బిగిసిన పిడికిలి (కవిత )- డి.నాగజ్యోతిశేఖర్.

“పోటెత్తిన నెత్తుటి కణాలు
బొట్లు బొట్లుగా చిట్లతుంటే
పగిలిన హృదయకుహరం వేదన శకలమైంది!

నివురుగప్పిన నిందల నిప్పులు
కుప్పలు కుప్పలుగా రాలుతుంటే
దహనమైన ఆత్మత్వచం చమురుకంపు కొడుతుంది!

ఉప్పెనైన కన్నీటి సంద్రాలు
క్యూసెక్కులు క్యూసెక్కులుగా నిండుతుంటే
భారమైన హృదయం రెప్పలు తెగి ఒంటరైంది!

అలసిన ఊపిరి పూలు
శ్రమల తీగలకు వేలాడుతుంటే
కొంచెం కొంచెంగా పోతున్న ఆశల ప్రాణం కొట్టుకులాడింది!

ఈ క్షణం!
దాగని రోదనల్లో తలదాచుకొని లింగవివక్ష అంచుల్లో నా వ్యక్తిత్వం
మాటరాని వ్యధా శిలై
అస్థిత్వపు పెదవంచున
చిగురుటాకులా వణికింది!
గుండె లోతుల్లో దిగుతున్న
“అసమానత్వపు” కత్తి కోతను
మౌనం సాక్షిగా భరిస్తున్నది!
కానీ హామీ ఇవ్వలేను….
నా ఓర్పు నీకు తీర్పు రాయకుండా ఉండగలదని!
నా స్వేచ్చా పొలికేక నీ గుండె గదుల్ని బద్దలుకొట్టక ఉపేక్షిస్తుందని!”

 డి.నాగజ్యోతిశేఖర్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.