రజిత చూపు -కశ్మీర్ అమ్మలకు కన్నీటి ఓదార్పు – రజిత కొమ్ము

” కశ్మీర్ స్త్రీలు వస్తువులు కారు.ఆనాడు జూదం లో ద్రౌపదిని ఒడ్డినట్టు యుద్ధంలో ఒడ్డడానికి.కశ్మీరీ అమ్మాయిలు రక్తం, మాంసం ,వ్యక్తిత్వం ఉన్న మనుషులు.వాళ్ళ అందం గురించి పెళ్ళిళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నా.”
—రితుపర్ణ ఘోష్.

“నేను..అనేక దొంతరల దుస్తుల మీద వేసుకున్న హిజబ్..గొంతు నొప్పి పుట్టేలా బిగుతుగా తలమీదుగా చుట్టిన స్కార్ఫ్..దాని మడతలను పిన్ను తో బంధిస్తుంటే అనుకోకుండా మెడమీద చర్మానికి గుచ్చి చిమ్మిన చిన్ని రెండు చుక్కల రక్తం…ముక్కు నోరు కట్టేసుకుని , కళ్ళు మాత్రమే కనబడేలా ముఖాన్ని కప్పేసిన’ నోస్ పీస్’ సాక్సులూ..అరచేతుల కూ గ్లవ్స్. శరీరం లోని అణువణువూ కప్పుకునే సంచరిస్తున్నా…నా రంగూ.. నా శరీరభాగాల పైనే మీ దృష్టి.ఇన్నిపొరల దుస్తులున్నా నేను వీధిలో నగ్నమవుతాను.సిగ్గుతో భయంతో నాలుగడుగులూ వేయలేని నా అశక్తత కు కారణం ఎవరు.ఈ నేల మీద పుట్టడమే నేను చేసిన పాపమా?? “— నబ్జా( అత్యాచార బాధితురాలు).

ఎన్ని ప్రశ్నలు..జవాబులు లేనివి..ఉన్నా ఎవరూ వినదలచుకోనివి.370 ఆర్టికల్ రద్దు తర్వాత ప్రతీ భారతీయ యువకుడి స్వప్నం కాశ్మీర్ లో ఒక ప్లాటూ ,కశ్మీరీ యువతి తో పెళ్ళి అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిస్సిగ్గుగా స్టేట్మెంట్ ఇవ్వడం దౌర్భాగ్య0.తర్వాత కనీసం ఎవరూ దానిని ఖండించి తప్పు అనలేదు.యాక్టివిస్ట్ మిహిర సూద్ దీనిని ” this objectification of women should be condemned ” అన్నారు.
ఇలాంటి నీతిమాలిన స్త్రీల గౌరవానికి భంగం కలిగించే మాటలు మనకు కొత్త కాదు.కానీ దశాబ్దాలుగా హింస తో ,నెత్తురోడుతున్న ఒక భూభాగం పై జాలిపడాల్సింది పోయి హేళన చేయడం అమానుషం.
“ఇకనుంచి మా జీవితాలు ఇంకా దారుణం గా మారుతాయి..మా ఇళ్ళ చుట్టూ వీధుల చుట్టూ వేల సంఖ్యలో ఉన్న మిలిటరీ..ఈ ముళ్ల కంచెలూ మా బ్రతుకును శాసిస్తాయి”..నుస్రత్ అమిన్ .
అక్కడి ప్రజల నోళ్లు నొక్కి వారి ఆగ్రహాన్ని కూడా సానుకూల స్పందనగా మాయ చేసింది మీడియా.
షాలబాగ్ ప్రాంతంలో దూరాన ఉన్న పల్లె నుండి పుట్టగొడుగులు తెచ్చి అమ్ముకునే వందల స్త్రీలు చెమర్చిన కళ్ళతో ,
” ఇది అన్యాయం మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వరా “అని ప్రశ్నిస్తున్నారు.

రాజస్థాన్ రైఫిల్స్ 68 బ్రిగేడ్…కుప్వారా లో చేసిన సామూహిక అత్యాచారాలు కశ్మీర్ మొత్తానికి తీవ్ర గాయాల్ని, భయంకరమైన అనుభవాల్ని మిగిల్చాయి.స్త్రీలూ పిల్లలూ పురుషులూ ఇంకా కోలుకోలేదు.తమ కళ్ళముందే పసి నెత్తురు పారడం..కూతుళ్ళ రోదనలూ..కొడుకులూ భర్తలు కొనఊపిరితో చూసిన చూపులూ ఇంకా వాళ్ళను వెంటాడుతున్నాయి.

“మా శరీరాలు మీ రణ క్షేత్రాలు కావు” అని నినదిస్తూ శోకం తో తల్లడిల్లుతున్న ఆ స్త్రీల దుఃఖం మాటలకందనిది.ఎన్ని గ్రంధాలు వ్రాసినా వారి వెతలను పూర్తిగా రికార్డ్ చేయలేము.

కశ్మీర్ లో ఒక్కో ప్రాంతంలో సుమారుగా 1000 నుండి 1500 ల మంది విడోస్ ( తెలుగు పదం వాడలేను) ఉన్నారు. ఆ స్త్రీలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య మానసిక వ్యాధులు..డిప్రెషన్.

ఆరిఫ్ మగ్రిబి ఖాన్ అక్కడి ఎన్జీఓ లో పనిచేస్తున్న సైక్రియాటిస్ట్ స్త్రీల మానసిక స్థితి పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.” Post traumatic stress disorder ” నుండి ఇక్కడి స్త్రీలు బయటపడలేకపోతున్నారు.ప్రతీ నిత్యం హింస ..బుల్లెట్ల బాంబుల చప్పుళ్ళూ… ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న భయం వాళ్ళ స్థితికి కారణం.

నెలల తరబడి నిద్రలేక.. నిద్రపోక..
కన్నీళ్ళు రాక.. ప్రాణాలు తీసుకుంటున్న యువతీ యువకుల గురించి, స్త్రీల గురించి మనకు తెలుసా..

బజిలియా ఐజాజ్ అనే ఎన్జీవో చీఫ్ పేదరికం..పోషకాహార లోపం.. శారీరక గాయాలకు ఇన్ఫెక్షన్లు నిద్రలో ఉలిక్కిపడడం..నరాలు చిట్లడం.. విపరీతమైన నిర్లిప్తత నుండి ఈ స్త్రీలు ఇప్పట్లో కోలుకునే అవకాశం కనిపించడం లేదు అని అంటారు..(voices inside unknown)

మనం మతం కానివారని, మన నేలని లాక్కుంటారని, ఇంకో జెండా ఏదో ఎగరేస్తారని వాళ్లకేదో మనకు దక్కని సౌఖ్యాలు దక్కుతున్నాయని ఏళ్లుగా పెంచుకున్న ద్వేషం, అక్కసు తో మొన్న భారతీయ పటానికి కాషాయ తలపాగా చుట్టి అహాన్ని తృప్తి పరచుకున్నాం.

ఫక్తు వ్యాపార పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసం చేసిన పనికి కనీస సహానుభూతి , ఓదార్పు ఇవ్వకపోగా నిర్లక్ష్యంగా ఆడకూతుళ్ళ గురించి మాట్లాడుతున్నారు.తిరిగి వీళ్ళే ‘ బేటీ పడావో..బేటీ బచావో ‘ అంటారు.

కశ్మీర్ స్త్రీలనూ బేటీ లు గానే చూసే ఔన్నత్యం వచ్చే వరకూ వారి స్థితిగతుల్లో మార్పు రాదు..

కశ్మీర్ అమ్మలకు కన్నీటి ఓదార్పు.

                                                                                                                                     — రజిత కొమ్ము.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Comments are closed.