జ్ఞాపకం-47 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

అలా అని తండ్రి చెప్పినట్లు విని ఇక్కడే వుంటే క్లాస్ లో  జయంత్ కన్పిస్తాడు. అతను కన్పించిన ప్రతిసారి ‘నేను నిన్ను ప్రేమించటం లేదు. అయినా నీ కెందుకమ్మా మరీ అంత ఆశ ?’ అని ఎగతాళిగా చూసినట్లే అన్పిస్తుంది. తను దాన్ని తట్టుకోలేకనే ఇంటి కెళ్లింది. అయినా తనకి తన తండ్రి వున్నాడు. ఇద్దరు అన్నయ్యలున్నారు. జయంత్ లేకుంటే ఏం? అలా అనుకున్నప్పుడు కొత్త శక్తి ఏదో వచ్చినట్లనిపిస్తుంది. ఆ తర్వాత మళ్లీ మామూలే అవుతుంది. ఎంత ప్రయత్నించినా ‘ఇదీ సమస్య’ అని తండ్రితో గాని, అన్నయ్యలతో గాని చెప్పలేకపోతోంది.

రాఘవరాయుడు బాధగా “తిలక్కేమో తన వయసుకి మించిన స్నేహాలు చేస్తున్నాడు. ఎంత చెప్పినా వినటం లేదు. నువ్వు కూడా ఇలా మొండికేసి చదవనంటే నేనేమైపోతానో ఆలోచించు సంలేఖా! నాలాగా పొలం వెళ్లి ఎండలో ఎండిపోతూ, వానలో తడిసిపోతూ నా పిల్లలు కష్టపడకూడదనే మిమ్మల్ని చదివిస్తున్నాను. ‘ఇక్కడే వుండి చదువుకుంటాను నాన్నా !’ అని ఒక్కమాట చెప్పమ్మా! నేను సంతోషంగా ఇంటికెళ్తాను” అన్నాడు ప్రాధేయపడుతూ.

తండ్రి ముఖం చూస్తుంటే బాధగా వుంది సంలేఖకు. ఏమనుకుందో ఏమో “సరే ! నాన్నా !” అంది.

అంతవరకు మానసిక వత్తిడితో వున్న ఆయన ప్రశాంతంగా అయ్యాడు.  సంలేఖను హాస్టల్లో వదిలి, ఏవేవో జాగ్రత్తలు చెప్పి అవసరమైనవి కొనిచ్చి ఇంటికెళ్లాడు.

ఆయన వెళ్లే ముందు సంలేఖ తలనిమురుతూ ఆప్యాయంగా “నువ్వు చిన్న పిల్లవేం కాదు సంలేఖా! చిన్నప్పటి నుండి నీకు పట్టుదల ఎక్కువ. మార్కులు తక్కువ వస్తే ఈసారి అలా జరగకూడదని పట్టుదలతో చదివే దానివి. ఆటల్లోకూడా అంతే! ఓడిపోకూడదన్న ధ్యేయంతో ఆడే దానివి. గెలవడం కోసం ఎంతైనా కష్టపడేదానివి. ఆ కష్టమే నిన్ను కాపాడుతుంది ఇక ముందు కూడా. ఆత్మ తృప్తి ముఖ్యం దేనికైనా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో.  జీవితం అంటే గోడకి అలంకార ప్రాయంగా పెట్టే బొమ్మకాదు. టేబుల్ డెకరేషన్ కి ఉపయోగపడే పూలతొట్టి కాదు. ఇక నేను వెళ్లిరానా?” అన్నాడు.

ఆ మాటలు అలాగే ముద్రించుకు పోయాయి సంలేఖ మనసులో.

సంలేఖ ఎప్పటిలాగే కాలేజీకి వెళుతోంది.

ఎక్కడైనా కార్పోరేట్ కాలేజీలల్లో ఇంటర్ చదువుతున్న అమ్మాయిల్ని, అబ్బాయిల్ని వేరు వేరు హాస్టల్స్ లో వుంచుతారు. కలవనివ్వరు.  మాట్లాడుకోనివ్వరు. క్లాసు రూంలో మాత్రం అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఒకే రూంలో వుంచి బోధన చేస్తారు. దానికి కూడా ఓ కారణం వుంది. అబ్బాయిలకో లెక్చరర్స్, అమ్మాయిలకో లెక్చరర్ ని అలాట్ చెయ్యాలన్నా ఒక్కోసారి సాధ్యం కాక ఎంసెట్, సి.ఎ. పౌండేషన్ ని అదే క్లాసులో అందరికి కలిపి ఇస్తుంటారు. అలా ఒకే క్లాస్ రూంలో కలసి కూర్చుని క్లాసులు విన్నంత మాత్రాన అబ్బాయిల దృష్టి అమ్మాయిల మీద అమ్మాయిల దృష్టి అబ్బాయిల మీద పడాలని ఏం లేదు. కానీ అందరి మైండ్ మెచ్యూరిటీ ఒకేలా వుండదు.

అసలు  ఒకే హాస్టల్ గదిలో వున్న పిల్లల తత్వాలే ఒకే విధంగా వుండట్లేదు. అలాంటిది ఇంత పెద్ద క్లాసు రూంలో పిల్లలందరు ఒకే తత్వంతో వుంటారన్న గ్యారంటీ ఏముంది? రకరకాల కుటుంబాల నుండి వేరు వేరు ఊర్లనుండి వచ్చి చదువు కుంటుంటారు. ఒకరు ఆలోచించినట్లు ఇంకొకరు అలోచించరు. ఒకరు మాట్లాడినట్లు ఇంకొకరు మాట్లాడరు. ఒకరు చదివినట్లు ఇంకొకరు చదవరు. కొందరికి చదువే పరమావది. కొందరికి చదువంటేనే పడదు. కానీ అందరినీ కలిపి తనలో ఇముడ్చుకుంటుంది ఏ కాలేజీ అయినా.  అది దాని విధి. ఏదీ మన చేతిలో లేదు.

కానీ క్లాస్ లోంచి బయటకు వస్తున్న సంలేఖను చూడగానే వాళ్ళ క్లాస్ మేడం ”చేతులారా కొనితెచ్చుకునే మానసిక తలనొప్పులే నోటికాడి చదువుని పాడుచేస్తాయి. ఎంత బాగా చదివేవాళ్ళనైనా క్రింద పడేస్తాయి” అంది ఇంకో మేడమ్ తో.  ఆమెకి చూచాయగా జయంత్, సంలేఖల విషయం తెలిసింది.

ఆ మేడం నవ్వింది.

“మీరన్నది నిజమే మేడం! హైస్కూల్ చదువు పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి ముందుగా కాలేజీలో అడుగుపెడుతున్నప్పుడు తల్లి రెక్కల చాటున వున్న కోడిపిల్లల్లా వుండాలనే అనుకుంటారు. ఆ తర్వాతనే ఆ పిల్లలకి రెక్కలు మొలవటం మొదలు పెడతాయి. ఎగరాలని చూస్తాయి. అవి ఆ రెక్కలతో ఎగురుతున్నప్పుడు నేలమీద పడొచ్చు. గుంతలో పడొచ్చు. గింజలున్న గంపలో పడొచ్చు. అది ఎగిరే విధానాన్ని బట్టి, విచక్షణను బట్టి వుంటుంది” అంది.

“అందుకే అంటారు మేడమ్ ఇంటర్ మీడియట్ అంటేనే అటు ఇటు కాని వయసు అని.  చెబితే వినడమూ, వినకపోవడమూ రెండూ జరుగుతాయి. ఆ వయసులో ఎటు గైడెన్స్ వుంటే అటే వెళ్తారు. ఏ అడుగు ఎటు వేస్తామో తెలిసినా వేస్తారు. తెలియక పోయినా వేస్తారు. తాము ఏది చేసినా కరక్టే అనుకుంటారు. ఏదైనా నేర్చుకోవాలని వాళ్లలో బలంగా వుంటేనే తప్ప బలవంతంగా వాళ్లకి ఏదీ నేర్పలేము. అది తెలిసే సంలేఖ ఇంతకు ముందులాగ చదువులో షార్ప్ గా  లేదని తెలిసి కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాం. మీరు కూడా చూస్తున్నారుగా సంలేఖ ఎక్కువ సేపు క్లాసులో కూర్చోకుండా వెయిటింగ్ రూంకెళ్లి కూర్చుంటోంది. అడిగితే తలనొప్పి అంటోంది. ఏదైనా కొట్టి చెప్పేంత చిన్నపిల్ల కాదుగా. ఏదైనా తనే తెలుసుకోవాలి. తనే మారాలి. మారిందంటే మంచి భవిష్యత్తు వుంది. లేదంటే తెలిసిందేగా ” అని సంలేఖను క్లాసులో బాగా దగ్గరగా చూసిన ఇంకో మేడమ్ అంది.

వాళ్లలా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు.

— అంగులూరి అంజనీదేవి

రచయిత్రి గత సంచికల కోసం ఈ లింక్ చూడగలరు .

అంగులూరి అంజనీ దేవి రచనలు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

One Response to జ్ఞాపకం-47 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో