ఏం సందేహం లేదు! (కవిత )-

గుబులు కిటీకీ తలుపు తెరుచుకొని ఓ ప్రశ్నల పిట్ట
నా ఎద గుమ్మంలో రెక్కలు ఆర్చుకు తిరుగుతున్నది…!
వాడి ముక్కుతో నా అస్తిత్వాన్ని పొడుస్తున్నది!

ఆకాశంలో సగం…
అవకాశం నీ జగం…
ఇది నీ యుగం అని నువ్వంటుంటే …..
మరి నా అడుగుల్ని
బంధించిన ఈ సంకెళ్లను పట్టుకున్న చేతులెవరివి??!

సాధికారం సింహాసనం….
అంతరీక్షం నీ ప్రస్థానం
అని నువ్వు నన్ను ఆకాశానికి ఎత్తేస్తుంటే….
మరి నా ఉనికిని మింగేస్తున్న
ఈ అహం నీడ ఎవరిదని…??!

ప్రగతి ఉషోదయం….
విజయం నీ దాసోహం….
అని నువ్వు నన్నో గెలుపువెలుగుగా అభివర్ణిస్తుంటే…
మరి అబలత్వమని వెక్కిరిస్తున్న
ఈ నొసలు అసలెవరిదని…??!

ఆత్మకు రెక్కలు….
స్వాతంత్ర్యానికి మొలిచిన నీ హక్కులు
అని నువ్వు చప్పట్లు చరుస్తుంటే….
మరి నా స్వేచ్ఛను ఉరి తీస్తున్న
ఈ తలారి చూపుడువేళ్ళు ఎవరివని….??!

నువ్వు జవాబు ఇవ్వలేవని
తెలుసు….!
సమానత్వమన్నది నీకు
నీటి మీద రాతనీ తెలుసు….!

కానీ ఒకటే సందేహం…!
సహనాన్ని దిగంతాల ఆవలికి విసిరేసి…
మాతృత్వానికి కఠినత్వం పూసుకుని….
నా గర్భం నీ దేహాన్ని ఇంక
మోయలేనని తెగేసి చెబితే….
ఏ బొడ్డు తాడుకి నువ్వు వేళ్ళాడుతావు…?!
అసలు ఏ స్త్రీ బతుకు కాగితంపై
ఒక్క వివక్ష నెత్తుటి బిందువునైనా ఎలా చిందించగలవూ….?!

నువ్వు ఎంత బీజమైనా….
నేను శక్తి క్షేత్రాన్ని….!
గాయాలు దున్నాలని చూడకు!
పోరాట పలుగులు మొలకెత్తుతాయి!
అహం విత్తుల్ని నిలువునా చీలుస్తాయ్!
ఇందులో ఏం సందేహం లేదు!

                                                                                    -డి.నాగజ్యోతిశేఖర్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.