అరణ్యం -3 -మండూక శోకం-దేవనపల్లి వీణావాణి

      

రాత్రికి బయటకు వెళ్ళే పని పడింది. అడవిలో  అక్రమంగా చెట్లను నరికడం , నరికిన వాటిని  ఒక చోట నుంచి మరొక చోటకి తరలించడం వంటివి రాత్రి పూటనే జరుగుతుంటాయి కనుక వాటిని అడ్డుకోవడం కోసం రాత్రి గస్తీ కాయడం, నఖాబందీ చేయడం వంటివి  అటవీ శాఖలో మామూలే.చాలా సందర్బాలలో మాకు కలప అక్రమ రవాణ గురించిన సమాచారం అందుతుంటుంది. సమాచారం లేకపోయినా గస్తీ తిరగడం తప్పనిసరి. అటవీశాఖలో ఉన్న ప్రధాన ఉద్యోగ బాధ్యతలలో కలప అక్రమ నరుకుల్లను,అక్రమ రవాణాను అడ్డుకోవడం  ఒకటి. రెండవ ప్రధాన విధి అడవులను పెంచడం. ఈ రెండింటి మధ్య ఇంకా అనేక పనులు చేయవలసి వస్తుంది. అడవులలో వన్య ప్రాణులను కాపాడుకోవడం, మంటలు వ్యాపించకుండా చూడడం, దారులు వేయడం, కొమ్మలు నరకడం,  కలపేతర ఫలసాయాన్ని సేకరించుకోవడం, గడ్డి భూముల నిర్వహణ , పశువుల , జీవాల నుంచి కొత్త పిలకలను  రక్షించుకోవడం, నీటి వనరులను , మట్టిని , కొండలను , బండలను ఒక్కటేమిటి ఎలా ఉండవలిసిన అడవిని అలా ఉంచేందుకు చేయవలసిన అన్ని పనులు చేసుకొంటూ పోవడమే. వీటి అన్నింటికీ శాస్త్రీయ విధివిధానాలు ఉన్నాయి. ప్రతీ అటవీ అధికారికి దాదాపు ఇరవై ప్రకృతి సంభంద అంశాలలో తగిన శిక్షణ ఇవ్వబడుతుంది. కానీ అంత కన్నా ఎక్కువ శిక్షణ  మేము పని చేసే అడవే యిస్తుంది. ఒక చోట ఉన్న పరిస్థితులు మరో చోట ఉండవు . ఎక్కడి  అడవి అక్కడికి ప్రత్యేకం, పనులు కూడా అందుకు తగినట్టుగానే ఉంటాయి. ఇంత వైవిధ్యమయిన శాస్త్రీయ విధి నిర్వహణ ఒక్క అటవీ శాఖలోనే చూడగలం అనడం అతిశయోక్తి కాదు.

           ముందుగా అనుకున్న ప్రకారం ఎంపిక చేసుకున్న దారుల్లో రాత్రి గస్తీ కోసం మేము  సిద్దపడే బయలుదేరాం. దారిలో ఎక్కడైనా ఆగవలసి వస్తుంది కనుక అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొని మధ్యరాత్రికి మొదలయ్యాం. మా బృందంలో నలుగురం ఉన్నాం. నేను ప్రస్తుతం పని చేసే చోట ఒకప్పుడు విస్తారమైన టేకు వనాలు ఉండేవి. కనుక రాత్రి పూట ఇలా గస్తీ కాయడం చాలా సాహసంగా ఉండేదని మా వాళ్ళు చెబుతుంటారు. ఇప్పుడు అటువంటి విలువైన కలప వృక్షాలు లేవు. కానీ ఉన్న వాటిని సైతం నరికి తరలిస్తూ ఉంటారు.  నిన్నా మొన్నా భారీ వర్షాలు కురిసాయి. ఈ రోజు కొంచం తెరిపి. మళ్ళీ వర్షం పడే అవకాశం  ఉన్నది. నిన్న మొన్న ఎవరైనా వర్షం కారణంగా కలప తరలింపు  ఆపుకున్న వారు ఈ తెరిపి నిడివిలో బయటకు వస్తారు. వాటినే లక్ష్యంగా మేమూ మ పనిలో ఉన్నాం.

          చుట్టూ చీకటి. పగలంతా రకరకాల పనులతో  ఉన్న గ్రామాల రహదారులన్నీ  రాత్రిళ్ళు నిశ్శబ్దంగా , కొన్ని చోట్ల కీచురాళ్ళ శబ్ధంతోనూ , మరికొన్న చోట్ల భరించలేనంత మౌనంగానూ నిద్రిస్తున్నాయి. దారి పొడుగూతా ఉన్న చెట్ట్లు వర్షానికి  తడిసి  ముద్దైన  కొమ్మలను ఆరబెట్టుకుంటున్నట్టు గంభీరంగా  నిలబడి ఉన్నాయి. మా జీపు వెళుతురు తప్ప ఏమీ కనిపించనంత చీకటి. మళ్ళీ వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దట్టంగా మబ్బులు పట్టి చీకటిని ఇంకా చిక్కగా చేస్తున్నాయి. మేము ఒక్కో కూడలికి ముందు  కొంత సమయం ఆగుతూ , చుట్టూ పక్కల గమనిస్తూ ముందుకు పోతున్నాం.

         కొంత సమయం ఒక చోట ఆగాక చిన్నగా చినుకులు పడ్డం మొదలైంది. వర్షం పెద్దది అవుతోంది.   ఎన్ని రోజులైంది , ఇలా అర్థరాత్రి  అడవి దారుల మధ్య నిలబడి చినుకు చినుకుగా పడే  వర్షం కళ్ళ  నిండుగా చూసి ! ఇలాంటి సంధర్భాలలో అక్కడ ఆగిపోవడం తప్ప ఏమీ చేసేలా ఉండదు. కాసేపు తెరిపి ఇచ్చేదాక  ఆగాలని నిర్ణయించుకొని జీపు చుట్టూ తెరలు వేసి అనుకూలంగా ఉన్న ఒక చోట ఆగిపోయాం. పొరపాటున ఏదైనా వాహనం అటువైపుంచి వస్తే ఇబ్బంది కాకుండా మా డ్రైవర్ భద్రు  జీపు లైట్లు వేసే ఉంచాడు.

          వర్షం ఆగడం లేదు. మంచి హుశారుమీద ఉన్న యువకుడు పరుగు పందెంలో పోటీ పడుతున్నట్టు చినుకు వెనక చినుకు జోరుగా పడుతూనే ఉంది. ఇలా జోరుగా పడే వర్షం కాల నిడివి తక్కువ ఉంటుంది. కాసేట్లో తగ్గిపోవచ్చు . జీపులో ఉన్న వాళ్ళతో  మాట్లాడుతూ చుట్టూ చూస్తూ ఉన్నాను. చాలా గంభీరమైన వాతావరణం. వాన శబ్దం తప్ప ఏమీ  వినిపించడం లేదు.  లైట్ల వెళుతురులో  చినుకులూ , ధారలు కట్టిన నీళ్ళు  మరేమీ కనిపించడం లేదు.

          ఇది సెప్టెంబర్ మాసపు చివరి వారం. భాద్రపద మాసపు చివరి రోజు అంటే వర్ష ఋతువు చివరి రోజు. రేపు ఆశ్వయుజ మాసం ప్రారంభంతో శరదృతువు ప్రారంభం అవుతుంది. వర్షాలు ఋతు భేదం మరిచి కురవడం ఇప్పుడు సాధరణమైపోయింది. ఋతువులతో పాటు ఉన్న జీవ గమనం ఈ మార్పును ఏ మేరకు తట్టుకుని నిలదొక్కుకుంటుందో కాలమే నిర్ణయించాలి.  

నేను చాలా సేపు కురిసే వర్షాన్ని చూస్తూ ఉండిపోయాను. వర్షం మెల్లి మెల్లి గా తగ్గుతున్నది. ముందుకు ప్రయాణించడానికి అందరం సిద్దం అయ్యాం, డ్రైవర్ జీపును నడపడం మొదలుపెట్టాడు. వర్షంలో తడిసిన  రోడ్డు  నల్లగా మెరుస్తూ పచ్చని తివచీని రెండుగా విడగొడుతున్నది.

జీపు లైట్ల వెలుగులో గంతులు వేస్తూ చిన్న చిన్న కప్పలు రోడ్డు దాటుతున్నాయి. వాటి మీద నుంచి పోతున్నామేమో అని  కంగారు పడ్డాను. ఇంత రాత్రి వేళ ఈ కప్పలు రోడ్డు దాటుతున్నాయి! దేని కొరకు ? వాటికి రోడ్డు దాటి పోవలసినంతగా ఏం పని ఉంటుంది అనుకుంటున్నారేమో , ఆరాటం మనుషులకు మాత్రమేనా,అన్నింటికీ ఏదో ఒక హేతువంటూ లేకుండా చలనశీలతను ఊహించలేము కదా.   ఇది కప్పలకు ప్రత్యుత్పత్తి జరిపే కాలం. ఆడ కప్ప అరుపులు అనుసరిస్తూ మగ కప్పలు వెళుతుంటాయి. ఈ రాత్రి అవి  తమ ఆహారాన్నో , తగిన జోడీనో వెతుక్కోవడానికి వెలుతుంటాయి, లేదా  యే ప్రమాదసూచికో వాటిని రానున్న సమయం నుంచి తప్పించుకోమని హెచ్చరించి ఉంటుంది.కప్పల కంటి దృష్టి మనలా ఉండదు. కప్పలకే కాదు మానవుల మాదిరి దృష్టి అన్ని జంతువులకు ఉండదు. కప్పలు చీకటిలో కూడా చూడగలవు.  మానవుల భూరీ వాహనాల విషయం వాటికేం తెలుసు, ప్రకృతి సంజ్ఞలతో ప్రయాణించడం తప్ప! వెళ్తూ వెళ్తూ వాహన చక్రాల కింద పడి నలిగి  మాంసపు ముద్దలైపోతుంటాయి. ఇలా రోడ్డు  దాటడానికి వచ్చి  రోజూ ఎన్ని కప్పలు మరణిస్తున్నాయో కదా!  కప్పలు ఇలా రోడ్డు దాటకుండా ఉంటె బాగుండు అని అనిపిస్తుంది,కానీ ఆ చిన్న అభాగ్యజీవులకోసం మనం ఏమీ చేయలేని పరిస్థితి.కొన్ని కొన్ని చిత్రమైన పరిస్థితులు అంతే, యే పరిష్కారమూ ఉండదు, తోచదు లేదా ఈ రెండూ.

జీవం ముందు  నీటిలో పుట్టి తర్వాత భూమి మీద విస్తరించింది. భూమి మీద కప్పలు ముప్పై అయిదు కోట్ల సంవత్సరాలనుంచీ ఉన్నాయి. భూమి మీద పాదం మోపిన మొదటి జీవులు ఉభయచరాలు అంటే ఈ మండూక జాతులే. మొట్ట మొదటి వెన్నెముక కలిగిన ఈ జాతుల నుంచి పరిణామ క్రమంలో జీవం మరింత అభివృద్ధి చెందింది. ఇవి నీటిలోనూ భూమిపైనా రెండు ఆవాసలలోనూ బతకగలవు ఇంకా రెండూ ఆవాసాలు వీటి మనుగడకు అవసరం.  ఆవాసం కోసం కేవలం నీటిలోనే కాదు , భూమి  మీదనూ, రెండింటి లోనూ , బొరియల్లోనూ ,చెట్ల మీదనూ జీవించే జాతులు ఉంటాయి.

మానవులు తప్ప , పర్యావరణానికి మేలు చేయని జీవులు లేవు. మండూకాలు తమ కన్నా చిన్న వాటిని తింటూ పెద్దవాటికి ఆహారమవుతూ ఆహారపు వలలో  ఒక ముఖ్య భూమిక పోషిస్తాయి. నీటిలో పెరిగే కీటకాల ,మొక్కల వ్యాప్తిని సమతూకంలో ఉంచడం ప్రకృతి వీటికి ఇచ్చిన బాధ్యత. ముఖ్యంగా దోమలను నియంత్రించడంలో ఇవి లేని లోటు ఈ మధ్య కాలంలో విస్తరిస్తున్న విషజ్వరాలకు మూలమని ఎంత మంది గుర్తించారో నాకు తెలియదు. పర్యావరణానికి ఎంతో మేలు చేసేవైనా , వాటి కృషి కేవలం  లెక్కలు మాత్రమే  వేసుకునే మన లెక్కలోకి ఎప్పుడు వస్తుందో కదా !

మా చిన్నప్పటి సహవాసగాళ్ళలో కప్పలు కూడా ఒకటి. మట్టి గచ్చు ఉన్న ఇళ్ళలో , సాయవాన్ ( వంటకొరకు ఇంటికి ఆనుకుని  వేసుకునే  షెడ్డు ) లో , బడిలో , తొవ్వలలో చిరపరిచయం ఉన్నవే. బడిలో క్లాస్ రూమ్లోకి కూడా వచ్చేసేవి.వాటిని చేతితో ఎత్తి అవతల పారేసి వాళ్ళం.  చిన్నప్పుడు బోలెడన్ని కప్పలు వచ్చేవి. పెద్దపెద్ద కప్పలు పెద్దగా అరుస్తూ   వరి చేలల్లో  సందడి చేసేవి. అది ఒకటో రెండో కాదు వేల వేల కప్పలు…వానాకాలం అంతా నీళ్లు చేరిన ప్రతీ చోటా .. రంగు రంగులవీ , పెద్దవి ,చిన్నవీ, బావి దగ్గరా, మురికి నీళ్లు నిలిచే చోట, పొలం దగ్గరా రక రకాల కప్పలు కనిపించేవి. అప్పట్లో బావి నీళ్లే తాగేవాళ్ళం, చేద వేసినప్పుడు బావి లోపల గట్టు సందుల్లోనించి కూడా కప్పలు కనిపించేవి. అక్కడికి ఎలా వెళ్ళాయో అని ఆశ్చర్యపోవడం కూడా అలవాటే. ఐతే  వానాకాలం మాత్రమే కనిపించే పసుపు రంగు కప్పలు పెద్దగా ఉండేవి. ఇవి ఎప్పుడూ కనిపించే కప్పల లాంటివి కాదు. ఎక్కువగా పొలాలలోనూ , ఒర్రెల దగ్గరా , వర్షం కురిసి బురద అయిన చోట  కనిపించేవి.వాటి అరుపుకూడా పెద్దగానే ఉండేది. మళ్లీ వానలు తగ్గగానే  మాయమయిపోయేవి. ఈ కప్పలన్నింటిని  పెద్ద వాన వచ్చి పొలంలో వేసి పోతుందని అనుకునే వాళ్ళం. అప్పుడు పెద్దగా వాటి గురించి తెలిసేది కాదు. పెద్దయ్యాక తెలుసుకున్నదేమిటంటే అవి భూమి లోపల బొరియలు చేసుకొని జీవిస్తాయనీ బాగా వానలు కురిసినప్పుడు వాటి బొరియలు నీటితో నిండిపోతాయి కనుక అప్పుడు బయటి వస్తాయినీ, నీళ్లు ఇంకిపోగానే తిరిగి మళ్లీ బొరియలలోకి వెళ్లిపోతాయి అని. ఈ కప్పలనే మా ప్రాంతంలో గోన్రు కప్ప అని బొదురు కప్ప అని పిలుస్తుంటారు.

ఇది ప్రతి వర్షాకాలం మాకు అలవాటుగా కనిపించే పనే. పల్లెటూల్లో ఇవ్వన్నీ మాములు విషయలలాగానే ఉంటాయి. నాకు బాగా గురుతున్న సంగతి , మా పాటశాల వైజ్ఞానిక ప్రదర్శనలో  గుండె పనితీరు ప్రయోగానికి ఈ పసుపు రంగు కప్పనే( Indian bull frog –Hoplobatrachus tigerinus ) ఎంచుకోవడం. మా అన్న  తన స్నేహితులతో కలిసి కప్పలను పట్టుకుని తెచ్చేవాడు.  ప్రయోగానికి సిద్ధం చేయడం కొరకు దాని నోట్లో తంబాకు( బీడీల్లో నింపటానికి వాడే పొగాకు పొడి ) వేసే వాళ్ళు. దాంతో కప్ప మగతగా మారిపోయేది. దాన్ని ప్రయాగ శాలలో మైనపు దిమ్మ ఉన్న పళ్ళెంలో వెల్లకిల్లా పడుకోబెట్టి నాలుగు వైపులా గుండుపిన్నులతో కదలకుండా పెట్టి అప్పుడు పొట్ట నుంచి కింది వరకు కోస్తే కప్ప శరీర భాగాలు మొత్తం ఎలా పని చేస్తాయో కనిపించేది.ముఖ్యంగా గుండె కొట్టుకోవడం. ఆ కప్ప అలా కాసేపు వుండి చచ్చిపోయేది.  మళ్లీ ఇంకో కప్ప…విజ్ఞాన ప్రదర్శన మూడు రోజులు ఇదే పనిగా ఉండేది. ఇదంతా  మామూలే అన్నట్లు ఉండేది కానీ, పాపం అనిపించేది. ఇలాటి ప్రయోగాలు మా సైన్స్ టీచర్ చేయించేవారు. ఇది  ఇరవైఅయిదేళ్ళ కిందటి   సంగతి. బహుశా  అప్పట్లో చదువుకోవడం ఒక ఉద్యమంగా ఉండేది కనుక మన చుట్టూ ఉన్న పరిసరాలలో నుంచి నేర్చుకుంటున్నామన్న ధ్యాసలో చచ్చిపోయే జీవాల ప్రాణాలు లెక్కలోకి తీసుకునే వాళ్ళు కాదు, పర్యావరణ స్పృహ కలిగించేంత విపరీత పరిస్థుతులు కూడా లేవు . 

ఇలా జీవించి ఉన్న జంతువులపై ప్రయోగాలను మనదేశంలో బ్రిటిష్ పాలన కాలంలో మొదలయింది. అందులోనూ ఎంతో ఆధునికీకరణ జరిగిన తర్వాత కూడా ఇందులో మార్పు రాలేదు. వైద్య విద్య లోనూ , జీవ శాస్త్ర ప్రయోగాలలోనూ, మందుల పనితీరు ప్రయోగాలలోనూ వివిధ జంతువులను వినియోగిస్తారు. ఇలా ఎక్కువ మొత్తంలో అధ్యయనం  కొరకు జరిగే ప్రయోగశాల వధకు గురయ్యే జంతువులలో మొదటి స్థానం కప్పలదే. ఇవి సులభంగా అందుబాటులో ఉండడం , వాటి నిమ్మళపు స్వభావం , చిన్న పరిమాణం వంటి కారణాల వల్ల విద్యార్థులు సులభంగా  నేర్చుకుంటారనే ఉద్దేశ్యంతో వీటిని ఎంచుకునే వారు. ఒక అంచనా ప్రకారం దేశంలో పందొమ్మిది మిలియన్ల జంతువులు  విద్యా సంబంధ విషయాలలో ఉపయోగించబడుతున్నాయని తెలుసుకోవడం పెద్దగా ఆశ్చర్యపోయే విషయమేమీ కాదు. ఇందుకుగాను  విద్యా సంస్థలకు వివిధ జంతువులను సరఫరా చేసే సంస్థలు ఉంటాయి. ఆయా సంస్ధలు స్ధానికంగా లభించే కప్పలు, పాములు, కుందేళ్లు, కోతులు వంటి జంతువులను పట్టుకొని కావలసిన విధంగా సమకూర్చుతారు. నిన్నా మొన్నటి వరకు అంటే భారత ప్రభుత్వం 2011 లో ప్రయోగశాల జంతు వధను నిషేధించేవరకు ఇది కొనసాగింది. జంతువులపై హింసా నిరోధక చట్టం (  Prevention of Cruelty against Animals Act, 1960, Section 17.1 (d) experiments on animals may be avoided wherever is it possible to do so Section 17.(f) requires that as far as possible experiments on animals are not performed merely for the purpose of acquiring manual skill )  వన్య ప్రాణి సంరక్షణ చట్టాలు( Wildlife Protection Act 1972 , All Sharks and Rays included in Schedule and All Frogs included in Schedule –IV) ఇందుకు భూమిక. కప్పల మీద, ప్రయోగశాలలో అధ్యయనం కోసం ఉపయోగించే ఇతర జీవుల మీద భారత దేశపు విశ్వవిద్యాలయల దిక్సూచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ఇంకా మానవ వనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త నిర్ణయాల ప్రకారం   2011 నుంచి పాక్షికంగా 2014 నుంచి పూర్తి స్థాయి నిషేధం విధించబడింది. ఇందుకు సంభందించిన నియమావళి వెలువరిస్తూ భారత వన్యప్రాణి చట్టం , జంతువులపై హింసా నిరోధక చట్టాలతో పాటు రాజ్యాంగంలోని 51A(G)   అధికరణ ప్రకారం ‘ పర్యావరణాన్ని , జీవులను కాపాడడం ప్రతి పౌరుని బాధ్యత’ని పేర్కొన్నారు. వైద్యవిద్య కు మార్గ దర్శకం చేసే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా , ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఇటువంటి మార్గదర్శకాలను వెలువరించాయి. వివిధ పర్యావరణ సంబంధ నివేదికలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ప్రతీ ఉన్నత విద్యా సంస్థలో రెండేళ్ళ కాల పరిమితికి లోబడి Dissection Monitoring Committee లను వేయాలనికూడా సూచించింది. ప్రయోగశాలలో జంతు వధ జరగకుండా చూడడం దీని విధి. దశల వారీగా  ప్రయోగశాల జంతువధ నిషేదాన్ని అమలు పరచడమే లక్ష్యంగా ఈ నియమాలను రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాలకు అనుగుణంగా  రాష్ట్రంలో జంతువుల ప్రయోగశాల వధ ను నిషేధించింది.   ఇలా జంతువులను కాకుండా   ఎక్కడ వీలైతే అక్కడ డిజిటల్ పద్దతిలో, వివిద రకాల మోడల్స్ ను ఉపయోగించి విద్య బోధన చేయాలని  కూడా ఈ నియమావళి సూచించింది.

అదంతా ఒక విషయం అయితే  ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ చూసినా నా చిన్నప్పుడు చూసిన పసుపు రంగు కప్పలు మాత్రం నాకు మళ్లీ కనబడలేదు. ఎవరిని అడిగినా  ‘లేదు, ఈ మధ్య  దానిని  చూడలేదు’ అన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బోదురు కప్పలు కనిపించకపోవడం గురించి ఫారెస్ట్ సర్వీస్లోకి రాక ముందు పెద్దగా ఆలోచించలేదు. పల్లెటూరు వ్యవసాయ క్షేత్రాలలోకి వెళ్ళేఅవకాశం కూడా  తగ్గిపోయింది  కనుక వాటి పరిశీలనలో కొంత విరామం అందుకు కారణం. ఈ బొదురు కప్పలు మంచి నీటి ఆవాసలలో చిన్న చిన్న పురుగుల్ని తిని బతికేవి. భూమి మీద , నీటిలో రెండు చోట్లా బతుకుతూ ఉండేవి. నిజానికి అంతర్జాతీయ ప్రకృతి మరియు  ప్రకృతి వనరుల సంరక్షణా సంస్థ ( International Union for Conservation of Nature and Natural Resources ) లెక్కల ప్రకారం ప్రత్యేక  సంరక్షణ చర్యలు అవసరం లేని మండూక జాతి ఇది . ఈ సంస్థ  ప్రపంచ వ్యాప్తంగా అంతరించి పోయే జాతుల వివరాలు నమోదు చేస్తూ వాటిని ,వాటి సంరక్షణ చర్యల అవసరాన్ని గుర్తిస్తూ సూచనలు చేస్తుంటుంది.అంటే ఈ బొదురు కప్పలు విస్తారంగా   ఉన్నాయి కనుక పెద్దగా సంరక్షణ చర్యలు అవసరం లేదని అర్థం . అయినా ఇప్పుడు ఎక్కడా వీటి జాడ మాత్రం ఉండడం లేదు. అయితే ఆ తర్వాత  తెలుసుకున్నది ఏమిటంటే గత నలభై ఏళ్లలో దేశంలోని అనేక కప్ప జాతులు అంతరించే దశకు చేరుకున్నాయని!ఎంత విషాదం , మన కళ్ళ ముందే  ఒక విశాలమయిన తెర మీద  ఒక్కొక్కరే అదృశ్యమై పోతున్నట్టు, ఒక బృహన్నాటకంలో  విరమించుకుంటున్న పాత్రలు చివరి అంకపు మొదటి భాగం మొదలు పెట్టినట్టుగా తోస్తుంది నాకు.  కప్పల జనాభా ఇంత పెద్ద మొత్తంలో తగ్గడం వెనుక అటువంటి సంజ్ఞ ఉందని అనుకోవచ్చానేమో.

  కప్పలు ఆహారంగా ఉపయోగించడం గురించి మీరు ఎప్పుడైన వినే ఉంటారు . ఎక్కడో పాశ్యాత్య దేశాలలో అనుకోకండి మన దేశం నుంచి విదేశాలకు కప్ప మాంసం ఎగుమతి కూడా  అయ్యేది.మన తెలంగాణ వాసులకు ఇది కొత్త విషయమైనా మనదేశంలోని కొన్ని ప్రాంతాలలో  కూడా కప్ప మాంసం తినే అలవాటు  ఉంది. కాకపోతే  విదేశీయులలో  కప్పు మాంసాన్ని తినే అలవాటు ఎక్కువ . ప్రపంచంలో కప్ప కాళ్ళను ఎగుమతి చేసే  మూడు ముఖ్యమైన దేశాలలో  భారతదేశం కూడా ఒకటిగా ఉండేది. కప్పలను పట్టుకునే వేటగాళ్ళు కూడా ఉండే వాళ్ళు, కప్ప కాళ్ళ ఎగుమతి వ్యాపారం మంచి దశలో ఉన్నప్పుడు కప్ప వేటగాళ్లకు సంఘాలు కూడా ఉండేవి.   ఒక దశలో  కప్ప మాంసం ముఖ్యంగా కప్ప కాళ్లకు విదేశాలలో ఉన్న డిమాండ్ కారణంగా  కప్పలను పట్టుకునే వాళ్ళ సంఖ్య కూడా  పెరిగింది. కేరళ , తమిళనాడు, బెంగాల్, సిక్కిం వంటి రాష్ట్రాలలో కప్పల వేట ఎక్కువ.

 వర్ష రుతువులో కప్పల సంచారం అనుసరించి మొదలయ్యే వేట వాటి అంతిమ స్థానం చేరే వరకు జరిగే హింస మనం  ఊహించేటంత  తక్కువేమీ కాదు. చీకటిలో చూడ   గల కప్ప మనిషిలోని చీకటి కోణం మాత్రం చూడలేదు, అందుచేతనే వేటగాళ్ళ చేతిలో  ఒక్క టార్చిలైట్ కాంతి తమ మీద  ప్రసరించినప్పుడు  మ్రాన్పడి పోయి   ఎక్కడివక్కడే ఆగిపోతాయి. అలా వేట మొదలవుతుంది. సంచులకు ఎత్తబడిన కప్పలు ఆ తర్వాత కాళ్ళు  విరిచి వేయబడి చల్లని మంచు ముక్కల మధ్య నిలువ చేయబడడమో లేదా  సజీవంగా ఫార్మాల్డిహైడ్ ద్రావణంలో ముంచివేయడమో జరిగేది. మొదటిది ఆహారం కోసం రెండవది ప్రయోగశాల వినియోగం కోసం. ఇక వాటి కళేబరాల మీద వ్యాపారం జరుగుతుంది.  ఇదంతా అధికారికంగానే జరిగేది. మన దేశంలోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ది సంస్థ ( Marine Products Export Development Authority) పర్యవేక్షణలోనే ఇది కొనసాగేది. 1984- 85 మధ్య కాలంలో 2776 టన్నుల కప్ప కాళ్ళని ఎగుమతి చేశామని అనుకుంటే ఎన్నికోట్ల కప్పలు అంతమయ్యాయో కదా . ఇలా రవాణా  చేయబడిన   కప్ప మాంసం యూరోప్ లోనో , అమెరికాలోనో సూప్ గానో, పకోడిలుగానో మారిపోయేది. కప్ప మాంసాన్ని జంపింగ్ చికెన్ అంటారు. వీటి మాంసానికి  మనదేశంలో కూడా విదేశే పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో  ఎక్కువ డిమాండ్ ఉంటుంది.  ముఖ్యంగా గోవాలో ఈ ఆహారానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఎంత  లేత కాళ్ళు అయితే అంత డిమాండ్. ఇందాక నేను ఈ మధ్య కనిపించడం లేదని  చెప్పిన  బొదురు కప్పలు(Hoplobatrachus tigerinus  ) జెర్డాన్ బుల్ ఫ్రాగ్ (Hoplobatrachus crassus)  వంటివి  ఎక్కువగా తినడానికి ఉపయోగపడే  కప్పలు .కప్పలను ఆహారంగా తీసుకోవడం మన దేశంలో  కొన్ని ప్రాంతాల్లో అలవాటుగా ఉన్నా విదేశాల కోసం , ప్రయోగాల కోసం తరలించడం వంటి వాటి వల్ల ఒక్క పెట్టున  వాటి జనాభా మీద ప్రభావం పడింది.ఈ పరిస్థితి  1987 వరకు అంటే  కప్ప మాంసాన్ని ఎగుమతి చేయడం నిషేధించే వరకు కొనసాగింది.

1986లో మొదటిసారి కప్ప మాంసపు వినియోగం  పట్ల కలకత్తాలో ఒక సమావేశం జరిగింది. అప్పటివరకు  ఇదంతా సామాన్యులకు తెలియని వ్యాపారం.  అప్పటి వరకు కూడా ప్రభుత్వం,  కప్పలు  లేకపోవడం  వలన కలిగే పర్యావరణ సంబంధ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. క్రియాశీలురైన పర్యావరణ ప్రేమికులు సమర్పించిన పలు  నివేదికల, పర్యావరణ  సేవకుల , పలు స్వచ్చంద సంస్థల ప్రభావంతో ప్రభుత్వం   కప్ప మాంసపు ఎగుమతులను  నిషేదించడమే కాకుండా , మనుగడ కష్టతరమైన  జాతులను  సంరక్షించడానికి పూనుకోవడం ఒక మంచి మార్పు. మంచి నీటి కప్ప జాతులన్నింటిని  వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972   లోని షెడ్యూల్ IV లో చేర్చి కప్పలను రక్షించడాన్ని చట్టబద్దం చేసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం  యొక్క కటిన నిబంధనలు , శిక్షలు   ఆయా జాతులను సంరక్షించడానికి ఉపకరిస్తాయి అని భావన. అయితే  ప్రభుత్వం  యొక్క నిర్ణయాన్ని   వ్యతిరేకిస్తూ కేరళలో కప్పలవేట సంఘాల అధ్వర్యంలో ఉద్యమాలు కూడా జరిగాయి . ప్రజలలో ,కప్పలు లేకపోవడం వల్ల కలిగే  పర్యావరణ  దుష్ప్రభావాలు తెలియకపోవడమే ఈ ఉద్యమాలకు హేతువు. చట్టపరమైన రక్షణ కల్పించినందువల్ల ప్రభుత్వం వెనుకకు మరలకపోవడం ఒక ఊరట. కాల క్రమంలో వీటి కప్ప మాంసపు వినియోగంలో కూడా మార్పు వచ్చింది.  ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఎవరైనా కప్ప మాంసంతో పట్టు పడితే మూడేళ్ల జైలు శిక్ష లేదా 25 వేల జరిమానా లేదా ఆ రెండూ .

కప్పలు, కప్ప మాంసపు  ఎగుమతుల వల్లనో ప్రయోగశాల వధల కోసమో అంతరిస్తున్నాయని అనుకుంటే అంతకన్నా ఎక్కువ తగిన ఆవాసం లేక నశించిపోతున్నాయి. కప్పలు మంచినీటిలో నివసించే జీవులు. వృక్ష మండూక జాతులైతే ( ట్రీ ఫ్రాగ్) చెట్ల మీదనే జీవిస్తాయి. ఒక చెట్టు  మీద నుంచి మరొక చెట్టు మీదకు ప్రయాణం చేస్తూ బతుకుతాయి. చలి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో శీతకాల సుప్తావస్థ ( Hybernation ) అంటే ఒక రకమైన దీర్ఘ నిద్రలో ఉండి అననుకూల వాతావరణం నుంచి తప్పించుకుంటాయి. కప్పలు మంచి పర్యావరణ జీవ సూచికలు ( Biological Indicators ). అంటే ఏదైనా ఒక ఆవాసంలో కప్పలు ఉన్నాయంటే ఆ ఆవాసం తక్కువ కాలుష్యం కలిగినదని అర్థం చేసుకోవచ్చునన్నమాట. అందులోనూ కప్పల ప్రత్యుత్పత్తి  నీటిలోనే జరుగుతుంది. ఆడ కప్ప నీటిలో గుడ్లను , మగ కప్ప వీర్యాన్ని విడిస్తే  నీటిలోనే ఫలదీకరణ , పిల్లలు ఎదగడం జరుగుతుంది.  ఇందుకేనేమో మన సంప్రదాయంలో మండూక వివాహాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. అంటే మండూకాల పరిరక్షణ పరోక్షంగా మంచి నీటి ఆవాసాల పరిరక్షణ. ఏదైనా ఇలా ప్రతీకాత్మకంగా చెప్పడం , ఆచరించడం భారతీయులలో అనాదిగా వస్తున్నసంప్రదాయమే .నీరు కలుషితం అయిపోతే కప్పలు అక్కడ ఉండలేవు , ఒక వేళ ఉన్నా తగిన ఆహారం దొరకదు. దొరికినా అటువంటి ఆవాసంలో ప్రత్యుత్పత్తి జరపలేవు. మొత్తంగా చెప్పాలంటే తగిన ఆవాసం కోల్పోవడం అనేది కప్పల జీవనానికి కలుగుతున్న ముప్పు, మనకూ ముప్పే.

 అడవుల క్షయం వల్లను, ఆవాసపు నాణ్యతను తగ్గిపోవడం వల్లను , ఆహార కొరత వల్లనూ  చెట్ల మీద నివసించే కప్ప జాతులు కూడా కనుమరుగవుతున్నాయి. ఇంకా భూమిలోకి ఇంకి అత్యంత దుష్ప్రభావం కలిగించే క్రిమిసంహారకపదార్థాలు, నీటిలో కలిసిపోతున్న వ్యవసాయ సంబంధ రసాయనాలు   మంచి నీటి ఆవాసాలను   ఘాటుగానూ, అననుకూలంగాను తయారుచేస్తాయి. బహుశా అందువల్లనేనేమో నేను వెతుకుతున్న బొదురు కప్ప ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు పొలం మొదటి దున్నడంతో పాటే ఎరువులు ,పురుగుమందులు వాడడం వల్ల  ఘాటెక్కిన నేల  వాటిని చాలా దూరం తరిమివేసి ఉంటుంది.

ఇప్పటికే భారత జంతు సర్వేక్షణ సంస్థ (ZoologicalSurveyofIndia) ప్రకారం 340 జాతులలో 78 జాతుల మనుగడ కష్టతరమైనదని ప్రకటించింది. అందులోనూ 17 జాతుల జనభా  రెండువందల యాభై కన్నా తక్కువ.  ప్రపంచ వ్యాప్తంగా 4800 జాతులు ఉంటే    భారత దేశంలో దాదాపు 410 జాతుల ఉభయచరాలను (Amphibians of India Web page  ఆధారంగా ) లను గుర్తించారు. ప్రతీ సంవత్సరం సరాసరిన పది కొత్త ఉభయచరాలను కనుగొంటున్నారు. మొన్నీమధ్యనే  భారతీయ శాస్త్రవేత్తలు బీహార్  చోటానాగపూర్ పీటభూమి  ప్రాంతంలో కొత్త కప్పను కనుగొన్నారని దానికి ఇప్పటి బీహార్ ఒకప్పటి మగధ సామ్రాజ్యానికి గుర్తుగా  దానికి మగధ మండూకం Magadha Burrowing Frog ( Spaerotheca Magadha )అని పేరు పెట్టారని చదివాను. ఇది పొలాలలో నివసించే మండూకమనీ  , వ్యవసాయంలో ఈ మండూకపు పాత్ర  ఇంకా వెలికి తీయవలసి ఉందని అనుకున్నారు. ఇప్పటివరకు ఝార్ఖండ్ ,బీహార్  రాష్ట్రాలలో  కనుగొన్న  మొదటి మండూకం అదేనట.  ఈ యేడు మార్చి నెలలో కూడా  పశ్చిమ కనుమలలో ఒక మండూకాన్ని  కనుగొన్నారు. కేరళకు చెందిన కురిచియ సమాజాన్ని సూచిస్తూ దానికి అస్ట్రో బట్రాకస్  కురుచియన (Astrobatrachus kurichiyana) అని  నామకరణం చేసారు. ఈ మండూకం ఎప్పుడో అంతరించి పోయిందని భావించారు.కానీ మన దేశ పశ్చిమ కనుమలలో తిరిగి గుర్తించారు. అంతే కాదు పరిణామాక్రమంలో దీని పాత్ర ను  అనుసరించి సజీవ శిలాజం( Living Fossil ) గా పరిగణిస్తున్నారు. ఇంకా మన కళ్ళ పడని, వెలుగుచూడని జాతులు ఎన్నో … అవి ఉన్నాయని  ప్రపంచానికి తెలియక ముందే ఆవాసం కోల్పోయిన జాతులు ఎన్నో. 

ప్రపంచ  వ్యాప్తంగా పెరుగుతున్న పర్యావరణ స్పృహ, కొత్త కొత్త పరిశోధనలు , ఔత్సాహిక పౌరులు ఈ మధ్య కాలంలో అనేక పర్యావరణ పరిశోధనలలో పాలు పంచుకొని తమ వంతు ప్రకృతి సేవను చేయడం ముదావహం. ఒక చిన్న ఆశ , మనం ఈ మాత్రం స్పృహతో బతికినా ఎంతో కొంత  సమతాస్థితిని కొనసాగించే అవకాశం ఉన్నది.మన దేశంలో కూడా ఇప్పుడు అనేక ఔత్సహిక స్వయం పరిశోధకులు ఇతోధికంగా కృషి చేస్తున్నారు.  మండూకాల మీద విస్తృతంగా పరిశోధన చేసి దాదాపుగా వంద పైచీలుగా కొత్త జాతులను కనిపెట్టిన సత్యభామా దాస్ బిజూ  కూడా ఆ కోవలోని వారే. వారి కృషికి గుర్తింపుగా భారత దేశ మండూక మహాశయుడు( Frog man of India ) గా చెప్పుకుంటారు. ఆయన కృషికి గౌరవంగా Polypedates bijui అని ఒక మండూకానికి  పేరు పెట్టారు. ఆయన  అంతరించి పోయాయనుకున్న ఉభయచరాలను గుర్తించాలానే సంకల్పంతో ” Lost amphibians of India ”  పేరుతో దేశ వ్యాప్త  యాత్ర నిర్వహించారు. మరింత మందిని పర్యావరణ సేవలో పాల్గొనేలా చేయడమే ఆయన ఈ యాత్ర అంతరార్థం. సీమా భట్ అనే  మరొక పర్యావరణ  ప్రేమికురాలు మండూక కళారూపాలను 45 దేశాల నుంచి 500 వరకు సేకరించి వాటితో ఢిల్లీలో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే స్వచ్చంద సంస్థ సహకారంతో  2018 లో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇవన్నీ   ప్రజలను  పర్యావరణ  హితం వైపు మరల్చడంలో ఒక భాగమే.

అటవీ శాఖ వారు కూడా   పర్యావరణ పరంగా అత్యంత సున్నిత ప్రాంతమయిన పశ్చిమ కనుమలలోనూ , సిక్కిం , హిమలయాల పర్వత సానువులలోనూ  మండూక పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మండూకాల మీద పరిశోధనలను  ప్రోత్సహిస్తూ వాటి సంరక్షణ కొరకు  ప్రయత్నం   చేస్తున్నారు.  అయినా ఇంకా చేయవలసింది ఎంతో ఉంది.

      మండూకాల జీవనంతో ముడిపడిన అనేక అంశాలు ప్రపంచ చరిత్ర నిండా కనిపిస్తాయి.   చైనాలోనూ మండూకసహితమైన  అనేక విశ్వాసాలు ఈనాటికీ చూడవచ్చు. ఖండాంతరాలలో యే సమాజాన్ని కదిలించినా మండూక ఆధారిత కథలో ఇతిహాసాలో వాటి  పురా మానవ సహజాతాన్ని ఉదాహరిస్తాయి.  భారతీయ చరిత్రలోనూ వాజ్ఞమయంలోనూ మండూకాలకు సముచిత స్థానమే ఉన్నది. మండూక  శరీర స్వభావాన్ని బానపొట్ట అలా బాన పొట్టను మాండూకగర్భం అనీ  అలా ఉన్న వాళ్ళు చాలా ధనవంతులవుతారని ఒక నమ్మకం. మండూక   సమూహాన్ని చూసే ,వాటి ప్రవర్తనను మనుషులకు  అనువర్తించి మండూక సూక్తంలో  శ్లోకాలు రాసారు..ఈ సూక్తంలో వర్షం పడితే గుమిగూడే కప్పలకు మల్లే మీరు ఉండకూడదు అనే ఒక హెచ్చరికలాంటి పాఠం ఉంటుంది. మండూక సూక్తం ఋగ్వేదంలో సప్తమ భాగంలో ఉంటుంది. అంటే ఋగ్వేద కాలం నాటికే మనకు మండూక పరిభాష తెలుసునన్నమాట. మండూక సూక్తమే కాదు, మండూకమహర్షి ప్రోక్తంగా వెలువడిన జ్ఞాన సుధనే మాండ్యుక ఉపనిషత్తుగా  వెలుగొందింది. ఆత్మ జ్ఞాన ప్రయాణంలో జీవుని జాగ్రత్, స్వప్న , సుషుప్త ,తురీయావస్థాలనే చతురావస్థలను వివరించించిన ఈ ఉపనిషత్తు  అద్వైతానికి ఆద్యం అని విజ్ఞుల మాట. అసలు  ఒక మనిషికి మండూకమనే పేరు రావడం , ఆ పేరు మీదనే ఒక ఉపనిషత్తు వెలువడడం భారతీయ సంస్కృతిలో ప్రకృతి పరిశీలనా వైశిష్ట్యానికి ఒక  గొప్ప నిదర్శనం. మండూక మహర్షి దక్షిణ భారత దేశపు   వ్రిశబద్రి కొండలలో అంటే నేటి తమిళనాడులో జల సమాధిలో ఉండి నారాయణ జపం చేసుకునే సన్యాసి. తనని చూడడానికి వచ్చిన దుర్వాస మహామునిని ఉపేక్షించిన కారణం చేత నీటిలో ఉండి ఇలా  అతిథిని అలక్ష్యం చేసావు కనుక నువ్వు నీటిలో ఆవాసం ఉండే మండూకంలా మారిపొమ్మని శపిస్తాడు. అలా కప్ప గా మారిన మునియే మండూక మహర్షి. తరువాత కాలంలో ఆయన తన తపోశక్తి తో తిరిగి మానవుడి గా మరి మహారుషి అవుతాడు. అతని ద్వారా వెలువడింది కనుకనే అది మాండ్యుక ఉపనిషత్తు అయింది .ఇంకా మండూక ప్రస్తావన కలిగిన పురా వాజ్ఞమయ సాక్ష్యాలు సంస్కృతంలో  అనేకం  దొరుకుతాయి.  తెలుగు సాహిత్యం లోనూ బద్దెన తన సుమతి శతకంలో కూడా  మండూకసూక్తంలో ప్రవచించిన విషయాన్నే అచ్చ తెలుగులో ” ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్   తెప్పలుగ చెరువులు  నిండిన  కప్పలు పది వేలు చేరు గదరా సుమతి  ” అని రాసి పెట్టాడు.

ఇక  ఉత్తరప్రదేశ్ లోని ఖేరీ జిల్లా లక్ష్మిపూర్లో ఉన్న శివాలయం పేరు మండూక మందిరం ! ఒక మండూకం తన వీపు మీద ఈశ్వరుని  గర్భాలయాన్ని మోస్తుంటుంది. ఈ మందిరం నిర్మాణ విశిష్టత కూడా గొప్పదే. మండూకం శుభాలను చేకూరుస్తుందని నమ్మడమే అటువంటి నిర్మాణాన్ని చేపట్టడానికి మూలమయ్యింది .  ఇక్కడ యాత్రా సాహిత్యం మీద విశేష కృషి చేసిన  ప్రొఫెసిర్ ఆదినారాయణ గారు రాసిన ఒక వాక్యాన్ని చెప్పడం అవసరమని భావిస్తాను. వారు  రాసిన స్త్రీ యాత్రికులు  పుస్తకంలో జర్మనీ నుంచి మనదేశానికి కాలినడకన సందర్శించిన యాండ్రియారెక్సాన్స్ , స్టీఫెన్ వోల్లార్త్ ల యాత్రా కథనాన్ని వివరిస్తూ  “హిందువులు పూజించనిది ఏదీ లేదని ,  పూజ్యనీయమైనది కానిది ప్రపంచంలో ఏదీ లేదని” వారు  తెలుసుకున్నట్టు రాశారు. ఈ సత్యాన్ని బోధించడానికే,  ప్రపంచానికి ఈ విషయం తెలియజేయాలనే మన పూర్వీకులు కూడా అనేక ప్రతీకాత్మక కృత్యాలను రూపొందించి అందించి ఉంటారు.  

ఇంత చరిత్ర ఉన్నా  ఎక్కడో  ఒక లంకె   వదులవుతుంటుంది , తెగడానికి సిద్ధంగా ఉంటుంది. మన చుట్టు పక్కలనే మనకు కళ్ళకు కాన రాకుండా  ఒక జీవం మనుగడ కోసం తపిస్తుంటుంది. వాటి శోకధార కురిసే చినుకులోనో , అవి జీవించే నీటిలోనూ నిశ్శబ్దంగానే కలిసిపోతున్నా వాటి లేమి మాత్రం నిశ్శబ్దంగా ఉండబోవడం లేదు. అప్పుడే ఒక విధ్వంసకర జ్వరపీడన మొదలైంది. ఈ మధ్య కాలంలో విజ్రుంభిస్తున్న విషజ్వరాల విస్తృతికీ,  వ్యవసాయంలోనూ  వివిధ సహజ శత్రువుల మధ్య సంభందాన్ని సరిగ్గా గుర్తించకపోవడంతో పెరుగుతున్న కీటకనాశకాల వినియోగం తత్కాకారణంగా కలుగుతున్న ఆర్థిక , పర్యావవరణ నష్టానికీ,  మండూకాల   అంతర్ధానానికి  ఉన్న లంకె అర్థం చేసుకుంటే మనం మేలుకున్న్నట్లు   లెక్ఖ.

అడవిలో పులులలాగా రాజసంగానో , పంచ వన్నెసీతాకోకలాగానో  మండూకాలు  ,ఆకర్షణీయమైనవీ కాకపోవచ్చు. మనకు దూర దూరంగా జరుగుతూ ఎక్కడో ఏ బురదలో తలదాచుకోవచ్చు.వాటి బెక బెకల శబ్దం కర్ణకటోరంగా వినిపించవచ్చు. నేను  వాటి అందాన్ని ఆరాధించమని చెప్పలేను కానీ వాటిని జీవించనీయండి అని  మాత్రం  వేడుకోగలను.

 నా ఆలోచనా తరంగాన్ని విచలితం చేస్తూ మా ముందుగా  తెగనరికిన  చెట్ల  మొండాలతో పోతున్న వాహనం ఎదురై మా బృందానికి పని చెప్పింది.  పట్టుకునేందుకు  వెళ్తున్న మా  జీపు చక్రాల  కింద ఎదురవుతున్న మండూకాలు   , కళేబరాలు కాకుండా మేం  ముందుకు పోతున్నాం.

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

2 Responses to అరణ్యం -3 -మండూక శోకం-దేవనపల్లి వీణావాణి

 1. Nakka Harikrishna says:

  వర్తమాన పరిస్థితులకు ఎంతో అవసరమైనటువంటి ఈ విషయాన్ని ఎంచుకున్నారు.
  ఇప్పుడు పర్యావరణ సాహిత్యం రావడం ఎంతో అవసరం. మంచి శీర్షిక తో , అద్భుతమైన విషయాలు వెలువడుతున్నాయి.
  వీణ వాణి మేడం గారికి,
  ఇంత చక్కని విషయాలను ప్రచురిస్తున్న విహంగ పత్రిక గారికి
  నమస్కారాలు.

 2. SBV YADAV. says:

  అంత పని వత్తిడి లోను అద్భుతమైన ప్రకృతి కుటుంబ సభ్యుల జీవితాన్ని ప్రయోగ శాలల్లో కత్తులనుండి పురాణాల్లో కలాల వరకు చక్కటి విశ్లేషణ చేసిండ్రు.
  “చిమ్మ చీకట్లో కూడా పరిసరాలను పరి పూర్ణంగా చూసే కప్ప మనిషి లో ఉన్న చీకటి కోణాన్ని మాత్రం పసిగట్టి లేకపోతుంది” పర జీవుల పట్ల మనిషి విష స్వభావాన్ని తేటతెల్లం చేసిండ్రు…
  మీకు వందనాలు…