తెలుగు భాషా ప్రేమికుడు పారుపల్లి కోదండ రామయ్య (వ్యాసం )-వెంకట్ కట్టూరి

“దేశభాషలందుతెలుగు లెస్స” అంటూ మహా రాజులచే కీర్తించబడినా.ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా విదేశీయులచే పొగడ బడినా,తేనె కన్నా, పనసతొనలకన్నా,చెఱకుగడల తీపికన్నా మధురమైనది మనతెలుగు.అని వేనోళ్లా కొనియాడబడిన మన అమ్మనుడి. నేడు ఆంగ్లభాషా ప్రభావంతో కనుమరుగయ్యో స్థితిలో ఉంది.యూనిసెఫ్ వారు ఇచ్చిన ఒక నివేదికలో, త్వరలో మరణించే భాషలలో మన మాతృభాష పదోస్థానంలో ఉంది అని ప్రకటించారు.ఇది మనం గ్రహించాలి.

డా.వూటుకూరి వరప్రసాద్ తెలుగు పరిమళం కావ్యంలో అన్నట్లుగా…

“వేల ఏండ్ల నుండి  నదిలా ప్రవహిస్తున్న

జీవద్భాష జనం మధ్య ఇంకి పోతుందంటారా”…?

 అంటే అవుననే అంటున్నారు పారుపల్లి కోదండ రామయ్య గారు. వీరు నెలభై సంవత్సరాల పాటు విద్యుత్ శాఖ లో పని చేసి, పదవీ విరమణ చేసి తెలుగు భాషాభివృద్ధికై నిరంతర కృషి చేస్తున్నారు.

    మనదేశంలో ఉన్నటువంటి పెద్ద భాషల్లో, ఏ భాషకు లేని ప్రమాదం మన తెలుగు భాషకు మాత్రమే ఉందని. అటువంటి ఉపద్రవాన్ని మనమందరం ఎదుర్కొని మన *నుడిని* కాపాడు కోవడానికి ప్రజలంతా ఏకతాటిపై నిలవాలని పిలుపునిస్తున్నారు పారుపల్లి వారు. మన నుడితో పాటు,మన సంస్కృతి, సంప్రదాయం,విజ్ఞానం, కళలు, చరిత్ర అంతరించిపోయే దశలో ఉంది.దీనిని గుర్తించి ప్రజలు,ప్రభుత్వం,ప్రభుత్వాధినేతలు,అధికారులు, భాషావేత్తలు,విశ్వవిద్యాలయాలు,పరిశోధకులు,కవులు,కళాకారులు,రచయితలు నడుం బిగించి చేయి చేయి కలిపి *అమ్మనుడిని* కాపాడాలని పిలిపునిస్తున్నారు పారుపల్లివారు.ఎవరూ ముందుకు రాకపోతే రాబోయే రోజుల్లో భాషతోపాటు,మన జాతి కూడా అంతరించిపోతుందని హెచ్చరిస్తున్నారు పారుపల్లివారు.

   కన్నతల్లి వంటి మన మాతృభాషను మన తెలుగు వాళ్లే బ్రష్టు పట్టిస్తున్నారని,పరభాషా వ్యామోహం లో పడి, అమ్మనుడిని పాతాళంలోకి నెట్టేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు పారుపల్లివారు.ఇది ఎంతమాత్రం సహించలేని విషయం. భావి తరాలకు మంచిది కాదని చెబుతున్నారు. ఇక కోదండ రామయ్యగారు రాసిన ” *తెలుగే గొప్ప భాష”-కానీ కనుమరుగు అవుతుంది.* అంటూ తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి భాషోద్యమ, పుస్తక రచనతో తెలుగు భాష కనుమరుగు అవుతుందని, అమ్మనుడిని కాపాడుకోవడం ఎలాగో తమ పుస్తకంలో వివరించారు.వీరు తెలుగు నుడి గొప్పదనం చాలా చక్కగా వివరించారు ఈ చిరు పొత్తంలో.తెలుగులో ఉన్నన్ని పదాలు మరే ఇతర భాషల్లో లేవని పారుపల్లి వారు విశదపరిచారు.అచ్చమైన దేశి పదాలు,పల్లె పదాలు,పదజాలం చాలా మటుకు ఈ పొత్తంలో అగుపిస్తాయి.భాగాలు/అధ్యాయాలు అనే మాటకు సమానంగా “కణుపు”అనే తెలుగు పదాన్ని ఈ పుస్తకంలో మనం గ్రహించవచ్చు.ఇలాంటి ఎన్నో పదాలను ఏరికోరి ఈ గ్రంథంలో ఉపయోగించారు.

     పట్నం నుంచి పల్లెటూరు దాకా ఆంగ్లభాష మోజు లో పడి తమ పిల్లలకు అమ్మనుడి నేర్పించడం మానేశారు.అమ్మా…!అనే కమ్మనైన పలుకు బదులు మమ్మీ అనే పిలుపుకోసం నేడు తహ తహ లాడుతున్నారు మన ప్రజలు.ఆంగ్లం నేర్చుకుంటేనే బ్రతుకు లేకపోతే  బ్రతుకే లేదన్నట్లుగా తల్లిదండ్రుల మనసుల్లో ఈ ఆలోచన కొవ్వులా పేరుకు పోయింది. ఈ కొవ్వు కరిగించాలి.తెలుగు భాషా మతల్లిని వెలిగించాలి.మాతృభాషలోని తీయదనాన్నీ మన తెలుగువారికి రుచి చూపించాలి.పరభాషా వ్యామోహం ఇంతలా నాటుకు పోవడానికి కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా ఒక కారణం.మన నెత్తిమీద గుమ్మడికాయంత  ఆంగ్లమనే బండరాతిని పెట్టేస్తున్నారు. సరే ఇంగ్లీష్ నేర్చుకోవడం నేటి ఆధునిక కాలంలో మంచిదే.విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమే. *కానీ ఇన్నేళ్లలో మన తెలుగు నేల నుండి ఒక్క ఆంగ్ల రచయిత అయినా పుట్టుకొచ్చాడా ?లేదే?మరి ఎందుకు ఆంగ్లభాష అంటే అంత అభిమానం.* రిక్షా తొక్కే పుల్లర్ నుండి ఆడి కారు నడిపే బడా పెద్దమనుషుల వరకు తమ పిల్లలు ఆంగ్లం లోనే చదవాలి. అని వారి మెడలో బొండ వేస్తున్నారు.ఇది మంచిది కాదు,అందరూ ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలని పారుపల్లివారు ఈ పొత్తం ద్వారా చెబుతున్నారు.

    *అంతెందుకు సూపర్ కంప్యూటర్ కనిపెట్టిన చైనీయులకు ఆంగ్లం రాదు.* కానీ  వాళ్ళు వాళ్ళ మాతృభాషలో చదువుకొని గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తున్నారు.ఇది మన తెలుగువారు ఆలోచించాలి. మాతృభాషను మనకంటే తమిళ ప్రజలు బాగా ఆదరిస్తారు. వాళ్ళకి వాళ్ల వాళ్లు కలుసినప్పుడు తమిళంలోనే మాట్లాడుకోవడం మనం చూస్తూనే ఉంటాం.అలా మాట్లాడుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం.ఇతర భాషలను వాళ్ళ రాష్ట్రంలో కనబడకుండా చేస్తున్నారు.పూర్వం ఉమ్మడి మద్రాస్ లో 46%ఉన్న మన తెలుగువారిని 36%ఉన్న తమిళులు పూర్తిగా అణిచివేశారు.అదీ వాళ్లకు మాతృభాషమీద ఉన్న అభిమానం.ఇంకో విషయం ఏంటంటే ఒక తమిళ అబ్బాయి పరభాష అమ్మాయిని పెండ్లి చేసుకున్నా,తెలుగు అబ్బాయి తమిళ అమ్మాయిని వివాహం చేసుకున్నా ఆ రెండు కుటుంబాలలో తమిళమే నేర్పిస్తారు.వాళ్ళను చూసి మనం సిగ్గు పడాలి.మన తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.ఇది భాష మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చుతుంది.ఇంకా గొప్ప విషయం ఏమిటంటే తెలుగువాళ్లు తమ పూర్వీకుల పేర్లు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు.ఇదే పాశ్చాత్య దేశాల ప్రజలు బైబిల్ లోని పేర్లను పెట్టుకుంటున్నారు.ఇటువంటి విధానం మనం కూడా పాటించాలని,అప్పుడే భాష జీవిస్తుందని, రచయిత చెబుతున్నారు.

   పూర్వం పాటంటేనే తెలుగు అన్న దశ నుండి, తెలుగుపాట లేనే లేదు అనే దశకు మనం దిగజారి పోయామని చెబుతున్నారు.ఈతరం పిల్లలకి శతకమంటే తెలియదు.వేమన పద్యాలు,భతృహరి శతకం, నీతి శతక పద్యాలు తెలియవు.నన్నయ,వేమన, తిక్కన,ఆదిభట్ల అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఉంది.తమిళ పాటలు బాగుంటాయి.ఆంగ్లపాటలు బాగుంటాయి. హిందీ పాటలు ఇంకా బాగుంటాయి.అనే ఆలోచన మన తెలుగువాళ్ళ గుండెల్లో ముద్ర వేసేసుకున్నారని ఆవేదన చెందుతున్నారు పారుపల్లివారు.ఇక ఈ విషయంలో తమిళ ప్రజలు,కన్నడిగులు మాత్రం వారి మాతృభాషను బ్రతికించడం కోసం,ఇతర భాషల సినిమాలను,సీరియళ్లపై నిషేధాన్ని విధించారు.పరాయి భాషల టి.వి కార్యక్రమాలు చూడటం తలవంపులు అనుకుని వాటిని దూరంగా ఉంచుతున్నారు.వీళ్ళను చూసి మన తెలుగువారు సిగ్గుపడాలి.

   “ఇక తెలుగే గొప్ప”అని పారుపల్లివారు అంటున్నారు.ఎందుకు గొప్పో ఒకసారి చూద్దాం.మన నేల మీద సుమారు ఐదువేల ఆరువందల దాకా, భాషలుంటే అందులో ఐదు భాషలు మాత్రమే అజంతా భాషాలున్నాయని,వాటిలో *తెలుగు* ఒకటని రామయ్యగారు వివరించారు.మూడు నాలుగు వందల ఏండ్ల కింద మన దేశానికి వలస వచ్చిన పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్ వాళ్ళు మన తెలుగు వింటుంటే ఇటాలియన్ నుడి వింటునట్లుగా ఉందని,అందువల్ల మన తెలుగును “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”అని అన్నారు.తెలుగు తెలియని వాడి ముందు తెలుగు మాట్లాడుతున్నా,వాడికి వినడానికి ఇంపుగా ఉంటుంది మనతెలుగు.ఇదే *తెలుగు భాష* గొప్పదనం.

        మన తెలుగులో మాత్రమె శతకాలు ఉన్నాయి.శతకంలో వంద కంటే ఎక్కువ పద్యాలు వుంటాయి. ఒకే రకం పద్యాలై ఉండి,ఒకే మకుటాన్ని కలిగి వుంటాయి. సంస్కృత భాషలో ఈ విధంగా ఉండదు. మన తెలుగు శతక పద్యాల ద్వారా, పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.మనదైన నీతిని,తరువాతి తరానికి విజయవంతంగా చేరవేస్తాం.ఇంకా చెప్పాలంటే మన తెలుగులో ఉన్నన్ని భాషా ప్రక్రియలు మరే ఇతర భాషలలోను లేవని తెలియజేస్తున్నారు పారుపల్లివారు.ఇక్కడ ఒక విషయం చెప్పాలి 1966 లో ఎమ్.పి గా ఉన్న అన్నాదురై,పార్లమెంట్ లో మాట్లాడుతూ “తెలుగే దేశానికి సరిఅయిన అనుసంధాన భాష” అని చెప్పడాన్ని మనం గుర్తుకు చేసుకోవాలి.మన నేలపై ఉన్న ఇతర భాషల కన్నా, తెలుగు భాషే పాతది అని తమిళుడైన కాశీపాండ్యన్ మరియు సుబ్రహ్మణ్యం వంటి వారు ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.ప్రముఖ భాషా  శాస్త్రజ్ఞుడు సునీత్ కుమార్ చటర్జీ, తెలుగు మాత్రమే భారత దేశంలో పురాతనమైన భాష అని ఎప్పుడో చెప్పారని తెలియజేస్తున్నారు.క్రీ.పూ మూడువందల సంవత్సరాల నుండే తెలుగు ఉందని,మన తెలుగువారు ఈజిప్టు వారితో వర్తక వాణిజ్యం నెరపేవారని తెలుస్తుంది.మన తెలుగు నుడిలోనే చాలా పాతవైన రాతి శాసనాలు దొరికాయని,అందువల్ల తెలుగుభాషే పురాతన భాష అని తెలియజేస్తున్నాయి మన గ్రంథాలు. బుద్ధుని జాతక కథల్లో తెలుగు గురించిన ప్రస్తావన ఉంది.మన తెలుగు అజంత మాటలను కలిగి ఉండటమే కాదు. దాదాపు అన్ని హల్లుల చివరన అచ్చు ఉంటుంది. ముఖ్యంగా సంగీతానికి తెలుగే అనువైనది.మలయాళ,తమిళ,కన్నడ వారు ఎవరైనా సరే సంగీతం నేర్చుకున్న తర్వాత మొదటి కచేరిలో త్యాగరాజస్వామి తెలుగులో రాసిన *పంచారత్నాలు* పాడాలి అని కోరుకుంటారు.అలా పాడలేకపోతే ‘మరలా ఒక ఆరునెలల పాటు నేర్చుకొని రామ్మా…!అని చెప్పి గురువుగారు  వెళ్ళిపోతారు.ఇదే తెలుగు భాష గొప్పదనమని వివరించారు.ఆరువందల ఏండ్ల నుండి వాగ్గేయకారులు అన్నమయ్య, క్షేత్రయ్యల నుంచి సంగీతం అంటే తెలుగే.మరొక విషయం ఏమంటే మన తెలుగుభాష రాని,ద్రిమ్మరి కళాకారుడు కూడా తెలుగు పాటే పాడతాడు.ఎందుకు అని ప్రశ్నిస్తే “పాటంటే తెలుగుపాటే కదండీ”అని బాదులిస్తాడు.జానపద పాటలు పాడే సంచార జాతులవాళ్ళు పాడే పాటలన్నీ తెలుగులోనివే.అందుకే తెలుగు భాషే గొప్పది అని కోదండ రామయ్యగారు తెలియజేస్తున్నారు.

    మన తెలుగులో మాత్రమే పద్యాలున్నాయి.ఇంగ్లీషు, హిందీలో కూడా పద్యాలుంటాయి.కానీ ఆ నుడుల్లో పద్యాలు ఉండనే ఉండవని చెబుతున్నారు పారుపల్లివారు. మన తెలుగుకు కన్నడం దగ్గరగా ఉంటుంది. గణ విభజన, ప్రాసలే వుంటాయి కానీ యతి ఉండదు.సలక్షణంగా గణ విభజన, యతి,ప్రాసలతో తెలుగులో మాత్రమే పద్యాలుంటాయి. అందుకే తెలుగే గొప్ప.ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే అష్టావధాన ప్రక్రియ తెలుగుకే సొంతం.పద్యనాటకం,పద్య రాగాల సంప్రదాయం తెలుగు వారిదే.తెలుగులో మాత్రమే పద్యాలను,వాక్యాలను ఒకే హల్లుతో చప్పుడులో రాయగలరు. మన తెలుగు పద్యాల్లో వింతలు ఉన్నాయి. కొన్ని పద్యాలు వెనకనుండి ముందుకు చదివినా,ముందునుండి వెనుకకు చదివినా అంతే ఉండేటట్లు రాశారు మన కవులు.పూర్వం రాజుల కాలంలో రహస్య సందేశాలు పంపడానికి పద్యాలు ఉపయోగించే వారట.ప్రబంధ కవిత్వం, చిత్ర కవిత్వం, బంధ పద్యాల తీరులు చాలా ఉన్నాయి మన తెలుగులో.తెలుగు తల్లి మెడలో చతుర్వ్యర్ధి కావ్యాల దండలున్నాయి.ఒకే వాక్యాన్ని రెండు అర్ధాలు వచ్చేటట్లు రాయడమే ఇబ్బంది అనుకుంటే,ఒక కావ్యాన్ని మొత్తంగా అలా రాయడం ఎంత గొప్పదనమో చూడండి.ద్వర్థికావ్యం,త్యర్థికావ్యం,చతుర్వ్యర్ధి కావ్యాలు కూడా ఉన్నాయి.అందుకే తెలుగే గొప్ప భాష అని నొక్కివక్కాణించి చెబుతున్నారు రామయ్యగారు.

    ఇంకా మన తెలుగునుడి లో ఒక వాక్యానికి ఉన్నన్ని పదాలు మరే ఇతర భాషల్లో లేవు. *ఉదా*:స్త్రీ అనే ఒక పదానికి దాదాపుగా అరవై డబ్భై దాకా మారు మాటలున్నాయి. అదేవిధంగా కష్టం అనే మాటకు చాలా మారుమాటలు ఉన్నాయి.ఉదా:- ఇడుములు ,ఇక్కట్లు,పాట్లు,తిప్పలు,పీడ,జటిలం,కీడు,గండం,కడివి,చిక్కు,చేటు ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి మన నుడిలో.ఇదీ మన తెలుగు భాష గొప్పదనమని, అటువంటి మన తెలుగునుడి నిరాదరణకు గురౌతుందని తెలియజేస్తున్నారు పారుపల్లివారు.అమ్మ అనే కమ్మనైన మాట మన తెలుగు మాటే.ఆడవారికి మన తెలుగునుడి చాలా గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. *తెలుగులో ఎక్కువ మాటలు ఉండటానికి ఒక కారణం ఉందంటున్నారు పారుపల్లివారు.అదేమంటే తెలుగుభాష చాలా ఎక్కువ ప్రాంతంలో వ్యాపించి ఉంది.ఎప్పుడూ ఒకే రాజ్యంగా లేదు అందుకని వేరు వేరు ప్రాంతాలలో ఉన్నవారు ఒకే విషయాన్ని వేరు వేరు మాటలలో చెబుతారు.కాబట్టి మరే భాషలో ఉంటానికి వీలు లేనన్ని మాటలు తెలుగులో ఉన్నాయని అంటున్నారు రామయ్యగారు.* మన తెలుగు నుడి రాజులను గాని మతాలను గాని మోయలేదు.ఈ ప్రత్యేకతలు కొన్ని ఇతర భాషల్లో ఉండవచ్చు. కానీ ఇందులో సగం ప్రత్యేకతలనైనా, కలిగిన మరో భాషను మనం చూడలేము.అందుకే తెలుగే గొప్ప భాషని అంటున్నారు పారుపల్లివారు.

     ఈ పొత్తంలో చాలా దేశి పదాలు మన వాడుకలో లేని వాటిని సుమారుగా వంద నుండి నూట ఇరవై పదాల వరకు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ఉదా:కణుపు,తడవు,కత,సిబ్బులు,సింగిణి,కుత్తుకలు,దండాలు,కైమోడ్పులు,సంస్కురుతం,తిండి,ఊరేగి, మాపులు,బలేగుంది,అక్కరం,గేడివాడు,అరుగు,కల్ల,అడక,దవ్వు,తెల్లం,వయ్యలు, బాప్ప,నాళ్ళు,మంది,తెనుగులు,మిడకవచ్చు…ఇలా చాల దేశి పదాలు మనం చూడవచ్చు.

     మరొక ఆలోచింపజేసే విషయం ఏమిటంటే,మన అమ్మనుడి పై సంస్కృత భాషా ప్రభావం చాలా ఎక్కువ ఉందని,ఈ భాషపై మక్కువతో తెలుగు భాషను విస్మరిస్తున్నామని ఈ విషయం తెలుగు ప్రజలు గమనించాలని, మన హిందూ దేవాలయాల్లో మనకు తెలియని. సంస్కృత శ్లోకాలను మనకు వినిపించి తెలుగును చంపేస్తున్నారని అభిప్రాయం వెలిబుచ్చారు రచయిత. ఆయన ఏమంటారంటే *సంస్కృత భాష గొప్ప భాషే* కానీ మన తెలుగును మర్చి పోకూడదు. మన మాతృ భాషలోనే ప్రవచనాలు,మంత్రాలు,శ్లోకాలు చదివి వినిపించడం వల్ల  మన అమ్మనుడి నిలబడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే తమిళ ప్రజలు వారి భాషలోనే వేలుపులను కొలుస్తున్నారు.వారి భాషలోనే శ్లోకాలు,ప్రవచనాలు,పాటలు,మాటలు పుట్టించుకుంటున్నారు.కొత్త మాటలను వారి తమిళ కుదురు నుంచే పుట్టించుకుంటున్నారు. ఇది ప్రతి తెలుగువాడు గామనించాలి.అదేవిధంగా క్రైస్తవుల విషయానికి వస్తే, వాళ్ళుకూడా మాతృభాషలో బైబిల్ బోధించడం వల్ల,  వాళ్ళు ప్రజలను తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేస్తున్నారు.మన హిందువులు కూడా తెలుగులో ఉచ్చారణ చేయడం వల్ల భాష బ్రతుకుతుంది.తద్వారా తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయం వెలిబుచ్చారు పారుపల్లివారు.ఇక విద్య విషయానికి వస్తే ఏమాత్రమూ మన తెలుగు వాళ్ళకి ఉపయోగం లేనటువంటి సంస్కృత భాషను ఒక సబ్జెట్ గా పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు రచయిత. ఇక్కడ మనం  డా.వూటుకూరి వరప్రసాద్ గారు రాసిన తెలుగు పరిమళం అనే దీర్ఘకావ్యంలో సంస్కృత భాషను గూర్చి ఇలా అంటున్నారు.

   “ఈ నేలపై సుమించి ఫలించిన భాషా ఫలం

కార్పొరేట్ చదువుల ఏథేనులో

నిషిద్ధ ఫలంగా ముద్రవేసి

మృత శిశువుకు జోల పాట పాడేస్తారు.

ర్యాంకుల పంటలతో రాగాలు తీస్తున్నారు.”అంటూ వూటుకూరి వరప్రసాద్ గారు మనకు ఏమాత్రం ఉపయోగం లేని సంస్కృతభాషను,ర్యాంకుల కోసం మన పిల్లలపై రుద్దుతున్నారని చెప్పారు.ఇక్కడ మృత శిశువు అనే  వాక్యాన్ని సంస్కృత భాషను తెలియజేస్తుంది.ఈ నేలపై సుమించి ఫలించిన భాషా ఫలం అంటే మన అమ్మనుడి అని చెబుతున్నారు.మన తెలుగునుడి అజంతాలు కలిగి పనస తోనలకన్నా,పంచదార కన్నా,మధురమైన మన తెలుగుభాషను వదిలి 

కేవలం మార్కుల కోసమే సంస్కృత భాషను మన నెత్తిమీద రుద్దుతున్నారు.అని చెబుతున్నారు.ఇది పెద్దలు,విద్యావేత్తలు ఆలోచించాలి. తెలుగులో చదివితే ఉద్యోగాలు రావనే అపోహ, మన ప్రజల్లో బాగా నాటుకుపోయేలా చేశారు.కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతలు.తెలుగు చదివితే ఉద్యోగాలు వస్తాయని,అవి ఎలా వస్తాయో ప్రజలకు విడమరిచి చెప్పేవారే లేరు.ఇటువంటి విషయాలు అందరూ గ్రహించాలని చెబుతున్నాడు రామయ్యగారు.ఇక మన అమ్మనుడి నుండే కొత్తమాటలను తెలుగు కుదురు నుండి మాట నుండి పదాలు పుట్టించుకోవాలి.తేట తెలుగు నుంచి పుట్టిన మాటలే పిల్లకు గుర్తుంటాయి.కొత్త పలుకులు పుట్టించడానికి, అందరికీ దారి చూపుతాయి.ఇప్పటికైనా ప్రజలంతా కళ్ళుతెరచి మన అమ్మనుడి ఔన్నత్యాన్ని గుర్తించి, తెలుగుభాషను  బ్రతికించాలని మన నుడి నేర్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని రచయిత చెబుతున్నారు.ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలంటున్నారు రచయిత. అదేమంటే ఆంగ్లేయులు అధికారంలో ఉండగా తెలుగును తక్కువగా చూడలేదు.బడుల్లో కూడా తెలుగు భాష నేర్పారు.చాలా ఎక్కువ మంది వివిధ ప్రాంతాల్లో మాట్లాడే భాష తెలుగు అని గుర్తించారు.ఆంగ్లేయులు తెలుగుభాషకు గొప్ప సేవ చేశారు.వారిలో ఎ. డి కాంబెల్,మెకంజీ,బెంజిమిన్ షుల్జీ,సి.పి బ్రౌన్ వంటి వారు ముఖ్యులు.తరువాతి కాలంలో ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయిన తరువాత మనం వారి ఆంగ్లంపై చాలా ఎక్కువ మోజు పెంచుకున్నాము.మనం తెలుగు నేర్చుకోకూడదు.కానీ ఒక్క ఆంగ్లం నేర్చుకుంటే చాలు అని అనుకున్నాము.ఇది మన దౌర్భాగ్యం.మనం సిగ్గుపడాలి.అంతర్జాతీయంగా విద్యాబోధన చేసేవారు అందరూ ఒక ఏకగ్రీవంగా ఒకవిషయాన్ని విభేదాలు లేకుండా నిశ్చయంగా తేల్చేశారు. అదేమంటే అమ్మ నుడి లో చదువుకున్న వాళ్లే చివరకు రాణిస్తారు. వారికే ఇతర భాషలు సరిగా వస్తాయని,భాషేతర విషయాల్లో ,శాస్త్రాల్లో వారే రాణిస్తారని చెప్పారు.ఇది మన తెలుగు వారందరూ ఒకసారి ఆలోచించండని రచయిత చెబుతున్నారు.

   ఇక కొన్ని సూచనలు సలహాలు చేశారు పారుపల్లివారు. ఒకసారి చూద్దాం…

1.మన ఊళ్ళో ఒక్కరో ఇద్దరో తెలుగు బాషాప్రేమికులు ఉంటే ఇంకొంత మందిని పొగుచేసి తెలుగు తల్లికి సేవ చేయడానికి ముందుకు వచ్చేటట్లు ఒప్పించి వారందరిని ఒక తెలుగు దండుగా ఏర్పరిచి అమ్మనుడి ని కాపాడటానికి తమవంతు కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పంటున్నారు.

2.ప్రభుత్వ పరిపాలన అంతా తెలుగులో ఉండేటట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

3.అన్ని పేరు పలకలలో తెలుగు ప్రముఖంగా ఉండాలని,ఇలా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చి తెలుగునుడిని కాపాడాలని కోరుతున్నారు.

4.తెలుగు భాషోద్యములోకి కొత్తవారిని చేర్చే పని నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి.

5.విశ్వవిద్యాలయాలు,కళాశాలల అధికారులను కలవాలి.

6.పత్రికల్లో మన వ్యాసాలు క్రమం తప్పకుండా వచ్చేలా చూడాలి.

7.రాజకీయ నాయకులను,ప్రతిపక్ష నాయకులను తప్పక కలవాలి.అందరి సహకారం తెలుగు భాషకోసం తీసుకోవాలి.

8.పత్రికాధిపతులకు పత్రికల్లో తెలుగు భాషోద్యమ వార్తలు,వ్యాసాలకు ప్రాముఖ్యత నివ్వాలని చెప్పాలి.

9.షోషల్ మీడియాలో తెలుగు భాష గురించి విరివిగా ప్రచారం చేయాలి.

10.కవులు,కళాకారులు,రచయితలు,భాషావేత్తలు,విద్యావేత్తలు, అధికారులు తెలుగు భాషను బ్రతికించం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని తెలియజీయాలి.

11.మన పిల్లలకు తెలుగుఆటలు,పాటలు,కళలు నేర్పాలి.మన కార్యక్రమాలలో అవి కనబడాలి.

12.అదేవిధంగా ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి వరకూ, తెలుగు తప్పని సరిగా నేర్పేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.అప్పుడే అమ్మనుడి బ్రతుకుతుందని అంటున్నారు పారుపల్లి వారు.

     ఇకనైనా మనందరం తెలుగు భాషను బ్రతికించడానికి చేయి చేయి కలుపుదాం.లేకపోతే మన అమ్మనుడి అంతరించి పోయే ప్రమాదం ఉంది.పారుపల్లి కోదండ రామయ్యగారు రాసిన తెలుగే గొప్ప భాష-కానీ కనుమరుగు అవుతుందనే ఈ చిరు పొత్తం ద్వారా మన తెలుగు ప్రజలకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు.ప్రభుత్వ అధినేతలు,అధికారులు,భాషా వేత్తలు,భాషాప్రియులు,విద్యార్థులు,తెలుగుప్రజలందరూ అమ్మనుడిని కాపాడటానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.

  తెలుగు ప్రజలంతా ఏకతాటిపై  వస్తే మన తెలుగుభాష దేదీప్యమానంగా, వెలుగొందుతుంది.ఇక ఈ పుస్తకం చదువుతున్నంతసేపు మనం ఏం కోల్పోతున్నామో,తెలుస్తుంది.తెలుగు ప్రజలంతా ఉద్యమబాట పట్టి మాతృభాషను బ్రతికించడానికి కార్యాచరణ రూపొందించుకోవాలని,యుద్ధ ప్రాతిపదికన మన నుడిని బ్రతికించడానికి ఎవరికి వారే ముందుకు రావాలని తెలుస్తుంది.ఒక యుద్దానికి సన్నద్ధమయ్యో సైనికుడిలా,కదనరంగంలో వీరవిహారం చేసే యుద్ధ వీరుడిలా,మన తెలుగు భాషకోసం పాటుపడాలని బోధపడుతుంది.అలా జరిగిన రోజు మన తెలుగు వెలుగుతుంది…గతకాలపు తెలుగు భాషా వైభవాన్ని మనం కళ్లారా చూద్దాం…భావితరాలకు మన అమ్మనుడిని అందిద్దాం…

        -వెంకటేశ్వర రావు కట్టూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Comments are closed.