జ్ఞాపకం-42 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

”ఛ ఛ. మాటలు జారకు జయంత్! తను ఇక్కడ లేదు కదాని తనని చీప్ చేసి మాట్లాడుతున్నావ్! అసలు నీ వాలకం చూస్తుంటే తను బాగా చదువుతుందని, ఎలాగైనా డైవర్ట్ చెయ్యాలని నువ్వు తనని ప్రేమించినట్లు నటించి వుంటావనిపిస్తోంది. పిచ్చిది అదంతా నిజమని నమ్మినట్లుంది” అంది.
జయంత్ ఉడుక్కున్నట్లు చూసాడు “నటించాల్సిన అవసరం నాకేంటి? నాలుగు మాటలు మంచిగా మాట్లాడగానే దాన్ని ప్రేమనుకుందేమో నాకేం తెలుసు! ఒకటికి నాలుగుసార్లు తన వైపు చూడగానే ఇంకేదో అనుకుందేమో దానికి నేనేం చెయ్యాలి?” అన్నాడు.

“ఆగాగు జయంత్ మరి నువ్వు తనకి ‘ఐ లవ్ యు’ అని రాసిన స్లిప్ ని చాక్లెట్లో పెట్టి ఇవ్వలేదా?” అడిగింది హస్విత.

జయంత్ నవ్వుతూ “అది నేనివ్వలేదు. దిలీప్ ఇచ్చాడు” అన్నాడు.
అది వినగానే నోటిమాట పడిపోయినదానిలా దిలీప్ వైపు చూసింది. వెంటనే తేరుకుంటూ

“అదిచ్చింది నువ్వా…? సంలేఖను ప్రేమిస్తున్నది నువ్వా?” అంది.
దిలీప్ ఉలిక్కిపడి “నీకేమైనా తిక్కా! నేనెందుకు ప్రేమిస్తాను? నాకేం పన్లేదా?” అన్నాడు.

జయంత్ చురుగ్గా కదిలి “మరి నాకేనా పని లేనిది? నేను ప్రేమిస్తున్నానని నువ్వెలా అనుకున్నావ్? నా మనసులోకేమైనా తొంగి చూశావా? ఇదిగో హస్వితా! ఈ తప్పంతా దిలీప్ వల్లనే జరిగింది. నాకు నిర్ణయం తీసుకోవటం రాదట, వ్యక్తీకరించడం రాదట. అందుకే నా వంతు తనే ఓ చీటీ రాసి పెట్టాడు చాక్లెట్లో. ఇది తర్వాత దిలీపే నాతో చెప్పాడు. నువ్వు నమ్మట్లేదు కదూ! అసలేం జరిగిందో చెబుతాను విను.

సంలేఖ ఒకరోజు ఇదే చాక్లెట్ విషయం మెన్షన్ చేస్తూ నేను కాలేజీకి తెచ్చుకున్న డైరీలో నా పట్ల తనకెలాంటి ఫీల్ వుందో రాసింది. అప్పుడు దాన్ని నేను దిలీప్ కి చూపించాను. అప్పుడు చెప్పాడు దిలీప్ చాక్లెట్లో స్లిప్ పెట్టింది తనే అని. నేను ఆశ్చర్యపోతుంటే దిలీప్ ఏమన్నాడో తెలుసా! ‘నువ్వు సంలేఖను ప్రేమిస్తున్నావని అనుకున్నానురా! హెల్ప్ చేద్దామనుకున్నాను ‘అన్నాడు. అనుకుంటే సరిపోదని అప్పుడే చెప్పాను. నువ్విక్కడే వుండు ఆ డైరీ తెచ్చి నీకూ చూపిస్తాను” అంటూ గబ గబ తన హాస్టల్ గదిలోకి వెళ్లి డైరీ తెచ్చాడు జయంత్.

ఆ డైరీని చూడగానే పామును చూసినట్లు బెదిరి “ఇతరుల డైరీని చదవటం నాకిష్టం వుండదు ప్లీజ్! దాన్ని నీ దగ్గరే వుండనీయ్!” అంది హస్విత.

“ఇది నువ్వు చూడకపోతే నువ్వు నా వైపు నుండి ఎలా ఆలోచించగలుగుతావు హస్వితా? నేను నీకు, దిలీప్ కు దోషిలా అగుపిస్తాను. నా పర్మిషన్ తోనేగా నిన్ను నా డైరీ చూడమనేది. చూడు పర్వాలేదు” అంటూ డైరీ హస్విత చేతికిచ్చాడు జయంత్.

హస్విత ఆ డైరీలో ఓ పేజీని తిప్పగానే సంలేఖ అక్షరాలు కన్పించాయి. దిగ్బ్రాంతిగా అక్కడే ఆగి చదవటం మొదలు పెట్టింది. అది డైరీ కాదు సంలేఖ మనసు.

“జయంత్! ఇన్ని రోజులు నువ్వూ, దిలీప్ ఒకేలా అన్పించారు నాకు. కానీ మా బెంచ్ మేట్ పుట్టినరోజు నుండి మాత్రం నువ్వొక ప్రత్యేకమైన వ్యక్తిలా, నా ఒక్క దానికి మాత్రమే పరిమితమైన వ్యక్తిలా అన్పిస్తున్నావు. అంతేకాదు. ‘అతను ప్రేమించడం సరే! నేను అతన్ని ప్రేమిస్తున్నానా లేదా ?’ అని నన్ను నేను అనేక సార్లు ప్రశ్నించుకున్నాను. నువ్వు నమ్ముతావో లేదో నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను జయంత్! ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే నువ్వు గుర్తొస్తేనే నా మనసంతా ఒక విధమైన భావోన్మత్తత ఆవరిస్తోంది. నువ్వు ఎదురైన ప్రతిసారి నన్ను గమనించావో లేదో. అంతవరకు నీ రూపాన్ని రహస్యంగా దాచుకున్న నా కనుకొలకులు అందంగా నవ్వుతుంటాయి. కానీ నీ మనసు నాపై వుందని తెలిసిన క్షణం నుండి ఎందుకో నీ ముందు ధైర్యంగా నిలబడలేకపోతున్నాను. నీ కళ్లలోకి సూటిగా చూడలేక పోతున్నాను. సిగ్గుపడి పోతున్నాను. కదిలిపోతున్నాను. సంచలించిపోతున్నాను. ఎవరు పలకరించినా ఏదో మాట్లాడుతున్నాను. నిద్రపోతున్నానో, మేల్కొన్నానో ఆ సృహే వుండటం లేదు.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.