గమ్యం(కవిత )-గిరి ప్రసాద్ చెలమల్లు 

ఆమె
కనబడట్లే
ఆమెకి సుస్తీ చేసిందట

రోజూ 
నా కళ్ల ముందు 
తచ్చాడే ఆమె
నడవలేక అవస్థపడుతుంటే
ఆమె ని వెలయాలిని 
చేయాలని చూస్తున్న తండ్రి

ఆమె  
గతుకుల రోడ్లపై పయనించి అలసిసొలసి
నిద్రకమ్ముకొస్తుంటే 
రేయి నా ఊరిపొలిమేరలో
సేదతీరి 
నాకు ఉదయాన్నే 
దిక్సూచినౌతుండే 

ఆమె వస్తుంటే
ఏదో తెలియని ఆనంద పరవశం
ఎన్నో ఏళ్ళ బంధం ఆమె తో నాకు 
ఆమె చుట్టూ మూగే గోధూళి 
తెలతెలవారుతుండగా
ఆమె తెరిచే హృదయ ద్వారాలు
ఏమీ ఆశించక 
ఆమెతో నా పయనం 
నా గమ్యమే ఆమె గమ్యం

ఇప్పుడేమో 
ఆమెకివ్వాల్సిన మందివ్వక
కాగితాలపోరులో
ఆమె ని ఆమె ఆస్తులని
ఆమె తండ్రియే చెరబట్టాలని
రోజుకో పన్నాగం పడుతుంటే

ఆమె కోర్టు మెట్లపై 
న్యాయం కోసం 
వీధుల్లో పోరుతో 
ఆమెకండగా నేను 
నిలబడకపోతే 
ఆమె నాకు చేసిన సేవలకు అర్ధమే లేదేమో?!

ఆమె యే 
కొంగు నడుముకి చుట్టి
కొడవలి చేత పట్టిన ఎర్రబస్సు 
నేనేమో  ఆమెతో ఎనభై ఏడేళ్ళ  
సాంగత్యం గల ప్రియుడిని 
గౌలిగూడా ప్లాట్ ఫామ్ మీద 
ఆమెకోసం పిడికిలి బిగిస్తూ

                                                                    – గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink

Comments are closed.