జ్ఞాపకం-48 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

ఆ మాటల్లో కొన్ని మాటలు సంలేఖ చెవిన పడ్డాయి.

కానీ క్లాసులో కూర్చున్నా, వెయింటింగ్ రూంలో కూర్చున్నా సంలేఖలో ఏదో విసుగు, విరక్తి, మానసిక ఒత్తిడి. దాన్నుండి ఎలా బయటపడాలో తెలియని స్థితి. ఏదో ఫ్రస్టేషన్.  ఎంత వద్దనుకున్నా మనసులోంచి తెగిపడని ఆలోచనల తీగల వల.

అయినా జయంత్ తనకి ఇంతటి షాక్ ని ఎందుకిచ్చాడు? కేవలం చదువులో తనని అణగ దొక్కాలనేగా.  నిజంగా స్వార్థం ఉండేది తనలో కాదు అతనిలో. అలాంటి అతని కోసమా తను తన ర్యాంక్ ను త్యాగం చెయ్యాలనుకుంది? ప్రతి ఒక్కరూ అతి ముఖ్యంగా భావించే ర్యాంక్ ను తనెందుకంత ఆషామాషీగా తీసుకుంది? కొన్ని నెలలుగా చదువును నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడా కాలాన్ని తిరిగి సంపాయించగలదా ? ఎంత చదివినా జయంత్ ని చేరుకోగలదా ? ర్యాంక్ కొట్టగలదా? ఎంత పొరపాటు చేసింది? కొన్నిపొరపాట్లు మనిషి అంతు చూస్తాయి. మరికొన్ని పొరపాట్లు మనసు అంతు చూస్తాయి.

సంలేఖ ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం మూడీగానే వుంది. ఎక్కువ శాతం కాలేజీ వెయిటింగ్ హాల్లో కూర్చుని పేపర్ చదువుతూనో, పత్రికలు చదువుతూనో గడుపుతోంది.

అది చూసి హస్విత “నీకో ఐడియా ఇవ్వనా ?” అంది.

నవ్వి “ఏంటా ఐడియా?” అడిగింది సంలేఖ.

“నువ్వీ డిప్రెషన్ లోంచి బయటపడాలంటే ఈ పేపర్లు, పత్రికలు సరిపోవు. తిరిగి క్లాస్ బుక్స్ ని  చదవడం మొదలు పెట్టు. మాములుగా కాదు. కసితో చదువు. జయంత్ ని మించి పోయేలా చదువు. అప్పుడు నీ కెరీర్ కి మంచి స్టెప్ పడుతుంది. జయంత్ కన్నా ముందు ర్యాంక్ లో వుంటావు. అసలు నువ్వు మామూలు మనిషివి కావాలీ అంటే జయంత్ ని చదువులో మించి పోవడం ఒక్కటే మార్గం. అంతర్గతంగా అతని మీద నీకున్న కోపం కూడా అప్పుడే తగ్గుతుంది. నీకు తెలుసో లేదో నువ్వింత మూడీగా వుండటానికి కారణం అతని మీద నీకున్న కోపం. దాన్ని నువ్వు ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక నలిగిపోతున్నావు” అంది.

అది వినగానే సంలేఖ “నాకు జయంత్ మీద కోపం వుందని నీతో చెప్పానా? ఛ… ఛ… అలాంటిదేం లేదు. రోజూ ఆ పేపర్ తో పాటు పత్రికలు చదువుతుంటే నాకు తెలియని, నేను చూడని ప్రపంచం కన్పిస్తోంది. ఎన్నో జీవితాల్లో రోజూ జరిగే సంఘటనలు, రాజకీయాలు కన్పిస్తున్నాయి. ఒకప్పుడు ఆశ్చర్యం కల్గించిన జయంత్ ప్రవర్తన ఇప్పుడు నార్మల్ గానే అన్పిస్తోంది. అతనేదో మోసం చేశాడని, మాయ చేశాడని, స్వార్థంగా మాట్లాడాడని నాకేం అన్పించడం లేదు. సహజమైన మనిషిలాగే అన్పిస్తున్నాడు. మనీషిలా వుండమంటే అతను మాత్రం వుండగలడా ?” అంది.

హస్విత ఆశ్చర్యపోతూ “ఈ మనీషేంటో, ఈ మాటలేంటో నాకైతే గందరగోళంగా వుంది. నేను చూస్తుండగానే నువ్వు పెద్ద ముదురై పోయావు. వయసుకి మించి మాట్లాడుతున్నావు. ఇంటర్ ఫస్టియర్లో వున్నప్పుడు నువ్విలా లేవు. ఇప్పుడే ఇలా వున్నావ్” అంది.

సంలేఖ నవ్వి “మాటి మాటికి వయసుని గుర్తు చేసుకుంటూ మాట్లాడడం అవసరమానే! మనం కూడా అందరిలాగే అన్నీ చూస్తున్నాం. వింటున్నాం. ఆ మాత్రం ఆలోచించలేమా? ఆ మాత్రం మాట్లాడలేమా? చిన్న పిల్లల్లా ఎందుకు మాట్లాడాలి? ఎందుకు ఆలోచించాలి? అంత అవసరం ఏముంది ” అంది.

కళ్లు పెద్దవి చేసి చూసింది హస్విత.

హస్విత ఎప్పుడైనా  ‘ఇప్పుడు మీరు ఇంటరేగా! ఇంటర్ పిల్లలు ఇంటర్ లాగే వుండాలి’ అని అనడం చాలా చోట్ల విన్నది. అంతే కాదు. ఇంటర్ పిల్లలు కొందరు సెవెంత్ పిల్లల్లా ఆలోచించడం, మాట్లాడడం. కొందరేమో డిగ్రీ వయస్సు వాళ్లలా వున్నది లేనట్లు, లేనిది వున్నట్లు వూహించుకుంటూ ప్రవర్తించటం చూస్తోంది. సంలేఖ మాత్రం అటు ఇటు కాకుండా ఇంకేదో ఆలోచిస్తూ కన్పిస్తోంది. అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతుంది? ‘పోగాలం దాపురించింది’ అని అంటుంటారు. అదేనా ఇది?

సంలేఖ హస్విత చేతిని తన చేతిలోకి తీసుకుంది.

“ఎక్కువగా ఆలోచించకు. నాకు క్లాస్ బుక్స్ పట్టుకున్నప్పుడు ఆపేజీల నిండా జయంతే కన్పించి సుత్తితో తల పగలగొట్టినట్లనిపిస్తోంది. అందుకే సరిగా చదవలేక పోతున్నాను” అంటూ తన ప్రాబ్లమ్ చెప్పింది.

“ఎందుకే అతనంటే నీకంత భయం ?”

“భయం కాదు. ప్రేమ. ఎంత చెప్పినా అది నీకు అర్థం కాదు. ఎందుకంటే నీకా ఫీల్ ఇంకా ఎక్స్ పీరియన్స్ కాలేదు. జయంత్ లాగా నేను నా మనసును చంపుకోలేను. మనసు మార్చుకోలేను. ఎలాగైనా అతని ఈగోని సంతృప్తిపరచాలి. అతను అనుకున్న ర్యాంక్ అతనికి దక్కేలా చూడాలి. అందుకే నేను క్లాస్ బుక్స్ కాకుండా జనరల్ బుక్స్ ని ఎక్కువగా చదువుకుంటున్నాను. అతని ఆనందంలోనే నా ఆనందం వుంది” అంది.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.