సాహిల్ వస్తాడు(పుస్తక సమీక్ష )-డా.సమ్మెట విజయ

అఫ్సర్ గారు రచించిన సాహిల్ వస్తాడు మరికొన్ని కథలు పుస్తకం చదవగానే నా మనసులో కలిగిన భావాలకు అక్షరరూపం తీసుకురావడం అవసరమా కాదా అన్న ప్రశ్న ఉదయించింది మొదట. ఎందుకంటే నేను పుస్తకం చదవకముందే సాహిల్ వస్తాడు పుస్తకం గురించి ఎందరో ఎన్నో చెప్పేసారు.

హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో పుస్తకం గురించి , అఫ్సర్ రచనల గురించి పలువురు ప్రముఖులు ప్రసంగించారు. స్వయంగా అఫ్సర్ తన స్పందన తెలిపారు . సాహిల్ వస్తాడులో ఏముందో తెలీకుండా వినడం, ఆ తర్వాత పత్రికలలో వచ్చిన వార్తా కథనాలు చదవడం , తిరిగి “ అంకుర్” సాహిల్ వస్తాడు కథలలోని స్త్రీపాత్రలపై జరిగిన గోష్ఠి లో ఒక్కొక్క కథని ఒక్కో రచయిత్రి విశ్లేషించగా ఆ సభకు వెళ్ళడం జరిగింది. ఆకాశవాణిలో సాహిల్ వస్తాడు కథాసంకలనం పై సి.యస్. రాంబాబు గారి విశ్లేషణ కూడా విన్నాను. శ్రీధర్ గారి విశ్లేషణ పత్రికలో చదివాను.

ఇన్ని విన్నాక నువ్వు చెప్పాల్సిందేమయినా ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాక రెండు విషయాలు నా మనసుకు తోచాయి. ఒకటి ‘ నేను ‘ అనే ఒక సామాన్యురాలి అభిప్రాయం స్పందన ఎవరు వింటారు. రెండు ఇందరు చెప్పిన తర్వాత కూడా చెప్పవలసింది ఇంకా ఉందా? అని. మొదటి దానికి సమాధానం ఎవరు విన్నా వినక పోయినా ఖచ్చితంగా అఫ్సర్ గారు వింటారు. అమీనా మాట విన్న అఫ్సర్ నా మాటకూడా వింటారు. వినడమే కాదు వెంటనే తన స్పందనను తెలియజేస్తారు. కేవలం ఈ వొక్క వైఖరి అతనికి ఎందరో అభిమానులు ఏర్పడేలా చేసింది. అందులో నేనూ ఒకరిని కావడం నా అదృష్టం . రెండవది ఇందరు చెప్పిన తర్వాత కూడా ఇంకా చెప్పేదుందా అంటే చాలా ఉందని చెప్పాలి. ఎంత చెప్పినా తరగని వ్యధ ఉంది. ఎంత చెప్పినా తరగని కథలు , కథనాలు, సంగతులు, సంఘటనలు, వాస్తవాలు , ఆరాటాలు, ఆక్రందనలు , ఆవేశాలు అనేకానేకం ఈ కథలచుట్టూ ఉండి మనల్ని కట్టి కుదిపేస్తాయి. ఒక్కొక్క కథ అఫ్సర్ మనో సంఘర్షణకు అద్దం పడతాయి.

అఫ్సర్ ఒక కవిగా ప్రపంచానికి తెలుసు. ఖమ్మం జిల్లాలోని చింతకాని గ్రామం నుంచి ఉపాధ్యాయుని బిడ్డగా అరమరికలు లేని హిందూ ముస్లిమ్ సఖ్యతతో కూడిన సమాజం నుంచి అడుగడుగునా గుచ్చి గుచ్చి ప్రశ్నించే అనాగరిక శకావికల సమూహాల మధ్య కొనసాగించిన జీవనంలో తాను చూసిన , తాను అనుభవించిన జ్ఞాపకాలకు , సంఘటనలకు , ఆవేదనలకు అక్షరరూపం చేసి ఆ ఊరి మట్టితో మలిచిన అద్భుత కళాఖండాలు సాహిల్ వస్తాడు కథలు.

ఒక కథలపుస్తకం చదివితే అందులో అందమైన ప్రేమకథో, వినోదమో, అడ్వెంచరో, వైజ్ఞానికమో..ఏదో ఒకటి అందుతుందని చదవాలనిపించే పుస్తకం మాత్రం ఖచ్చితంగా సాహిల్ వస్తాడు కాదు. అలా చదివి అలా వదిలేసేది కాదు. చదివి ఇదింతేలే అనుకునేదీ కాదు. ఒక పుస్తకం చదివాక అది మనలో ఆలోచనలు రేకెత్తింపజేస్తే.. ఒక పుస్తకం చదివాక అది మనలో ప్రకంపనలు పుట్టించగలిగితే ..ఒక పుస్తకం చదివాక అది మనల్ని అంటిపెట్టుకుని ఉంటే ..ఒక పుస్తకం చదివాక అది మనకు సజీవ చిత్రాన్ని చూపించ గలిగితే ..ఒక పుస్తకం చదివాక అది మనలోని నెగెటివిటీని తీసి వేయగలిగితే అది ఖచ్చితంగా ఒక గొప్ప పుస్తకం . ఆ కోవలోకి చెందిన పుస్తకమే సాహిల్ వస్తాడు.

సాహిల్ వస్తాడులో మొత్తం 11 కథలున్నాయి.ఈ కథలకు “సీనేమే జలన్ “ అంటూ మహమ్మద్ ఖదీర్ బాబు , “ఇతరుడి” అస్తిత్వ కథలు అంటూ కె. శ్రీనివాస్ ముందుమాటలు రాసారు. వీరిద్దరి ముందుమాటలు వేటికవే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్రముఖుల రచనలకు ప్రముఖుల ముందుమాటలను మనం చదివాం . కొన్ని శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం ముందుమాట మనలో చెరగని ముద్ర వేసింది. సాహిల్ వస్తాడులో మహమ్మద్ ఖదీర్ బాబు ముందుమాట అందుకు ఏమాత్రమూ తీసిపోని రచన. నిజానికి ముందుమాట అభివ్యక్తి సూటిగా గుండెలను తాకిందనడానికి నిదర్శనం. ఒక సందర్భంలో.. “.ఇటువంటి సమయంలో మనిషి పెద్దగా అరవడం ఉండదు. లోలోపల పెనుగులాడటమే ఉంటుంది. తన నిస్సహాయతకు తానే అపరాధ భావంతో కుమిలిపోవడం ఉంటుంది. కడుపున పుట్టిన పిల్లలు కల్లకపటం ఎరుగని వయసులోనే వివక్ష ఎదుర్కోవటం చూసి విలవిలలాడటం ఉంటుంది. అల్ప సంఖ్యాకులు ఇంటి ఆడది మరింత పీడితురాలు ఆ స్త్రీ రోదిస్తూ తల మొత్తుకుంటుంటే భరించలేక పారిపోవాల్సి ఉంటుంది. ఇదంతా ఈ కథలో ఉంది. అఫ్సర్ కథలో ఉంది” అని చెప్పడంలోనే ఆ కథల్లో కనిపించే వేదన చిత్రీకరణలో మహమ్మద్ ఖదీర్ బాబు విజయుడయ్యాడు.

కె. శ్రీనివాస్ గారు “ బలవంతపు ప్రవాసాన్ని వియోగ భారాన్ని , ప్రవాస జీవితం గురించి తిరిగి మూలాల్లోకి పునరాగమన కాంక్షను వెళ్లిన చోట , ఉన్న చోట, తిరిగి వచ్చిన చోట, కలిగే ఆశాభంగాల వేదనను , జీవితపు సన్నటి సందులగుండా , సున్నితమైన సన్నివేశాల మీదుగ చిత్రించాయి. ఈ కథలన్నిటిలో పాఠకులను కూడా తాకి ఒక మెలాంకలీలోకి నడిపిస్తాయి “ అనడం కూడా సాహిల్ వస్తాడు కథలకు ఎక సమగ్ర రూప ఆవిష్కరణకు దోహదం చేసింది.

సాహిల్ వస్తాడులో ఒక్కో కథ నన్ను చాలా ఉద్విగ్నతకు లోను చేసింది. నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం నేను సంచరించిన ఖమ్మం కోట , మామిళ్ల గూడెం , రైటర్ బజార్ వంటి ప్రాంతాలనుంచి నేను ఆదిలాబాద్ లోను, హైదరాబాద్ లోను ఎందరో ముస్లిం మిత్రులతో కలిసి జీవిస్తూ వారితో అనుబంధం కలిగి ఉన్నాను. మరో పక్క వృత్తిరిత్యా ఉపాధ్యాయురాలిగా నేను బోధించే పాఠశాలలో చాలా వరకు ముస్లీం విద్యార్థులు ఉండేవారు. తెలుగు బోధనలో ద్వితీయ భాషగా తెలుగు బోధిస్తున్నతరగతులలో దాదాపు 80 శాతం ముస్లీమ్ పిల్లలే నా చుట్టూ ఉండేవారు. వారి ప్రేమ, అభిమానం నన్ను ఎప్పుడూ కట్టిపడేసేవి. వారిలో కొందరు తమ కుటుంబ సమస్యలను నాతో పంచుకున్న వారూ ఉన్నారు. విచిత్రమేమిటంటే అఫ్సర్ గారి కథలలో పాత్రలు అన్నీ నా చుట్టూ నా మధ్య తిరుగాడినట్లు ఉండటం.అందులో కొన్ని నాకు తెలిసినవే అని పరామర్శించినట్లుగా అనిపించాయి.

నా బోధనలో భాగంగా నెల్లూరు కేశవరావు కథలగురించి పిల్లలతో పంచుకున్నప్పుడు యుగాంతం, చార్మినార్ కథలు హైదరాబాద్ పాతబస్తీ కథలుగా పేరుపొందిన కొథలైతే సాహిల్ వస్తాడు కథలు ఖమ్మం కథలు లేదా తీరని వ్యథలు అనొచ్చేమో(?) ..అడుగడుగున తమ జీవన అంతః సంఘర్షణ , ఆవేదన, అనుభూతి పదం పదం నింపి..తన చుట్టూ జరిగే సంగతులకు కళ్ళముందు సజీవంగా నిలిపి ఆ కుటుంబాల్లోకి మనల్ని తీసుకువెళ్ళి వారందరినీ మన కుటుంబ సభ్యులుగా మార్చేసిన మాంత్రికుడు అఫ్సర్. ఈ మొత్తం కథలన్నింటిలోనూ ఉన్నపాత్రలన్నీ మనకెంతో దగ్గరయిపోయాయి. వాటిలోని ఆవేదన అస్తిత్వ పోరాటం అంతర్గత ఆక్రందన మనకు సూటిగా తాకాయి. కళ్లు చెమిర్చాయి. కడుపులో చుట్టచుట్టిన బాధ ..రాజకీయం , దేశం , మతం , మూలం , వీటిని శోధించడం కన్నా మానవత్వం అనే అంతస్సూత్రం ప్రతి కథ చుట్టూ ఆవరించి ప్రకంపనలు పుట్టించి మనిషి పట్ల మనిషి ప్రవర్తన మతమనే ముసుగులో మభ్య పెట్టబడింది. ఈ ముసుగులు మనిషిలోని అసలు మానవతని తొక్కిపడేసాయి. అడుగడుగునా అవమానానికి గురిచేయబడ్డాయి. భయపెట్టాయి. బాధ పెట్టాయి. కులమతవిద్వేషాలకు అతీతంగా మనిషిని మనిషి గుర్తించి ప్రేమించి ఆదుకుని అక్కున చేర్చుకోవాలనే ఆరాటాన్ని వ్యక్తపరిచాయి. సమస్య మూలం తెలుసుకోవాలని సూచించాయి. ఆ ముద్రలను అమాయకులపై వేయకూడదని వారించాయి. వేసినప్పుడు పడ్డ వేదనను కళ్ళకు కట్టినట్లు చూపించాయి.

సాహిల్ వస్తాడులో కథల పాత్రల ఎంపిక ప్రత్యేకంగా ఈ పాత్ర ఇలా ఉంటుందని నిర్దేశించినట్లుగా ఉండవు. అసలు పాత్రలుగానే అనిపించవు. మన పక్కింట్లోనో మన ఎదురింట్లోనో మనతో మాట్లాడుతున్న అనుభూతిని కలిగించే సజీవ రూపాలే. ఒక్కొక్క పాత్ర పరిచయం చేసే విధానంలో అఫ్సర్ గారి ప్రతిభ మనతో కాజువల్ గా చెబుతున్నట్లుగా నిజానికి మనతో మాట్లాడుతున్నంత సహజంగా ఉంటాయి.

కోటలోపలి గదులు , అక్కడి ఇళ్ళల్లో వారి కథనాలు వారి జీవనపు ఈతిబాధలు , అగచాట్లు క్రమంగా ఒక సజీవ దృశ్యంగా మన ముందు సాక్షాత్కరించినట్లుగా అనిపిస్తాయి. హిందూ ముస్లీమ్ లు కలిసి జీవిస్తున్నతీరుకు అద్దం పట్టిన కథలివి.

అఫ్సర్ కవిగా కంటే కథారచయితగా తనముద్రను స్థిరంగా వేసుకున్నట్లుగా మనకీ కథలు చదవగానే అనిపిస్తుంది ( ఇంటివైపు కవితలు చదివాక కవిగానే మన మనసుల్లో నిలిచిపోవడం వేరే విషయం ..అదిక్కడ ప్రస్తావించకూడదు) కవిగా కవితాహృదయం ఉన్న వ్యక్తిగా కథలను మరింత చేరువగా అందించాడని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.

సాహిల్ వస్తాడులోని స్త్రీ పాత్రలపై జరిగిన చర్చాగోష్ఠి లో ఒక్కొక్క స్త్రీ పాత్ర పరిచయం జరిగింది. గోరిమాని పరిచయం చేసిన విధానం మనకి గోరిమాకి చేరువ చేసింది. ప్రవాహం లాంటి హసీనా, అద్దం లాంటి తితలీ, మున్నీ , అపూ , అరుణ వంటి స్నేహపూర్వక పాత్రలు, షబ్నం , బేబీల దగ్గరితనం , రజియా వాస్తవికత, నస్రీన్, ఆర్తిల ఖచ్చితత్వం ఏ పాత్రకు ఆ పాత్ర మనలో ఇమిడి పోతుంది.

అ పాత్రయినా ఏ కథైనా మొత్తంగా స్థానికత ,ప్రవాస వేదన, అస్తిత్వ పోరాటం , వాస్తవ చిత్రీకరణలతో పాటు ప్రశ్నలుగా మొదలై సమాధానాలు వెతుక్కునే మజిలీగా సాక్షాత్కరించే కథలే. ఈ కథల్లో విహరించిన వారి కళ్ళు చెమర్చక మానవు. ఈ కథలను చదివిన వారు సాహిల్ తమ వాడేనని తిరిగి వస్తాడని విశ్వసించక మానరు. అద్భుత కథాయానం చేయించిన కవికి కథామూర్తికి వంద వందనాలు .

-డా.సమ్మెట విజయ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలుPermalink

Comments are closed.