సామ్యవాది ,తత్వజ్ఞాని ,బ్రిటిష్ మలోళోద్యమ నాయకురాలు అనీ బీసెంట్ (వ్యాసం )- గబ్బిటదుర్గాప్రసాద్

బాల్యం లోనే భావజాల వికాసం :

1847అక్టోబర్ 1 లండన్ లోని కస్లాం లో జన్మించిన మధ్యతరగతి ఐరిష్ జాతి మహిళ అనీ బీసెంట్ .తల్లి ధార్మిక స్వభావం ,తండ్రి విలియం ఫేజ్ విద్వత్తు వారసత్వంగా పొందింది . .బిర్క్ టెక్ లిటరరీ అండ్ సైంటిఫిక్ ఇన్ స్టి ట్యూట్ లో చదువు ప్రారంభించి౦ది . ఆమె అయిదవ ఏట తండ్రి మరణి౦చే నాటికి కుటుంబ౦ చేతిలో పెన్నీ కూడా లేని నిర్భాగ్య స్థితి లో ఉంది ..కుటుంబ బాధ్యతతల్లి తీసుకొని హారో స్కూల్ లో బాలుర బోర్డింగ్ హౌస్ నిర్వహించి కుటుంబాన్ని పోషించింది .స్కూల్ లో బెసెంట్ చేబట్టిన మత రాజకీయ కార్యకలాపాలు రేపిన అలజడికారణంగా ఆమె పరీక్షా ఫలితాలు నిలిపేశారు .చాలీ చాలని ఆదాయం తో కూతురును సాకలేక, స్నేహితురాలు ఎల్లెన్ మేరియట్ కు అప్పగించింది .ఆమె పెంపకం లో స్వయం వ్యక్తిత్వం ,కర్తవ్య దీక్ష, స్వాతంత్ర పిపాస విద్యా పేక్ష ,సమాజం పట్లబాధ్యత ఏర్పరచుకొన్నది .యవ్వనం లోనే నిర్భయంగా యూరప్ అంతా పర్యటించింది .అప్పుడే రోమన్ కేథలిక్ మతం పై ఆసక్తికలిగి జీవితమంతా పాటించింది .

విరుద్ధ భావాల వ్యక్తి తో వివాహం:

1867లో 19వ ఏట తల్లి కోరిక మేరకు ఫాదర్ ఫ్రాంక్ బీసెంట్ ను వివాహమాడి , అనీ బీసెంట్ అయింది .ఇద్దరుపిల్లలు కలిగాక అయన మత భావనలు ,భూస్వామ్య భావనలు , ఈమె సామ్యవాదం ఫేబియన్ సోషలిజం భావాల మధ్య ఘర్షణ జరిగి ,కేథలిక్ నాయకుడు బివార్ పూసే సలహాతో భర్తతో రాజీకి ప్రయత్నించినా ,విఫలం అవటంతో దంపతులు వేరయ్యారు .కూతురుతో ఆమె లండన్ చేరింది .

సేవాతత్పరత –కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహం:

1874లో లండన్ లోని నేషనల్ సెక్యూలర్ సొసైటి లో చేరి ,మహా వక్తగా పేరుపొంది ,’’లా అండ్ రిపబ్లిక్ లీగ్ ‘’స్థాపించి పోలీసు అత్యాచారాలకు గురైన కుటుంబాలకు సేవలు చేసింది .చార్లెస్ బ్రాడ్ లా అనే స్నేహితునితోకలిసి చార్లెస్ నోల్టన్ రాసిన ‘’బర్త్ కంట్రోల్’’ పుస్తకప్రచురణలో విచారణ ఎదుర్కొని శిక్ష పడగా ,ఇద్దరిపేర్లు బాగా ప్రచారమై ,1880లో బ్రాడ్ లా నార్త్ ఆమ్ టన్ నుంచి పార్లమెంట్ మెంబర్ గా ఎన్నికవటానికి తోడ్పడింది .

ప్రజాస్వామ్య పరిరక్షణ ,చర్చి మత దురంహార వ్యతిరేకత:

తర్వాత బీసెంట్ ‘’బ్లడీ సండే’’,ప్రదర్శన ,లండన్ వేశ్యల స్ట్రైక్ వంటి యూనియన్ కార్యకలాపాలలో 1888 కాలమంతా నిమగ్నమై ,ఫెబియన్ సొసైటీ ,మార్క్సిస్ట్ సోషల్ డెమోక్రాటిక్ ఫెడరేషన్ లతరఫున ప్రచారం చేస్తూ మహోన్నత వక్తగా గుర్తింపు పొంది౦ది .’’టవర్ హేమ్లెట్ ‘’కు వోటుఅర్హత కొద్దిమంది మహిళలకు మాత్రమే ఉన్నా ‘’లండన్ స్కూల్ బోర్డ్ ‘’కు ఎన్నికై, సత్తా చాటింది.ఇంగ్లాండ్ చర్చిల మత దురహంకారాన్ని తీవ్రంగా విమర్శించింది .

దివ్యజ్ఞాన సమాజ సేవ –అధ్యక్ష బాధ్యత:

1880 లో ‘’మేడం హెలెనా బ్లావ్ ట్స్కి’’ ని కలుసుకోవటం లో బీసెంట్ జీవితం మలుపుతిరిగి,ఆమె దృష్టి సామ్యవాదం నుంచి దివ్యజ్ఞానం వైపుకు మళ్ళింది .దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలై ,ప్రచార బాధ్యత తీసుకొని వక్తృత్వం తో విశేషంగా ఆకర్షిస్తూ,1898లో భారత దేశం వచ్చి,’’సెంట్రల్ హిందూ స్కూల్ ‘’,హైదరాబాద్ (సింధ్ )కోలీజియేట్ బోర్డ్ లను బొంబాయి లో స్థాపనకు సహకరించింది. 1902లో బీసెంట్ ‘’కో ఫ్రీమం సొరి లీడ్రాయిట్ హ్యూమన్ ‘’సంస్థను లండన్ లో స్థాపించింది .కొద్దికాలం లోనే బ్రిటిష్ సామ్రాజ్యం అంతటా ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేసింది .1907కు మద్రాస్ లోని అడయార్ అంతర్జాతీయ కేంద్రంగా ఉన్న దివ్యజ్ఞాన సమాజానికి అంటే థియోసాఫికల్ సొసైటీకి ప్రెసిడెంట్ అయింది అనీ బీసెంట్ .

జిడ్డు కృష్ణమూర్తి వ్యవహారం:

1909లో లెడ్ బీటర్ 14ఏళ్ళ జిడ్డు కృష్ణమూర్తిని ‘’వరల్డ్ టీచర్ ‘’గా ప్రచారం చేయగా ,అతని భవిష్యత్తు దెబ్బతింటుందని బీసెంట్ అతని తల్లిదండ్రుల అనుమతితో ఆతని లీగల్ గార్డియన్ అవగా ,కొన్ని రోజుల్లోనే తండ్రి ప్లేటు ఫిరాయించి బీసెంట్ పై కేసుపెట్టాడు .తల్లిని కోల్పోయిన జిడ్డుకు పెంపుడు తల్లిగా ,వారిద్దరిమధ్య ఉన్న తల్లీ కొడుకుల అనుబంధం దెబ్బతిన్నది .20ఏళ్ళ తర్వాత కృష్ణమూర్తి వరల్డ్ టీచర్ ప్రాజెక్ట్ వదిలేసి ‘’ఆర్డర్ ఆఫ్ దిస్టార్ ఇన్ ది ఈస్ట్ ‘’వైపుకుఆకర్షింపబడి దివ్యజ్ఞాన సమాజం వదిలేసి ,ఆత్మ జ్ఞానం పొంది ‘’జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ –ఇండియా ‘’స్థాపించి తనదైన శైలిలో ఆధ్యాత్మిక జ్ఞాన బోధ చేశాడు .

భారత స్వాతంత్రోద్యమమం లో ప్రముఖ పాత్ర –బాయ్స్ స్కౌట్ ఏర్పాటు:

‘’మే యూనియన్ ‘’స్థాపించి కార్మిక హక్కులకై పోరాడింది బీసెంట్ .1898 జులై 7న బెనారస్ లో ఒక చిన్న ఇంట్లో తానుకలలుకన్న విద్యా సౌధాన్ని ప్రారంభించి దానినే’’ అలహాబాద్ విశ్వ విద్యాలయం’’గా పేర్కొన్నది .1895లో బాల గంగాధర తిలక్ ఇచ్చిన ‘’స్వయం పాలన ‘’(హోమ్ రూల్ )పిలుపును అందుకొని ,1914లో కార్య రూపం లో తెచ్చేందుకు ప్రజలను సమాయత్త పరచింది బీసెంట్ సతీమణి .దీనికోసం ‘’కామన్ వెల్త్’’అనే వారపత్రిక నడిపింది .1915లో ‘’హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడం ‘’పుస్తకం రాసి భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని చిత్రీకరించింది .

ఇప్పటిదాకా పరోక్ష రాజకీయాలలో ఉన్న ఆమె , ప్రత్యక్షరాజకీయాలలో పాల్గొని అఖిలభారత కాంగ్రెస్ సభ్యురాలై,1914మొదటి ప్రపంచయుద్ధ ప్రారంభ సమయం లో తన నేతృత్వం లోని ‘’హోమ్ రూల్ లీగ్ ‘’ఆధ్వర్యం లో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి పూర్తిగా సహకరించిన బ్రిటిష్ వనిత అనీ బీసెంట్ .1917 అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షురాలైనది .యుద్ధం తర్వాత ఆమె స్వాతంత్ర్య పోరాటానికి ,దివ్యజ్ఞాన సమాజ సేవకు జీవితమంతా అంకితం చేసింది .ఎన్నో రకాల ప్రతిపాదనలతో’’ భారత జాతీయ విద్యా ప్రణాళిక’’ రూపొందించింది .’’న్యు ఇండియా ‘’దినపత్రిక స్థాపించి, నడిపింది .ఆమె ఆలోచనాఫలిత౦గానే ‘’ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోసియేషన్ ‘’ఏర్పడింది .

పురస్కారాలు:

1921లో కాశీ విశ్వవిద్యాలయం బీసెంట్ కు ‘’డాక్టర్ ఆఫ్ లెటర్స్ ‘’ఇచ్చి సత్కరించింది .80ఏళ్ళ వయసులోనూ బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్ కు ,చికాగో ప్రపంచ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన శేముషి ఆమెది .

గ్రంథ రచన:

అనీ బీసెంట్ ‘’ది పొలిటికల్ స్టేటస్ ఆఫ్ వుమన్ ,క్రిస్టియానిటి ఇట్స్ ఎవిడెన్సెస్ అండ్ ఆరిజిన్ ,ది లా ఆఫ్ పాప్యులేషన్ ,మై పాత్ టుఎథీజం,మారేజేస్ యాజ్ ఇట్ వజ్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ యాజ్ ఇట్ షుడ్ బి,వై ఐ యాం ఎ సోషలిస్ట్,కర్మ ,ది ఏన్షేంట్ విజ్డం, ధాట్ ఫారంస్ విత్ లెడ్ బీటర్ ,ఎలిమెంటరి లెసన్స్ ఆన్ కర్మ, థాట్ కాన్షస్ ,యాన్ ఇంట్రడక్షన్ టు యోగా న్యూఇండియా వంటి ,54పుస్తకాలు రాసింది .భారతీయ సంస్కృతీ సాహిత్యాలపై గొప్ప అవగాహన ఉన్న మహిళ.వేదోపనిషత్తులపై సాధికారంగా మాట్లాడే ప్రజ్ఞ ఆమెది .ఆమె ప్రసంగం దివ్య గంగాప్రవాహమే .

దివ్యలోక పయనం:

1933 సెప్టెంబర్ 20న విశ్వ జననిగా భావింపబడిన దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షురాలు అనీ బీసెంటమ్మ,86వ ఏట మరణించి , దివ్యలోకం చేరి ,దివ్యతారగా వెలుగులీనుతోంది .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

వ్యాసాలుPermalink

Comments are closed.