“అరణ్యం -1 ప్రతీ చోటూ పూల వనమే”-దేవనపల్లి వీణా వాణి

ఇది ఆగస్టు మాసం. గత కొంతకాలంగా జరుగుతున్నట్టే ఈ సారి కూడా వానలు ఆలస్యంగా రావడంతో మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఆలస్యంగా ప్రారంభం అయింది. ఈ మధ్య కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయికి తీసుకువెళ్ళిన ఘనత తెలంగాణదే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. అలా విస్తృత వనీకరణలో భాగంగానే ఈ రోజు సంగెం గ్రామంలో రహదారి పక్కన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాం. ఈ గ్రామం వరంగల్ కు తూర్పున పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొక్కలు నాటడానికి ఎంపిక చేసిన ప్రాంతం తిమ్మాపూర్ దారిలో సంగెం చెరువు కట్టకు అవతలి వైపు ఉన్న రోడ్డు పక్కన. సంగెం చెరువు మొదలయ్యే చోట గంగాభవాని సమేత సంఘమేశ్వర ఆలయం దానిని ఆనుకుని విస్తరించిన సంగెం చెరువు ఉంటుంది. ఎప్పుడో పదిహేనవ శతాబ్దంలో తీవ్ర కరువు వచ్చినప్పుడు ఘనపురానికి చెందిన గ్రామస్తులు జీవికను అన్వేషిస్తూ ఇటుగా వచ్చారట . ఊరిపెద్దకు కలలో ఒక ముసలి దర్శనం ఇచ్చి ఇంకాస్త ముందుకు వెళ్తే ఒక చెరువులోని బండ పై నాపాదాల గుర్తులు కనిపిస్తాయి అక్కడ నేను సంఘమేశ్వరునుగా వెలసానని చెప్పాడట. అలా ఘనపురం గ్రామస్తులు ఈ శివలింగాన్ని కనుగొని ఇక్కడే ఉండిపోయారట. కాలక్రమంలో సంఘం కాస్తా సంగెంగా మారిందని ఈ ఆలయం పేరు మీదనే ఈ గ్రామానికీ , చెరువుకీ ఈ పేరు వచ్చిందని చెబుతారు.

మేము మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాట్లు చూడడం కోసం చాలా పొద్దున్నే బయలుదేరాం. అనుకున్నట్టుగానే పనులు తొందరగా పూర్తి చేసాం. ఇక ముఖ్య అతిథులు రావడమే తరువాయి. అందువల్ల మాకు కాసేపు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించే అవకాశం దొరికింది. అడవి అందాలను చూడాలనుకున్నా, కలకూజితాలు వినాలని అనుకున్నా ఉదయమే సరైన సమయం. సూర్యకిరణాల తాకిడికి అడవి మేల్కొంటుంది, పక్షులు పాడతాయి. అలా చుట్టూ ఉన్న చెట్లను , చెరువును గమనిస్తూ ముందుకు నడిచాను.

గ్రామం దాటాక కుడివైపున ఉండే చెరువు , పక్షం రోజుల నుంచి కురిసిన వర్షం నీళ్లతో కళకళలాడుతుంది. అక్కడ కట్ట వద్ద తుమ్మ చెట్టు పొదల మీద తెల్లని రంగు పూలపై వంగ రంగు గీతలు కలిగిన తీగ.. చెట్టే తానేమో అనేంతగా పెరిగి పోయింది. ఎంత అందమైన పువ్వులు అవి! ఆ పూల కాడ ఎంత సున్నితంగా ఉందంటే గాలి బరువు కూడా మోయలేనంతగా.. గాలివాటుకు కూడ ఓర్చుకోలేని తీగ కిందకు వాలిపోయింది. వాటి పూలు రూపాయి బిళ్ళ పరిమాణంలో ఉన్నాయి. దూరం నుంచి చూసే వాళ్ళకు అది తీగ కాదు చెట్టే అలా ఉందేమో అని భ్రమపడే లాగా కనిపిస్తుంది.ఆ తీగ ఎక్కడ ఉన్నా కూడా ఎండిన పొదల మీదనే ఉంది కానీ ఎక్కడా విడిగా లేవు. ఆధారం లేకుండా పెరగలేవు కొన్ని సున్నితమైన మొక్కలు. ఇదీ అలాంటిదే. దీన్ని దూధిపాల ( Oxystelma esculentum , Rosy milkweed vine Jaldhudhi ) మొక్క అంటారు. ఇది మందు మొక్క. ఫొటోస్ తీయాలని ప్రయత్నించినా ఆ చ్గెట్టు ఉన్న దగ్గర ఒడ్డు సరిగ్గా లేకపోవడంతో సంతృప్తిగా తీయలేకపోయాను. ఏ మాత్రం అడుగు జరిగినా చెరువులో పడి పోయేలా ఉంది. తీసినవి కూడా అతికష్టం మీద తీశాను . స్థానికులకు దాని గురించి ఏమైనా తెలుసునోనని పశువులు తోలుకు వెళ్తూ ఎదురైన ఒకరిద్దరిని అడిగాను. వారు తెలియదనే చెప్పారు.

అటవీ శిక్షణ కాలంలో ఇలాంటి ఎన్నో సున్నితమైన మొక్కలు చూశాను. కానీ ఆ రోజు ఈనాటిలా అరచేతితో అన్ని పనులు చేయగల సెల్ ఫోన్ లేదు. లేకపోతే చాలా మొక్కలు కనీసం ఫోటోల రూపంలో భద్ర పరిచే వీలు ఉండేది. చాలా చోట్ల కెమెరా పట్టుకొని ఫోటో తీసే పరిస్థితి ఉండేది కాదు. ఇపుడు కూడా నేను ఆ మొక్కను ఫొటో తీయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా అది ఉన్న చోటు ఫొటో తీయడానికి అనుకూలంగా లేదు. అయినా సెల్ ఫోన్ జూమ్ చేసి కొన్ని ఫోటోలు తీసుకొని ముందుకు వెళ్ళాను. ఆశ్చర్యం… కాస్త ముందుకు వెళ్తే రెండు మూడు హెక్టార్ల పైననే రోడ్డు మీద నుంచి చెరువు వరకు గులాబీ వనం… కనుచూపు మేర పూలతో చెరువు అంచును కలిసేదాక ఉన్నాయి. దీనిని ఎవరూ గమనించినట్టు లేదు. నాలుగు రెక్కలు కలిగిన పూవు మధ్యలో నుంచి పొడుచుకు వచ్చే కాంతి కిరణాలలాగా ఉన్నాయి ఈ పూల కేసరాలు . శాస్త్రీయంగా వీటిని Cleome chelindonii అంటారు. నేను ఇలాంటి అందమైన ప్రాంతాలని అనేకం చూసినా ఈ మధ్య కాలంలో ఇలా ప్రకృతి సిద్ధంగా ఉన్న గులాబిరంగు పూల వనాన్ని మొదటిసారిగా ఈ ప్రాంతంలో చూశాను. ఈ మొక్కలు అర మీటరు పొడవు వరకే పెరుగుతాయి. కానీ లేత గులాబీ వన్నె పూలు పూసి చూడ ముచ్చటగా ఉంటాయి. కాయలు పెసర కాయలలాగా వస్తాయి.ఇంగ్లీషులో ఈ మొక్కని Celandine Spider Flower అంటారు. ఇది కూడా ఋతు ఆధారిత మొక్కనే. ఇలా ఋతువులకు వికసించే అందమైన మొక్కలన్నీ ఎక్కడ పోయాయో కానీ ఇక్కడ మాత్రం విరగబూసాయి. ఇపుడు దీన్ని చూసిన ప్రాంతం సాగు చేయకుండా వదిలివేసిన వ్యవసాయ క్షేత్రం. వర్షాలు సకాలంలో కురవ కుండా ఉన్నందుకు సాగు చేయకుండా వదిలివేసినట్టున్నారు.

ఇలాగే ఇంతకు ముందు ఇటుకాలపల్లి వెళ్లినప్పుడు చూసాను. ఆకుపచ్చ పొలాల మధ్య రెండు పెద్ద పెద్ద మడులలో పసుపు పచ్చ పూలు ఉన్న పిల్లి పెసర లాంటి మొక్కలు. అది కూడా వదిలేసిన వ్యవసాయ క్షేత్రమే. స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం హన్మకొండ నెహ్రూ పరేడ్ మైదానంలోనూ ఇలాగే విస్తారంగా పెరిగిన నల్లేరు వనం , మేడిపల్లి అడవులలో కొండ అంచు వెంట ఉన్న మొక్కలు , తీగరాజు పల్లి కాలువ గట్టు వెంట ఉన్న కొండి పూల చెట్లు , తుత్తురు , నల్ల బెండ పొదలు , వెంపలి, మూషిక పర్ని , కట్ల తీగలు.. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఈ కాలమంతా రంగు రంగుల పూలతో వానకు కొట్టుకు పోని రంగవల్లికలు వేసి ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నీ మోకాలు ఎత్తు దాటని చిన్న చిన్న మొక్కలు . అలా వీటిని చూస్తే ఆ నేలలన్నీ వాటి స్వస్థలాలేమో, మనమే పంటల కోసం వాటిని పెరగనివ్వడం లేదు కదా ,మనమే వాటి పాలిటి శత్రువులం కదా అనిపిస్తుంది. ఆ చుట్టూ పక్కల పనిచేసే వాళ్ళని , మొక్కలు నాటే కార్యక్రమానికి వచ్చిన వాళ్ళని దాని స్థానిక నామం తెలుసుకోవాలని ఈ చెట్టును మీ ఊర్లో ఏమంటారని అడిగాను. ఏమో అనీ తెలియదు అనీ , అది పిచ్చి చెట్టుఅనీ ,అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అన్న సమాధానాలు వచ్చాయి. ఏమిటో ఒకప్పుడు ఆయుర్వేదానికి , స్థానిక వైద్యానికి పేరు మోసిన ఈ దేశంలో కనీసం పేర్లు కూడా ఒక తరం నుంచి మరొక తరానికి చేరలేకపోయాయా అనిపించింది. ఈ రోజు ఉన్న వాతావరణానికి ఈ అందమైన పూల వనానికి , దూదిపాల తీగలకు చాలా సంతోషం అనిపించింది. మనం కలుపు మొక్కలుగా పెరికివేసే మొక్కలు అవకాశం దొరికితే నేలకు రంగులద్దడానికి సర్వదా సిద్దంగా ఉంటాయని నిరూపించినట్టు అనిపించింది.

అటవీ శాఖలో చేరినప్పుడు మా శిక్షణ కాలం అంతా కూడా డెహ్రాడూన్ లో జరిగింది. డెహ్రాడూన్ ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని. అడవులకు సంబంధించిన అత్యుత్తమ శిక్షణ నిచ్చే రెండు ప్రసిద్ద శిక్షణాలయాలు, ప్రసిద్ది గాంచిన అటవీ పరిశోధనాలయం ఉన్నది అక్కడే. అవి దేశ వ్యాప్తంగా అటవీ సర్వీసులకు సంబంధించిన శిక్షణను ఇస్తాయి. మొదటిది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుకు శిక్షణ ఇచ్చే ఇందిరా గాంధీ జాతీయ అటవీ అకాడమీ. ఇది అఖిల భారత సర్వీసుల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు భారత అటవీ సేవలకు(IFS) సంభందించిన శిక్షణను నిర్వహిస్తుంది. మరొక సంస్థ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ అకాడెమీ అంటే రాష్ట్ర అటవీ సేవలకు(SFS) సంభందించిన శిక్షణను నిర్వహిస్తుంది.ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రూప్ వన్ స్థాయి అధికారులకు శిక్షణ ఉంటుంది . అయితే అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల వల్ల కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అక్కడ మాకు శిక్షణ కొరకు కేటాయించింది. అక్కడ ఒక సంవత్సరన్నర పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం. శిక్షణలో భాగంగా దేశ వ్యాప్త పర్యటన చేసే అవకాశం లభించింది. ఆ అకేడమి నుంచి శిక్షణ తీసుకున్న మొదటి మరియు చివరి రేంజ్ అధికారుల బృందం మాదే.

డెహ్రాడూన్ పట్టణం హిమాయల పర్వతాల పీట భాగమైన శివాలిక్ కొండల్లో వెలసింది. స్థానిక గర్వాలీ భాషలో దూన్ అంటే లోయ అని అర్థం. సిక్కుల ఏడవ గురువైన గురు హరి రాయ్ ఇక్కడ కొంత కాలం బస చేసిన డేరా పేరు మీదగా డెహ్రాడూన్ అన్న పేరు వచ్చింది. ఇంతకు ముందు దీని పేరు సుధనగర అని తెలుస్తున్నది. భారత దేశంలోని ఇతర రాజ్యాల లోగానే ఇది కూడా విదేశీ దండ యాత్రలకు లోనయ్యింది. నేపాల్ రాజవంశం అధీనంలోకి వచ్చాక అప్పుడు జరిగిన ఇండోనేపాల్ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఇండియాలో తదనంతర కాలంలో భారతదేశంలో విలీనమైంది. డెహ్రాడూన్ చుట్టుపక్కల అంతా కూడా లోయలు , చిన్నా పెద్దా నీటి పాయలతో పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడి ప్రత్యేక వాతావరణం ఆనాటి బ్రిటిష్ పాలకులకు ఎంతగానో అనుకూలంగా ఉన్నందువల్ల ప్రసిద్ద పర్వత విడిది కేంద్రాలుగా నైనిటాల్ , చక్రత, ముస్సోరీ వంటి ప్రాంతాలను అభివృద్ధి చేసారు. అవి ఇపుడు పర్యాటక ప్రాంతలుగా కొనసాగుతున్నాయి.

అక్కడ సంవత్సరంలో దాదాపు చలికాలం ఉంటుంది. కొండ వాలు ప్రాంతాలలో ఆపిల్ తోటలు, ప్లం తోటలు ఉంటాయి. మిగిలిన అన్ని వసతులు అంతంత మాత్రమే అయినా అక్కడి ప్రజలు మైదానాలకు రావడానికి ఇష్టపడని మహత్యం అంతా ఆ అడవిలో దాగి ఉంటుంది. స్వచ్చమైన నిశ్శబ్ద జీవితానికి అలవాటు పడ్డ అక్కడి వాళ్ళు మైదానాల్లో ఉన్న వాతావరణానికి ఇష్టపడలేరేమో పది పదిహేను ఇళ్ళున్నా సరే అక్కడే తరాల పాటు జీవిస్తున్నారు . అక్కడి వాతావరణం హిమాలయలంత గడ్డ కట్టే చలికి , మైదానాల ఉష్ణ తీవ్రతకు సరి హద్దుగా ఉంటుంది. ఇది సున్నితమైన పూల మొక్కలకు అనుకూలంగా ఉంటుంది. ప్రపంచ ప్రకృతి ప్రియులను అలరించే పూల లోయ, భారతీయుల ఆనంద దేవత , హిమాలయాల పోషక మాత నందా దేవి పర్వతం ఉన్నది ఈ రాష్త్రంలోనే. ఎంతో మంది యోగులను ఆకర్షించిన పుష్పవతి లోయ ( భారతీయ ఇతిహాసాల ప్రకారం పాండవులు వనవాస కాలంలో ఈ ప్రాంతంలో ప్రవహించే నదికి ఆ లోయకి అక్కడ కనిపించే సుందర పుష్పాల పేరు మీద పుష్పవతి నదీ అని ఆ లోయ పేరు పుష్పవతీ లోయ అనీ పెట్టారట) అంటే పూల లోయ గురించి 1931 వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఫ్రాంక్ స్మిత్ అనే బ్రిటిష్ పర్వతారోహాకుడు ఎరిక్ శిప్టన్, RL హోల్డ్స్ వర్త్ తో కూడిన తమ బృందం పర్యటనలో భాగంగా చేసిన యాత్రలో ప్రస్తుత చమోలీ జిల్లాలోని కామెట్ పర్వతసానువుల్లో దీనిని కనుగొన్నాడు. అది వారి బృందం ఈ లోయ ప్రాంతంలో తప్పిపోవడం వల్ల యాదృశ్చికంగా జరిగింది. ఫ్రాంక్ స్మిత్ తను చూసిన అపూర్వ దృశ్యం మీద “ది వాలీ అఫ్ ఫ్లవెర్స్” పేరుతో ఒక పుస్తకం రాసాడు. ఇది 1938లో అచ్చయింది. ఇప్పటికీ ఈ లోయ అసలు పేరు భ్యుందర్ లోయ (Bhyundar Valley ) పేరు కన్నా ఫ్రాంక్ బృందం ఇచ్చిన పేరు వాలీ ఆఫ్ ఫ్లవర్స్ తోనే చలామణిలో ఉన్నది.

విశాల భారతావనిలో ఈ లోయలన్నిటి సమాచారం ఎక్కడివక్కడ ఉన్న చిన్న రాజ్యాలకు పరిమితమయి ఉండేవి. పరిమిత రవణా సౌకర్యాలు , జన జీవన విధానాలు అందుకు కారణమని ఊహిస్తాను. ఇప్పటికి మనకు తెలియని సుందర వన్య దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. భారతీయ శాస్త్రాలలో వివరించినట్టుగా ఆయా ప్రాంతాల పేర్లు , వృక్ష జంతుజలాల పేర్లు ,నాటి ఉద్గ్రంధాల సమచార క్రోడీకరణ అటవీ అధ్యయన దృష్ట్యా చెప్పుకోదగినంతగా జరగలేదనే చెప్పాలి. ఇక మన చారిత్రక సందర్భంలో విలువైన సమాచరపు లంకె తెగిపోవడం మనకు తెలియనిది కాదు. ఇప్పుడు ఈ మాత్రం వెలుగులోకి వచ్చిన పూల వనాల బాహ్య విషయ విస్తరణ వెనుక ఆసక్తికర సంఘనలున్నాయి. అవి నిజంగా అత్యంత ఆసక్తితో చేసిన ఔత్సాహికుల పరిశీలనలు , పరిశోధనలూనూ. ఫ్రాంక్ స్మిత్ కూడా అలాంటివాడే. స్వతహాగా ఎలక్త్రికల్ ఇంజినీర్ అయిన ఫ్రాంక్ తన అభిరుచి మేరకు ప్రకృతి శోధకుడిగా మారి పర్వతారోహకుడై దాదపు 23 పుస్తకాలు రాస్తే అందులో మన దేశంలోని అనుభవాలపై మూడు పుస్తకాలు రాశాడు. అందులో “ ది కంచన్ జంగా అడ్వెంచర్” , “ సెంట్రల్ హిమాలయన్ మౌంటైన్స్ అండ్ ఫ్లవర్స్” వంటివి మన దేశ విశిష్ట ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఫ్రాంక్ రాసిన ఈ “ది వాలీ అఫ్ ఫ్లవెర్స్” పుస్తకం ద్వారా ఈ ప్రాంత విశిష్టత ప్రపంచానికి తెలిసింది.
ఫ్రాంక్ పుస్తకం ద్వారా పూల లోయ గురించి తెలుసుకున్న రాయల్ బొటానికల్ గార్డెన్ ,ఇంగ్లండ్ వారు పరిశోధనల నిమిత్తం జాన్ మార్గరెట్ లెగ్గి ని పురమాయించారు. లండన్ కు చెందిన మార్గరెట్ 1939 లో పూల లోయ లోని పూల సేకరణ కొరకు ప్రయత్నించి ఆ కొండల వాలులో జారి పడి మరణించింది. ఆమె మరణాంతరం ఆమె చెల్లెలు తన అక్క అన్వేషణ నిమిత్తం ఇక్కడకు వచ్చి కొంత ప్రయత్నం చేసింది. కానీ ఆమె కనుక్కోలేక పోయింది. అధ్బుతమైన పూల లోయ సౌందర్యానికి ముగ్ధురాలైన ఆమె చివరి క్షణం వరకూ అక్కడే ఉండిపోయింది. తన అక్క జ్ఞాపకార్థం ఒక సమాధిని నిర్మించింది. అది పూల లోయలో ఇప్పటికీ చూడవచ్చు. పూల లోయలోనే చివరి వరకు గడిపిన ఆమె 1954లో ఇక్కడే మరణించింది. జాన్ మార్గరెట్ లెగ్గి జ్ఞాపకార్థం 2010లో Impatiens పూల మొక్కలకు ఇమ్పెశన్స్ లెగ్గి (Impatiens leggi) అన్న పేరు పెట్టారు.

స్వతంత్రం వచ్చాక పర్యావరణ సంధితమైన అనేక సంరక్షణ చర్యలు తీసుకోబడ్డాయి. అందులో అభయారణ్యాలను చేయడం ఒకటి. ఈ పూల లోయను కూడా అభయారణ్యం గా సెప్టెంబర్ 6,1982న నోటిఫై చేసారు. దీనికి అనుకొనే ఉన్న నందాదేవి అభాయారణ్యాన్ని కూడా కలుపుకొని నందాదేవి బయో స్పియర్ రిజర్వుగా ప్రకటించి 2005నుంచి నందా దేవి మరియు పూల లోయ జాతీయ పార్కుగా ఏర్పాటు చేసారు. ఈ ప్రాంత వైశిష్ట్యాన్ని గుర్తించిన UNESCO 1988లోనే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

ఒక్కో చోట ప్రకృతి తన కారకాలతో ఒక్కో ప్రత్యేకమైన అనుభూతి పవనాలు సృష్టిస్తుంది. అది ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా ఉంటుంది. అందులో ఒక ఆనందం కనిపిస్తుంది. ఆ ఆనందపు అనుభూతిని ఒక ఎప్ప్పుడూ అక్కడే ఉండే చెట్టు ఒక అందమైన పూవులగానో , సుగంధ భరిత పవనం లాగానో వ్యక్తీకరిస్తే ఓ పక్షి తన శరీర వర్ణంతో వంత పాడుతుంది. అన్నీ దర్శించ గలిగే మానవులు మాత్రం ఎవరో ఎప్పుడో తప్ప ఆ సుందర ప్రకృతి దృశ్యానికి తాదాత్మయం చెందరు. వారానికో రంగు మార్చే పూల లోయ ఉత్తరాన హిమాలయ పాదాలకు రంగులు అద్దితే , పన్నెండేళ్ళకు ఒక సారి పూసే నీలి కురింజీలు దక్షిణాన సహ్యాద్రి కొండలలోని మన్నార్ లోయకు పుష్కరాలను తీసుకు వస్తాయి. తూర్పున నాగాలాండ్ జుకోవ్ లోయ ,సిక్కింలోని యుమ్తాంగ్ లోయ ఉదయ సూర్యుని కిరణాల లాలిత్యాన్ని స్వీకరించి పచ్చని లోయల మీద రంగ వల్లికలు వేస్తే మధ్య భారతంలోని ఖాస్ మైదానం దానిని అనుకరిస్తుంది.కాశ్మీర్ లోని కుంకుమ పూల సోయగం జగమెరిగినదే , ఇంకా మనకు అందని పూవనాలెన్నో.
మన దేశపు దక్షిణ భాగంలో కుడి ఎడమల పెట్టని కోటలు పశ్చిమ కనుమలు , తూర్పు కనుమలు, ఉత్తరాన హిమాలయాలు. పశ్చిమ కనుమలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు . తూర్పు కనుమలను కూడా ఒక్కో రాష్ట్రంలో ప్రాంతంలో ఒక్కో పేరుతో ఉన్నాయి. అలా పశ్చిమ కనుమలు మహారాష్ట్ర లో సహ్యాద్రి పర్వతాలుగా , తమిళ , కేరళ ,కర్ణాటక పర్వతాలు కలిసే చోట నీలగిరి పర్వతాలుగా పిలవ బడుతున్నాయి. నీలగిరి కొండలకు ఆ పేరు నీలి పుష్పాలనిచ్చే కురింజి మొక్కల పేరు మీద వచ్చింది. ఈ నీలగిరి కొండలను మొదటగా గుర్తించింది Mr.Whish and Kindersley 1818 లో కనుగొన్నారని చెబుతారు. అయితే ఆ కొండకు నీలి రంగు పులిమిన కురింజి పుష్పాల జాతుల్ని గూర్చి వివరంగా రాసింది మాత్రం Christian Gottfried Nees Von Esenbeck. ఈ మొక్కను శాస్త్రీయంగా Strobilanthes kunthiana అంటారు. ఈ చివరి పదం కుంతియాన అన్నది కదా, అది కుంతీ నది పేరు మీదగా వచ్చింది . వీటిలో 250 జాతులు ఉంటే భారత దేశంలో ఇప్పటికి 46 జాతులను గుర్తించారు. నమోదు చేసిన వివరాల ప్రకారం 1838 నుచి 2018 వరకు 16 సార్లు ఈ కురింజి పూల విస్పోటం జరిగింది. ఇలా పుష్కరం తర్వాత పుష్పించిన ఈ మొక్కలు తమ సంతతిని సృష్టించి శాశ్వత విశ్రాంతి తీసుకుంటాయి. ఇలా ఒక్కసారే మూకుమ్మడి సమూహం పుష్పించి ప్రత్యుత్పత్తి పూర్తి చేయడాన్ని శాస్త్రీయంగా మాస్టింగ్ అంటారు. ఇలా మనకు చిరపరిచితమైన వెదురు జాతుల్లో కూడా ఉంటుంది. వెదురులో ఇది దాదాపు నలభై సంవత్సరాలపైనే. ఇలా కొన్ని జాతులకు తమ జీవితకాలంలో ఒకే సారి పుష్పించి మరణిస్తాయి. వెదురు జాతుల్లో ఈ మాస్టింగ్ ప్రక్రియ మిజోరం రాష్త్రం లో ఒక జాతీయ పార్టీ ఆఖరికి మిజోరం రాష్ట్రం ఏర్పాటు కావడానికి హేతువు అయిందన్న విషయం ఆశర్యం అనిపించినా అది నిజం. మిజోరం లో మౌతం లేదా మిజో అంటే వెదురు వనం పుష్పించే సమయమని అర్థం. అలా ఒక్కసారిగా విత్తనం తయారైనప్పుడు నల్ల ఎలుకలు విజ్రుమ్భించి (Rat Flooding) పంటచేలను, నిలవ ఉన్న ధాన్యాన్ని ఆశించి కరువుకు కారణయ్యాయి. కరువులను ఎదుర్కోవడానికి మిజో నేషనల్ ఫమైన్ ఫ్రంట్ పార్టీ ఏర్పాటు కావడం ,ఆ పార్టీ అధ్వర్యంలో జరిగిన పోరాట ఫలితంగా నేటి మిజోరమ్ ఏర్పాటవడం ఇదీ చరిత్ర. ప్రకృతి సమాజం మీద చూపే ప్రభావానికి ఒక చిక్కని ఉదాహరణ ఈ మాస్టింగ్ ప్రక్రియ.

పశ్చిమ కనుమల అడవులు కూడా ప్రత్యేకమైనవే. ఇక్కడి లోయల మడతలలో పెరిగే చిక్కని అడవులను షోలా అడవులు అంటారు. ఈ అడవుల జీవ వైవిధ్యం ఎంతో విశిష్టమైంది. జీవ శాస్త్ర పరంగా పరిణామ క్రమంలో అంత్య దశని సూచిస్తుందని నిర్దారించారు. కొండలను కప్పిన గడ్డి పరదాల మధ్య ఈ ఆకుపచ్చ పట్టుకుచ్చులను పోలిన వృక్ష గుచ్చాలు అత్యధిక జీవ వైవిద్యానికి పేరుపడ్డాయి. కురింజి పూలు ఈ షోలా అడవుల ఒక విన్యాసం. తమిళ సాహిత్యంలోనూ కురింజి పూల ప్రస్తావన ఎన్నదగినదే. అది తమిళ చారిత్రక గమనాన్ని ధ్రువ పరుస్తుంది కూడా.

నాగాలాండ్ మణిపూర్ రాష్ట్రాల సరిహద్దు లోయ Dzkov పూల వనాలకు ప్రసిద్ది చెందిది. ఇక్కడ దొరికే ప్రత్యేకమైన లిల్లీలు ఇంకెక్కడా కనిపించవు అంటే ఎండమిక్ జాతులు అన్నమాట. రుతువుల విన్యాసానికి ప్రకృతి ప్రతిస్పందన ఇక్కడ లోయల నిండా రంగు రంగుల పూవులై పర్వత సానువులను అలంకరిస్తుంది. సిక్కిం రాష్ట్రంలోని యుమ్తంగ్ లోయ కూడా వన్య పుష్పాలకు ప్రసిద్ధి. తీస్తానది ఉపనది అయిన యుమ్తంగ్ ప్రవాహ తీరం ఈ లోయకు జీవనాడి. హిమయాలయాల వంటి శీతల ఎత్తైన భౌగోళిక ప్రాంతాలకు చెందినా రోడో డెన్డ్రాన్ జాతులు ఇక్కడ విస్తారంగా పెరుగుతాయి. సిక్కిం రాష్ట్ర పుష్పమైన రోడో డెన్డ్రాన్ పుష్పాల ఆవాసం ఈ లోయలోనే . అందుకే ఆ పూల పేరు మీదగానే శింగ్బా రోడో డెన్డ్రాన్ అభయారణ్యంగా గుర్తించారు.

మధ్య భారతంలోని సహ్యాద్రి పర్వతాల మధ్యనున్న కాస్ పీటభూమి కూడా పూల వనమే. పర్వత ప్రాంతాలలో భౌతిక స్థితి సానుకూల రక్షణ. పీట భూముల్లో ఆ రక్షణకు అనేక పరిమితులు ఎదురౌతాయి. అయిన ఇక్కడ ఎన్నో పూల మొక్కలు ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయంటే కొంత వాటి బలమూ మరికొంత అధికారుల నిర్భంధ క్రమశిక్షణ. 2012 లో ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం ఈ క్రమశిక్షణకు పొడిగింపు మాత్రమే.

ఇలా ఆలోచిస్తూ మధ్య మధ్య మా వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ ఉన్న చెట్టు కింద కూర్చున్నాను. నాతో పాటు మా సిబ్బంది , గ్రామస్థులు, కొంత మంది పనివాళ్ళు ఉన్నారు . సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు భోజన విరామం అంటూ ఉండదు. కార్యక్రమం ముగిసే దాకా వేచి ఉండవలసి వస్తుంది. పని వాళ్ళు ఎప్పుడో ఉదయమే బయలుదేరి ఉంటారు. పని చేస్తోంటారు కనుక ఆకలి వేయడం సహజం. అయినా ఒక వేళ వెంటనే కార్యక్రమం మొదలు పెట్టవలసి వస్తే ఇబ్బంది కనుక వాళ్ళు కూడా అలగే కుర్చుండిపోయారు. అక్కడ ఉన్నది గ్రామ దేవత మైసమ్మ దేవాలయం. పాత రాతికట్టు గోడ దాదాపు కూలిపోయి ఉంది. కూలిన గోడను అనుకోని పెరిగిన పెద్ద రావి చెట్టు అది. దేవాలయం వద్ద పూజ చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. పక్కన మరొక ఆలయం కొత్తగా కట్టింది కూడా ఉంది. అక్కడా పూజలు చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి.రావి చెట్టు మొదట్లో శతమూలి తీగలు మొలిచి పైకి ఎగబాకుతున్నాయి. సహజీవనం చెట్టుకి కొత్త కాదు కదా !

నేను ఇంతకుముందు పని చేసిన తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో కూడా పొద్దు తిరుగుడు పూల వంటి చిన్న చిన్న పసుపు రంగు పూల మొక్కలు ఒక చక్కని పూల చద్దరులా మొలిచేవి. నేను చాలా సార్లు మా ఇంటి కుండీలో పెంచడానికి ప్రయత్నించి విఫలమయ్యాను . అవి విస్తారంగా మొలిచే చోటు అకాడెమీలోని గులాబీ తోటలో . అక్కడ గులాబీ చెట్ల కోసం తరచూ నీళ్ళు పట్టేవారు. ఆ నీటిచెమ్మకు ఈ మొక్కలు కూడా బాగా వచ్చేవి. ఆ చిన్ని మొక్కల వివరాలు నమోదు చేయాలని చాలా ఉండేది. ఎందుకంటే గులాబీ తోట కోసం తరచూ పూలు పూయక మునుపు కలుపు మొక్కలుగా భావించి అక్కడి పనివారు వాటిని తీసివేసే వారు. అయితే సహజంగా ఇలా వాటికి అవే వచ్చే వన్య పుష్ప జాతుల వివరాలను నమోదు చేస్తూ బోంబే నేచురల్ హిస్టరీ వారు ఒక పుస్తకం విడుదల చేసారు. అందులో ఈ మొక్కల గురించి నాకు పూర్తి వివరాలు దొరికిన తర్వాత వాటిని తీసివేయకుండా అక్కడ పని చేసే మహిళలకు చెప్పడమే కాక ఆ కొద్ది ప్రాంతాన్ని వాటి కొరకే వదిలివేయడానికి నిర్ణయించడం జరిగింది.

ఈ రోజు ఇక్కడ మొలిచినట్టే ఈ వర్ష రుతువులో అంతటా ఈ చిన్ని చిన్ని పూలవనాలు నిద్ర లేచి ఉంటాయి. మళ్ళీ ఏడాది దాకా ఆ మట్టిలోనే తమ చిన్ని విత్తనాలను దాచిపెట్టి మళ్ళీ ఏడాది కోసం ఎదురుచూస్తాయి. వాటి భాగ్యం కొద్దీ ఆ మట్టి నిర్లక్ష్యంగా విసిరి వేసిన అగ్గికి అర్పితం కాకపోతేనో , సాగు చేయబడక పోతేనో , చేసినా గట్ల మీద, మొలకల శిరసు మీద కలుపు మందు జల్లక పోతేనో , మొగ్గ పట్టక ముందే గడ్డి కోసం కోత కోయక పోతేనో తప్ప మళ్ళీ ఈ రోజు నా ముందు కనిపించినట్టుగా నవ్వ లేవు, వాటి సంతతిని కొనసాగించలేవు. మళ్ళీ కనిపించలేవు. కాసేపు ఇలా ఆలోచించేలోగా మా మొక్కలు నాటే కార్యక్రమం కోసం అతిథులు రానే వచ్చారు. కార్యక్రమం సవ్యంగా పూర్తి అయింది. అంతా అయ్యే సరికి సాయంకాలం అయ్యింది. మేము తిరిగి వెళ్ళే సమయానికి పొద్దున్న విచ్చుకున్న పూలు రెండు చేతులూ జోడించి ప్రార్తిస్తున్నట్టుగానే వెక్కిరిస్తునట్టు సన్నగా గొణుగుతున్నాయి “ మీరు లేని ప్రతీ చోటు పూల వనమే”.

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Comments are closed.