సాంస్కృతిక ప్రతీకగా వినాయక చవితి-(వ్యాసం )- నక్క హరిక్రిష్ణ

భారతదేశం అనాది నుండి విభిన్న ఆచారాల సమాహారం. ప్రకృతిని ఆరోగ్యాన్ని మానవున్నీ అనుసందించేలా అవలంబించే  పండగల  ప్రతీ కృతి ఎప్పటికప్పుడు కాలంతోపాటుగా నవీకరించుకుంటుంది. జరుపుకునే పండుగలు అన్నీ ప్రకృతితో  పెనవేసుకొని ఉండడమే భారతీయుల సాంస్కృతిక పునాది. శాంతి సహనం మానవత్వపు సువాసనలతో జోడించబడి ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందింది. బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు, చాలా మంది విదేశీయులు సైతం భారత భూమిని వారి మాతృభూమి అంతగా ఆదరించడానికి. అంతటి విశిష్టత కలిగినది ఈ దేశ సంస్కృతి.

పండుగలు ఉత్సవాలు కేవలం ఒక వ్యక్తికి కాకుండా అందరికీ బాగా అనిపిస్తాయి. అందుకే మహాకవి కాళిదాసు ‘ ఉత్సవ ప్రియః ఖలు మనుష్యాః ‘ అని అన్నాడు. ఉత్సవం నందు భావ వైభవం కనిపిస్తుంది.

భారతీయుల ఆచారాలన్నీ ప్రతీకాత్మకమైనవి. ప్రతీకల ద్వారా బుద్ధి వికాసం జరుగుతుంది. మనిషి ప్రవర్తనా సరళిని ఇవి క్రమబద్ధీకరిస్థాయి. సమ్యక్ దృష్టిని కలిగిస్తాయి. ఒక జాతి సాంస్కృతిక చరిత్ర పుస్తకాలలో కంటే ఆ జాతి పండుగలలో ఉత్సవాలలోనే  అధికంగా నిక్షిప్తమై ఉంటుంది.

భారతీయులందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే ప్రకృతి పూజ విధానాలలో ఒకటి  వినాయక చవితి. తొమ్మిది రోజుల ఈ ఉత్సవాన్ని భారత స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా భారతీయుల సమిష్టితత్వం కోసం, సంఘటితత్వం కోసం బాలగంగాధర తిలక్ గారు వ్యక్తి గత    పూజను  సమిష్టి ఆరాధనగా మలిచారు.  ఏ ఫలితాన్ని ఆశించి దీనిని జన హృదయాలలో నిలిపారో  అంతటి ఫలితాన్ని కూడా నాటి భారతీయ సమాజం పొందింది. అప్పటి నుండి ఇది ఒక సామాజిక ఉత్సవంగా రూపాంతరం చెందింది.

కాలం మారింది. నాటి నుండి నేటి వరకు సమాజంలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆధునికత ప్రతి విషయంలోనూ, పనిలోనూ, ఆచారంలోనూ కనిపిస్తుంది. మార్పులు అవసరాలు, నాగరికతను సంస్కృతిని ప్రభావిత పరుస్తాయి. అలాగే ఇన్ని దశాబ్దాలుగా వస్తున్న గణపతి ఉత్సవాలు సైతం దీనికి అతీతం కాలేదు.

మానవుని అంతః సౌందర్యం గురించి నిగూఢంగా తెలిపే పండుగ వినాయక చవితి. ఆషాడ శ్రావణ  మాసాల తర్వాత  పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొనే పండుగ. గణపతి అంటే సమూహం యొక్క నాయకుడు. యోగ్యమైన మార్గాన్ని చూపించే తత్వవేత్తగా నాయకుడు ఉండాలని ఈ నవరాత్రులు సూచిస్తాయి. పండుగలు ఉత్సవాలు ఐక్యతను సాధించేవి. ప్రేమను పోషిస్తాయి. మన సంస్కృతి ఆనందంతో బుద్ధి మథనం చేస్తుంది.

గతంలో వినాయక చవితి ఉత్సవాలు పర్యావరణానికి అత్యంత మేలు చేసేవిగా ఉండేవి. మట్టితో తయారు చేసిన గణనాథుని విగ్రహాలను పూజ కోసం ఉపయోగించేవారు. వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ నీటి కాలుష్యాన్ని తగ్గించే వనమూలికలతో జరుపుకోవడం ఆనవాయితీ.

అయితే పరిస్థితులు మారాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినియోగం విగ్రహాల తయారీ ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. ఫలితంగా నీటిని శుద్ధి చేసే ఉత్సవం కాస్త కాలుష్యానికి ఒక కారకం అయింది. మద్యపాన ప్రవేశం కొంతమేరకు జరిగింది. మార్పుకు ఎపుడూ సిద్ధంగా ఉండే భారతీయలు జరిగిన  విపరిమాణానికి త్వరగానే స్పందించి మేలుకుంటున్నారు. పర్యావరణ హితమే కాంక్షగా సకల జనులు పురా పద్ధతికి మారి మట్టి గణపయ్యలను కొలుచుకుంటున్నారు. ఒక్కొక్కరుగా అవగాహన పెంచుకొని, నిజమైన సమూహ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. పండగ అసలైన ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నారు. ప్రకృతి పట్ల బాధ్యతను గుర్తేరుగుతున్నారు. గత కొంతకాలంగా ఈ పండుగ జరుపుకునే చాలామంది మట్టి విగ్రహాల కొనుగోలుకు ఆసక్తి చూపడం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ మధ్య కాలంలో ఇంతగా స్పందించిన విషయం ఇదేనంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మార్పు నూటికి నూరు శాతం కావాల్సి ఉంది.  వివిధ రకాల పండ్లతో తయారు చేసిన విగ్రహాన్ని , విత్తనాలు నిండిన గణపతి వంటి ఇతర పర్యావరణానికి మేలు చేసే మూర్తులను పూజకు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఏర్పాటు చేసుకునే మండపాల అలంకరణలో కూడా మార్పులు వచ్చాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని వీలయినంత తక్కువగా వాడడం, బట్టలని ఎక్కువగా ఉపయోగించడం, పూలు, కాగితాలను వాడటం వంటివి జరుగుతున్నాయి. ఇది మనకు ఒక అత్యంత శుభ పరిణామం. ఈ సారి అత్యధిక మండపాల అలంకరణ పర్యావరణ హిత వస్తువులతో చేశారు.  ఆకులలో ప్రసాద వితరణను చేస్తున్నారు. ఈ స్థితి రావడానికి పర్యావరణ ప్రేమికుల వివిధ స్వచ్ఛంద సంస్థల నిస్వార్థ కృషి ఉంది.

వినాయక చవితి మరోరకంగా ఉపాధి కారకం. వివిధ వర్గాలలో ఇది ఉపాధిని కల్పించి వినిమయ స్థబ్ధతను తొలగిస్తుంది. దేశం మొత్తం వేల కోట్ల వ్యాపారం సాగుతుంది. ఈ పరిణామం ఆర్థిక భరోసా ఇస్తుంది. శ్రమ సంస్కృతిని ప్రోత్సహిస్తుంది.

ఇరుగు పొరుగు ముఖాలు తెలియని, తెలుసుకోలేని ఈ కాలానికి ఇటువంటి పండుగల అవసరం చాలా ఉన్నది. అనేక వాడలలో పిల్లలు , మహిళలు , పెద్దలు అరమరికలు లేకుండా కలిసిపోయే చక్కని అవకాశం కల్పిస్తుంది. కేంద్రక కుటుంబాలు ఏర్పడుతున్న ఈ దశలో ఈ విధమైనటువంటి ఉత్సవాలు మనుషుల మధ్య వారధిని నిర్మించి కలయికలకు రూపాన్నిస్తుంది. కొన్ని ప్రాంతాలలో ఈ పండుగ మత సామరస్యానికి చక్కని వేదిక అయ్యింది. మొహర్రం పండుగను హిందువులు కూడా జరుపుకుంటున్నట్లే ఈ నవరాత్రులలో ముస్లింలు కూడా పాల్గొంటూ ఆనందిస్తున్నారు. పరస్పర స్నేహభావాన్ని పెంపొందించుకుంటున్నారు. ఈ రకమైనటువంటి జీవన విధానం దేశ సమగ్రతను పదిలపరుస్తుంది. దేశ నైతిక వర్తనానికి అద్దం పడుతుంది. ఈ పద్ధతే భారతీయ ఆత్మ. సమిష్టి సహకారంతో లోక కళ్యాణ కారకంగా సాగే ఈ వినాయక చవితి లోక కళ్యాణ స్ఫూర్తికి అచ్చమైన ఉదాహరణ.

– నక్క హరిక్రిష్ణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Comments are closed.