“అరణ్యం -2-” పురస్థాపనం ”-దేవనపల్లి వీణా వాణి

ఈ వర్షాకాలం కూడా  ఎన్నో యుగాలలాగానే మళ్ళీ వచ్చింది. ఒక కొత్త   వృక్ష తరాన్ని భూమి మీద నాటడానికి నేలను సిద్దం చేస్తుంది. వాన తర్వాత వాన. నేలంతా మెత్తబడి అప్పుడే పుట్టి  పైకి లేచే  పసి ఆకులకు మృదువుగా విచ్చుకొని దారి యిస్తుంది.ఎన్నాళ్ళుగానో ఊపిరి పోసుకోవడానికి సిద్దంగా ఉన్న విత్తనాలు కళ్ళు నులుముకొని ఇక లోకాన్ని చూస్తాయి.  వర్ష రుతువు మొదలవుతూనే భూమిపొర అంతా నిండు గర్భినిగా మారుతుందేమో !ఎన్నెన్నని , ఎక్కడికక్కడ మట్టిని చీల్చుకొని  చిన్నగా తలలెత్తుకొని  పైకి లేచే లేలేత ఆకులు..ఈ సమయం కోసం అవి ఎప్పటి నించో ఎదురుచూస్తాయి. జంతువుల లాగా కనీ పెంచీ కొంత వయసు వచ్చాక  స్వేచ్చను ఇవ్వడం మొక్కలలో లేదు. వాటి విత్తనంతో పాటే తల్లితో సంభందం తెగిపోతుంది. తల్లి చెట్టు విత్తనంలోనే అన్ని జాగ్రత్తలు రాసి పెట్టేస్తుందేమో ,ఇక మిగిలినదంతా తనకు తానుగా చేసే యుద్దమే. ఇవాళ నేను వచ్చిన అటవీ ప్రాంతం అంతా కూడా అలా మొలిచిన , మొలుస్తున్న పసి పిలకలతో లేలేత పసరిక పచ్చ రంగుతో , వాతావరణం మబ్బుపట్టి ఆహ్లాదంగా ఉన్నది.

           ఈ కాలంలో  అడవులలో స్థానిక జాతుల విత్తనాల మొలక శాతం ఏ విదంగా ఉన్నదనే అధ్యయనం చేస్తారు. అలా చేయడం వల్ల  ఆయా అడవులలో ఆవరణ వ్యవస్థలో మార్పుని అంచనా వేయవచ్చు . తదుపరి కాలంలో కొత్త మొక్కలు నాటే సమయంలో ఈ అధ్యయనం ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్త మొక్కలు నాటే ప్రణాళికలో ఆయా అడవులలో నివసించే  జంతువుల మనుగడకు అవసరమయ్యే జాతులకు ప్రాధాన్యం ఇస్తారు. ఇదంతా అడవుల శాస్త్రీయ  నిర్వహణలో భాగమే .

ఈ రోజు నేను అడవికి  ఈ అధ్యయనం కోసం ప్రత్యేకంగా రాలేదు కానీ ఇలా పరిశీలించడం మా నిత్య విధిలో ఒక భాగం అయింది. గరుకు నేలంతా  పచ్చని మొక్కలతో  ఉంటే  అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ  ఎక్కడో ఒక ముడి తప్పిన గొలుసులా ఉంది. మన పక్కనే మౌనంగా పోరాడే వృక్ష  జాతులు కొన్ని తమ చూపుడు వేలెత్తి మనల్ని  దోషిని చేస్తున్న భావన కలుగుతోంది. అక్కడ ఉన్న బండల మీద కాసేపు కూర్చున్నాను. చుట్టూ పక్కల అంతా ఒకటే జాతి మొక్కలు కనిపిస్తున్నాయి.  నేను కూర్చున్నదగ్గరే కాదు  ఈ మధ్య కాలంలో తెలంగాణ అడవుల నిండా ఎక్కడ చూసినా  మహావీర మొక్కలే కనిపిస్తున్నాయి. ఎంతగా అంటే నా కాలు కూడా దూర్చలేనంత చిక్కగా ఒకదాని పక్కన ఒకటి మొలిచి కనుచూపు మేర  అంతా తానై ఉంది ఈ మొక్క.  ఒక్క అడవిలోనే కాదు ఎక్కడ చూసినా అదే.

నా చిన్నప్పుడు స్కూల్లో శ్రమదానం చేసినపుడు అక్కడంతా వయ్యారిభామ మొక్కలే ఉండేవి. అవి పీకేసాక చేయంతా ఒకలాంటి చేదు వాసన. అప్పట్లో వయ్యారిభామ మొక్కగురించే ఎక్కువ సమాచారం లభించేది. వార్తా పత్రికల్లోనూ, పర్యావరణ చర్చలలోనూ దాని గురించే మాట్లాడేవారు.  అదే   ఖాళీగా కనిపించిన ప్రతీ చోటును ఆక్రమించి కనిపించేది. అప్పుడు నాకు తెలిసిన ఒకేఒక పర్యవరణ శత్రువు వయ్యరిభామే. ఆ తర్వాత కొన్నాళ్లకు  పులికంప వార్తలలో నిలిచింది. ఇప్పుడు అన్నిటి స్థానాలను ఈ మహావీరనే ఆక్రమించినట్టు నా పరిశీలన చెప్తుంది.

          వయ్యారి భామగానీ , పులికంప గానీ, మహావీర గానీ మనకు బాగా పరిచయం ఉన్న మొక్కలే. వీటి గురించిన చర్చల వల్ల వీటికి  అత్యంత ప్రజాదరణ పొందినవయ్యాయి. నిజానికి ఇవి మన దేశానికి చెందినవే కావు. చాలా వరకు ఎక్కడెక్కడి దేశాలవో మన దేశానికి వచ్చి మన ముంగిలి దాకా విస్తరించాయి.  వయ్యారి భామ ( Parthenium hysterophorus స్వస్థలం-మెక్సికో) అమెరికా నుంచి భారత దేశానికి చేర్చబడింది.  అప్పట్లో అంటే 1956 లో భారత ప్రభుత్వం,  అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఫుడ్ ఫర్ పీస్ కార్యక్రమంలో  భాగంగా మనకు గోధుమలు దిగిమతి అయ్యేవి. ఈ కార్యక్రమానికే PL -480 అని పేరు. ఇలా  ఆహార ధాన్యాల దిగుమతుల ద్వారా ఈ వయ్యారిభామ మన దేశం చేరిందని చెప్తారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు దేశ వ్యాప్తంగా అడవులకు సమస్యగా మారిన ఈ మహా వీర  (Pignut -Hyptis suavolen, స్వస్థలం-ట్రాపికల్ అమెరికా) 19 వ శతాబ్దంలో జోసెఫ్ డాల్టన్ హూకర్ దక్షిణ భారత దేశంలో ప్రవేశపెట్టాడట.  ఈయన పేరెన్నిక కలిగిన వృక్ష శాస్త్రవేత్త. వృక్ష శాస్త్ర అధ్యయనాన్ని ప్రోత్సహించి భారత దేశ వృక్ష వైవిధ్యాన్ని వెలికితీసిన అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులకు మార్గదర్శి. ఆయన ఎందుకు ఈ మొక్కను మన దేశంలో ప్రవేశపెట్టాడో    నేను చెప్పలేను కానీ అది ఈ రోజు ఇంత ప్రమాదకరంగా మారుతుందని ఆయన  ఊహించి ఉండడు. దీని వ్యాప్తిని అరికట్టడం చాలా కష్టమైన పని.  ఈ మొక్కల చిన్న చిన్న పూలు చూస్తే ఓడల నిండా  కొత్త కొత్త ప్రాంతాలలో  దిగి ఖండాంతరాలు దాటి అమాయక దేశాలను  ఆక్రమించుకుంటున్న తెల్లవారే కనిపిస్తుంటారు. ఈ మొక్కలు మొలిచిన చోట స్థానిక జాతుల మనుగడ దాదాపు యుద్ధమే.చాలా సందర్భాలలో స్ధానిక జాతులు ఓడిపోతాయి.వాటి జీవిత చక్రాలు చిన్నాభిన్నం అవుతాయి.  మొత్తంగా జాతుల పోరాటాల్లో  మచ్చ పడ్డ  మానవ  సంస్కృతులలాగానే అక్కడి ఆవరణ వ్యవస్థ కూడా అస్తవ్యస్తమవుతుంది.

మన నిత్య జీవితంలో ఇప్పుడు చూసే జాతులు అనేకం  ఇతర దేశాల నుంచి ఇక్కడికి ప్రవేశపెట్టబడ్డవే. మొక్కజొన్న, టోమాటో, మిరప కాయలు ,ఆలు గడ్డలు, కాబేజీ, కారట్, బీట్ రూట్, కాలి ఫ్లవర్, అమెరికన్ పత్తి , టీ , కాఫీ, అనేక రకాల అలంకరణ మొక్కలు ఇలా వచ్చి భారత దేశంలో తమ సొంత గడ్డగా  మనుగడ సాగిస్తున్నవే . అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఇలా కొన్ని జాతులను స్వయంగా నాటి పాలకులు , వ్యక్తులు ప్రవేశ పెట్టారు.కొన్ని అత్యుత్సాహం తోనూ కొన్ని అవసరం కోసమూ ఈ గడ్డ చేరుకున్నాయి . ప్రకృతి సిద్దంగా కూడా మొక్కలు జంతువులు ఒక చోట నుంచి మరొక చోటికి విస్తరించడం మామూలే.  ఇలా ఒక  చోట నుంచి మరో చోటికి జీవుల సహజ  ప్రయాణం “వ్యాప్తి” అయితే మానవుల ద్వారా ప్రవేశ పెట్టబడడం” పురస్థాపనం ” అవుతుంది. ఇది మన అవసరాలలో ఏర్పడ్డ ఖాళీలను పూరించడానికి చేసే ఒక ప్రక్రియ. ఇది సహజంగా జరగడం అత్యంత నెమ్మదిగా జరిగే పని . అలా జరిగినప్పుడు బాధ్యత ప్రకృతే తీసుకొని సమతుల్యత కాపాడుతుంది. మానవుల వల్ల జరిగితే  పరిస్థితులు మానవుల నియంత్రణలో  ఉండవు, ప్రకృతి అదుపులోకీ రాదు . జీవుల మధ్యన ఉండే సున్నితమైన సంభందం తెగిపోయి అంతా అస్తవ్యస్తం అవుతుంది.

          పురస్థాపనం చెందిన జాతులు కొన్ని అత్యంత ప్రమాదకర విస్తరణ చెందడం ఇప్పుడు అడవులకు ఉన్న అతిపెద్ద సమస్య. గత కొంత కాలంగా ఈ సమస్య విస్తృతమైంది. ఇటువంటి జాతుల గురించిన పరిశోధన చేసిన  భారత వృక్ష సర్వేక్షణ (Botanical Survey of India ) వారి (ENVIS centre on floral Diversity Website Article on Invasive Alien species) ఒక నివేదిక ప్రకారం ఇలా ఇతర చోట్ల నుంచి  మన దేశంలో ప్రమాదకరంగా విస్తరిస్తున్న జాతుల సంఖ్య నూటా డెబ్బై మూడు. అంతే కదా అనుకుంటున్నారేమో  అందులో ఒక్క పులి కంప ( Lantana camara స్వస్థలం-అమెరికా, తలంబ్రాల చెట్టు అనికూడా అంటారు) జాతి  ఆక్రమించుకున్న స్థలం దాదాపు 13 మిలియన్ల హెక్టార్లు ! ఈ పులికంపను బ్రిటిష్ వారు  ఉద్యానవనాలలో పూల మొక్కలుగా పరిచయం చేసారు.అంటే పులికంప వలన 13 మిలియన్ల సహజ ఉద్బీజాల స్వస్థలం  ప్రమాదంలో పడినదన్నమాట.అంతెందుకు మన చెరువులలో, నీటి కుంటలలో అత్యంత సాధారణంగా కనిపించే గుర్రపు డెక్క( Eichhornia crassipes స్వస్థలం- దక్షిణ అమెరికా ) కూడా మనదేశానిది కాదు. ఎక్కడో దక్షిణ అమెరికా నుంచి భారత దేశంలో ప్రవేశపెట్టబడి మన మంచినీటి ఆవాసాలకు  ఎంత పెద్ద సమస్యగా మారిందని!    గుర్రపు డెక్కను కూడా ఉద్యానవన అవసరాలకే   ( భారత గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ భార్య తీసుకు వచ్చిందని చెప్తారు)   ప్రవేశపెట్టారు. ఇప్పుడు మన దేశంలో దానికి వచ్చిన పేరు “బెంగాల్ భీతి”( Terror of Bengal) అనీ “నీలి దయ్యం “(Blue Devil) అనీ! బెంగాల్ రాష్ట్రంలో మంచినీటి ఆవాసాలలో ఈ గుర్రపుడెక్క విస్తారంగా వ్యాపించి చేపల పెరుగుదలకు అడ్డంకిగా మారడం వల్ల అక్కడ చేపల పరిశ్రమకు విపరీతమైన నష్టం వాటిల్లినందువల్ల  ఈ పేరు పెట్టేశారు. ఒక్క బెంగాల్ లోనే కాదు దేశంలోని అనేక నీటి అవాసాలు గుర్రపు డెక్క బారిన పడినవే.

మనకు బాగా తెలిసిన నీలగిరి చెట్లను అప్పటి  మైసూరు పాలకుడు టిపు సుల్తాను ఆస్ట్రేలియా నుంచి తెప్పించి బెంగళూరు దగ్గరలో ఉన్న నంది కొండలమీద తన ఉద్యానవనంలో నాటించాడట. అది 1790 నాటి సంగతి. అటుతర్వాత 1843 నుంచి బ్రిటిష్ వారు తమిళనాడులో వంట చెరుకు కోసం నీలగిరి కొండలలో పెంచడం మొదలు పెట్టారు. ఇలా నీలగిరి కొండలలో పెంచిన కారణం చేతనే యుకలిప్టస్ మొక్కలకు నీలగిరి చెట్టు అన్న పేరు వచ్చింది. భారత దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రారంభించిన అనేక సామాజిక వనాల్లో ఈ నీలగిరి చెట్లు ఒక తప్పనిసరి మొక్కగా మారింది. ఆంద్ర ప్రదేశ్లో 1874 నుంచి అక్కడక్కడా నాటుతూ 1960 నుంచి విస్తృతంగా నీలగిరి వనాలను అభివృద్ది  చేసారు. ( Reports submitted to the Regional Expert consultation on Eucalyptus –Volume II అన్న పుస్తకం నుంచి   R.M.పాలన్న రాసిన Eucalyptus in India అన్న వ్యాసం నుంచి. పాలన్న  కర్నటక అటవీ శాఖలో  ఉన్నతాధికారి )అలా ఈ నీలగిరి వనాలు మన దేశమంతటా విస్తరించాయి. మన దేశంలో దాదాపు 170 నీలగిరి జాతుల పరీక్షించారు. అనేక చోట్ల స్థానిక వనాల స్థానాలలో ఈ వనాలను ప్రతిక్షేపించారు. అందుకు కారణం ఈ మొక్కలు తొందరగా పెరగడమే.అంతేకాకుండా తొందరగా అటవీ ఫలసాయం పొందవచ్చుననే కారణం కూడా యుకలిప్తుస్ వనాల విస్తృతికి దోహదం చేసింది. కానీ వీటి వ్యాప్తి వల్ల వన్య జాతుల పెంపకం ప్రమాదంలో పడడంతో అటవీ అభివృద్ధిలో వీటి ప్రాధాన్యం   గత కొంత కాలంగా తగ్గించబడింది.

        ఇక సర్కారు తుమ్మ (Prosopis juliflora స్వస్థలం-మెక్సికో, దక్షిణ అమెరికా) సుబాబుల్( Leucaena leucocephala స్వస్థలం–మెక్సికో, అమెరికా)వంటి మొక్కలను తక్కువ స్థాయి కలప అవసరాల కొరకు పరిచయం చేసారు.ఇవన్నీ మనం రోజూ చూసే మొక్కలే. మన ఇంటి ముందో పొలం దగ్గరో , గట్లమీదో పెరుగుతూ కనిపిస్తున్నా వీటి చరిత్ర , జీవితం మాత్రం మనం అనుకున్నంత ప్రశాంతమైనవి మాత్రం కాదు.

            ఈ జాతుల విస్తరణలో  ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ మొక్కల పెంపకం వల్ల సహజ ఉద్బీజాల స్థలం తగ్గిపోవడం ఒక నష్టమైతే  ఈ మొక్కల స్రావాలలో ఉన్న రసాయనాలు సహజ ఉద్బీజాల పెరుగుదలను అడ్డుకోవడం రెండవ నష్టం !  అంటే ఒక సారి ఈ మొక్కలు ఒక ప్రాంతాన్ని ఆక్రమించాయంటే మరే మొక్కను ఎదగనివ్వవన్నమాట. శాస్త్రీయంగా ఈ రకంగా ఒక మొక్క మరొక మొక్కను ఎదగనివ్వనితనాన్ని “అల్లెలోపతిక్ ఎఫెక్ట్”(Allelopathic effect)అనీ అటువంటి రసాయన పదార్థాలను “అల్లెలిన్స్”  ( Allellins )అనీ  అంటారు. మీరు ఎప్పుడైనా  ఈ సారి నీలగిరి వనాన్ని చూడండి. అక్కడ కలుపు మొక్కలు లేకుండా ఉండడం మీరు గుర్తిస్తారు. అలా ఉండడానికి కారణం ఈ ప్రక్రియనే. ఈ మధ్యనే మహావీర మొక్క నీలగిరి వనాల్లో బీభత్సంగా విస్తరించడం గమనించాను. అంటే మహావీర మొక్క నీలగిరి మొక్క అల్లెనిన్స్ ప్రభావాన్ని తట్టుకోగలిగి మరీ విజ్రుభిస్తుందన్నమాట. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇలా ప్రవేశపెట్టబడిన అనేక జాతులను పశువులు గానీ గొర్రెలు , మేకలు గానీ తినవు . వీటిలో ఉండే ఒక రకమైన వాసన , అందుకు కారణమైన రసాయనాలు ఈ మొక్కలను తినడానికి వీలు లేకుండా చేస్తాయి. ఇటువంటి విద్వంసకర జాతులు తాము నిలదొక్కుకొని, స్థానిక జాతులను  నిలదొక్కుకోకుండా  అడ్డుకుంటూ , జంతువుల బారి నుంచి తప్పించుకుంటూ , ఆయా జంతువుల ఆహార మైదానాలను ఆక్రమిస్తూ  విస్తరిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు.మరొకవైపు  సహజ ఉద్బీజాలు తమ ఆవాసం కొద్ది కొద్దిగా కోల్పోతూ , బలహీనమైపోతూ , నిలదొక్కుకోలేని  అశక్తులై  చివరరాఖరికి అంతరించే స్థితికి చేరుకుంటాయి, చేరుకుంటున్నాయి. ఆయా జాతుల మీద ఆధారపడిన మరెన్నోకీటకాలు , పక్షులు , పురుగులు, జంతువులు కూడా తమకు నిలవ నీడ లేక తాము తినే ఆహారం లేక అంతరించే స్థితికి చేరుకుంటాయి, చేరుకుంటున్నాయి. పశువులకు సరిపడినంత గడ్డి భూములు లేకపోవడంలో ఇదీ ఒక కారణమే.   ఇపుడు దేశ వ్యాప్తంగా  సహజ ఉద్బీజాలు ఎదుర్కుంటున్న సమస్య ఇది. అచ్చంగా వీటి విస్తరణ ,మధ్య యుగాలలో రాజ్య విస్తరణ కాంక్ష ,అందుకు బలియైన మానవ జాతుల చరిత్రకు సరిపోలేలా ఉంటుంది.

భారత ఉపఖండం ,ఉపఖండంగా పేరు పడడానికి కారణం  అచ్చంగా ఇక్కడి వైవిధ్యమే. ప్రకృతి వైవిధ్యమే జీవనవైవిధ్యంగా , సాంస్కృతిక వైవిధ్యంగా కూర్పు చెందడం, తరాలు మారినా మారని  సజీవ అంతరలయ. చరిత్రలో గత కొన్ని శతాబ్దాలు మినహా ఈ లయ నిరాటంకంగా కొనసాగడం ప్రపంచచరిత్ర అధ్యయనంలో గుర్తించగలిగే మొదటి అంశం. గడిచిన కొన్ని శతాబ్దాలలో జరిగిన మార్పు ప్రపంచాన్ని ఒక్క కుదుపుతో త్వరణ యుగాన్ని సృష్టించి భూమండలం అంతా  ప్రకృతి సంపదను అమాంతం మార్చివేసే దిశగా జరిగుతున్నది. పర్యవసానంగా సాంస్కృతిక  మార్పు అనివార్యం అవుతున్నది, అవనున్నది. 

            భారత దేశ సుసంపన్నతకు  బలమైన భూమిక పోషించినదీ ఈ ప్రకృతి కారకాలే.ఇందుకు భారతీయ చరిత్ర నిండా సాక్ష్యాలు ఉన్నాయి.  ఎక్కడికక్కడ స్థిరమైన సామాజిక జీవనం కుదురుకొని స్వయం సమృద్ధిగా మనగలగడానికి కారణం కూడా అపార సహజ వనరులే. చరిత్రకారులు విశ్లేషించిన ప్రకారం భారత దేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, నీలిమందు, పత్తి , సహజ అద్ధకాలు, విలువైన రత్నాలు   మొదలైనవి విదేశాలకు ఎగుమతి అయ్యేవి.  భారత దేశ బంగారపు సంపద వెనుక వీటి ఎగుమతుల ద్వారా ఆర్జించిన విషయం చరిత్రీకరించబడినది. విదేశీ దండ యాత్రలు ప్రారంభమయ్యాక వచ్చిన మార్పూ, నవీన అవిష్కరణలూ , విదేశీ పాలనా వంటి అంశాల వల్ల  ఆయా జాతుల ప్రాధాన్యత తగ్గడమే కాకుండా , కొత్త కొత్త జాతులు  ప్రవేశపెట్టబడ్డాయి. 

          మానవుల ద్వారా ఒక చోట నుంచి మరొక చోటికి  ప్రకృతి ఎంపికకు భిన్నంగా చేరిన జాతులు స్థానికంగా ఉన్న జాతుల పట్ల చేసిన   భౌతిక  నష్టాన్ని లెక్కించ గలిగినా  లెక్కించలేనంత ప్రాకృతిక నష్టం ఉన్నది. సమకాలీన ఆర్థిక చరిత్రలో దీని పర్యవసానాలూ తీసిపారవేయదగ్గవేమీ కాదు. నాణ్యతా ప్రమాణికంగా చూసినా  మొత్తం ఆవరణ వ్యవస్థను ప్రభావితం చేయగల ఈ మార్పు సుదీర్ఘ కాలం రగిలే నిప్పు రవ్వ. మెల్లిగానైనా మొత్తంగా ఆవరణ వ్యవస్థను సమూలంగా  మార్చివేయగల శక్తి గలది.

        ఇప్పటిదాకా వనాలకు యాదృశ్చికంగానో , ఆయా జాతుల  విస్తరణ విధానాన్ని తక్కువగా అంచనా వేసో లయ తప్పిన  జీవ గమనాన్ని చెప్పాను. మరి మన అలవాట్లు తెచ్చిన ప్రకృతి  ముప్పు ఇంకా  చెడ్డది. అవే  మన కాలపు అమృతాలు కాఫీ, టీల మాట . అవి కలుగజేసిన ప్రాకృతిక నష్టం గురించిన అంచనా వేయాలంటే అవి మనదేశంలోకి ప్రవేశించిన కాలానికి ముందు ప్రయాణం చేయాలి.

             భారతదేశానికి కాఫీ( Caffia arabica) రావడమే విచిత్రమైన సంఘటన. కాఫీని మొదటగా ఆఫ్రికా లోని ఇథియోపియలో  గొర్రెల కాపరులు, తమ గొర్రెలు ,కాఫీ చెట్ల కాయలు తిన్నాక మగతగా ఉంటున్నట్లు   గుర్తించారు. ఆసక్తి తో ఈ కాయలతో కషాయం చేసుకొని తాగడం మొదలుపెట్టారు. కాఫీ తాగిన తర్వాత ఉత్సాహంగా అనిపించడంతో ఈ కాయల విషయం అందరికీ తెలిసిపోయింది. గొర్రెల కాపరులనుంచి యెమెన్ చేరింది. అక్కడి మత వ్యాప్తి చేసుకునెందుకు వచ్చిన ఇస్లాం మత గురువులు రమదాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఆకలి నిరోధించడానికి చక్కగా పనిచేస్తుంది అని    కనిపిట్టడంతో కాఫీ ప్రాధాన్యత పెరిగింది.   ఆ విధంగా ఇస్లాంలో హజ్ యాత్రలోనూ, ఉపవాస దీక్షల సందర్భంగానూ కాఫీ గింజల కషాయాన్ని అందించడం ఒక సంప్రదాయంగా వస్తుండేది. అయితే కాఫీ కషాయం అందించడం వ్యాపారంగా కూడా మారడంతో  ముస్లిం మత పెద్దలు  ఈ విషయానికి సంబంధించిన సమాచారం ఎంతో జాగ్రత్తగానూ , గుప్తంగానూ ఉంచారు. అందుచేత కాఫీ గింజలు ఎక్కడా అందుబాటులో రాకుండా, ఎవరికీ దీని గురించి తెలియకుండా ఉండటం కోసం ,దీని మీద ఆధారపడి ఉన్న వ్యాపార వ్యవస్థ దెబ్బ తినకుండా ఉండడం కోసం వారు గింజలను వేయించి పెట్టేవారు. అందువల్ల ఎవరైనా గింజలు తీసుకెళ్లినా అవి మొలకెత్తే అవకాశం ఉండేది కాదు.

          16వ శతాబ్దంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన  బాబా బుడాన్ అనే  సూఫీ సన్యాసి  మక్కా సందర్శనకు వెళ్లినప్పుడు ఎలాగోలా ఏడు కాఫీ గింజలు  సంపాదించాడు. ఆయన అక్కడివారి కంటపడకుండా జాగ్రత్తగా మన దేశానికి  తీసుకొచ్చి ప్రస్తుత  చిక్మంగళూరు కొండలలో నాటాడు. చిక్మాంగళూర్ కొండలను బాబా బుడంగిరి అనీ బాబా బుడాన్ హిల్స్ అన్న పేరు రావడానికి కారణం ఈ సూఫీ గురువే. అక్కడ ఆ కొండవాలులో అతని సమాధి కూడా ఉంది. ఆయన కేవలం తన అవసరం కోసమే నాటుకున్నప్పటికీ కాఫీ తోటలకు అదే ఆద్యం అయింది. అప్పటికే కాఫీ విషయం తెలిసిన యురోపియన్లు కాఫీ పెంపకంపై దృష్టి పెట్టారు. డచ్ వారు మన దేశంలో కాఫీ వ్యాప్తికి  తోడ్పడితే బ్రిటిష్ వాళ్ళు దాన్ని వ్యాపారం చేసేశారు. 18వ శతాబ్దం నుంచి మొదలైన కాఫీ తోటల విస్తరణ ఈనాటికి 3,90,000 హెక్టార్లకు చేరుకుంది. అయితే  కాఫీ ఉత్పత్తి మైదానపంటల లాంటిది కాకపోవడమే అసలు సమస్య. ఈ మొక్క సముద్ర మట్టానికి 1000 నుంచి 1500 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది.అంటే  అచ్చంగా కొండ ప్రాంతాలలో అన్నమాట. అంటే ఇప్పటివరకు కాఫీ తోటలు సాగు చేయడం కొరకు నరికివేసిన అడవులన్నీ కొండలమీద ఉన్న అడవులే. అప్పటి బ్రిటిష్ యాజమాన్యం.   కర్ణాటక , కేరళ , తమిళనాడుకు చెందిన పశ్చిమ కనుమలలోని    అడవులను నరికివేసి కాఫీ తోటలకు విస్తారంగా   అనుమతులు ఇచ్చారు. ఈ పశ్చిమ కనుమలు ప్రపంచంలో అత్యంత విలువైన జీవ వైవిధ్యం కల ప్రాంతాలలో ఒకటి. ఈ కనుమలలో అనేక వృక్ష, జంతు జాతులు ప్రత్యేకమైనవి.  వనాల మీద ఆధారపడి ఉండే పక్షి ,కీటక జాతులు కూడా ప్రత్యేకమైనవి. కాఫీ తోటల విస్తరణ వల్ల అవి కూడా ప్రమాదంలో పడ్డాయి.అందులోనూ 16 పక్షి జాతులు అంతరించి పోయే దశలో ఉంటే మరీ ముఖ్యంగా నీలగిరి ఫ్లై కాచెర్ (Emuyias albicaudatus) అంటే ఎగిరే పురుగులను పట్టుకుని తినే పక్షి , బ్లాక్ అండ్ రుఫుస్ ఫ్లై కాచెర్ (Ficedula nigrifura) వంటివి పశ్చిమ కనుమలలో మాత్రమే జీవవించేవి.( Coffee and conservation  web page నుంచి)

 పశ్చిమ కనుమల తర్వాత  బ్రిటిష్ వారు తూర్పు కనుమలలో కూడా కాఫీ తోటల పెంపకం చేపట్టారు. 1898లో మొదట తూర్పు గోదావరి జిల్లాలో పాములేరు వద్ద మొదలు పెట్టి మెల్లి మెల్లిగా విశాఖ పట్నంలోని అరకు లోయకు విస్తరించారు.1956 నుంచి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం , ఆంద్రప్రదేశ్ అటవీ శాఖ అధ్వర్యంలో స్థానిక గిరిజనులతో కలిసి ఇక్కడ కాఫీ తోటల పెంపకం చేపట్టింది. దాదాపు 93000 మంది గిరిజన రైతులు , 4000 హెక్టార్ల విస్తీర్ణంతో  వ్యాపించిన కాఫీ తోటలు అచ్చంగా  రక్షిత అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం దాదాపు 142 వృక్షజాతులు  ఇక్కడి తూర్పు కనుమలలో మాత్రమే పెరుగుతాయట .పెరుగుతున్న కాఫీ తోటల విస్తీర్ణం  ఇక్కడ మాత్రమే (  Endemic species  )జాతుల మీద ఎటువంటి ప్రభావం కలిగిస్తున్నాయో వాటి భవిష్యత్తు ఎలా మారనున్నదో  పెరుగుతున్న మన అవసరాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు.

          భారతదేశంలోని టీ పరిశ్రమ కూడా అంతే. ఎక్కడో బ్రహ్మ పుత్ర తీరానికి అవతల ఇప్పటి అస్సాం వైపు నివసించె  శింప్బో  గిరిజన తెగలో తేయాకు సేవించడం ఉండేది. భారతీయులకు తేయాకు పరిచయం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ  తేయాకు సేవించడం ఒక  అలవాటుగా మాత్రం  లేదు. అయితే చైనాలో మాత్రం విరివిగా వాడుకలో ఉన్నది. 16వ శతాబ్దంలో తేయాకు చైనా నుంచి నుంచి పోర్చుగీసు  వారి ద్వారా యూరోప్ చేరి అక్కడి నుంచి మనకు చేరింది. అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్స్ 1774లోనే  చైనా తేయాకు జాతులను తెప్పించి అప్పటి బ్రిటిష్ అధిపథ్యంలో ఉన్న భూటాన్లో పెంచే ప్రయత్నం చేసాడు. ఆ విధంగా తేయాకు తోటలను వ్యాపారం కొరకు పెంచడం ప్రారంభం అయింది. అప్పట్లో భారత దేశ జీవ వైవిద్యం ఎంతో మంది  ఔత్సాహిక విదేశీ శాస్త్రవేత్తలను  ఆకర్షించింది. అందువల్లనే ఎంతోమంది యురోపియన్లు మన దేశంలో విరివిగా పరిశోధన చేసారు. నాటి అస్సాం  దివాన్ (ప్రధాన మంత్రి )గా ఉన్న మణిరామ్ అస్సాం ప్రాంతం లోని శింగ్పో(Singpho) తెగ వారు వాడే తేయాకు గురించిన సమాచారం ,తేయాకు మీద పరిశోధన  చేస్తున్న స్కాట్లాండ్ దేశస్థుడు రాబర్ట్ బ్రుస్ కి తెలియజేసాడు.  రాబర్ట్ బ్రూస్ 1823వరకు  శింప్బో  గిరిజన తెగ వారు వాడే తేయాకు  మీద పరిశోధన చేసినా అది ఒక కొలిక్కి రాకముందే మరణించాడు. తర్వాత అతని తమ్ముడు తన అన్న పరిశోధన పూర్తి చేసి ఈ జాతి చైనా తేయాకు( Camellia sinesis var sinensis)  జాతికి దగ్గరి సంబంధంకలదని నిర్ధారించాడు. అస్సాంలోని తేయాకు వేరు అనీ దానికి Comellia sinensis varassamica kitamura   అని పేరు పెట్టారు. ఈ లోగా దివాన్ మణిరామ్ శింగ్పో(Singpho) తెగ ప్రజలను బ్రిటిష్ అధిపత్యంలోకి తెచ్చి తేయాకు తోటల పెంపకాన్ని ప్రోత్సహించాడు. తదనంతరం బ్రిటిష్ వారితో విభేదాలతో తనే సొంతంగా తేయాకు తోటలను పెంచాడు . అలా దివాన్ మణిరాం దేశంలో మొదటి వ్యక్తిగత తేయాకు తోటల యజమాని అయ్యాడు. అయితే దివాన్ మణిరాంను 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడన్న నెపంతో ఉరి తీసారు.

          అస్సాం తరవాత తేయాకును  డార్జీలింగ్లో పండించడం మొదలైయింది. అక్కడి నుంచి తేయాకు వ్యాపార లాభాలు పెట్టుబడి దారులను ఆకర్షించాయి. తేయాకు పెంపకానికి అనుకూలమైన  వాతావరణం ఉన్న చోట్ల  విరివిగా తోటలను విస్తరించారు. అలా ఉత్తరాన కుమౌన్ , డెహ్రాడున్, గర్హ్వాల్,కాంగ్రా లోయలలోనూ , దక్షిణాన నీలగిరి కొండలలోనూ , పశ్చిమ కనుమల పర్వత సానువులలోనూ  తేయాకు తోటలు వెలశాయి. ఈనాడు తేయాకు తోటల విస్తీర్ణం 2013 నాటి లెక్కల ప్రకారం 5,63,980 హెక్టార్లు! ఏటేటా డిమాండ్ మరెంతో అడవిని కరిగించేసుకుంటుంది. కుంచించుకుపోయే తమ పరిధిని తలుచుకొని ఇక్కడి  చెట్లూ , మన నిలువ నీడ పోతున్నదని , ఆహారం కనుమరుగు అవనుందని జంతువులూ దుఃఖిస్తున్నాయేమో ఎవరు వాటి హృదయ ఘోష  విన్నారని !

నా చిన్నప్పుడు మా నానమ్మ చెబుతుండేది, అందరం పాలు తాగే వాళ్ళం, ఎవరైనా ఇంటికి వస్తే పాలు పోయడమో, సల్ల (మజ్జిగ) చేసి ఇవ్వడమో , అంబలి ఇవ్వడమో  ఉండేది కానీ ఇప్పటిలా ఇంటికి వచ్చిన అతిథులకు టీ, కాఫీలను ఇవ్వడం తెలియదని.  ఊర్లో ఎవరికీ చాయ్ తాగే అలవాటు ఉండేది కాదని  కానీ ఇప్పుడు అందరూ చాయ్ తగుతున్నారనీ చెప్పేది . మా ఊర్లో కూడా కచ్ఛిరు  దగ్గరికి ఎక్కడి నుంచో కొందరు చాయ్ పత్తా తో వచ్చే వాళ్ళనీ, అక్కడ ఛాయ్ తయారు చేసి  అందరికీ ఉచితంగా ఇచ్చేవారని అలా చాయ్ తాగడం గురించి అందరికి తెలిసిందని చెప్పేది. చాయ్ తాగే ఈ అలవాటు బ్రిటిష్ వారి నుంచి మనకు వచ్చిందని చదువుకున్న చరిత్రను నానమ్మ మాటలు రుజువు చేసాయి. ఇప్పుడు అయితే చాయ్ లేకుండా తెల్లవారే ఇళ్ళు ఉండవని  నమ్ముతాను. అంతగా మన సంస్కృతిలోకి జొరబడిన టీ కాఫీ తోటల వల్ల మన దేశ జీవ వైవిధ్యానికి వచ్చిన ముప్పు ముందు ముందు మరింత తీవ్రమై వినాశకర పరిస్థితులు రానున్నాయి.

టీ కాఫీ నిజానికి ఆహారం కాదు, నిత్య జీవితంలో ఇంతగా ఆధార పడవల్సిన అవసరమూ లేదు. అవి కొన్ని మందుమొక్కలుగా వాడుకోవడానికి ఉపయోగపడే  ఇతర అనేక మొక్కల లాంటివే . ఏటేటా వీటి వ్యాపారం వృద్ది చెందుతున్నకొద్దీ అక్కడ అప్పటి వరకు ఎన్నో తరాల తరబడి ఉన్న అడవి , అనుబంద జీవులు మరో కొత్త స్థావరం వెతుక్కోవడం అనివార్యమవుతుంది. మైళ్ళు దాటి కొత్త  ప్రాంతానికి వాటి ప్రమేయం లేకుండానే తరిమివేయబడతాయి. అంటే మనం తాగే ఒక్కో కప్పు కాఫీలో రోదిస్తున్న పక్షుల, పశువుల  అశ్రువులు కూడా కలిసి ఉండవచ్చునేమో కదా . కుంచించుకుపోయిన వాటి స్వస్థలాల మీద మానవుని దాడిని అవి అంగీకరిస్తాయా,మనల్ని క్షమిస్తాయా. అవి మనతో పోరాడి గెలవాలని అనుకుంటే అవి ఏం చేయబోతున్నాయి , అవి తమను తాము ఆత్మార్పణం  చేసుకుంటూ ఆహారపు బృహత్వాలయం లో మనల్ని ఒంటరికమ్మని శపించనున్నాయా?! కాలం ,నిర్ణయ దండం చేతిలో ఉంచుకొనే తిరుగుతున్నది. గమనించకపోతే అది మన తప్పే కదా !            ఇప్పుడు వీటి విస్తరణ నియంత్రించడం , మన అలవాటును “ అవసరానికి మాత్రమే  ” అన్న సూత్ర  పరిధిలోకి తెచ్చుకోవడం మన చేతిలో పనే కదా.

             ఇలా చెప్పుకుంటూ పొతే ఇంకా ఎన్నో జాతులు ఇలా  అవసరాలకోసం కొన్ని , ఆహారం కోసం కొన్ని , అనుకోకుండా కొన్ని  మన   వైవిధ్య భారత వనాలలో ఎక్కడికక్కడ విస్తరించి మన దేశ సౌభాగ్యానికి మన ఆర్ధిక ,ప్రాకృతిక సంపదకు శాశ్వత నష్టం కలిగిస్తున్నాయి. విచారించవలసిన విషయం ఏమిటంటే అసలు ఏమీ తెలియకుండానే , మన ఆలోచనలోకి కూడా  అందకుండానే ఇవ్వన్నీ జరగడం, ఎంతోకాలంగా నిర్మించున్న జీవన వారధిని కూలదోయడం.   

చరిత్రను గమనిస్తే  మనుషులు మనుషుల చేత ఒక చోట నుంచి మరొక చోటకి  ప్రతిక్షేపించబడ్డ విషయం మనకు తెలుస్తుంది.ఇప్పుడు ఉన్న అమెరికన్లు నిజనికి అసలు  అమెరికన్లు కారని అమెరియాకు ఆక్రమించుకున్న యూరోపియన్లు  అని మీకు తెలుసు అనే అనుకుంటాను.ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సంస్కృతుల పరంగా చూస్తే  మరెన్నో విషయాలు ద్యోతకమవుతాయి.  మూలవాసులని ఇప్పుడు  ప్రచారంలో ఉన్న మాట  ప్రపంచ చరిత్ర నిండా కనిపిస్తుంది. వారి మనుగడను కొనసాగించే పరిస్థితిని కల్పించాలని కోరుకోవడమూ వినిపిస్తుంది. మనుషులు మనుషుల చేత ప్రతిక్షేపించబడడం ఎంతగా  ఆక్షేపించబడినదో మనకు తెలిసిందే. అది సహేతుకమైంది అయితే  మనుషులు మరెన్నో జాతులను ప్రకృతి విరుద్దంగా పురస్థాపనం చేయడం కూడా ఆక్షేపించతగినదే కదా. కాకపోతే మానవులు తమ భావాలను ప్రచారం చేసుకోగలరు కనుక చరిత్రగా నిలుపుకుంటూ వస్తున్నాం. మరి మానవులకు మల్లే ఖండాంతరాలు దాటిన  జీవులు, స్థానిక జీవుల మనుగడ మీద చేసిన దాడిని ఎవరు చరిత్రగా రాయాలి.?  ఒకనాడు వైభవాన్ని పొంది నేడు వునికిలోనే లేని జాతుల గురించి విలపించే వారెవరు? అసలు అది జరిగిందని గుర్తించేవారెవరు? అడవిలోకి వెళ్లినప్పుడల్లా అక్కడ కనిపించే మొక్కమీదో , పురుగు మీదో దృష్టి పడ్డప్పుడు నాకు ఇలాగే అనిపిస్తుంది. 

ఒక సారి నేను, తీరిక దొరికినప్పుడు చరిత్రనూ , సామాజిక పరిణామాన్ని అన్వేషించే సమయంలో , రెడ్ నెపోలియన్ గా పేరుపడ్డ  నెజ్ పెర్స్ తెగ నాయకుడు చీఫ్ జోసెఫ్ చెప్పిన వాక్యాలు ఆకర్షించాయి’

“మనం జన్మిస్తుంటాం , మనం మరణిస్తూంటాం, సమాధి మీది మృదు మృత్తికా తలంనుంచి ఉద్బవించే గడ్డి లాగానో వృక్షాల లాగానో పునరుత్తానమవుతుంటాం. శిలలు విరిగిక్షయిస్తాయి, విశ్వాసాలు పాతవై స్మ్రుతి తప్పుతాయి కానీ  కొత్త నమ్మకాలు మొలకెత్తుతాయి. గ్రామాల విశ్వాసాలు  ఇప్పుడు దూళిగా మారాయి  కానీ అవి వృక్షాలలాగా తప్పక తిరిగి వృద్ధి  చెందుతాయి.” 

నెజ్ పెర్స్ అమెరికా మూల జాతులలో ఒకటి . చీఫ్ జోసెఫ్ తన తెగ ప్రజలతో అమెరికా దురాక్రమణదారుల చర్యలకు వ్యతిరేకంగా పనిచేసాడు. ఆ తెగకు , అక్కడ ఉన్న పరిసరాలకు ఉన్న అనుబంధం ఇక శాశ్వతంగా ముగిసిపోతున్నదని తెలిసి కలత చెందాడు. అయినా నశించిన చోటు నుంచే పునరుత్థానం చెందగలమని ఆశించాడు. ఆ ఆశలో నుంచి  వచ్చినవే పై వాక్యాలు. ఏదీ నశించదని తిరిగి మరో రూపంలో  జనిస్తాయని చెప్పడం విశ్వాసాన్ని బతికించుకోమని చెప్పడమే.

          జీవం ఒక అవిచ్చిన్న ధార. దానిని అంటి పెట్టుకునే విశ్వాసాలతో దానికి పని లేదు. అది తన దిశలో తాను ప్రయాణం చేస్తూనే ఉంటుంది. కానీ మానవులకు  ఈ గమనం ఒక సంక్లిష్ట దృగ్విషయం. వారికి నమ్మదగిన విధంగా విశ్వాసం అవసరమౌతుంది. ఆ విశ్వాసాల పెనవేసుకునే మనుగడ సాగిస్తారు. అందుకు తగిన తాత్వికతను ఏర్పరచుకుంటారు. దానికి తగిన జీవన విధానం, నైతిక అనువర్తనం ఏర్పరచుకుంటారు. అలా ఒక సమాజం, ఒక సమూహం, ఒక కుటుంబం మనుగడ కొనసాగిస్తుంది. వీటన్నిటికి భూమిక అక్కడి ప్రకృతి. ఒక్కో చోట ఒక్కో జీవన విధానం ,ఒక్కో విశ్వాసం ఒక్కో  మనుగడ. అందుకు విఘాతం కలిగితే కలత చెందుతారు. ప్రతిఘటిస్తారు. ఉనికి నిలుపుకోవడానికి  ప్రయత్నిస్తారు. మనుషులు పరిణామ క్రమంలో ఇటువంటి స్థాయికి చేరడం ఒక అద్వితీయమైన  విషయం. మరే జీవులూ ఇటువంటి స్థాయి పొందక పోవడం వెనుక ప్రకృతి యొక్క ఉత్కృష్ట మార్మిక శక్తి ఉందని నేను భావిస్తాను.

జాతి విస్తరణ కాంక్షలో కొందరు మానవులు గెలిచి ఉండవచ్చు , కొందరు అంతరించి పోవడమూ గమనించవచ్చు.అయినా ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న వృక్ష జంతుజాలాలు కూడా   చీఫ్ జోసెఫ్ వ్యక్తీకరించినట్టు ఆశిస్తుండవచ్చు,పోరాడమని శక్తిని కూడగట్టవచ్చు ,అతని జీవితం లాగానే వీటి ఆక్రోశం అంతమవనూవచ్చు… ఆ నిశ్శబ్ద వ్యాకులతను నువ్వూ నేనూ గుర్తించకపోతే అందుకు కారణమైన మన అవసరాలు  నియంత్రించుకోలేకపోతే , మన నిర్లక్ష్యాన్ని సరి చేయకపోతే  ఆ వృత్తం మానవ జాతినే  అంతిమ లంకెగా   కలుపుకొని ఆవృతమవుతుంది. చీఫ్ జోసేఫే అన్నట్టు అంతం నుంచి ప్రకృతి తనదైన రీతిలో మరోసారి పునరుత్థానమవుతుంది. అయితే ఈ సారి అది మానవజాతి సమాది ధూళి మీదుగా కొత్తగా మొలకెత్తుతుంది.

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Comments are closed.