జీవితాన్ని జీవించనీ ! – డా .హేమలత పుట్ల

కొన్ని యుగాలు కానక్కర్లేదు
కొన్ని సంవత్సరాలూ కానక్కర్లేదు
కొన్ని లిప్తల పాటు చాలు
నన్ను మనిషిగా జీవించనీ
బ్రతుకు మొక్కపై
హృదయ పుష్పాన్ని వికసించనీ
కష్టమో సుఖమో
ఒక అభద్రతా భావమో
నన్ను నీడలా వెంటాడనివ్వు
నేను ఒంటరిగా ఉన్నప్పుడు
నా ఉచ్చాస్వ నిశ్వాసాల మధ్య
ఒక మృత్యు పుష్పం మొగ్గ తొడిగినపుడు
నన్నిలాగే సమాదిలోనే ఒదిగి పోనీ
కలవరమో వ్యాకులమో
నన్ను మొహించినపుడు
దారం చిక్కులా ముడివడ్డ నా అనుబంధాలు
ఒక్కొక్కటీ పుతుకున్న తెగుతున్న అనుభూతి కలుగుతుంది
నిశ్శబ్దాన్ని సాలెగూడులా చుట్టూ అల్లుకున్నప్పుడు
ఒక్క నా గుండె చప్పుడు మాత్రమే
నాకు వంత పాడుతుంది
నా మౌనం
కొన్ని యుగాల నిశ్శబ్దాన్ని సమీక్షిస్తుంది
నా రక్త మాంసాలు విభజించుకున్న ఖండికలు
వేల వేల భయాలతో
భవిష్యత్తుని ప్రశ్నార్ధకాలు చేస్తాయి
నాకెప్పుడూ జీవితం చివరి కనిపిస్తుంది
పసిపాపల బోసినవ్వే గోచరిస్తుంది
యిప్పుడు హృదయాల మద్జ్య
జడత్వం రక్త పింజరలా పెనవేసుకుంటుంది
మనిషికీ మనిషికీ మధ్య
సామీప్యపు స్నేహ జలధిలో విలీనం చెయ్యడానికి
ప్రత్యూష ప్రదీపనంలా
చిన్న చిరునవ్వు కణం చాలు
పెదాలపై లిప్ స్టిక్ లా
అలంకారానికి అడ్డుకున్న ప్రహసనం
గుండె కవాటాలను తట్టలేదు
రెండు ఆత్మలు
భావ ప్రకంపనలు ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నప్పుడు
నా హృదయ పరిభాష నీకేంతకూ అర్ధం కాదు
సమాజం నాకెప్పుడూ
అందని ద్రాక్షలా
హిపోక్రసీ డేగ కాళ్ళ మధ్య యిరుకున్న
పక్షి పిల్లలా కనిపిస్తుంది
బీటలు వారిన
అంతరాల క్షేత్రాలను
శపిత గునపాలతో పెకిలించకు
చేతనైతే
బేల గుండెకు జోలపాట పాడు
ప్రతి మనిషీ బ్రతకండం కాదు
వ్యక్తిగా జీవించడం కావాలి
ఒక్క రెప్పపాటైనా
నన్ను జీవితాన్ని జీవించనీ !

                                                                    -హేమలత పుట్ల

 

(డా .హేమలత పుట్ల ప్రధమ సంస్మరణ సభ మరియు డా .పుట్ల హేమలత  సాహితీ పురస్కారాలు ప్రదానం -09 -02 -20 ఉదయం 10 .గం .లకుశ్రిలియో టవర్స్ , తిలక్ రోడ్ , రాజమండ్రి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.