కూలీల  హక్కులను కాల రాసిన ‘పల్లకి ’ -కొలిపాక అరుణ

             

ISSN – 2278-478                         

కావ్యేషు నాటకం రమ్యం. సాహిత్య ప్రక్రియల్లో ‘నాటకం’ అత్యంత శక్తిమంతమైన సాధనం. ప్రజా హృదయాన్ని సూటిగా స్పందింపజేసే శక్తి ఒక్క నాటకానికే ఉంది. భారతీయ నాటక చరిత్ర చాలా ప్రాచీనమైంది. తెలుగు  నాటకం మాత్రం ఆధునిక యుగానికి చెందింది. తెలుగు  నాటక రంగానికి మహోజ్వలమైన చరిత్ర ఉంది. మనుషుల  హావ భావ విన్యాసాల్ని, సంభాషణల  సంబంధాన్ని కలగలుపుతున్న ప్రముఖ సాహితీ ప్రక్రియ నాటకం. ఎందరో నాటక కర్తలు  తమ నాటక రచన ద్వారా తెలుగు  నాటక సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. కాలానుగుణంగా సామాజిక పరిస్ధితులకు అనుగుణంగా అనేక నాటకాలు  వచ్చాయి.

19వ శతాబ్ధి ఉత్తరార్ధంలో ఒక ప్రత్యేక ప్రక్రియగా సమగ్ర రూపు రేఖలు  దిద్దుకొన్న నాటకాలు  ప్రజాజీవన స్రవంతిలో కసిపోయి అంతర్భాగమై ప్రజలకు వినోద, విజ్ఞాన, వికాసాలను కలిగింపజేసాయి. 1880 నుండి నేటి వరకు ఆరంభ, వికాస, స్వర్ణ, సంధి, పోటీ యుగాలను  దాటుకొని 1970 నుండి సమకాలీన యుగం ఉన్నటువంటి ఈ నాటక రంగ దశలో సమకాలీన యుగంలో వచ్చిన నాటకాలలోని సాంఘిక నాటకాలు  ప్రఖ్యాతి చెందినవి.                           

సమకాలీన సంఘవ్యవస్ధను జీవిత సత్యాన్ని విభిన్న మానవ ప్రవృత్తుల్ని ప్రకటిస్తుంది నాటకం. సాంఘిక నాటకానికి శక్తినిస్తుంది జీవన సంఘర్షణ, ప్రేక్షకులకు సమస్య యొక్క అవగాహన కల్పించే నాటకం సాంఘిక నాటకం. 

సాంఘిక నాటకాల్లోని ఇతివృత్తం నూటికి నూరుపాళ్ళు కచ్చితమై ఉంటుంది. ఈ నాటకాలలో సమాజంలోని అనేక సమస్యలు  ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా విద్యార్ధుల  సమస్యలు , నిరుద్యోగ సమస్యలు , వరకట్న సమస్యలు , స్త్రీ సమస్యలు , అధికారుల  అవినీతి సమస్యలు , విడాకుల  సమస్యలు , హరిజన సమస్యలు , అంటరానితనం సమస్యలు , వితంతువుల  సమస్యలు , కార్మిక సమస్యలు , స్త్రీ స్వాతంత్య్ర సమస్యలు , భూ సమస్యలు , డబ్బు సమస్యలు , మద్యపాన సమస్యలు , కుటుంబ సమస్యలు , దళిత సమస్యలు , ఇలా ఎన్నో ముఖ్యమైన సమస్యల్ని తీసుకొని తెలుగులో నాటకాల్ని ఎందరో రాశారు.

 ప్రస్తుత నాటకం ‘పల్లకి  రచయిత బి.ఆర్‌.రంగారెడ్డిగారు. జన్మస్ధలం  కడప జిల్లాలో కోసినేపల్లె అనే మారుమూల గ్రామం . చిన్నతనం నుంచీ సాహిత్య కళారంగాల మీద ఆసక్తి ఉండేది . నటుడిగా తన రచనల్లోనే కాక మరెన్నో మంచి నాటకాల్లో సంఘర్షణ ఉన్న క్షిష్టమైన పాత్రలలో నటించి ఉత్తమ నటుడిగా బహుమతులందుకున్నారు . సామాజిక ప్రయోజనం లేనిదే కవిత్వం , కళ నిష్ప్రయోజనం అన్నది ఈ రచయిత లక్ష్యం . ఆ దిశగానే వీరు కలం కదిలించారు .

కష్టించి పని చేసే కూలీల హక్కులను కాలరాసి కుబేరుడు కావాలని తపించిపోయాడు  జన్నాధం . కూలీలు ఎదిరించలేరనే ధైర్యంతో వారి జీవితాలను శాసించాలని ప్రయత్నించాడు . కానీ కూలీల ఐకమత్యంతో వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోతే బ్రతుకు భయంకరంగా మారిపోతుందనే సత్యాన్ని ఆవిష్కరించిన నాటకం ‘పల్లకి ‘.

ఈ నాటకంలో పాత్రలు విక్రం , సీత , జగనాధం , అవతారం , రాఘవ , గౌరీ , నాగరాజు , తిరిపాలు మొదలయినవారు . ‘పల్లకి ‘ అనేది భౌతిక రూపమయితే అంతర్లీనంగా ఈ పల్లకీని మోసిన బోయీలు వీరంతా .

సీతా , విక్రం లు భార్యాభర్తలు , దరిద్రం తాండవిస్తున్న ఇల్లు వారిది . దారిద్రవ్యంతో విసిగో వేసారిన విక్రం ఎలా అయినా , ఎలాంటి అడ్డ దారిలో అయినా దానం సంపాదించి కోటీశ్వరుడు కావాలని నిర్ణయించుకుంటాడు . “పాపం కానీ , నరకం కానీ మరేమైనా కానీ డబ్బు సంపాదించి పంచభక్ష్య పరమాన్నాలు తింటాను “ అంటాడు . ఆత్మీయత , అనురాగాలకు తిలోదకాలోదిలి అన్నిటికీ డబ్బు అతీతమైనదని విర్రవీగాడు .

అతడి ఆశయం డబ్బు సంపాదించటం . దాని కోసం కొన్ని సంవత్సరాలను హత్యా చేశాడు . ఎంతో కాలాన్ని పాతి పెట్టాడు . హత్యలు , దొంగతనాలు చేసాడు . చివరికి అడ్డు వచ్చిన భార్యను కూడా చంపి జగన్నాధంగా అవతారమెత్తాడు . జగన్నాధ పురానికి మకుటంలేని మహారాజు అయ్యాడు .

ఈ జగన్నాధపురం చుట్టూ కొండలు , లోయలూ ….అక్కడి కొండల్లాగే అతని ఐశ్వర్యం ….అక్కడ లోయల్లాగే అక్కడ పనిచేస్తున్న ఎందరో మనుష్యులు నిరాశ నిస్పృహలు ….ఆ నిరాశ నిస్పృహలే జగన్నాధం ఊపిరి . ఆ ఊపిరే అతడికానందం …అతడు కూర్చున్నది పల్లకి . అదో బంగారు పల్లకి ! దాన్ని మోస్తున్న బోయిల భుజాలు పగిలి నిరంతరం సీవిస్తున్న రక్తంతో ఎరుపెక్కిన ఎర్రటి పల్లకి …ఆ పల్లకినెక్కి ఆనందిస్తున్నాడు జగన్నాధం .

కూలీల హక్కులను కాలరాసి , వారి జీవితాలను శాస్తున్న జగన్నాధం కొడుకు రాఘవ . అందరూ సమానమే అన్న భావన కలిగినవాడు కావడంతో తండ్రిని నిలదీస్తాడు . ప్రపంచాన్ని చీకటి చేసి తానొక్కడే వెలుగులో ఉండాలనుకునే జగన్నాధం దగ్గరికి కూలీలు వచ్చి “ తాము పోద్దస్తమాను కష్టించి పని చేసే కూలీలమని ప్రభువులనే నమ్ముకున్న వారమని , తమకు గొడ్లకు పెట్టె ఆహారం కాకుండా మనుషులు తినే మంచి ఆహారం పెట్టించండి మహాప్రభో “ అని ప్రాధేయపడతాడు . వారిని చూచి రాఘవ చలించిపోతాడు . కానీ జగన్నాధానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా ఉండదు .

రాఘవ తండ్రితో ……”బంగారు పంజరంలో బ్రతకటం కష్టం . కార్మికులతో కలిసి జీవించడంలో ఆనందం ఉంటుంది “ అంటూ వారితో కలిసి జీవించడానికి నిర్ణయించుకుంటాడు .  ఇక్కడ రాఘవ కార్మిక పక్షపాతిగా కనిపిస్తాడు. కష్టించి పనిచేసే కూలీలను నిత్యం బాధపెట్టే జగనాథం అతని కుక్క అజీర్తి వ్యాథితో చనిపోతే దాని వర్ధంతి మాత్రం వేలకు మలు  ఖర్చు పెట్టి చేస్తాడు. ఇది అతని కర్కశత్వానికి, కూలీల  పట్ల అలసత్వానికి నిదర్శనం. 

ఒకరోజు తిరిపాలు  అనే కూలీ జగన్నాథం దగ్గరకు వచ్చి ‘‘నా బిడ్డ గౌరీని నా చెల్లలు  కొడుకు నాగరాజుకు ఇచ్చి పెళ్ళి చేద్దామనుకుంటున్నాము మీరు వచ్చి అక్షింతలు  వేయండి బాబుగారు’’ అంటూ అడుగుతాడు. అప్పుడు జగన్నాథం వత్తాసుదారు ‘‘నీకసలు  బుద్దుందా? మా పర్మిషన్‌ లేకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు  తీసేసుకోవడమేనా? జగన్నాధపురంలో మనిషి పుట్టాలంటే మాతో చెప్పి పుట్టాలి. చావాలంటే మా పర్మిషన్‌ తీసుకోవాలి. ఇంతెందుకు… ఊపిరి తియ్యాంటే తీయాలి.. వదులు  అంటే వదలాలి’’ అంటాడు. వాళ్ళు నియంతల్లా ప్రవర్తించారనడానికి ఇది నిదర్శనం.                                                

జగన్నాథం గౌరిని సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు తిరుపాలు  ఇలా అంటాడు ‘‘యజమానికీ, కూలివాడికి ఉండే సంబంధం ఇచ్చే జీతానికి ` చేసే సేవకి గానీ చితికిపోయిన జీవితాలకీ సంసారాలకీ కాదు బాబు..’’ అన్నప్పుడు వారి జీతంపైనే  కానీ, జీవితాల పై యజమానులకు హక్కు లేదని మొదటి సారిగా ఎదురు తిరిగిన కార్మికుడు కనిపిస్తాడు.   ప్రజాస్వామ్య యుగంలో

                                                  అధికారపు హజంలో

                                                  అనురాగానికి నోచని పేదలు

                                                  అణగి మణగి హతమారిన సమిధలు  

                                                  ఈనాటి జరుగుతున్న నిజం!

                                                  ఏనాటికి తీరుతుంది దౌర్జన్యపు హజం?

                                                  దౌర్జన్యపు హజం…. దౌర్జన్యపు హజం?                                        

అంటూ విలపిస్తారు కూలీలు . జగన్నాథం ఎస్టేట్లు చూసే గుమాస్తాలు  గోతికాడ నక్కల్లా అతని సింహాసనం కోసం కాచుకుని కూర్చుంటారు. 

చివరికి కూలీలు  అంతా జగన్నాథం ఆగడాలు  భరించలేక, పస్తులతో కాలం  గడపలేక, అతనికి ఎదురు తిరగలేక అందరూ కసికట్టుగా వేరే ఊరికి ఒక్కసారిగా వలస వెళ్ళిపోతారు. కొడుకు రాఘవ కూడా కూలీకే మద్దతు తెలపడంతో ఫ్యాక్టరీలు , కర్మాగారాలు  మూతపడ్డాయి.                                                  

చివరిగా కూలీలు  ‘‘నువ్వు లక్షలు  గుమ్మరించినా నీకు దాసోహం అనే తొత్తులేడు. జగన్నాథపురంలో యింకేం లేదు నువ్వు నీ పాపం తప్ప . ఇంతకాలం  మేము ఏ తిండి కోసం అలమటించామో అదే తిండి కోసం నువ్వు తపించిపోవాలి. ఈ ఎడారిలో నీకెవ్వరూ లేరు. నువ్వు  గుండెలు  అలసిపోయేలా అరచినా నీగోడు వినే నాథుడే ఉండడు, నశించిపోతున్న నీ శరీరాన్ని చూసుకుంటూ ప్రతీ నిమిషం కుమిలి కుమిలి చావాలి. నీలాంటి వాళ్ళ బ్రతకులకు నీ జీవితమే ఒక గుణపాతం కావాలి “ అంటూ అందరూ వెళ్ళిపోతారు .

నేటి సమాజంలో స్వార్ధంతో , కారుడు కట్టిన హృదయాలతో కూలీల రక్తాన్ని పీల్చే జగన్నాధాలెందరో , ఎందరెందరో ఉన్నారు . రక్తంతో తడిసిన బోయిల భుజం పై పల్లకి నెక్కి ఊరేగుతున్న అయ్యలు ఎందరో ఉన్నారు . కూలీల హక్కులను , జీవించే హక్కును కాలరాసి కుబెరులై విర్రవీగుతున్న వారెందరో ఉన్నారు .  ఇదెంతో అమానుషమైన చర్య . కూలీలు తమ హక్కులను తాము తెలుసుకున్న నాడు , వారంతా ఐక్యమత్యంతో ఉన్ననాడు ఇలాంటి జగన్నాధాలకు కనువిప్పు కలుగుతుంది . వారందరికీ ఈ పల్లకి నాటకం ఒక హెచ్చరికగా మిగులుతుంది .

 పల్లకి నెక్కిన ప్రభువుల్లారా !

అందలమెక్కిన అయ్యల్లారా !

ధనస్వామ్యానికి దాసుల్లారా!

స్వార్ధం నిండిన సాముల్లారా !

హెచ్చరిక ! హెచ్చరిక ! హెచ్చరిక !

–కొలిపాక అరుణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.