జ్ఞాపకం-40 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

“నీకలా అన్పించవచ్చు కానీ మనం గొప్పగా భావించే హియాలయ పర్వతాలకి, మహాత్మాగాంధీకి, మదర్ థెరిసాకి ఆల్టర్నేటివ్ లేనట్లే నా మనసులో వున్న జయంత్ కి కూడా లేదు. అతని రూపం నా మనసు లోతుల్లో అంత బలంగా స్ర్టక్కయి పోయింది. ఇక అది ఎప్పటికీ అంతే. అలాగే వుంటుంది”
“పిచ్చిదానా స్ర్టక్కయి పోయింది జయంత్ కాదు. నీ కెరీర్. అసలు నీలాగా ఎవరైనా ఆలోచిస్తారానే. నువ్వొక ర్యాంకర్ వి. విధ్యార్ధులకి స్పూర్తిగా నిలవాల్సిన దానివి. కాలేజీ ప్రాస్పెక్టస్ లో నీ ఫోటోతో పాటు నెంబర్ ఒన్ ర్యాంకర్ గా ముద్రించబడాల్సిన దానివి. ఇప్పటి నుండే హై స్కోర్ సాధించి మంచి మంచి కంపెనీలలో ఆఫర్స్ సంపాయించుకోగల శక్తిగల దానివి. ఇలా నీలో వున్న సామర్థ్యాన్ని చంపుకుంటూ జయంత్ ని ర్యాంకర్ గా నిలబెట్టడమే ధ్యేయంగా, ధ్యాసగా వుండటం నాన్సెన్స్ లా లేదూ?”

“నీకెలా చెప్పాలే హస్వీ! అది అతని కోరికే. అతను నా కాబోయే భర్త తెలుసా?” అంది సంలేఖ.
హస్విత ముందు షాక్ తిన్నది. ఆ తర్వాత తేరుకుని వెంటనే చేతిలో చెయ్యేసి కొట్టుకుంటూ “అలా అని ఫ్రూఫ్ చూపించవే” అంది.

సంలేఖ అందంగా నవ్వి “ఫ్రూఫ్ కావాలా నీకు? సరే చెబుతాను విను. మొన్న మన బెంచి మేట్ పుట్టిన రోజు జరిగినప్పుడు నువ్వు రాలేదు కదూ! నేను వెళ్లాను. జయంత్ వచ్చాడు. జయంత్ తో కలిసి దిలీప్ కూడా వచ్చాడు. అది మన ఫ్రెండ్సందరికి చాక్లెట్స్ పంచుతూ మిగతావి జయంత్ ను పంచమంది, అప్పుడు జయంత్ నాకిచ్చిన చాక్లెట్ లోపల ‘ఐలవ్ యు’ అని రాసి పెట్టిన స్లిప్ వుంది. దాన్ని ఏమనాలి? ప్రేమ అనరా? మనసునంటే వదిలెయ్. నా కళ్లను కూడా నేను నమ్మవద్దా? అది చూసి ముందు నేను ఆశ్చర్యపోయాను.

ఆ తర్వాత ఆనందంతో పిచ్చిచూపులు చూశాను. నిజం చెప్పాలంటే ఆరోజు నేను, నా పిచ్చి చూపులు మామూలు స్థితికి రావటానికి కొంత టైం తీసుకోవలసి వచ్చింది. ఎందుకంటే జయంత్ మనిషి బాగుంటాడు. తెలివైన వాడు. వాళ్ల నాన్న గారు కూడా అదేదో క్లాత్ మిల్లులో సెక్రెటరీగా వున్నాడు. పరిపూర్ణమైన ఆర్థిక భద్రత వుంది. ఇది మా ఇంట్లో చెప్పినా అంగీకరిస్తారు. ఇంత కన్నా ఒక అమ్మాయికి ఏం కావాలి చెప్పు? ఆ రోజునుండి మేమిద్దరం ఒకరితో ఒకరం మా అభిప్రాయాలను పంచుకుంటున్నాం. ఇంతెందుకు నేను కష్టపడి ప్రిపేర్ చేసుకునే నోట్స్ మొత్తం నా దగ్గర కన్నా అతని దగ్గరే ఎక్కువగా వుంటోంది. ఇది నువ్వు గమనిస్తున్నావో లేదో!” అంది.

హస్విత ఒక రకంగా ముఖం పెట్టి నీరసంగా చూసి “అందరూ అన్నీ గమనించలేరు. అలాంటి వాళ్లలో నేనొక దాన్ని ” అంది.

వెంటనే చురుగ్గా చూస్తూ “కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న ఆలోచనలు గాని, పడుతున్న ఆనందంగాని ఒక నార్మల్ అమ్మాయి స్థాయిలోనే వున్నాయి. ఇది నేరం” అంది.

”నేరం అని నేను అనుకోవాలి. నువ్వనుకుంటే సరిపోతుందా? ఏ అమ్మాయిలో అయినా మనసనేది తన పని తను చేసుకుపోతూనే వుంటుంది. దాన్నెవరు ఆపగలరు? అసలు ఆపాలని ఎందుకనిపిస్తుంది? నాకయితే అలా ఏం అన్పించటం లేదు” అంది.

హస్విత బరువుగా నిట్టూర్చి ”నేను చెప్పేది వినే స్థితిలో నువ్వు లేవు. పోనీ నేను వెళ్ళి జయంత్ ని అడిగిరానా ?” అంది.

సంలేఖ వులిక్కిపడింది “ఏమని అడుగుతావే ! ఏదో ఫ్రెండ్ వని నీతో చెప్పాను. ఇప్పుడు నువ్వెళ్లి ఇవన్నీ జయంత్ ని అడిగేస్తావానే?” అంది.

“అడుగుతాను. తప్పేంటి? నా కళ్ల ముందే నువ్విలా స్టడీని నిర్లక్ష్యం చేస్తుంటే చూస్తూ వూరుకోటానికి నేను నీ శత్రువును కాను. స్నేహితురాలిని. అయినా నాతో అన్నీ చెప్పుకునే దానివి. నేను అడిగేంతవరకు దీన్నెందుకు షేర్ చేసుకోలేదు? ఏ విషయంలో నైనా నా సలహాలు తీసుకునేదానివి. ఇప్పుడు నేనేం చెప్పినా ఎందుకు వినడం లేదు? సరే! ఇంతవరకు నీ వైపు నుండి అన్నీ విన్నాను. ఓ.కే. జయంత్ ఏమంటాడో కూడా వినాలి కదా!” అంటూ గబగబ ఫ్రెషప్పయి ఎంత చెప్పినా వినకుండా బయటకెళ్లింది హస్విత.

– అంగులూరి అంజనీదేవి

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.