ఆమె కథ (కవిత )-నవ

నేను నగ్నంగా నడవాలనుకుంటున్నాను
నన్ను కౌగిలించుకోలేని నా
నీడను కూడా నువ్వు శృంగారించగలవు

నా నుండి నీకు కావాల్సిన సుఖం
ఎలా అయినా పొందగలవు
కానీ అది నీకోసం అయితే
రావట్లేదు

నన్ను తడుముతున్నప్పుడు నాకు ఎంత
హాయిగా ఉందో తెలుసా
బ్రహ్మాజెముడు, నాగజెముడు
మొక్కలు నీ ఎడారి చేతులపై
మొలిచాయి అనుకుంటా

నువ్వు నీ ఊపిరిని, నీ శక్తిని
బలవంతంగా నాలోకి తోస్తుంటావు
నీ స్వేచ్చతో నా స్వచ్ఛతను చంపేస్తుంటావు

బాహ్యంగా నీ వేళ్లు నన్ను చేతబడి చేస్తుంటాయి
అంతరంగా కూడా నీ వేళ్లు ప్రయోగాలు చేస్తుంటాయి

నేను ఇప్పుడు నగ్నత్వాన్ని
కప్పుకున్న పుల్లల గూడుని

నేను నగ్నంగానే తిరుగుతాను
ఎప్పుడైతే మీ తల్లి కళ్లలో నేను
కనిపిస్తానో అప్పటివరకు

ఎంతమంది నన్ను వ్యామోహిస్తారో
వ్యామోహించండి

-నవ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink

Comments are closed.