అటవీ అధికారి తన జీవిత కాలంలో   సరాసరిన పది వేల రోజులు అడవిలో గడిపే అవకాశం కలిగి ఉంటాడు. గడియారం ముల్లుతో పాటే  పరుగెత్తవలసిన ఆధునిక కాలంలో నిశ్చలంగా అడవిలో గడిపే సమయం లభించడం   ఎంత అదృష్టమో కదా.. అడవితో సహజీవనం అంటే ఎంతో తెలుకునే అవకాశం కూడా నన్నమాట.

అటవీ అధికారుల విధులను ఒక గాటన కట్టలేము..ఎన్నో పనులు ..ఉన్న వనరులను కాపాడుకోవడం, వాటి విలువను పెంచడం , జంతువుల ఆవాసలను సంరక్షించడం వంటివి  హోదాలకు అతీతంగా ఇవ్వబడిన విధులు. అన్నీ జాగ్రత్తగా , శాస్త్రీయంగా నిర్వర్తించాల్సినవే. అటవీ శాఖలో అతి చిన్న కార్యనిర్వాహక విభాగాన్ని బీటు అంటారని ఇంతకు ముందే చెప్పాను కదా..ప్రతీ బీటుకు ఒక  అధికారి  బీటు అధికారి  ఉంటాడు. ఇతనినే వనసేవకుడు  అని కూడా అంటారు . ఇతను తన బీటు పరిధిలో అటవీ సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు.ఇతను నిర్ణీత  కాలంలో  నరికి వేయబడిన చెట్లు , కొత్తగా మొలకెత్తుతున్న చెట్లు  , అటవీ భూమి  అక్రమిత వివరాలు , వన్యప్రాణులు వంటి వివరాలు కూడా నమోదు చేయవలసి ఉంటుంది. ఇందుకు గాను ఒక రిజిస్టర్ కేటాయించి ఈ వివరాల్ని  నమోదు చేస్తారు. ఒక వేళ అక్రమంగా చెట్లు నరికివేతకు గురైతే అందుకు ప్రతిగా ఆ వన సేవకున్ని బాధ్యునిగా చేసి చర్యలు తీసుకోవడమే కాకుండా నరికి వేయబడిన చెట్ల విలువను  అతని జీతం నుంచి మినహాయిస్తారు. ఇలా నష్టపోయిన  ప్రభుత్వ ఆస్తికి  సమానమైన మొత్తాన్నిఅదే ప్రభుత్వ అధికారినుంచే రాబట్టడం అదీ అతని ప్రమేయం ఉన్నా లేకపోయినా అన్నది చాలా సంధర్భాలలో  బీటు అధికారులు, ప్రజల చేత నరికివేయబడిన చెట్ల విలువను తన జీతంలోనుంచి కోల్పోవడానికి కారణమౌతుంది  . ఈ విధమైన ఏర్పాటు ఒక్క అటవీ శాఖలోనే  ఉన్నది. విలువైన వృక్షాలు ఉన్న చోట ఇలా కోల్పోయే జీతం పెద్ద మొత్తమే అవుతుంది. ఇక అటవీ భూ భాగాన్ని కాపాడుకోవడం ప్రతీ అటవీ అధికారి విధి.  ప్రతి స్థాయి అధికారికి వారి హోదాను బట్టి అధికారాలు ఇచ్చి ఈ విధులన్నీ నిర్వహిస్తుంటారు. ఇవ్వాళ అలాంటి పని మీదే మేము మేడపల్లి బీటు ప్రాంతానికి వెళ్తున్నాం. పనిలోపనిగా  నాతో పాటు నా పుస్తకాలూ.. నేనూ..

మేడపల్లి, వరంగల్ గ్రామీణ జిల్లాలో ప్రధాన పట్టణమైన నర్సంపేటకు ఉత్తరంగా పదిహేను  కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బానోజీ పేట , మేడపల్లి , గోవిందాపూర్ నర్సంపేట వరంగల్ గ్రామీణ జిల్లాకి చెందినవి . మేము ఈ రోజు చూసి నివేదిక రాయవల్సిన అటవీ ప్రాంతం మేడపల్లి వన్యప్రాణి బీటు, ఇంకా మేడపల్లి బీటు కూడా ఉంది. వన్యప్రాణి సంరక్షణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కనుక వన్యప్రాణుల కొరకు  ప్రత్యేకంగా   చిక్కని అటవీ ప్రాంతాన్ని వన్యప్రాణి బీట్లుగా నిర్ణయిస్తారు. అటువంటి వాటిలో ఇది ఒకటి.

అడవికి వెళ్ళేపని ఉంటే నేను వీలైనంత  పొద్దున్నే వెళ్ళడానికి ఇష్టపడతాను. అందుచేత ఉదయం ఆరున్నర గంటలకే నేను , మా బృందంతో కలిసి  నర్సంపేట నుంచి బయలుదేరాం. నర్సంపేట్ నుంచి ఉత్తరం వైపుగా ముత్తోజీపేట, ఇటుకాలపల్లి, ఆకుల తండా , నాగయ్య పల్లె , గుండ్ల పహాడ్ నుంచి కుడి వైపు వెళ్తే  మేడపల్లి  వస్తుంది. ఈ పల్లెలన్నీ  దాటుకొని గుండ్ల పహాడ్ చేరుకునేటప్పటికి సమయం ఏడున్నర గంటలయింది.ఇంకా తొందరగా కూడా వెళ్ళవచ్చు. అయితే చుట్టుపక్కల చూస్తూ వెళ్తున్నాం. గుండ్ల పహాడ్ గ్రామం నల్లబెల్లి మండలానికి చెందింది.  తదుపరి ప్రయాణంలో గుండ్ల పహాడ్ ఊరి నుంచి  మూల మలుపు దాటి ముందుకు  వెళ్ళవలసి ఉంటుంది.మేమూ అలాగే వెళ్తున్నాం.

దారి వెంట  వెళ్తుంటే చిన్న ఇళ్లు, పశువుల పాకలు, పసుపు బట్టలు కట్టుకున్న  బొడ్రాళ్లు , సాదాసీదాగా అచ్చంగా  అమాయకంగా చూసే, ఎదుగుతున్న పసిపాపల్లా ఉన్నాయి.ఈ  పల్లెలు..అన్ని ఊళ్ళ లాగే కొన్ని ఇల్లు ,కొన్ని పొలాలు, కొంత అడవి…అంతా సవ్యంగా ఉన్నట్టే ఉంది. అలుకు చల్లిన వాకిళ్ళలో పురుగులు ఏరుకుంటున్న కోళ్ళు , వరుసలుగా నాటిన  పట్నం బంతి చెట్ల మీద ముసురుకుంటున్న తేనెటీగలు ,రంగు రంగుల గోరింట పూలు , వంకర టింకరగా అల్లిన కట్టె పుల్లల   దడి ,దడి సందుల్లోంచి ముదురాకుపచ్చ చీరచుట్టుకొని  ఎర్రని నాలుక చాపిన అమ్మవారి వలె ఉన్న  మందార పూరెక్కలు..చిన్నప్పుడు మా ఊరి వాడలు కూడా ఇలాగే ఉండేవి.   అప్పట్లో దాదాపు అందరు ఇళ్లల్లో బర్రెలో ,ఆవులో ఉండేవి. వాకిలి ఊడ్చిన కసుపు ఒక కుప్పగా పోసి పెంట కుప్ప అని అనే  వాళ్ళు. పెంట కుప్ప  పెద్దదిది అయ్యాక రైతులకు  అమ్మేసే వాళ్ళు ,అలా వచ్చిన డబ్బులు ఇంటామెకే. పెంట కుప్పకు పక్కనే  రాస గుమ్మడి, బూడిద  గుమ్మడి నాటుకునేవాళ్ళం .బతుకమ్మ పండగ కోసమని నాటుకున్న గుమ్మడి తీగ  పెంట మీద ఉండేది.అలా పెంట కుప్ప పక్కనే నాటితే పెద్ద పెద్ద గుమ్మడి పూలు పూస్తాయని చెప్పేవారు. చూస్తూ చూస్తూ నేను నా చిన్ననాటి రోజుల్ని తడుముకున్నాను.ఇలాటి దృశ్యాలు తగిలినపుడు  అప్రయత్నంగా చిన్న పిల్లనై పోతుంటాను..నేనె ఈ వాడలన్నీ నా స్నేహితురాళ్లతో తిరిగినట్టు గుర్తుకువస్తుంది. అయితే

మా ఊరు  ఇప్పుడు ఇలా లేదు. పెంకుటిల్లులు అరుదై పోయాయి. అంతా మారిపోయింది. మునుపు ఉన్నవేవీ  లేవు. కానీ  ఈ రోజు ప్రయాణంలో కనిపించిన పల్లెలు నా చిన్ననాటి ఊరునే తలపించాయి.. అంటే ఈ  గ్రామాలు ముప్పై ఏళ్లు వెనుకబడి ఉన్నాయా ,లేక కొత్తగా ఏర్పడుతున్న గ్రామాలు అని అనుకోవచ్చునా ..లేక మరేదైనా కారణం చేత పాత గ్రామాలు …తిరిగి వృద్ధిచెందుతున్నాయా. ఇక్కడ నివాసముంటున్న వీళ్ళు ఆనాటి వాళ్ళ  తరాలేనా.. వలస వచ్చిన వారా .. ఇంతకు ముందు వాళ్లే అయితే  శతాబ్దాల తరబడి ఇలాగే ఉండిపోయారా…యే నవయుగాల గాలి సోకకుండా  ఎలా గడుస్తున్నది వీళ్ళకి…ఈ ఊర్లే కాదు అటవీ పరిసర గ్రామాలను చూసినప్పుడు నాలో నిర్ద్వంద్వంగా ఇటువంటి ప్రశ్నలు ఉబికి వస్తుంటాయి.

అనుకున్నట్టుగానే గుండ్ల పహాడ్ మూల మలుపుకు చేరుకున్నాం. కొంత దూరం వెళ్ళాక ఏదో గంభీరంగా ఉన్న శిథిల మందిరపు ఆనవాళ్లు కనిపించాయి..దానికి ప్రాకారం ఏమీలేదు.. రెండు పెద్ద పెద్ద చెట్లు మూలకు చెరో వైపు ఉన్నాయి.

బయట నుంచి యే ఆర్భాటమూ లేని ఉత్త రాత్రి పేర్పులా ఉంది. ఇలా బయట నుంచి యే ఆకర్షణా లేకుండా ఉండే మందిరాలు భారత దేశంలో  చాలానే ఉన్నాయి. అప్పుడెప్పుడో రాజస్థాన్లోని మౌంట్ అబూకి వెళ్ళినప్పుడు ప్రసిద్ది  చెందిన దిల్వారా జైన మందిరాలను పరిచయం చేసిన పరిచయ కర్త (గైడు ), ఆ మందిరాల గురించి చెప్తూ  విదేశీ  దండయాత్రలనుంచి కాపాడుకోవడానికి  జైనులు ఇలా బయట వైపు ఎటువంటి ఆర్బాటం లేకుండా మందిరాలు నిర్మించారని చెప్పుకురావడం  గుర్తుకువచ్చి  ఆగిపోయాను. ఏమో ఈ  శిథిల మందిరం మనకు యే రహస్యం చెప్పాలని ఇంకా మౌనంగా ఎదురుచూస్తున్నదో , భవిష్యత్తుకు యే సందేశాన్ని, చరిత్రను చెప్పాలని ఆ శిల్పులు తలచారో కదా , ఒక సారి చూస్తే బాగుండునని అనిపించింది. ఇటువంటివి చూసినప్పుడు  చరిత్రలో వీటి స్థానమేమిటో తెలుసుకోవాలని ఆరాటం కలుగుతుంది. మనిషి వందేళ్ళు మాత్రమే బతుకుతాడు,కానీ తన  చరిత్రను  ఎన్ని ఏళ్ళైనా బతికించుకోగలడు. వేల సంవత్సరాల నాటి మానవ నిర్మిత చారిత్రక అవశేషాలే ఇందుకు పెద్డ ఉదాహరణ. అన్ని చోట్ల లాగానే ఇక్కడ కూడా ఏ పురా అవశేషమో మన కోసం వదిలే ఉంటారు.ఇటువంటివి కనపడినప్పుడు    మన ముందు గుట్టు విప్పుకునే రహస్యానికి జోడించే సాక్ష్యం ఏమైనా దొరుకుతుందా అని నా అరణ్య ప్రయాణాలలో నేను వెతుకుతుంటాను. ఒక్కో సారి వాటికి  అవి నా కళ్ళకి ఎదురుపడి వాటి గోడు వినమంటాయి , గొంతెత్తి చెప్పమంటాయి. ఆ సందర్భం నాకో అవకాశం అనే  అనుకుంటాను,  ఒక లంకెను కలుపడానికి ఉద్యుక్తురాలని అవుతూ తన్మయం చెందుతుంటాను. ఈ రోజు కూడా ఒక అలాటి రోజేనేమో అది ఈ జీర్ణ మందిర రూపంలో ఎదురుపడింది.

అప్పటికి ఇంకా లేత ఉదయమే..వాతావరణం  ప్రశాంతంగా ఉంది. గుడి ఆవరణ  చక్కగా ఊడ్చి నీళ్ళు జల్లి , ముగ్గు పెట్టి ఉంది. దీపం వెలుగుతున్నది. మూలవిరాట్టు శివుడి మూర్తిపై రాసిన విభూతి రేఖలు ఇంకా తడి తడిగానే ఉన్నాయి. అప్పుడే  పూజ చేసి వెళ్లినట్లున్న మందిరావరణం కడిగిన వృద్ధ మానులా   దర్శనమిస్తోంది. ఆలయం పరిసరాలలో శిల్పాలు , వాటి విడి విడి భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బహుశా ఒకప్పుడు త్రికూట ఆలయం కావచ్చు. ఒక ప్రధాన ఆలయం, కుడి పక్కన మరో ఆలయం ఉన్నాయి ,రెండు భాగాలు మాత్రమే  గుర్తించదగినవిగా  ఉన్నాయి. మధ్యలో  ఉన్న మండపం  ఒక పక్క అంతా భూమిలోకి  ఒరిగిపోయి ఉంది. బయట వైపు ఎటువంటి అలంకారాలు లేకుండా  ఉత్త రాళ్ళుపేర్చినట్టు  ఉంది కానీ లోపల శిల్పాలు ఉన్నాయి.  గుడి ముందు భాగంలో పెద్ద వేప చెట్టు, లోపల మర్రి చెట్టు ఉన్నాయి. వాటి కింద కప్పుల్లా చెక్కిన శిల్పంలో నీళ్లు అచ్చంగా ఫెంగ్ షూయ్ ప్రకారం  పువ్వులు వేసిపెట్టే మట్టి పాత్రలాగానే ఉన్నా అందమైన చెక్కణపు పని  ఉంది.  ఆ చెట్లు మందిర ఆవరణలో ధ్యానిస్తున్న ఋషుల్లా నిశ్శబ్దంగా నిలుచున్నాయి.

  కొన్ని ఫోటోలు తీసుకున్నాను. కొత్త తెలంగాణ చరిత్ర పేరుతో పరిశోధన చేస్తున్న  శ్రీరామోజు హరగోపాల్ గారు గుర్తుకువచ్చి వారికి వాట్స్అప్ లో  ఫోటోలు పంపాను,ఏమైనా చెప్తారేమోనని.

 ఈ లోగా మా బృందం కూడా మందిరాన్ని దర్శించుకున్నారు. హరగోపాల్ గారు  వెంటనే బదులిచ్చారు.  వారు చెప్పినదాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి శిల మీద చెక్కిన  తోరణం శంఖలతా తోరణం అనీ, మధ్యలో ఉన్న మండపాన్ని రంగ మండపం అనీ, గుడి వద్ద ఉన్న పురాతన చెట్ల కింద  విసరి వేసినట్టు ఉన్న గిన్నె లాంటి శిలలను కప్పు శిలలు అంటారని చెప్పారు. ఈ మందిర శిల్పాలు రాష్ట్రకూట శైలికి చెందినవని కనుక  ఒకప్పుడు జైన ఆలయంగా ఉండి తదుపరి శివాలయంగా మారి ఉంటుందని ,అక్కడ ఉన్న ఆధారాలు అందుకు సరిపోలతాయనీ అన్నారు. మందిరంలోని  మూల విరాట్టు కాకతీయ శైలిలో ఉన్న శివుడు . చుట్టూ ఉన్న శిల్పాలు  జైనుల అంటే రాష్ట్రకూటుల శైలి. నేను ఆశ్చర్య పోయాను. ఈ మధ్యనే పూర్తి చేసిన ఈ ప్రాంత చరిత్ర పుస్తకాలలో ( కాకతీయుల చరిత్ర – పి వి పరబ్రహ్మ శాస్త్రి) చెప్పిన విధానికి సరిగ్గా సరిపోలినట్టు నాకు  ఈ అటవీ పరిసర గ్రామంలో ఇంత తొందరగా  ఒక ప్రత్యక్ష సాక్ష్యం దొరకడంతో ఆనాటి  చరిత్ర అంతా కళ్ళ ముందు మెదిలినట్లు అనిపించింది. జవహర్ లాల్ నెహ్రూ తన డిస్కవరీ అఫ్ ఇండియా ( తెలుగులో భారత దర్శనం) అన్న పుస్తకంలో   భారత దేశ గంభీరతను విశ్లేషిస్తూ “ ఒకే రాతి మీద ఒకటిగా ఎన్నో శాసనాలు వ్రాసినా, అన్నీ దేనికదే సుస్పష్టంగా  కనబడే పురాణ శాసనంలా కనబడింది భారత దేశం” అని రాసాడు. బహుశా ఇలాటి దృష్టాంతాలే అందుకు భూమికనేమో .నేను అక్కడ చెట్టు కింద కూలబడ్డాను.  అప్పుడే పూజించి వెలిగించిన దీపం ఆ పురా మందిరపు ప్రభను  ఇంకా సజీవంగా ఉంచుతుండగా ధూపపు గాలి వెయ్యేళ్ళ వెనుకకు  తీసుకుపోతున్నది.

 భారత దేశానికి , అలా చెప్తే ఏ దేశానికైనా చరిత్ర  అంతా  యుద్దాలతోనే మొదలవడం ఒక అనివార్యత.  ఒకరి ఆధిపత్యం పై మరొకరు దాడి చేయడం, ఆ ప్రాంతాన్ని  ఆక్రమించుకోవడం..తమ సంసృతిని వ్యాప్తి చేయడానికి పూనుకోవడం.. ఇవే కనిపిస్తాయి. కాకపోతే సాక్ష్యాలు దొరికినంత వరకే  చరిత్ర. దొరకనిదంతా  కాల గర్భంలో  నిగూఢ రహస్యం.   ఒక దేశాన్నో , ప్రాంతాన్నో , సంస్కృతినో  అర్థం చేసుకోవాలంటే  అక్కడి చరిత్ర  పట్ల ఎంతో కొంత అవగాహన లేకుండా   అది సాధ్యం కాదు. పన్నెండేళ్ళ  క్రితం నేను ఇదే నర్సంపేట ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి చరిత్రను అన్వేషించే ప్రయత్నం చేశాను. అయితే అది ముందుకు పోలేదు. కొంత కాలం క్రితం ఆ లోటు పూరించబడి  నాకు  కావలసిన వివరాలు దొరకడం నాలో ఉన్న  జిజ్ఞాసను ఒక ఒడ్డుకు చేర్చింది.

ఇప్పటి జగిత్యాల జిల్లాకు ఆరు కిలోమీటర్ల దూరంలో పొలాస అనే గ్రామం ఉంది. దాన్నే పొలవాస అనికూడా అంటారు. ఎప్పుడో ఇరవై రెండేళ్ళ క్రితం అక్కడ  వ్యవసాయ పరిశోధన కేంద్రంలో  వ్యవసాయ శాస్త్రంలో రెండేళ్ళ  డిప్లొమా  కోర్సు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను రెండేళ్ళు ఉన్నాను.ఆ గ్రామానికే చెందిన స్నేహితురాలు వుండడం వల్ల  పొలాస గ్రామామలో  ఉన్న చెరువు , అక్కడి బ్రాహ్మణుల  ఇండ్లూ , పులస్తేశ్వరుని  గుడి చూడడం జరిగింది. పొద్దు పొద్దున్న పొలస చెరువు దగ్గర వేదం నేర్చుకుంటున్న పిల్లలు కనిపించేవారు.

మా స్నేహితురాలి తాత గారు , ఆ ఇంట్లో వాళ్ళు, అంతెందుకు ఆ గ్రామంలోని అందరూ చాలా చక్కని తెలుగు మాట్లాడేవారు. ఎంత చక్కగా అంటే ఒక యాభై ఏళ్ళ కిందటి తెలుగు పుస్తకంలో ఉండే భాష..నేను ఆశ్చర్యపోయేదాన్ని. నేను వారితో  మాట్లాడాలంటే కొంత ఇబ్బంది పడేదాన్ని కూడా. ఇప్పటి వరకు మళ్ళా అంత చక్కని తెలుగు భాషా నుడికారాన్ని వినలేదు.

అక్కడి ఇళ్ళు , మంథనిలో మా చుట్టాలు కిరాయికి ఉన్న బ్రాహ్మణ ఇల్లులాగే వుండేవి.నాకు ఆ వాతావరణం అప్పటికి చాలా కొత్త. అచ్చమైన తెలంగాణ పల్లె భాష మాత్రమే తెలిసిన నాకు ఆ భాషా విలాసం ఎంతో గానో ప్రభావితం చేసింది.  నేను  ఇటువంటి సాధారణ విషయాలను    గమనించాను  గానీ  అప్పడు అంతగా ఆ గ్రామ చరిత్ర తెలియదు. కనుక  అవన్నీ ఒక సరళ రేఖ గీసుకోవడానికి సరిపడే బిందువులనే ఆలోచన తట్టలేదు .

పొలాసగా ఒక చిన్న మారుమూల గ్రామంలా ఉన్న ఆ ప్రాంతం ఒకప్పుడు ఒక రాజ్యానికి చెందిన రాజధాని. ఆ ప్రాంతాధీశులు ఆ  గ్రామం పేరు మీదనే పొలవాస నాయకులుగా ప్రసిద్ది చెందారు. రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్న పొలవాస నాయకుల పాలన  క్రీ.శ.1080 -1160 వరకు కొనసాగింది.

కాకతీయులతో ఏర్పడిన వైరుధ్యాల వలన జరిగిన యుద్దాలలో కాకతీయల ద్వారా జయించబడి కాకతీయ సామ్రాజ్యంలో కలిసిపోయింది. పొలవాస రాజ్యం మొదటి మేడ రాజు ఆదిగా అతని కొడుకు జగ్గదేవుడు ,  జగ్గదేవుని సంతానమైన ఇద్దరు కొడుకులు రెండవ మేడరాజు , గుండ రాజు , ఆ తర్వాత రెండవ మేడరాజు కొడుకు రెండవ జగ్గరాజు కాలానికి అంతమైంది. ఈ ఎనభై  ఏళ్ళ  కాలంలోనే  వారు కావల్సినంత చరిత్రను మిగిల్చిపోయారు.  ఈ రాజుల పేరు మీదనే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల  మేడపల్లి పేరుతో గ్రామాలు వెలసాయి. ఇప్పటి జగిత్యాల ప్రాంతం పొలవాస రాజైన జగ్గ దేవుని పేరు మీద వెలసిందే.

 ఈ రోజు నేను వెళ్లవలసిన మేడపల్లి ప్రాంతం   కూడా ఈ రాజుల పేరు మీద ఏర్పడిందే. పొలవాస నాయకుల వంశ క్రమాన్ని తెలిపిన  జగ్గ దేవుని క్రీ.శ. 1112 నాటి శాసనం లభించింది ఈ రోజు నేను వెళ్లబోయే మేడిపల్లిలోనే.   అక్కడికే  నేను ఈ రోజు వెళ్తున్నది. మేడపల్లి పక్కనే ఉన్న గోవిందాపూర్లో  దొరికిన   మరొక శాసనం కూడా పొలవాస నాయకులకు చెందిందే.

          ప్రస్తుతం వరంగల్ గ్రామీణ జిల్లా లో ఉన్న ఇప్పటి ములుగు నర్సంపేట,    బానోజి  పేట, గోవిందాపూర్ , మేడపల్లి  ప్రాంతాలు పొలవాస నాయకుల అధీనంలోనే ఉండేవి.  జగ్గదేవుడు తన ఇద్దరు  కుమారులకు రాజ్యాన్ని పంచుతూ  గుండరాజుకు మంథని ( మంత్రకూటం), కరీంనగర్  ప్రాంతాన్ని (సబ్బినాడు) ఇచ్చి , మిగిలిన ప్రాంతాన్ని రెండవ మేడరాజుకు  ఇచ్చాడు . అంటే ఈ నర్సంపేట ప్రాంతాన్ని మెదటి మేడరాజు , జగ్గదేవుడు ,  రెండవ మేడ రాజులు  పాలించారన్నమాట.  రెండవ మేడరాజుకు, కాకతీయ రాజైన రెండవ  ప్రోల రాజు  సమకాలికుడు . పొలవాస, కాకతీయరాజ్యాధినేతలు  ఇద్దరూ ముందుగా రాష్ట్రకూటులకి తదనంతరం కళ్యాణ చాళుక్యులకి సామంతులుగా ఉన్న  సైనిక ప్రభువులు. రాజ్య విస్తరణలోనూ , స్వతంత్ర్యం  ప్రకటించుకోవడంలోనూ తలెత్తిన వివాదాలు యుద్దాలుగా మారాయి.కాకతీయ రాజైన  రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాప రుద్రుడితో జరిగిన యుద్దంలో  గుండరాజు వదించబడ్డాడని , మేడరాజు  అడవులలోకి పారిపోయాడని  రుద్రదేవుడు హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలో   శాసనం వేయించాడు. అడవులలోకి పారిపోయిన రెండవ మేడరాజు అడవి బిడ్డలైన కోయల ఆశ్రయం పొంది తిరిగి రుద్రదేవుడి పై యుద్ధానికి ప్రయత్నం చేస్తాడు. రుద్ర దేవుడు( మొదటి ప్రతాప రుద్రుడు )   మేడరాజుతో సంధికి పిలుపునిస్తాడు. కానీ మేడ రాజు  సంధికి ఒప్పుకోడు. సంధికి రుద్ర దేవుడు  పెట్టిన శరతే అందుకు కారణం. అదేమంటే మేడరాజు తన కూతురు సమ్మక్కను , రుద్రదేవునుకి  ఇచ్చి వివాహం  చేయమనడం. సమ్మక్క మేడరాజు కూతురా లేక దగ్గరి బంధువా తెలిపే ఆదారాలు లేవు. ఒక కథనం ప్రకారం సమ్మక్క మేడరాజు కూతురు.. మరొక ఆధారం ప్రకారం దగ్గరి బంధువు. ఎట్టి పరిస్థితి లోనూ వివాహానికి , సంధికి అంగీకరించని రెండవ మేడరాజు రుద్రదేవుడితో యుద్దానికే సిద్ద పడతాడు.ఈ యుద్ధంలోనే సమ్మక్క , ఆమె భర్త పడిగిద్దరాజు, కూతురు సారలమ్మ, కొడుకు జంపన్న మరణిస్తారు.రుద్రదేవుని  సైన్యం చేతిలో పొలవాస రాజ్యం తగలబెట్టబదుతుంది.ఇది అతనికి  శత్రు శేషాన్ని మిగల్చకుండా చేస్తుంది.అలా పొలవాస రాజ్యం కాకతీయ రాజ్యంలో కలిసిపోయింది.

అంటే వెయ్యేళ్ళ క్రితం వరకు రెండు వేరు వేరు సంస్కృతుల కింద మనగలిగిన  ప్రాంతాలు తరువాత కాకతీయల పాలనలో ఆ తరవాత నేటికి వరంగల్ గ్రామీణ జిల్లాకు వచ్చి చేరాయన్నమాట. పొలవాస నాయకులు జైనులు, వారి చేతిలో ఊపిరి పోసుకున్న జినాలయాలు కాకతీయుల కాలం నాటికి  శైవాలయాలయ్యాయి. అయినా మందిరాల మూర్తులు మారినా పూజించే వ్యక్తుల మూర్తిమత్వం మాత్రం మారలేదు.. వాటిని అలా కాపాడుకుంటూనే వస్తున్నందునే  నేను ఈ మాత్రం చూడగలుగుతున్నాను.మేడరాజు ఓడిన ఆ ప్రాంతమే మేడరాజు పేరు మీదుగా  నేటి మేడారం అయింది. అక్కడి కోయలు ఎంతో ఆదరించిన సమ్మక్క కుటుంబం యుద్ధంలో మరణించడం జీర్ణించుకోలేని వారు ఆమె కుటుంబాన్ని వారి ఆరాధ్య దైవాలుగా కొలుచుకున్నారు. సమ్మక్క చిలుకల గుట్ట మీద అమ్మవారుగా ఉండి తమను కాపాడుతుందని నమ్మారు. అలా ఆ ప్రాంతం  వారి మొక్కుబడుల తీర్థం అయింది. ఈనాటికి జాతీయ పండుగ అయింది.అదే నేటి సమ్మక్క సారలమ్మ జాతరగా ప్రసిద్ది  చెందింది.

          కొన్నాళ్ల క్రితం నేను కొంత కాలం నర్సంపేటకు దగ్గర్లోని గుడూరులో పనిచేయవలసి వచ్చింది. అప్పుడు నర్సంపేటకి దగ్గరలో గుంజేడు అన్న ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ప్రతి శుక్రవారం చాలా భక్తి శ్రద్దలతో   గుంజేడు ముసలమ్మవారి  జాతర జరుగుతుంది. అది కూడా ఎక్కవగా అడవి బిడ్డలు జరుపుకునేదే. ముసలమ్మ పేరుతో అనేక చోట్ల ఆలయాలు ఉండడం నాకు తెలుసు.గూడూరులో ముసలమ్మ  అని కొలుచుకునే చోట ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టునే అమ్మవారిగా పూజించేవారు, తర్వాత కాలంలో దాని కింద అమ్మవారి విగ్రహం వచ్చింది. అక్కడ ఉండే వాళ్ళని అడిగినప్పుడు గుంజేడు అమ్మవారిని సమ్మక్క  అత్త అని చెప్పారు. అత్త అంటే భర్త తల్లో మరే వరుసో తెలియదు. కాకపోతే ఇప్పుడైతే అక్కడ చెట్టు లేదు.  చెట్టును తొలగించి చిన్న గుడి కట్టారు. సమ్మక్క ఆలయ ప్రాంగణం , గుంజేడు ఆలయ ప్రాంగణం ఒకే తీరు నిర్మాణాలు.. ఈ గుంజేడు కూడా ఇప్పుడు చెప్పుకుంటున్న చరిత్రలో ఒక బిందువే అనుకోవాలేమో.. ఏమో ఆమె ఎవరో …ఆమె కూడా ఎక్కడి నుంచో వచ్చి ఈ చిక్కని అడవిలో తల దాచుకొని ఉంటుందా… లేక యుద్దంలో మరణించి ఉంటుందా లేక ఆమె సమ్మక్క లాగా స్థానిక చెట్ల  వైద్యురాలా, సమ్మక్క తల్లి తరఫా, భర్త తరఫా… గుంజేడులో అమ్మవారుగా పూజలు అందుకుంటున్న సమ్మక్క అత్త  చెట్టే, సమ్మక్క , ఆమె కూతురు సారలమ్మలు కూడా చెట్లే …వారి కుటుంబం అంతా చెట్లే .. చెట్లే అక్కడ సాక్షులు …వారి జీవితానుభవ శాంతి ప్రభోదాలే వారి పేరు మీద వెలసిన వనమందిరాలు…!

         చాలా రోజుల క్రితం నేను సాక్షి అనే శీర్షికతో ఒక కవిత రాశాను.  కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో  పాల్గొనడం  కోసం మణిపూర్  రాష్ట్రానికి వెళ్ళినప్పుడు  భారత  శాంతి  స్మ్రుతి చిహ్నం  (India peace memorial) పేరుతో వెలసిన ఒక పార్క్ ను చూసే అవకాశం దొరికింది.  ఇంపాల్ కు పదిహేడు కిలో మీటర్ల పరధిలో ఉన్న రెడ్ హిల్ మీద  అక్టోబర్ 7 ,1994 లో జపాను వారు ఏర్పాటు చేసిన  స్మ్రుతి వనం అది. .

 రెండో ప్రపంచ యుద్దంలో పాల్గొన్న జపాను వారు అప్పటి, ఆ దేశ సైనికుల  జ్ఞాపకార్థం దీనిని నెలకొల్పారు . 1944 సంవత్సరంలో మార్చ్ 8 నుంచి జూలై ౩ వ తేదీ వరకు మణిపూర్ కేంద్రంగా  జరిగిన రెండవ ప్రపంచ  యుద్దం    యాభై ఏళ్ళు  పూర్తి చేసుకున్న సంధర్భంగా దీనిని ఏర్పాటు చేసారు, అక్కడ నుంచే జపానుసైన్యం అప్పటి బ్రిటిష్ ఇండియా మీద దాడి చేసింది. బ్రిటిష్ అధీనంలో ఉన్న భారత దేశ ప్రజలు సైనికులుగా బ్రిటిష్ వారి తరఫున , భారత దేశ స్వతంత్ర్యమే లక్ష్యంగా  ఆజాద్ హింద్ ఫౌజుకు  చెందిన భారతీయులు జపాను తరఫున పోరాడిన విచిత్ర యుద్ధం అది. యుద్దంలో  బలి పెట్టబడిన  ప్రాణాలు  డెబ్బై వేలకు పైననే.   ఆ స్మృతి వనంలో ఉంచిన శిలలు      ( అవి ఉంచిన ప్రాంతం Maibam) మాత్రమే స్మ్రుతులుగా మిగిలి శిలా సదృశమైన చరిత్రను బరువుగా మోస్తున్నట్టు అనిపించింది నాకు. జపాను ఓడిపోయింది. తదనంతర  పరిణామాలు అలా ఉంచితే   ఆ స్ర్ముతివనం ప్రారంభంలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. వాటి వయసు ఈ యుద్ధపు వయసు కన్నా ఎక్కువే ఉండి ఉండవచ్చు. ఆ చెట్లు , జరిగిన సంఘటనలనన్నీ మౌనంగా చూసే ఉండవచ్చు. కానీ అవి చరిత్రను చెప్పలేవు కదా అనిపించి చెట్టు ప్రత్యక్ష సాక్షిగా ఉండక పోవడం వల్లనే చరిత్ర రాసే వాళ్ళ అవగాహన తో మాత్రమే చెప్పబడుతున్నదని ” చెట్టు నోరు విప్పదు .. చరిత్ర  నీళ్ళలా రాసే వాళ్ళ పాత్రలో ఒదిగి పోతుంది”  అని నా సాక్షి కవితలో  రాసుకున్నాను . ఇప్పటికీ  చెట్టు కు నోరు ఉంటె బాగుండునని అనుకుంటాను. చూసింది చూసినట్టు చెప్తే బాగుండును. రకరకాలుగా రాసుకుని , పేర్చుకొని వాదులడుకునే అవసరం రాకుండా నేను నిలుచున్న చోటనే నాకొక స్పష్టత దొరికేది. మానవుల మాదిరి కావలసిన విధంగా చరిత్రను రాసుకునే అవసరం వృక్షాలకు లేదు.. కనుక నిక్కచ్చి నిజం మనముందు తెలిసేది.

ఇంతదాకా చెప్పుకున్నదంతా  రాళ్ళు  విప్పిన రాజుల చరిత్ర ….అంటే మందిరాల ఆనవాళ్ళలోనో  శాసనాలలోనో విశ్లేషించి నిర్దారణ చేసిన చరిత్ర. చరిత్ర ఇక్కడ కూడా  ఈ చిన్న అడవిలో  రాయిలా పడివుంది. తనని తెలుసుకోవాలని తపించిన వారికి తనే కళ్ళై ఇన్నాళ్ళు సాక్ష్యాలను  కాచుకుంది…తెలుసుకున్న విషయాలన్నీ, బయటపడ్డ కాసిన్ని  విరిగిపడిన రాళ్ళ నుంచి నేను  ఊహించిన బొమ్మల్లగానే కనబడుతున్నది .కానీ అది యే బొమ్మో చెక్కిన చేయికి   మాత్రమే    తెలుసు..  అక్కడ నిలబడ్డ  మహా వృక్షాలకు  తెలుసు.ఆ వృక్షాలను  కాచిన  ఒక్క అరణ్యానికి   మాత్రమే తెలుసు. అరణ్యం తన కడుపులో  మన కోసం యే రహస్యం అయినా దాచి ఉంచిందా… తేలాల్సిన విషయం ఎప్పటికైనా తెలుస్తుందో లేదో ఇంకా నేను ఇప్పుడు కూర్చున్న ఉన్న గుండ్ల పహాడ్ ఎప్పటి ఊరో..ఈ గుడి ఏనాటిదో ఎటువంటి కార్యాలను నెరవేర్చిందో ఎవరు చెప్తారు..తెలిసిన వాళ్ళు లేరు … తెలిసిన అడవి చెప్పగలదా.. పోనీ తెలిసే అవకాశమైనా నాకు  దొరుకుతుందో లేదో గానీ నేను మాత్రం మళ్లీ మళ్లీ వెతుక్కుంటూనే ఉంటాను.

చిన్నప్పుడు ఇంగ్లిష్ పాటంలో చదువుకున్న “ టామరిండ్ డ్రం” కథలో  చెట్టు మాట్లాడుతుంది.  కథలో రాజు గారికి ఉదయం లేవగానే తన ముఖం చూసుకుంటే తల మీద రెండు కొమ్మలు కనిపిస్తాయి. ఆస్థాన క్షురకుడు కొమ్ములతో ఉన్న రాజును చూడడంతో ఆ రాజు అతన్ని పిలిపించి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని చెప్పి ఒకవేళ చెప్తే మరణ శిక్ష విధిస్తానని అంటాడు. క్షురకుడు  విషయాన్ని దాచుకోలేక ఎవరికీ చెప్పుకోలేక చింత చెట్టుకు చెప్పుకుంటాడు. అదే రోజు రాత్రి కురిసిన వర్షానికి  చింత చెట్టు  పడిపోతుంది. రాజాజ్ఞ మేరకు  దాని నుంచి ఒక డోలు తయారు చేస్తారు .ఆస్థాన సంగీత కారుడు ఆ డోలు మ్రోగించినప్పుడల్లా  అది క్షురకుడు తనకు చెప్పిన విషయాన్నే మ్రోగిస్తుంది .. అలా రాజుగారి రహస్యం   చింత చెట్టు బయటపెడుతుంది.తనకు తెలిసిన విషయం ప్రపంచమంతా చాటింపు వేస్తుంది . ఇప్పుడు ఇక్కడ ఈనాటి అరణ్య శోధనలో నాకు మళ్ళీ అలా అనిపించేలా పెద్ద పెద్ద  వృక్షాలు దర్శనమిచ్చాయి. ఎంత పెద్ద వృక్షాలో …ఎంత వయసు ఉండి ఉంటుందో…నానమ్మ లాగో  , అమ్మమ్మ లాగో   వాటి ముందు జరిగిన చరిత్రను చెబితే బాగుండు..ఎంతకీ తెమలని చిక్కు ముళ్ళనన్నీ విప్పేద్దును… ఒక్క సారి  నేను కూర్చున్న చెట్టు పైకి  చూసాను… సూర్యుడు బాలబింబం  దశ దాటుతున్నాడు. ఎండ కాపు  శరీరంలో రేపే జటరాగ్ని చల్లార్చుకోవడానికా అన్నట్టు పక్షులు ఆహారం వెతుకుంటున్నాయి..చెట్టుకున్న పెద్ద పెద్ద శాఖలు  అరచేతులు సాచి చిన్ని చిన్ని పక్షులను కూర్చోమంటున్నాయి. కొన్ని పక్షులు కాసేపు కూర్చొని వెళ్ళిపోతున్నాయి.మళ్లీ వస్తున్నాయి. కప్పుశిల లో నిలిచిన నీళ్లను తాగి మళ్లీ వెళ్తున్నాయి. చెట్టు పక్షికి యే ముచ్చట్లోచెప్తుంది. పక్షి వింటుంది. ఇక్కడ వెయ్యేళ్ళకు ముందేముందోనని ఆలోచిస్తూ నేనూ కాసేపు పక్షిని అయ్యాను. పక్షి కన్నుతో వెయ్యేళ్ళని చూసి వచ్చాను…వెయ్యేళ్ళకు ముందర ఏముందో…యే చేతుల ఇంద్రజాలం శిలల్లో మార్మికంగా దాగి వుందో ఈ  చెట్టేమైనా చెప్పగలదోనని చూసి   చెయ్యారా తడుముకొని భారంగా నిట్టూర్చాను…

ఇక  తిరిగి నా గమ్యానికి ఎగరడానికి రెక్కలు చాపుకుంటున్నాను…

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink
0 0 vote
Article Rating
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Sumana
Sumana
11 months ago

వీణా గారు..ఆరణ్యం కాలమ్ ద్వారా ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు తెలియజేస్తున్నారు…మీకు ధన్యవాదాలు…

మరిన్ని ఆర్టికల్ రాయాలని ఆశిస్తున్నాను.

D Veenavani
D Veenavani
8 months ago
Reply to  Sumana

ధన్యవాదాలండీ…