అరణ్యం 4 -దేవతా గొడుగులు-దేవనపల్లి వీణావాణి

ఈ రోజు కూడా మబ్బు పట్టి ఉంది. రాత్రి జోరు వాన , తెల్లవార గట్ల కొంత తెరిపి ఇచ్చినా ఇంకా వాన పడేటట్టుగానే ఉంది. చల్లటి గాలి వీస్తున్నది. కొంచం కొంచం తెరిపి ఇస్తూ మంచి వానలు కురుస్తున్నాయి. నాలుగు నెలల నుంచి ఎండ వేడికి ఉడికి పోయిన శరీరం హాయిగా సేద తీరుతున్నట్టు భావన. రోడ్లన్నీ పచ్చి పచ్చిగా ఉన్నా దుమ్మంతా పోయి శుభ్రపడ్డాయి. నల్లని తారు రోడ్డు లేత లేతగా మొలిచిన పచ్చిక చూడడానికి ఒక వర్ణ చిత్రంలో ప్రయాణిస్తున్నట్టుగా ఇన్నాళ్ళు ఎండిపోయినట్లున్న నేల ఇంకా తనలో ప్రాణం ఉందని నిరూపించుకుంటునట్లుగా ఒక కొత్త సందేశం దృశ్యమానవుతున్నది. గత వారం నుంచీ మాకూ రకరకాల పనుల్లో తీరిక దొరకలేదు. ఈ రోజు సెప్టెంబర్ నెలలో సందర్శించవల్సిన బీటు (అటవీ శాఖ అడ్మినిస్ట్రేషన్ లో ప్రాధమిక భూ భాగం , దీనికి ఒక బీటు ఆఫీసర్ లేదా వన సేవకుడు అధికారిగా ఉంటాడు) వివరాలు చూసి నెలవారీ ప్రణాళిక తయారు చేసే పని ఉన్నది. అటవీ శాఖ ఉద్యోగి పనులు ప్రధానంగా రెండుగా విభజించుకోవచ్చు. మొదటిది క్షేత్ర పాలన , రెండవి కార్యాలయ విధులు. సాధారణంగా ఉదయం పూట క్షేత్ర పాలనా విధులు తరువాత కార్యాలయ విధులు నిర్వర్తించడం ఒక సంప్రదాయంగా వస్తున్నది. అందుచేతనే ఇతర ప్రభుత్వ కార్యాలయాలో ఉదయం పూట కనిపించే హడావుడి అటవీ శాఖ కార్యాలయాలలో కనిపించదు.

ప్రస్తుతం మా కార్యాలయం ఉన్నది ప్రభుత్వ కలప డిపోలో. చాలా మటుకు అటవీ కార్యాలయాలు పాతవే. చుట్టూ చెట్టూ చేమలతో పెద్దగా ఆర్భాటం లేనివి. కార్యలయాలలో కార్యనిర్వాహక ఉద్యోగులు సాధారణంగా కనిపించరు. వాళ్ళంతా క్షేత్ర విధులలో ఉంటారు. మినిస్టీరియల్ ఉద్యోగులు కార్యాలయానికి చెందిన విధులలో మునిగి ఉంటారు.

కలప డిపోలో ప్రతి నెలా ప్రభుత్వం సేకరించిన కలప వేలం పాట జరుగుతుంది.అంటే ప్రభుత్వం తన ద్వారా కలపను ప్రజలకు అందుబాటులో ఉంచే ఒక పద్ధతి అన్నమాట. ఒకప్పుడు ప్రభుత్వమే అడవిని సంవత్సరానికి ఇంత చొప్పున అని నరికి వాటిని వేలం వేసేది.అడవులు విస్తారంగా ఉన్నప్పుడు అటువంటి విధానం ఉండేది. అది కూడా శాస్త్రీయంగా నిర్వహించబడేదే . కలప ఇంకా ఇతర అటవీ ఫలసాయాల సేకరణ Departmental Extraction of Timber & other forest produce or DET Manual ప్రకారం జరుగుతుంది. 1976-77 కు ముందు తెలంగాణలో ఇలా కలప, కలప ఉత్పత్తుల సేకరణ కొరకు కాంట్రాక్టర్ సిస్టం ఉండేది. అయితే పెరుగుతున్న పర్యావరణ ఒత్తిడిని తట్టుకోవడం కొరకు, జీవ వైవిధ్య పరిరక్షణ కొరకు 1988 అటవీ విధానం ప్రకారం అడవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడింది. తదుపరి 1996లో సుప్రీం కోర్టు, ప్రతిష్టాత్మక గోడావర్మన్ కేసులో ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం ఒక్క వెదురు బొంగును, సరుగుడు , నీలగిరి చెట్లను మినహాయించి, అది కూడా వర్కింగ్ ప్లాన్ / అటవీ నిర్వహణ ప్రణాళికను లోబడి కలప సేకరణ మీద నిషేధం విధించింది. 1996 నుంచి ఈ నిషేదం అమలుచేయబడుతుంది కనుక ఇప్పుడు ప్రభుత్వం కలపను సేకరించడం కొరకు అడవులను నరకడం లేదు. ఏదైనా అటవీ సంబంధ నేరాలలో పట్టుబడిన కలప మాత్రం డిపోలలో లభిస్తుంది. అందువల్ల ప్రస్తుతం ఏదైనా అటవీ నేరాలలో పట్టుబడిన కలపను మాత్రం వేలం వేస్తున్నారు. ఇక్కడ అటవీ నేరాలలో పట్టుబడిన ఎడ్లబళ్ళు, వాహనాలు , అక్రమంగా కోసిన కలప సైజులు కూడా ఉంటాయి. అటవీ అధికారులు వివిధ నేరాలలో స్వాధీనం చేసుకున్న కలప నాణ్యతను బట్టి కుప్పలుగా విడదీసి ప్రభుత్వ ధర ప్రకారం ముందుగానే నిర్ణయించిన ఒక తేదీన వేలం వేస్తారు. సాధారణంగా వేలం వేసే తేదీ ప్రతీ కలప డిపోకు స్థిరంగా ఉంటుంది. అందువల్ల వివిధ ప్రాంతాలలో వేలం పాటలో పాల్గొనే వాళ్ళకు ముందుగానే తయారుగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నకలప వాణిజ్య పరంగా పెద్దగా విలువైంది కాదు. ఎందుకంటే చాలా మటుకు అటవీ నేరాలు అదుపుచేయబడడం ఇంకా ఈ ప్రాంతంలో విలువైన కలప వనరులు తగ్గిపోవడం కారణాలు. ఇక్కడ ఉన్న కలప డిపో చాలా చిన్నది. క్రమేణా అడవి తగ్గిపోవడం , అటవీ శాఖ నిఘా పెంచడం , స్థానికులలో కూడా కొంత అటవీ నేరాల పట్ల అవగాహన కలగడం కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. అడపాదడపా దొరికిన కలప వాణిజ్యపరంగా పెద్దగా విలువైనది కాకపోవడంతో చాలా రోజులుగా అమ్మకం కాక వానకు తడిసి పోయింది.

కలప డిపో చుట్టూతా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.ఎప్పుడో ఎవరో నాటి ఉంటారు.అవి పెరిగి ఇప్పుడు మనకు నీడగా ఉన్నాయి. అటుగా వెళ్ళే ప్రజలు మధ్యహ్నం పూట అవసరం అయితే కాసేపు ఆగి సేద తీరుతారు. ఈ నెల రోజుల పాటు కురిసిన వానలకు అక్కడ చెట్ల కింద రాలిన ఆకులు కుళ్లిపోయి నల్లని పొరలాగా ఏర్పడింది. కొత్త మొక్కలు వస్తున్నాయి. కలప దుంగల చుట్టూ కూడా చిన్న చిన్న మొక్కలు పెరిగాయి. డిపోలో ఉన్న చెట్ల నీడవల్ల కుళ్ళిన ఆకుల వల్ల తేమ ఎక్కువగా ఉంది. ఈ తేమకు డిపోలో ఉన్న కలప దుంగల మీద , నేల మీద తెల్లని చిన్న చిన్న పుట్ట గొడుగుల తలలు నేలను పొడుచుకొని వస్తున్నాయి.

డిపోలో మెత్త బడ్డ నేల, కలప , కుళ్ళిన ఆకులు అంతా కలిపి ఒక రకమైన పచ్చి వాసన. అక్కడక్కడ కుప్పలు కుప్పలుగా పుట్ట గొడుగులు. రంగు రంగులవి చిన్నవీ పెద్దవీ, రకరకాలవి .జీవులలో ఎంత వైవిధ్యం ! అప్పటి దాక అక్కడ ఒక ప్రాణి ఉన్నదన్న చిన్నపాటి ఆధారం కూడా ఉండదు, అయినా ఒక సజీవ సాక్ష్యం ప్రతి యేడూ తన ఉనికిని నిలబెట్టుకోవడానికి ఇలా జెండాలెత్తుకొని వచ్చేస్తాయి. జీవం విశ్వ వ్యాప్తితమైనది అన్న మాట ఎంత సత్యమోకదా , అది నిరూపించడానికే అప్పటికప్పుడు ఇన్నిన్ని బుడగలు , గొడుగులూ మేమూ ఉన్నామంటూ వచ్చేస్తాయేమో. ఎక్కడి నుంచి వస్తాయివి ! నాలుగు రోజులు పోగానే మళ్ళీ అదృశ్య మైపోతాయి. ఇలా పుట్టగొడుగుల ప్రత్యక్ష -అదృశ్యాలను గమనించే ప్రసిద్ద అమెరికన్ కవయిత్రి ఎమిలీ డికిన్సన్ ( The Mushroom is the Elf of Plants by Emily Dickinson 1830-1886) వీటి మీద కవిత రాస్తూ పుట్ట గొడుగులను మొక్కల యొక్క ఒక మొహినిగా అభివర్ణించింది. ప్రకృతి పుట్టగొడుగుల పట్ల విధేయంగా ఉందా లేక దిక్కరిస్తున్నదా అంటూ ఆశ్చర్యపోతుంది. ఈ కవిత్వం చదివినప్పుడు నా చుట్టూ ఉన్న లోకాన్నే మరో దివ్య చక్షువుతో అనుభూతి చెందుతున్నట్టు అనిపించింది నాకు .అంతకు ముందెప్పుడూ ఇంత లోతుగా వీటి గురించి ఆలోచించలేదు కానీ నిజంగానే ఈ కాలం అంతా ఎంతో ప్రత్యేకమైంది. ప్రకృతి కూడా ఒక ఇంద్రజాలానికి సిద్దపడినట్లు రెండు రుతువుల సరిహద్దుని గీయడానికి ఇటువంటి అవతారాలను సృష్టించినట్టు తోస్తుంది.సరిగ్గా తమ జన్మ కాలం అదేనని వాటికి ఎలా తెలుసునో కదా! వాటి పని పూర్తి కాగానే వాటి అవతారం ముగుస్తుంది. పుట్టగొడుగుల అవతారం చేసే పనిని, పాల్ ఎడ్వర్డ్ స్టామెట్స్ “ పుట్టగొడుగులు చనిపోయిన వృక్ష జంతు వ్యర్థాల నుండి ఎంతో చాకచాక్యంగా ఆహారాన్ని సంపాదించుకునే ఒక చిన్నపాటి ఔషదీయ కర్మాగారాలు” అని చక్కగా చెబుతాడు. ఈ అమెరికన్ జాతీయుడు తన స్వీయ శోదనతో పుట్ట గొడుగుల మీద అనేక పరిశోధనలు చేసి తన అనుభవసారాన్ని Fantastic Fungi: How Mushrooms Can Heal, Shift Consciousness & Save the Planet , Mycelium Running: How Mushrooms Can Help Save the World , Psilocybin Mushrooms of the World, Growing Gourmet and Medicinal Mushrooms , Psilocybe Mushrooms & Their Allies అనే ఐదు పుస్తకాలలో రాశాడు.

జీవం ఏ పదార్థాన్ని, పనినీ అసంపూర్తిగా వదిలిపెట్టదు. శక్తి నిత్యత్వ సూత్రం ప్రకారం శక్తి నశించబడదు ,ఒక రూపంలో నుంచి మరో రూపంలోకి మార్చ బడుతుంది.ఇక్కడ కూడా అంతే. కుళ్ళిన వ్యర్థాలు అని మనం అనుకునే పదార్దం రసాయనికంగా అత్యంత శక్తి కలిగినది. ఈ సేంద్రియ పదార్దాన్నుంచి ఒక శక్తిని సంశ్లేషించి , వినియోగించుకొని , పునరుత్పత్తి చెంది అదృశ్యమయే ఒక జీవి జన్మించడం ప్రకృతి విన్యాసమే కదా. ఈ లయాత్మక విన్యాసం ఋతువు రుతువుకు మారుతూ ఒక శక్తి వంతమైన గతిశీలతను ఆయా జీవుల ద్వారా ప్రకటిస్తుంది. ఇప్పుడు ఈ మాసం అటువంటిదే. ప్రఖ్యాత కథా రచయిత , కవయిత్రి కేథరిన్ మాన్స్ ఫీల్డ్ ( Katherine Mansfield 1888-1923, న్యూజీలాండ్ ) “మిగిలిన అన్ని మాసాలలో కన్న సెప్టెంబర్ మాసం విభిన్నమైంది. అది ఒక ఇంద్రజాలిక , పుట్ట గొడుగులను ఉద్బవింపజేసే నేలలో నేనొక కొత్త రసాయన మార్పును అనుభూతి చెందుతాను, అదికూడా, గాలిలోని ఉన్న అదనపు జీవం మరలివచ్చే ఒకానొక దీపశిఖ (September is different from all other months. It is more magical , I feel the strange chemical change in the earth which produces mushrooms is the cause , too, of the extra life in air a resilience , a sparkle” గాలిలో ఉన్న అదనపు జీవం అన్న మాట ఎంతోగానో నిజం. జీవం అంతటా విస్తరించి ఉన్నదన్న మాటను ఒక కవి తన మాటలో కళాత్మకంగా చెప్పినట్టుగా ఆ వాక్యం నిలబడుతుంది. మన కంటికి కనిపించని ఒక సూక్ష్మ ప్రపంచం ఈ భూమండలం అంతా ఆవరించి ఉన్నది. ఎన్నో సూక్ష్మ జీవులు వాటి బీజాలను , గాలిలో, నీటిలో , మట్టిలో ప్రతిక్షేపించి ఉన్నాయి. అనుకూల పరిస్థితి వచ్చిన వెంటనే అవి తమ చాకచక్యాన్ని ప్రదర్శిస్తాయి. పుట్ట గొడుగులు అందులో ఒక ఉదాహరణ మాత్రమే.

పుట్ట గొడుగులు ఒక రకమైన శిలీంద్రం. సంస్కృతంలో కవక అని అంటారు. వీటికి జంతు కణాల లక్షణాలు వృక్ష కణాల లక్షణాలు రెండూ ఉంటాయి. కానీ అధ్యయనం కోసం జీవులవర్గీకరణలో వృక్ష శాస్త్రంలో భాగం చేసారు. మనకు బాగా పరిచయం ఉన్న ఈస్ట్ లేదా బ్రెడ్ మోల్డ్ ఈ శిలీంద్ర జాతులకు చెందినదే. మన డాక్టర్లు వాడే ప్రాథమిక సూది మందు పెన్సిలిన్ ఇచ్చేవీ , బీరు , ఆల్కహాల్ ,సారా అయారు అయ్యేవీ ఈ శిలీంద్రాలతోనే. ఈ శిలీంద్రాల జాతిలోనివే పుట్ట గొడుగులు కూడా. ఇప్పుడు తినడానికి ఉపయోగించే పుట్ట గొడుగులను పెంచుతున్నారు కానీ ప్రకృతి సిద్ధంగా మొలిచే పుట్టగొడుగులు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవి కావు. కేవలం వానా కాలం ముసుర్లకు బాగా తేమ ఉన్న చోట కుళ్ళిన చెట్ల వ్యర్థాల దగ్గర , పుట్టల మీద మట్టి దిబ్బల మీద , కలప దుంగల శిథిల పదార్థాల మీద, వ్యవసాయ వ్యర్థాల మీద, గడ్డి కుప్పల వద్ద ఏడాదిలో ఒక్కసారే కనిపిస్తాయి. ఇలా పుట్టల మీద వస్తాయి కనుకనే వీటికి పుట్ట గొడుగులని, పుట్ట పూత అని పేరు వచ్చింది. మీరు కుక్క గొడుగులు అనే మాట కూడా వినే వుంటారు. అయితే పుట్ట గొడుగులు, కుక్కగొడుగులు అని ఖచ్చితంగా విడదీసే నిర్వచనం ఇవ్వలేకపోయినా అవగాహన కోసం పుట్ట గొడుగులను విషపూరితం కానివీ కుక్క గొడుగులను విషపూరితమైనవీగానూ విభజించుకోవచ్చు. బహుశా తినడానికి పనికి రాని వాటిని చెప్పడం కొరకు కుక్కగొడుగులని వాడుకలోకి వచ్చి ఉంటుంది . ఈ పదాలను ఇంగ్లీష్లో వాడుకలో ఉన్న మశ్రూమ్స్ ఇంకా టోడ్ స్టూల్స్ కు (Mushrooms and Toad stools ) సమానార్దకంగా తీసుకోవచ్చు.

అటవీ సమీప గ్రామస్తులలో తినగలిగే పుట్టగొడుగులను గుర్తించే పరిజ్ఞానం వారి సంప్రదాయ అలవాట్ల కారణంగా ఇంకా సజీవంగా ఉంది. పట్టణాలలో అటువంటి అవకాశం లేదు. ఈ మధ్య కాలంలో కాస్త ప్రతీ పెద్ద గ్రామంలోనూ పుట్టగొడుగుల వంటకాలు దొరుకుతున్నాయి. రకరకాలవంటల ,ఆరోగ్య ప్రయోజిత కార్యక్రమాల వల్ల పుట్టగొడుగులకు కూడా విస్తారమైన ప్రచారం దొరికింది. 1980 వ దశకం నుంచి పుట్టగొడుగుల పెంపకంపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టినందువల్ల భారత దేశంలో ఈ రంగంలో చెప్పుకోదగిన కృషి జరిగింది. తత్పలితంగా 1997 నాటికే హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ పట్టణం “ భారత దేశ పుట్ట గొడుగుల నగరం( Mushroom City of India )” గా పేరు తెచ్చుకుంది.

నేను కొన్ని పుట్టగొడుగులను మాత్రమే గుర్తించగలను. చాలా వాటిని గుర్తించలేను. అయితే తెలుసుకోవాలన్న కోరికను ఈ రోజుల్లో ఎక్కువ సేపు దాచిపెట్టుకునే అవసరం లేదు కదా! అందుకే పుట్ట గొడుగులను ,కుక్క గొడుగులను ఫోటోలు తీసుకోవడానికి ముందుకు కదిలాను. నేను చాలా వాటిని ఫోటోలు తీసాను. అడవికి వెళ్ళినప్పుడు, తోటల దగ్గర ఇంకా ఎక్కడ కనిపించినా సేకరిస్తూ వస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరో ఏడాది వేచి ఉండాలి కనుక. చాలా సందర్భాలలో వాటిని సేకరించకముందే అవి నశించి ఉండడమో లేదా స్థానికులు సేకరించడమో జరుగుతుంది. ఉరుములు, మెరుపులు పడిన రాత్రి , బాగా వర్షం కురిసిన రోజున తెల్లవారగానే స్థానికులు ముఖ్యంగా గిరిజనులు అడవిలో పుట్టల వెంట వీటి కోసం వెతుకుతారు. రాత్రికి రాత్రే మొలిచి పెద్దగా అయిపోతాయని వీరినమ్మకం. వారి నమ్మకం కూడా ఒకింత నిజమైనదే. ఈ జాతులు అత్యంత స్వల్ప కాలంలో పెరుగుతాయి. చుట్టూ తేమ ఆరకముందే వాటి బీజాలను వదిలి కుళ్ళి పోతాయి. ఇక మళ్ళీ అంతా సవ్యంగా ఉంటే వచ్చే ఏడాది కనిపిస్తాయి.

నేను చుట్టూ పరిశీలిస్తూ ఫోటోలు తీస్తూ వస్తున్నాను.నాకు చాలా రకాలు దొరకడానికి ఇక్కడ కలప దుంగలు , కుళ్ళిన పదార్థాలు ఉండడం కారణమని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కదా. పుట్టగొడుగులు మొలిచిన ఒకటి రెండు రోజులు సున్నితంగా , మృదువుగా , అందంగా కనిపిస్తాయి. పోను పోనూ వికృతంగా తయారవుతాయి.నేను ఇక్కడ తీసిన మొట్టమొదటి ఫోటో అందమైన లేత గానోడర్మా జాతిది .ఇది లేతగా ఉన్నప్పుడు తెలుపు నుంచి లేత పసుపులో నాలుగు రంగులు వరసలు కలిగి తడి నేల మీద మొలిచిన రంగుల గొడుగులాగా ఉంటుంది. ముదిరిన దశలో గట్టిగా ,పెలుసులా మారిపోతుంది. ఈ జాతి పుట్టగొడుగుల ప్రయోజనం గురించి చైనాలో విస్తరమైన సాహిత్యం ఉంది. రెండు వేల ఏళ్ళ క్రితమే చైనాలో సంప్రదాయ వైద్యంలో దీనిని వాడినట్లు లభించిన ఆధారాలను బట్టి తెలుస్తున్నది. దీనికి చైనా లో లింగ్ జి( Spirit plant ) అని పేరు. అంటే చైనా భాషలో శాశ్వతత్వం అన్న అర్థం . చైనా తాత్విక చింతనాక్రమం తావో యుగంలో ఈ మొక్క వాడకం ప్రస్తావించబడింది. మానసిక స్థిరత్వానికి దీనిని తగిన మోతాదులో వాడవచ్చునని ఆ విదంగా ధ్యానం చేసే వారు ఏకాగ్రత సాధించడం కొరకు దీనిని ఉపయోగించవచ్చునని అంతేకాక దీనిని ఎలా పెంచాలో కూడా గ్రంధాల్లో(Taoist Patrology) నిక్షిప్తం చేశారు.ఆ విధంగా పేర్కొనడం వలన తావో సాహిత్యంలో దీనికి చెప్పుకోదగిన స్థానం ఇచ్చినట్లైంది.

చైనా దేశపు తొలి భూ భౌగిళిక పరిశోధకుడు లీ డావోవాన్ (Li Dao Yuan c. 470AD -527AD ) రాసిన Commentary on the Water way classics ( ఆంటి చైనా దేశపు నదుల గురించిన భౌగిళిక సమాచారపు గ్రంధం ) వూ పర్వతం గురించి చెప్తూ (Wu mountain ) లింగ్ జీ గురించిన ఒక జానపద కథను ప్రస్తావించాడు. దాని ప్రకారం ఒకానొక చోట యోజి( Yao ji ) అన్న అమ్మాయి ఉండేది . ఆమెస్వర్గ లోక చక్రవర్తి కూతురు, దురదృష్ట వశాత్తు వివాహం జరగక ముందే మరణిస్తుంది. అప్పుడు ఆమె శరీరం గడ్డి గాను ,ఆత్మ లింగ్ జీ గాను మారుతుంది. స్వర్గ లోక చక్రవర్తి అయిన ఆమె తండ్రి వూ పర్వతం యొక్క దక్షిణ భాగాన్ని ఆమెకు బహుమతిగా యిస్తాడు. అక్కడ ఆమె ప్రతి ఉదయం మేఘాలుగా తిరుగాడుతూ సాయంకాలానికి వర్షంగా మారుతుంది. ఈ కథ వూ పర్వతంలోని పన్నెండు శిఖరాలలో ఒక దానిని దేవతాశిఖరంగా గుర్తించడం వెనుక ఉన్న కథను తెలియ జేస్తుంది. ఇదొక్కటే కాదు ఇంకా చైనాలో ఈ పుట్టగొడుగు నేపథ్యంగా అనేక జానపద కథలు ఉన్నాయి. చైనా సాహిత్యంలో కవులు దీనిని ప్రస్తావిస్తూ కవిత్వం రాసారు. ఇప్పుడు అధునిక విజ్ఞానంతో వీటిని వ్యాపారాత్మకంగా కూడా పెంచుతున్నారు. లింగ్ జీ కాఫీ , టీ కూడా అందుబాటులోకి వచ్చింది , అయితే భారతీయుల సోమరసం మీద ఎటువంటి సందిగ్దత ఉందో ఆధునిక పరిశీలనలలో తావోల “జీ”కి గానో డెర్మ జాతుల మీద కూడా అటువంటి అభిప్రాయమే ఉంది. ( Indian Journal of History of Science, 47.1 (2012) 1-35 ఆధారంగా )

చైనాలోనే కాదు అనేక దేశాలలో ప్రాచీన పుట్టగొడుగులకు ప్రపంచ వ్యాప్తంగా విస్తారమైన చరిత్ర ఉన్నది. ఆఫ్రికాలోనూ , మధ్య అమెరికా లోనూ , వేల సంవతరాల నుంచి పుట్టగొడుగుల వాడకం ఉన్నట్లు రాతి చిత్రాల సాక్ష్యాల ఆధారంగా గుర్తించారు. మెక్సికో మూల వాసులైన మజాటేక్ సమూహ ప్రజలు (Maztec community ) ఒక రకమైన పుట్ట గొడుగులను వారి సంప్రదాయ ఉత్సవాలలో(Maztec mushroom ritual) ఉపయోగించేవారు. వారు వీటిని దైవపుష్టి ( Flesh of God ) అని పిలుచుకునే వారు. అయితే 19వ శతాబ్దం వరకు వీటి గురించి ప్రపంచానికి తెలియదు.తెగ సంప్రదాయాలు గుప్తంగా ఉంచుకోవడం సాధారణమే. ఇందుకు చాలా కట్టుబాట్లు ఉంటాయి. ప్రతి తెగ దాని యొక్క ఉనికిని కాపాడుకోవడం కొరకు ఇలా గుప్త విధనాలు పాటిస్తుంది. అయితే 1950 ప్రాంతంలో రాబర్ట్ గార్డోన్ వాసన్ (Robert Gordon Wasson) అనే అమెరికన్ జాతీయుడు స్వతహాగా బ్యాంకింగ్ రంగంలోని వాడైనా అనుకోకుండా పుట్ట గొడుగుల అధ్యయనంలో ఆసక్తి పెంచుకొని సంప్రదాయంగా పుట్టగొడుగుల వాడకం (Ethno mycology )మీద పరిశోధన మొదలుపెట్టాడు. మానవ మనోధర్మాలపై పుట్ట గొడుగులు కలిగించే మార్మిక శక్తి ( Psychedelic) గురించిన అంశంపై ఉన్న ఆసక్తితో మెక్సికో వెళ్లి అక్కడ మజాటేక్ సమూహ ప్రజలు ఉపయోగించే వివిధ రకాల పుట్టగొడుగుల సమాచారం సేకరించాడు . దీనికి సంభందించిన వివరాలతో అతని అనుభవాల ఆధారంగా 1957లో Seeking the divine mushroom పేరుతో ఒక వ్యాసాన్ని రాసాడు. దీంతో అప్పటివరకు వారి సామాజిక కట్టుబాటు ప్రకారం ఎవరికీ తెలియకుండా దాచిన సంప్రదయ విజ్ఞానం ప్రపంచానికి తెలిసింది. అయితే గార్డోన్ వాసన్ పరిశోధనకు అమెరికా దేశపు కేంద్ర దర్యాప్తు సంస్థ (Central Investigation Agency ) నిధులు సమకూర్చిందని తెలియడంతో ఇతను మెక్సికోలో చేసిన పరిశోధనలు వివాదాస్పదమైనాయి. అయినా అతని ఇంద్రజాలక పుట్టగొడుగుల ( Magic mushroom) పరిశోధన అంతటితో ఆగలేదు, అటు తర్వాత భారత దేశంలోనూ , గ్రీక్ దేశంలోనూ ఇటువంటి పరిశోధనలే చేసి వ్యాసాలను ప్రచురించాడు.

గార్డోన్ వాసన్ వల్లనే పుట్ట గొడుగులలో మాదకస్వాభావికత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రచారం ఆధారంగా మరికొంత పరిశోధన జరిగి సైలోసైబిన్ ( Psilocybin) అనబడే రసాయన పదార్థం కలిగి ఉండడం వల్ల కొన్ని జాతుల పుట్టగొడుగులు మాదక (మత్తు)స్వభావాన్ని కలిగి ఉన్నాయని గుర్తించారు.

గార్డన్ వాసన్ భారత దేశంలో చేసిన పరిశోధనలు కూడా మెక్సికోలో చేసినటువంటివే. అయితే భారత దేశంలో అటువంటి సాంప్రదాయ విజ్ఞానం అంతా కూడా వివిధ సమూహాలలో కాకుండా భారతీయుల ప్రాచీన శ్రుతులైన వేదాలను ఆధారంగా చేసుకొనిచేసినవి. భారతదేశ ప్రాచీన వేద వాగ్మయంలో ఎంతో ప్రాధాన్యం ఇవ్వబడిన సోమరసాన్ని తన పరిశోధన కోసం ఎంచుకొని తగిన ఆధారాలను అన్వేషించే ప్రయత్నం చేశాడు. ఇందుకుగాను సోమరసం గురించి విస్తారంగా వర్ణించిన ఋగ్వేద శ్లోకాల ఆధారంగా అమనిటా మస్కారియ( Amanita mascaria ) అనే పుట్టగొడుగు సోమరసాన్ని ఇస్తుందనే ప్రతిపాదన చేశాడు. ఇందుకు సంబందించిన సిద్దాంతం 1967లో “Soma : Divine Mushroom of Immortality” పేరుతో ప్రచురించాడు.నాలుగు వందల ముప్పై ఏడు పేజీలు గల యీ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించి ఆర్యుల ద్వారా ఈ రకమైన సోమరసం భారతదేశానికి పరిచయం చేయబడినదని రుజువుచేసే ప్రయత్నం చేశాడు. అందుకు తగిన ఆధారాలను మాత్రమే వినియోగిస్తూ ఋగ్వేద శ్లోకాల వర్ణనను ఉటంకిస్తూ సోమ మొక్కను శాస్త్రీయంగా అమనిటా పుట్ట గొడుగే అని తీర్మానించాడు.

గార్డన్ వాసన్ ప్రతిపాదనకు మూలం కేవలం రుగ్వేదంలో చెప్పబడిన శ్లోకాలే. అంతే కాదు గార్డన్ ప్రకారం బుద్దుడి చివరి భోజనంలో కూడా యీ పుట్ట గొడుగే ఉన్నది. గార్డన్ అభిప్రాయం ప్రకారం అమనిటా మస్కారియ మోతాదు మించి స్వీకరించినందువల్లనే బుద్దుడు మరణించాడు.ఇక్కడ కూడా గార్డన్ వాసన్ బౌద్ద సాహిత్యం నుంచే విషయ సేకరణ చేసి ఈ నిర్ధరాణ చేసినట్టు తెలుస్తున్నది. ( Indian Journal of History of Science, 47.1 (2012) 1-35 లోని వివరాల ప్రకారం గార్డన్ వాసన్ ఇంకా వెండి దోనిజర్ ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తున్నది. వెండీ దోనిజర్ భారతీయుల మీద చేసిన రచనల్లో భారతీయల చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరిగిందని ఇంకా ఆమె ప్రతిపాదనలపై అనేక అభ్యంతరాలు ఉన్నాయనేది నమ్మదగిన విషయం). అయితే ఒక్క ఋగ్వేద సాహిత్యం మినహా గార్డన్ వాసన్ భారత దేశంలో ప్రతిపాదించిన సోమరసం గూర్చిన వివరణ నిరూపించే ఇతర ఆధారాలు ఏమీ లేవు. తదనంతర కాలంలో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయానికి చెందిన జాన్ బ్రో (John Brough ) గార్డన్ వాసన్ చేసిన అమనిటా సోమరస ప్రతిపాదనను వ్యతిరేకించాడు. కేవలం భాష దారంగా ఇటువంటి ప్రతిపాదన చేయలేమని జాన్ బ్రో వాదన. ఇక శిలీంద్రశాస్త్ర పరంగా చూస్తే అమనిటా మస్కారియా అనే ఈ పుట్ట గొడుగు విషపూరితమమైనది ,మానవ స్వీకార యోగ్యమయినది కూడా కాదు. అంతే కాకుండా ఈ అమనిటా జాతులలో అనేక రకాలు ఉండడం వలన వీటిలో తినగూడనివీ , తినడానికి అర్హమైనవీ తెలుసుకోవడం సాధారణ వ్యక్తులకు సాధ్యం అయ్యే పని కాదు. కనుక ఈ పుట్టగొడుగులు వినియోగ ప్రయత్నంలో తెలియకుండా ఎటువంటి ప్రయోగాలుచేయకూడదు.

గార్డన్ వాసన్ సోమరసం మీద చేసిన ప్రతిపాదన తెలసిన తర్వాత నేను కూడా కొంత స్వీయ వాజ్మయ శోధన చేశాను. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ శిలీంద్రాలు కావడం కూడా ఇందుకు కారణం. నా స్వీయ శోధనలో దొరికిన కొన్ని పుస్తకాల ఆధరంగా సోమరసం గూర్చిన లోతైన అవగాహన కొరకు ఋగ్వేదాన్ని చదివాను. అక్షర వాచస్పతి డాక్టర్ దాశరధి రంగాచార్య సంస్కృతంలో ఉన్న వేదాలను తెలుగులోకి అనువాదం చేస్తూ రాసిన ఋగ్వేద సంహిత మొదటి భాగంలో కొంత వివరణ నాకు లభించింది. రెండవ అధ్యాయం –నూట ముప్పది ఏడవ సూక్తములో –-పురుచ్చేపుడు ఋషిని, –మిత్రా వరుణులు అనే దేవతలను ఆహ్వానిస్తూ చెప్పడిన శ్లోకాలలో “ సోమము నుంచి రసము తీసినాము , సోమ రసమున పాలు కలిపినాము ,ఇది మిక్కిలి మాదకము : సోమము తీసినాము , అందు పెరుగు కలిపినాము. ఉష , సూర్యుని కిరణముల ప్రకాశమున సోమము పిండినాము: పాలిచ్చు ఆవును పితికినట్టు సోమమును పిండి రసమును తీసినాము,అందులో నీరు చల్లినాము , రుబ్బినాము” వంటి అంశాలు ఉన్నాయి. ఇదే అధ్యాయానికి ఆలోచనామృతం పేరున రాసిన విశ్లేషణలో యథాతధంగా ఇలా ఉంది.

“సోమము చంద్రుని వెలుగు వెన్నెలతో పెరుగు తీవ. దానితో సిద్దము చేయునది సోమరసము. సోమరసము సాంతము ఒకే తీరుదికాదు . ఒకే పదార్ధమును రుచుల మార్పుతో వండుట జరుగును. పదార్థము ఒకటే. వంటలు వేరు. రుచులు వేరు. అట్లే సోమమును సిద్దము చేయు పద్దతులు , ప్రక్రియలు వేరు వేరుగా ఉన్నట్లున్నవి . పిండినవి రుబ్బినవి, పాలు కలిపినవి, పెరుగు కలిపినవి వేరు వేరు సోమములు ఉన్నట్లున్నవి. సోమ శక్తిని అశ్వ శక్తితో పోల్చుట జరిగింది. ఆధునిక మాదక ద్రవ్యములకు గుర్రపు పేర్లు ఉన్నవి.”

అంటే సోమ లత లేదా సోమ అనబడే ఒక తీగ జాతి మొక్క చంద్రుని కళలకు అనుగుణంగా పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.సోమము అంటే చంద్రుడు అని అర్థం. మన ఆయుర్వేద శాస్త్ర్రాల ప్రకారం ఔషదులు చంద్రుని ప్రభావంతో తయారు అవుతాయని అంటారు. భారతీయ వైద్యుడు సుశ్రుతుడు హిమాలయ పర్వత సానువుల్లో లభించే 24 రకాల సోమరసాన్ని ఇచ్చే మొక్కలున్నాయని, మరొక 18 మొక్కలు సోమరసాన్ని పోలిన రసాన్ని ఇచ్చే మొక్కలున్నాయని ప్రతిపాదించాడు. కనుక సోమ లత కూడా ఒక ప్రత్యేకమయిన ఔషది అయ్యే అవకాశం ఉంది.

ఇక ఋగ్వేదం తొమ్మిదవ భాగంలో కూడా ఐదు గొప్ప మొక్కల ప్రస్తావన చేసారు, సోమ, దర్భ(Desmostachya bipinnata.), భంగు (Marijuana గంజాయి ) యవ (Hordeum vulgare), సహస్.అయినప్పటికీ సోమ అంటే ఏమిటో ఇప్పటి వరకు ఎవరూ నిర్దారించలేక పోయారు. పరిశోధకులు ఒక్కక్కరిది ఒక్కో వాదన . సోమరసం ఇచ్చేది ఒక మొక్కే అయ్యి ఉండేది కాదని అనేక మొక్కలు దీని కొరకు ఉపయోగించారని భావించవచ్చునేమో. (ఆచార్య వామదేవ స్వామి –Dr. Devid frawley వ్రాసిన వ్యాసం ఆధారంగా). అయితే గార్డన్ వాసన్ చెప్పిన (Amanita muscaria) రకపు పుట్ట గొడుగును సోమరసం ఇచ్చేదిగా వేద పండితులు అంగీకరించలేదు. మన వేద పండితులు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుత యజ్ఞయాగాదులలో సోమలత (Sarcostemma acidum) ను సోమరసం కొరకు వాడడం జరుగుతున్నది.

ఇప్పటివరకు ఏది సోమలత అని నిర్ధారించడంలో ఎవరూ సఫలీకృతం అయినటువంటి దాఖలాలు లేవు. సోమరసం గురించిన అంశం పరిశోధకులకు ఎప్పటికీ ఆసక్తి కలిగించే అంశమే.శివ ట్రయాలజీ రాసిన అమీష్ సోమరస భావనకు విశేషమైన కాల్పానికత జోడించి పాటకుల అవగాహనను మరింత జటిలం చేశాడు. ఇక్కడ నాకు తెలిసన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గార్డోన్ వాసన్ చేసిన మెక్సికో పరిశోధనలకు అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన Central Investigation Agency నిధులు సమకూర్చడం! ఈ విషయం జాన్ మార్క్ అనే అతను Freedom of Information Act ఆధారంగా సేకరించిన సమాచారం ప్రకారం అమెరికా, MK ultra sub project 58 అనే ప్రణాళికలో భాగంగా గార్డోన్ 1957లో చేసిన మెక్సికో పరిశోధనకు ఆర్థిక సహాయం అందజేసింది.మన దేశంలో జరిగన పరిశోధనలకు ఎవరు ఆర్ధిక సహకారం అందించారో తెలుసుకునే అవకాశం నాకు లేదు, కానీ ఒక దేశం యొక్క సంప్రదాయ విజ్ఞానం మీద , వాజ్మయం మీద పరిశోధించి ఒక నిర్దారణకు రావడానికి , ఒక సిద్దాంతం ప్రతిపాదించడానికి ఇంత తక్కువ సమయం సరిపోతుందా అన్నది నాకు వచ్చిన సందేహం. అంతేకాకుండా ఇటువంటి సంప్రదాయ విజ్ఞానాన్ని వెలికి తీసే పనికి ఇతర దేశాల దర్యాప్తు సంస్థలు పూనుకోవడం, అందుకు ఆర్ధికసహకారం అందించడం వెనుక వ్యూహం ఏమిటో తెలుసుకోవడం మన బాధ్యత అని అనుకుంటాను.

ఇక మన తెలంగాణప్రాంతంలో ఈ కాలంలోనే జరుపుకునే ఉప్పలమ్మ పండుగ కూడా ఒక పుట్టగొడుగుకు జరిపే ఉత్సవమే. ఉప్పలం అంటే అచ్చంగా పుట్ట గొడుగు అనే అర్థం. అయితే ఒక ప్రత్యేకమైన పుట్ట గొడుగులు మొలిచినప్పుడు ఉప్పలమ్మ మొలిచింది అంటారు . అందులో ముఖ్యంగా చేయి ఆకారంలో ఉండే పుట్టగొడుగు. దీనికి మన తెలంగాణా ప్రాంతంలో వివిధ జానపద కథా నేపత్యాలు ఉన్నాయి. శ్రీ మహా విష్ణువు ఆరవ అవతారం అయిన పరశురామావతారంలో అధర్మవర్తనులైన క్షత్రియలను అంతం చేసే క్రమంలో పరశురామునికి భయపడి అనేక మంది రాజులు అరణ్యాలకు పారిపోతారు. అయినా సరే పరశురాముడు ఎక్కడ అధర్మం ఉన్నా అక్కడ ఉద్భవిస్తాడని, ఇలా మొలిచిన ఉప్పలం పరుశురాముని చేయేనని అది మొలిచిన చోట వినాశనం తప్పదని అంటారు. అందుకు ఉపశమనం కోసం ఉప్పలం మొలిచిన చోట పూజలు చేస్తారు. మరొక కథలో పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ ప్రకారం తన తల్లి రేణుక తల నరికిన తర్వాత పశ్చాతాపంతో చేయిని నరుక్కుంటాడు.అందుకు చలించిపోయిన రేణుకా దేవి అలా నరుక్కున్న పరశురాముని చేయి ఏ ఇంట్లో అయితే మొలుస్తుందో అక్కడ పూజలు చేయడం వల్ల శుభం కలుగుతుందని చెబుతుంది.ఆ చేయేఉప్పలం. ఉప్పలం వెలసిన చోట రాతి పలకలతో గానీ , బండ రాళ్లతో గానీ, మట్టి తో గానీ చిన్న గుడి కట్టి గ్రామ దేవతల మాదిరిగా పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ విధంగా ఉప్పలమ్మ మన గ్రామ దేవతలలో ఒక భాగం అయింది . శాస్త్రీయంగా చూస్తే ఇది జాంబీ హ్యాండ్ ( Zombie hand: Clathrus archeri ) అనే కుళ్ళిన మాంసపు వాసన వేసే విషపూరితమైన పుట్టగొడుగు. జాంబీ అన్న పేరు హైతీ భాష నుంచి వచ్చింది. జోంబీ అంటే హైతీ భాషలో భూతం. ఇది ఉన్న చోట దుర్గందం తో కూడిన తెల్లని ద్రవం చుట్టూతా ఈగలు కనిపిస్తాయి. ఈ పుట్ట గొడుగును దయ్యపు వేళ్ళ పుట్టగొడుగు అని , ఆక్టోపస్ ముళ్ళు అనీ అంటారు.

ఇంకా అనేక రకాల పుట్టగొడుగులు మానవ శరీర భాగాలను పోలిఉంటాయి. వీటిని పుట్టగొడుగులను దయ్యపు పుట్టగొడుగులు అని అంటారు. అందులో కొన్ని మెదడు ఆకారంలో (Calvatia craniiformis : Brain Mushroom ) కొన్ని రక్తం కారుతున్న పళ్ళ ఆకారంలో(Bleeding tooth Fungus: Hydnellum peckii ), మర్మావాయల ఆకారంలో (Shameless phallus : Phallus impudicus) కాలిన చేతి వేళ్ళ ఆకారంలో కూడా ఉంటాయి. ఇవి అన్నీ కూడా విషపూరితమైనవే.

ఇప్పటికి నేను ఈ ప్రాంతంలో ఇరవైకి పైగా కుక్క గొడుగుల్ని సేకరించాను. ఈ నెలాఖరు నాటికి ఇంకా ఎన్నో కొత్తవి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడే వాటి కాలం మొదలైంది. వచ్చే రెండు మాసాల వరకు కొనసాగే అవకాశం ఉంది. అడవిలో , వాలు భాగాలలో కొత్త కొత్త జాతులు దొరికే అవకాశం కూడా ఉంది. అటవీ ప్రాంతాల్లో వివిధ విశ్వ విద్యాలయాలు పరిశోధనా కార్యక్రమాలు నిర్వహిస్తాయి ,కానీ వాటి వివరాలు అటవీ శాఖ రికార్డులలో నమోదు కావు. అందువల్ల క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులకు ఇటువంటి వివరాలు తెలుసుకునే అవకాశం తక్కువ. నేను ఈ ఖాళీని పూరించాలని ప్రయత్నం చేస్తుంటాను. అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే స్థానికులను , పశువుల కాపరులను, వ్యవసాయ దారులను అడిగి వివరాలు తెలుసు కుంటాను. ఒక సారి ఒక నల్లని పుట్టగొడుగు కారట్ ఆకారంలో ఉన్నది కనిపించింది. అక్కడ పనిచేసే వ్యక్తిని అడిగినప్పుడు ఆ పుట్ట గొడుగు నల్లని పొడిని చిన్న పిల్లలకు నీళ్ళతో కలిపి తాగిస్తారని , ఇప్పుడు ఎవరూ అలా చేయడం లేదనీ , ఈ పుట్ట గొడుగులు కూడా ఎక్కవగా కనిపించడం లేదని చెప్పాడు. అతనికి కూడా పూర్తి వివరాలు తెలిసినట్లు లేవు . కాకపోతే తరాల తరబడి కొనసాగిన ఒక అనుభవైక జ్ఞానం శాశ్వతంగా మరుగునపడుతున్నదని అర్థమైంది. ఇలా ఇప్పటికే ఎంతో సంప్రదాయ వినియోగాంశాలు గతించిన కాలంతోపాటే అంతరించిపోయాయి , మరెన్నో పోనున్నాయి . ఇదిగో ఇప్పుడు ఇలా రాసే అక్షరాలు ఎప్పుడైనా ఎవరికైనా మార్గదర్శనం చేస్తాయని ఆశ.

కలప డిపోలో ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని నడుస్తున్నాను.నా పాదానికి దగ్గరగా ఒక చిన్న మొగ్గ లాంటి తెల్లని తల. నేను కూర్చుండిపోయాను. అది పుట్ట గొడుగా , కుక్క గొడుగా అని దగ్గరగా చూస్తున్నాను . ఆ తెల్లని మొగ్గ నా చెవిలో ఇలా “నువ్వు నా చిన్న ప్రపంచం లోకి ఎలా ప్రయాణం చేస్తావో గాని ఇక్కడ నిజానికి ప్రపంచానికి చెందనిది ఏది లేదని చెప్పాలనే మొలుస్తుంటాను,మీ కళ్ల ముందుకు రాని జీవితాలని చూడమని తల ఎత్తి పిలుస్తుంటాను… ఈ విశాల మృణ్మయ దేహం మీద నా పాద ముద్రలూ చిత్రించి గతించిపోతాను. ఇప్పుడు నువ్వు రాసే పేజీలో నా గమనం గురించి ఏం రాయబోతున్నావు ? ” అన్నట్టు అనిపించింది. నా డైరీలో కాగితం ఈ దేవతాగొడుగులను వర్ణిస్తూ నీలపు మణులను అలంకరించుకుంటుండగా వృత్తి బాధ్యతలను గుర్తు చేస్తూ పిలుపు వినవస్తోంది..లేవబోతూ నేను ఆలోచనలో పడ్డాను…

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Comments are closed.