జ్ఞాపకం-44 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

“నేను మౌనంగా వున్నప్పుడు నన్ను దూషించకు దిలీప్! నువ్వు నా రూం మేట్ వి. ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే నాకు సలహా ఇవ్వు. సంలేఖని చదవొద్దని, ర్యాంక్ తెచ్చుకోవద్దని నేను అనలేదు. ఏదో సరదాగా నువ్వే గనక మన కాలేజీలో లేకుంటే నేనే నెంబర్ వన్ ర్యాంకర్ని అని అన్నానేమో! అంత మాత్రానికే స్టడీ బుక్స్ చదవటం మానేసి నవలలు చదవాలా? నేనసలు తనని ప్రేమించనేలేదు. ఒక వేళ ప్రేమించానని సంలేఖ అనుకుంటే అది కేవలం నటన అని, తనని డిస్టర్బ్ చెయ్యటానికే ప్రేమించానని వెళ్లి చెప్పండి! తిరిగి రెచ్చిపోయి నవలలు మానేసి క్లాస్ బుక్స్ చదువుతుందేమో చూద్దాం! అయినా నన్ను ప్రేమించి, నా కోసం తన ర్యాంక్ ని వదులుకునేంత గొప్పతనం నాలో ఏం కన్పించిందట ? ఇది మరీ సిల్లీ థింక్ లా లేదూ? ఏది ఏమైనా నాకు ఇప్పుడు నా ర్యాంక్ ముఖ్యం దిలీప్! నేను బాగా చదువుకోవాలి. సి.ఎ. కొట్టాలి. సంలేఖనే నెంబర్ ఒన్ ర్యాంకర్ కావాలన్న స్వార్థంతో నా డైరీలో నన్ను డైవర్ట్ చెయ్యాలని అలా రాసిందేమోనని నేనెందుకు అనుకోకూడదు? అలా అనుకున్నాను కాబట్టే ఇప్పుడింకా బాగా చదువుతున్నాను. ఇది కూడా వెళ్లి చెప్పండి! దిమ్మదిరిగిపోతుంది. చదువుకునే వయసులో చదువు ముఖ్యం. ప్రేమకాదు. ఆ ప్రేమ కోసం చదువుని త్యాగం చెయ్యటం కాదు. ఇదంతా ఆలోచిస్తుంటే పరమ చెత్తగా వుంది” అన్నాడు జయంత్. అతను ఎంత మౌనంగా వుంటాడో సందర్భాన్ని బట్టి అంత గంభీరంగా మాట్లాడతాడు.

“ఈ మాటలు విన్నదంటే సంలేఖ ఉరేసుకుని చస్తుంది” అన్నాడు దిలీప్.

దిలీప్ మాటలు కొంచెం కూడా పట్టించుకోలేదు జయంత్.

మాట్లాడలేక పోయింది హస్విత. ఎప్పుడైనా ఒక అమ్మాయికి అబ్బాయి ప్రేమిస్తున్నానని చెబితే చదువుతో పాటు ప్రేమ కూడా కావాలనుకుంటుంది. అలా సాధ్యం కానప్పుడు చదువుకన్నా ప్రేమే ముఖ్యమని కూడా అనుకుంటుంది.

అదే జయంత్ లాంటి పుస్తకాల పురుగు దగ్గరకి వెళ్లి ప్రేమిస్తున్నానని ఏ అమ్మాయి చెప్పినా ఆ ఫీలింగ్ కి విలువ వుండదు. ప్రేమ కన్నా చదువే ముఖ్యం అనుకుంటాడు. చదువు మానేసి నువ్వే ముఖ్యం అనేంత అద్భుతం ఏముంది అంటాడు. ఇప్పుడు సంలేఖ పరిస్థితి అలాగే అయింది. అయినా సంలేఖ కూడా జయంత్ మీద మరీ అంత వెర్రి ప్రేమను పెంచుకోవలసింది కాదు. దిలీప్ కూడా హస్వితలాగే ఆలోచిస్తున్నాడు.

జయంత్ మాత్రం చాలా సూటిగా ఏ మాత్రం పశ్చాత్తాపం చెందని వాడిలా చూస్తున్నాడు. కానీ వాళ్లకి అతి దగ్గరలో వున్న కరెంటు స్థంభం వెనకాల బోగన్ విల్లా చెట్టు ప్రక్కన నిలబడి వాళ్ల మాటలు వింటున్న సంలేఖను వాళ్లు చూడలేదు.

సంలేఖ మనసు మేఘాలు ఒరుసుకున్నట్లు ఘర్షిస్తోంది. అక్కడో క్షణం కూడా వుండకుండా నేరుగా బస్టాండ్ కి వెళ్లి ఆదిపురి బస్సెక్కి కూర్చుంది. బస్ లో కూర్చుందన్న మాటే గాని ఆమె మనసంతా మంచు గడ్డలా అయింది.

జయంత్ మాటలు ఎంత వద్దనుకున్నా ఆమె మనసును గాయం చేసి దాని మీద పచ్చికారం కూరినట్లు మంట పుట్టిస్తున్నాయి. అసలీ ప్రేమ విషయంలో మనుషులు ఎప్పుడైనా తమని నిర్లక్ష్యం చేసేవారినే ప్రేమిస్తారు. తమని ప్రేమించే వారినే నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ నిర్లక్ష్యం ఎదుటి వారి మనసుని ఎంత కుళ్లబొడుస్తుందో అర్థంచేసుకోరు. చదువులో మమేకమైతే ప్రేమ విలువ తెలియదు. ప్రేమలో మునిగిపోతే చదువు విలువ తెలియదు. అందుకే ప్రేమ అనేది ఇద్దరూ ఆడే ఆట. ఇద్దరూ గెలిచే ఆట. ఏ ఒక్కరితో అది సాధ్యం కాదు. ఆమె కళ్లు కన్నీటితో మసక బారాయి.

ముందు సీట్లో కూర్చుని వున్న భరద్వాజ మాస్టారిని ఆమె చూడలేదు. ఆ రోజు ఆదివారం స్కూల్ లేదని ఏదో పని మీద ఊరెళ్ళి వస్తున్నాడు. వెనుదిరిగి సంలేఖను చూసాడు.

”కాలేజీ నుండి ఇంటికొస్తున్నావా లేఖా?” అన్నాడు అభిమానంగా. సంలేఖ మాట్లాడలేదు.

“ఏమ్మా మాట్లాడవ్? కళ్ళలో ఆ నీరేంటి? అలా వున్నావేం?” ఆశ్చర్యపోతూ అడిగాడు భరద్వాజ మాస్టారు.
సంలేఖ కంగారు పడింది. ఇంకా పరిశీలనగా చూసాడు.

“కంట్లో నలక పడితే పర్వాలేదు కాని కన్నీటిని వృధా చెయ్యకూడదు” అన్నాడు.
సంలేఖ మౌనంగా వుంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, UncategorizedPermalink

Comments are closed.