ఏదీ(కవిత )- గిరిప్రసాద్ చెలమల్లు

ఏదీ
నా గిలకొయ్య పోయి
హ్యాంగర్ ఆక్రమించింది

ఏదీ
కంచంలో బువ్వని
ప్లేట్ లో రైస్ కమ్మేసింది

కక్కయ్య బాబాయి మామయ్య
పిన్ని చిన్నమ్మ పెద్దమ్మ అత్తయ్య లను
అంకుల్ ఆంటీ కుమ్మేసాయి

పూటకూళ్ళని
హోటళ్ళు సమాధి చేసినై

దార్లు రహదార్లు
రోడ్లై విస్తరించినై
జనం పై టాక్స్

ఉప్పు సాల్టయి
చక్కెర సుగరై
పెరుగు కరుడై
పాలు మిల్కయి
వ్యాపార సామ్రాజ్యంలో ఏలుతున్నై

పొట్లం పోయి
కవరు భూమి పొరల్లో
జొర్రబడుతుంది

నూజీళ్ళు పప్పుచెక్కళ్ళు పకోడీలు గారెలు
పిజ్జా బర్గర్ ల దెబ్బకి ఠారెత్తుచున్నాయి

కిరాణా కొట్లు
సూపర్ డూపర్ మార్కెట్ల మాయాజాలంలో విలవిల

కట్టెలపొయ్యి ని
గ్యాస్ బండ తరిమి గుదిబండ అయ్యింది

వనానికి
యురేనియం ఉరి వేస్తుంది

తెలుగుని
ఎప్పుడో ఖూనీ చేసింది
పెట్టుబడి

ఇప్పుడెందుకు హైరానా
బహుజన భాషే పుస్తకంలో
లేనప్పుడు వారికే భాషయినా ఒక్కటే

చేతనైతే పెట్టుబడిని
విధ్వంసం చెయ్
అందరి బతుకుల లో వెలుగు నింపు

పనికిరాని నినాదం
మాటున పెట్టుబడి లీల స్పష్టం
భాష ఏ భాషనీ మట్టుపెట్టదు
పెగిలే గొంతులో పెట్టుబడి మందు

                                                     – గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.