*మారిషస్ దేశంలో తెలుగు భాష వెలుగుతోంది* (ముఖాముఖీ )-వెంకట్ కట్టూరి

మారిషస్ దేశంలో తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకుని తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు దాదాపు 15 రోజులపాటు జరుపుకుంటున్నారు.అక్కడి తెలుగు ప్రజలు.అక్కడ తెలుగు భాషాధికారిగా,తెలుగు భాషాభిమాని *సంజీవ నరసింహ అప్పడు* తో పరిచయ కార్యక్రమం చేద్దాము. భారతదేశానికి దాదాపుగా ఐదువేల కిలోమీటర్ల దూరంలో, ఉన్న మారిషస్ దేశంలో తెలుగు భాష “వెలుగుతోంది”వికసిస్తోంది.అలా తెలుగుభాష అంతలా వికసించడానికి,కారణం మన తెలుగు వారే. మనదేశం నుండి చెఱకు తోటల్లో, పని చేయడానికి మన ఉమ్మడి ఆంధ్రదేశంలో నుండి అనేక ప్రాంతాలనుండి,ముఖ్యంగా విజనగరం జిల్లానుండి తూర్పుగోదావరి జిల్లా కోరంగి ఓడరేవు ద్వారా మారిషస్ వలసవెళ్లి స్థిరపడిన మన తెలుగు వారి వారసులు సంజీవ నరసింహ అప్పడు తో ఒక ఒక చిన్న ప్రశ్నోత్తర కార్యక్రమం జరుపుకుందాం.

★ *నమస్కారమండీ సంజీవ గారు.*
*.జై జై జై జై జై జై జై తెలుగు తల్లీ! బావున్నారా…నమస్కారమండీ.

★ *మీ గురించి మీ నేపథ్యం గురించి మా విహంగ చదువరులకి  వివరిస్తారా…*
*తప్పకుండానండీ.నా పరిచయ భాగంగా ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే సంజీవ తెలుగు పిచ్చి.
పుట్టింది పెరిగింది మారిషస్ దేశంలో.మా తాతయ్య నాకు ప్రసాదించిన అతి పాత తెలుగు పెద్దబాల శిక్ష.మాకు పవిత్రమైన తెలుగు వేదంలాంటి గ్రంథం నుండి తెలుగు నేర్చుకున్నాను.మా తాతయ్య ఆలయ పూజారిగా ఉంటూ అయిదవ సంవత్సరం నుండి నా చేయి పట్టుకుని,ఆలయానికి తీసుకొని వెళ్లేవారు . ఆలయ విశేషాలు మరియు సాయంత్రం వేళలో అర్చన కార్యక్రమం చేసిన తరువాత, విద్యార్థులకు తెలుగు శిక్షణ ఇచ్చేవారు. నేను కూడా ఆయన దగ్గర తెలుగు నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచీ తెలుగంటే పిచ్చి ప్రేమ.తెలుగు భాషలోని మాధుర్యం,తెలుగుభాషా విశేషం,తెలుగు భాష పరిమళం నన్నెంత గానో ఆకట్టుంది. తెలుగు మహా సాగరంలో ఇప్పటివరకు నేను ఒక్క తెలుగు చుక్కను మాత్రమే తెలుసుకున్నాను..

*★మీ కుటుంబం గురించి వివరించండి.

మా తాతయ్య గారు నూకన్న అప్పడు,వారి తాతయ్య గారు తెలుగు పుణ్యభూమి,విజయనగరం నుండి తూర్పుగోదావరి జిల్లా,కోరంగి ఓడరేవు నుండి వచ్చారు.మా నాన్నగారు బలరాం అప్పడు,మా అమ్మగారు పుష్పాoజలి అప్పడు. *అప్పడు* అనేది మా ఇంటి పేరు.ఇక్కడ ఉన్న తెలుగు వారికి వారి ఇంటిపేరు తెలియదు.ఎందుకంటే ఆనాటి రోజుల్లో ఆంగ్లేయులు,మా ముత్తాతల పేర్లు రాసేటప్పుడు.ఇంటి పేరు అంటే ఏమిటి. వాటి విలువ ఏమిటో ఆనాటి ఆంగ్లేయులకు తెలియదు.నా ధర్మపత్ని పేరు హేమావతి.నాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు.సాయిస్వాతి,శ్రీను.మేము నివసించే ప్రాంతం మోకా అనే జిల్లాలో సాకే అనే ప్రాంతంలో నివసిస్తున్నాము.సాకే అంటే తెలుగు వారు ఎక్కుకువగా నివసించే ప్రాంతమని పేరు.

★ *సరేనండీ మీరు ఎంతవరకు చదుకున్నారు.
*నేను తెలుగులో BA చదువుకున్నానండీ.మొట్టమొదటిసారిగా మారిషస్ దేశంలో ఉన్న ఏకైక మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఐదుగురం చదువుకున్నామండీ.

*★మీ పూర్వీకులు వస్తూ వారితో పాటు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు తీసుకొని వచ్చారు.వాటిని కాపాడటానికి,రాబోవుతరాలకు అందించడానికి ఏవిధంగా కృషి చేస్తున్నారు.*
*అవునండీ తెలుగు పుణ్య భూమిలో,తెలుగు భాష,తెలుగు సాహిత్యం, తెలుగు సాంస్కృతిక వారసత్వం,ఆచారవ్యవహారాలు,ఆహార విహారాలు, కట్టు,  బొట్టు,జుట్టుతీరు,సంప్రదాయాలు,మర్యాదలు, వేమన పద్యాలు, మానవ విలువలు.భగవద్గీత, రామాయణ మహాభారతాలు  వంటి వాటికి తెలుగుభూమి పుట్టినిల్లు. తెలుగుభాష ఎలా సజీవంగా ఉన్నదీ,తెలుసుకుని మా ప్రజలకు తెలియజేస్తాను.నాకు చిన్నప్పటినుండీ భాష సంస్కృతి మీద ఎక్కువ అభిలాష చూపిస్తూ,ఎప్పుడైనా తెలుగు పుణ్యభూమికి వెళితే తెలుగు గురించి, తెలుగు సంప్రదాయాల గురించి,అంటే పండుగలు మేము జరుపుకుంటాము.పండుగ జరుపుకోవడం ఒకటి అందులో ఉన్న అంతరార్థం మరొకటి.అంటేఎక్కువగా తెలుగు పుణ్యభూమికి వచ్చి అనేక విషయాలు, నేర్చుకొని ఇక్కడి వారిని ప్రశ్నలు అడిగి మాదేశంలో ఉన్న మా తెలుగు ప్రజలకు తెలియజేస్తున్నాను.అందరూ మీ తెలుగు పుణ్య భూమికి రానవసరం లేకుండా,నేనే అందరితరపునా ఒక వారధిలా పనిచేస్తున్నానండీ. అటువంటి తెలుగు మహాజ్ఞాన యాగం చేయదలిచాను.దానికి నేను ఒక సమిధని.

★ *తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆంగ్లభాషాభిమానంతో తెలుగుకు ఆదరణ తగ్గుతోంది.కానీ మీ మారిషస్ దేశంలో “తెలుగు వెలుగుతోంది”కారణం వివరిస్తారా….
*ఇక్కడ తెలుగు అనేది మీ దేశంతో పోల్చితే మా మారిషస్ దేశంలో భారతీయ భాషలు. అంటే ఒక తెలుగును మాత్రమే గాకుండా హిందీ,తమిళం,ఉర్దూ,మరాఠీ,గుజరాతీ, బోజ్ పురి మొదలైన అన్ని భాషల్లో బోధన జరుగుతుంది.ఇక్కడ భారతీయ భాషాలు ప్రతీ భాష ఒక మతంలా మారిపోయింది.ఇక్కడికి వచ్చి తెలుగు ఆలయం,గాణేశ కోవిల్,మరాఠీ మందిర్,అని సహజమైన పదాలు పెడతారు.ఇక్కడ ఉన్న అన్ని తెలుగు ఆలయాల్లో సంస్కృతంలో “ఓం” అనే అక్షరం పెద్దగా రాస్తే ఒప్పుకోరు.ఈ విధంగా భాష పరంగా మతం ఏర్పడింది.అదే మాకు మా చిన్నప్పటి నుండి మా పూర్వీకులు ఇచ్చిన సంస్కారం. ఆ తెలుగు ఇంకా ఇంకా విస్తృతంగా, పరిశీలించి పరీక్షించి చేయడానికి నా జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాను.అందుకే ఏపని చేసినా,నా శ్వాస,ఉచ్చ్వాసలు తెలుగు తెలుగు అంటూ జీవిస్తున్నాను.మీరు కూడా గమనించే ఉంటారు.

*★మీ మారిషస్ ప్రభుత్వం వారు దాదాపు 150 తెలుగు పాఠశాలలు నెలకొల్పారు కదా…వాటి బోధనా విధానం ఏవిధంగా ఉందో తెలియ జేస్తారా….
*ఆ అవునండీ !ఇక్కడ మా ప్రభుత్వం వారు పెట్టిన పథకం వల్ల 1958 నుండి భారతీయ భాషలను రాబోయే తరాలు తమ తమ భాషా సాహిత్యాలను తెలుసుకోవడానికి ఈ పాఠశాలలు ఏర్పాటు చేసారండీ.మన పూర్వీకుల భాషా సాహిత్యం,భాషా సాహిత్య విలువలు,తెలుగు గొప్ప కవుల రచనలు,తెలుగు భాషా సౌందర్యాన్ని,తెలుగు భాష గొప్పదనం, తీయదనం ఆస్వాదించడానికి భాషా పరిజ్ఞానం ఉండి తీరాలి.ఈ ఉద్దేశ్యంతో మా మారిషస్ ప్రభుత్వం వారు ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయం వరకూ భారతీయ భాషల బోధన జరిపిస్తున్నారండీ. ప్రతీరోజూ మా పాఠశాలల్లో కనీసం రోజుకు నలభై నిమిషాల నుండి రెండున్నర గంటల పాటు* తెలుగు బోధన జరుగుతుంది.మా దేశంలో విద్యార్థులు తెలుగు భాషను కష్టంగా నేర్చుకోరు.ఎంతో ఇష్టంతో నేర్చుకుంటారు.మా ప్రభుత్వం వారు తెలుగు భాషను,తెలుగు సంస్కృతిని, సాహిత్యాన్ని మా తెలుగు ప్రజలకు అందించడానికి ఎంతో కృషి చేస్తున్నారండీ.

★ *సరేనండీ…..మీ మారిషస్ తెలుగు ప్రజల సంస్కృతిని వివరించండి…..
* పండుగలు, పబ్బాలు,నోములు వచ్చినపుడు మా దేశములో అనేక తెలుగు శాఖలు ఉంటాయండీ.ఉదాహరణకు మారిషస్ తెలుగు మహాసభ.దీనికి మాదేశం అంతటా 94శాఖలు ఉన్నాయి.వీటి ద్వారా ఏదయినా పండుగ వస్తే ఆ సంస్థలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు-పండుగను గురించి తెలియజేస్తారు.వినాయక చవితి పండుగ ఎలా జరుపుకోవాలి.ఆ పండుగ యొక్క పురాణ చరిత్రను తెలియజేసి,ప్రజలకు ఆ పండుగల విశేషాలు తెలియజేస్తూ ఆచరింప చేస్తారు.ముఖ్యంగా ప్రతీ పండుగ వెనుకాఎటువంటి మానవ విలువలు ఉంటాయో తెలియజేస్తారండీ.తెలుగు వారందరూ ఇక్కడ హిందువులు.కావున సంప్రదాయ బద్దంగా ఆ పండుగ గురించి పెద్ద తెల్లకాగితంపై రాసి ఒక నెలరోజుల ముందు ఆంగ్లంలో రాసి,కొద్దిగా తెలుగులో కూడా రాసి ఆ పండుగ రోజున ఏమేమి కార్యక్రమాలు జరుపుకోవాలో తెలియజేస్తారు.అందరూ ఆ పండుగలను ఉత్సాహంతో,ఉత్సవంలా మహోత్సవంగా జరుపుకుంటారండీ.ఈ పండుగలలో తెలుగు సంప్రదాయం వెల్లి విరిసేలా కొత్త బట్టలు ధరిస్తారు.కట్టు, బొట్టు,పడికట్టు అంతా తెలుగు సంస్కృతిని ప్రతిబింబిచేలా పండుగను జరుపు కుంటారు. ఇక్కడ ఈ పండుగల ముఖ్య ఉద్దేశ్యం అందరూ కలుసుకోవడం జరుగుతుంది. అదే వసుధైక కుటుంబం. మాకు ఏ పండుగ వచ్చినా ఏ నోము వచ్చినా ఇక్కడ విధి విధానంగా చేస్తామండీ.మీ తెలుగు పుణ్యభూమి లో పండుగలు ఏవిధంగా చేస్తారో. మేముకుడా అదేవిధంగా తూ. చ తప్పకుండా చేస్తాము.మారిషస్ ప్రభుత్వం తరపున తెలుగు సాంస్కృతిక నిలయం,తెలుగు సాంస్కృతిక కేంద్రం, తెలుగు భాషా సంఘం వీటి ద్వారా ప్రభుత్వ సహకారంతో పండుగలు నిర్వహిస్తాము.

★ *మీ దేశంలో తెలుగు భాషపై విద్యార్థుల స్పందన ఏ విధంగా ఉంది……
*మా విద్యార్థులు తెలుగు భాషను కష్టంగా నేర్చుకోరు.ఎంతో ఇష్టంగా, ప్రేమతో నేర్చుకుంటారండీ.తెలుగులో ఏ పరీక్ష పెట్టినా 95 శాతం మార్కులు తెచ్చుకుంటారండి.ఇక్కడ అదొక గొప్ప విశేషం. కానీ తెలుగులో మాట్లాడటం చాలా తక్కువ.తరగతి గదిలో మాత్రమే మాట్లాడతారు. బయట మాట్లాడరు. కానీ వారందరూ ఎప్పుడు మాట్లాడతరంటే,తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల పోటీలు ఉన్నప్పుడు అప్పుడు తెలుగు మాట్లాడుతూ, వింటుంటుంటారు.అందుకే ఇక్కడ తెలుగు మాట్లాడే విధంగా ప్రోత్సాహం చేస్తూ,అనేక తెలుగు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము.అంటే ప్రతీవారం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్లి “పఠనం”అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మాట్లాడితే భాష వస్తుంది.

కాగితం మీద చూడకుండా తెలుగు మాట్లాడే విధంగా పోటీలు నిర్వహిస్తున్నాము.మాసానికి ఒకసారి వివిధ ప్రాంతాలకు వెళ్లి,తెలుగు భాషా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం.ఆ కార్యక్రమంలో ఒక్కొక్కరిని వేదికపై నిలబెట్టి,చూడకుండా దాదాపు పదిహేను నిమిషాలపాటు ఒక్క ఆంగ్లపదం కూడా వాడకుండా అచ్చ తెలుగులో మాట్లాడేలా పోటీలు నిర్వహిస్తాము.దీనివల్ల భాషాభివృద్ది జరుగుతుందని మా చిన్ని కోరిక మరియు చిన్ని ఆశ.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తెలుగు నేర్చుకుంటున్నారు.

★ *చాలా మంచి ఆలోచనండీ, అదేవిధంగా మీ దేశంలో ఉగాది పండుగను జాతీయ సెలవు దినంగా పాటి స్తున్నారని విన్నాము.కారణం వివరిస్తారా…
*అవునండీ…మా మారిషస్ దేశంలో తెలుగువాళ్లు తెలుగుభాషా ప్రియులు.తెలుగు సంస్కృతి,సంప్రదాయాలను విధిగా పాటిస్తారు.మాకు “ఉగాది”పర్వదినాన్ని జాతీయ సెలవుగా మా ప్రభుత్వం ప్రకటించడానికి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారండీ.వారు పూజ్యులు తెలుగు వైతాళికులు పండిట్ గుణయోత్ గారు,మరియు పండిట్ రామమూర్తి గారు.తెలుగు భాష ఇప్పటి వరకూ మా దేశంలో సజీవంగా ఉంది అంటే దానికి కారణం వారే.వారిద్దరు కలిసి మాదేశ ప్రధాని దగ్గరకు వెళ్లి మారిషస్ దేశంలో తెలుగు వారు సుమారు లక్ష మంది వరకు ఉన్నందున, ఇతర మతాల వారి పండుగ రోజుల్లో ఏవిధంగా సెలవు ఇస్తున్నారో, మాకు అలాగే సెలవు ప్రకటించమని విన్నవించుకున్నారు. అప్పుడు 1958 వ సంవత్సరం శాసనసభలో చట్టం చేసి,ప్రతీ సంవత్సరం మారిషస్ దేశంలో తెలుగు పండుగలు దాదాపు 22 పండుగలకు సెలవులు ప్రకటించింది మాస్ ప్రభుత్వం. మీ తెలుగు దేశంలో ఏవిధంగా పండుగలు జరుపుకుంటారో మేముకుడా అలాగే జరుపుకుంటామండీ.

★ *మీ మారిషస్ దేశంలో తెలుగు భాషాదినోత్సవ వేడుకలు 15 రోజుల పాటు తెలుగు భాషాబ్రహ్మోత్సవాలు జరపుకుంటారు కదా.ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తారు...
ఆ అవునండీ..వాడుక భాషోద్యమకారుడు శ్రీ గిడుగు రామ్మూర్తి పతులుగారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం.మా దేశంలో పక్షోత్సవాలుగా జరుపుతామండీ.ఎదుకంటే మాకు తెలుగంటే పిచ్చి. తెలుగంటే ప్రేమ,అనురాగం,ఆప్యాయత. అందుకే మేము ఈ సంవత్సరం ఆగష్టు 15 వ తేదీ నుండి 29 తేదీ వరకు మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామండీ.ఈ పదిహేను రోజులు తెలుగు వారందరూ కలిసి తెలుగు సంప్రదాయం, సంస్కృతి ,తెలుగుదనం, ఉట్టిపడేలా ఈ వేడుకలు నిర్వహిస్తామండీ.ఈ సంవత్సరం మా మారిషస్ దేశానికి ముఖ్య అతిథిగా ప్రాన్స్ దేశానికి చెందిన ప్రొఫెసర్ డానియెల్నేజర్ గారు వస్తున్నారండీ.

★ *ఈ పండుగలో ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు….
ఈ 15 రోజుల పండుగలో ప్రతీరోజూ ఒక అంశంపై మాట్లాడుతామండీ.
ఈ పండుగలో తెలుగుభాష ఔన్నత్యాన్ని,గొప్పదనాన్ని,తెలుగు భాష చరిత్రను,వ్యాకరణం, కవితలు, కథలు,ఆటలు పాటలు,ముగ్గులు వేయడం.పెద్దవారితో తెలుగు పిండి వంటలు చేయిoచడం. అందరికీ నేర్పించడం.అందరం కలిసి ఇక్కడే భోజనాలు చేయడం వంటి కార్యక్రమాలు చేస్తామండీ.ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల తెలుగు భాషను గురించి,తెలుగు సంస్కృతి గురించి రాబోవు తరాల వారికి తెలియజేస్తాం.మా పూర్వీకులు మాకు వారసత్వం గా అందించిన తెలుగు సంస్కృతిని,సంప్రదయాలను రాబోయే తారలకు అందించడమే మా ఉద్దేశ్యం. ఈ వేడుకల్లో మా ఉపాధ్యాయులచే కవి సమ్మేళనం, అవధానాలు నిర్వహించడం చేస్తాం.ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లల్లో తెలుగు భాష పట్ల ఆకర్షణ కలిగేలా చేస్తాం. భగవద్గీత పఠనం కూడా ఉంటుంది.

★ *చాలా మంచి ఆలోచనండీ. మీ మారిషస్ దేశంలో తెలుగు వారి వివాహ వేడుకలు గురించి వివరించండి….
మా దేశంలో తెలుగు పుణ్యభూమిలో ఏవిధంగా పెళ్లిళ్లు జరిపిస్తారో మేముకుడా అలాగే జరిపిస్తామండీ.కాకపోతే మా దేశంలో *వరకట్నం* తీసుకోము. మేము ఎవరికీ ఇవ్వం.ముఖ్యంగా ఐదు రోజుల వివాహ వేడుకలు నిర్వహిస్తాము.పసుపు వేసి పాటలు పాడటడం.నలుగు పెట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం.పెళ్లి తంతులో పుట్నాలు అనే కార్యక్రమం చేస్తాం.పెళ్లికి ముందు పూజ చేయడం,వ్రతాలు చేయడం, పెళ్లి తరువాత అరుంధతీ నక్షత్రం చూపించడం వంటి అన్ని కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా జరిపిస్తామండీ.

★ *మీ దేశంలో దాదాపు మూడువందల హిందూ దేవాలయాలు ఉన్నాయని విన్నాము.వాటి ద్వారా తెలుగు భాషను ఏవిధంగా ముందుకు తీసుకుపోతున్నారు…
అదేనండీ…మాదేశంలో దేవాలయాలు,తెలుగు మహాసభ ద్వారా 94 శాఖలు నిర్వహిస్తున్నారని అన్నాను కదా…ఆ సభ దగ్గర ఒక పెద్ద ఆలయం,తెలుగుబడి,ఒక కళ్యాణ మండపం ఉంటాయండీ.వారానికి రెండు సార్లు విద్యార్థులు సాయంత్రం వేళ నాలుగుగంటల నుండి ఆరు గంటల వరకు,తెలుగు నేర్చుకుంటారు.తరువాత కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం, తెలుగు ముగ్గులు నేర్చుకుంటారండీ.పెద్దవారు కుడా తెలుగు పిండివంటలు, మిఠాయిలు చేయడం నేర్చుకుంటారండీ.అదేవిధంగా ప్రతీ శుక్రవారం తెలుగువారి దేవాలయాల్లో, సామూహిక పూజా కార్యక్రమాలు జరుగుతాయి.ఆరు నుండి తొమ్మిది గంటల వరకు పూజారులు అర్చన చేసిన తరువాత,అన్నమాచార్య సంకీర్తనలు,త్యాగరాజకీర్తనలు,రామదాసు, కీర్తనలను రాగ తాళ యుక్తంగా పడుతారండీ. మా పాటల్లో భావం తక్కువ.ఎందుకంటే మాకు భాషా పరిజ్ఞానం తక్కువ మీలాగా మేము పడలేము.కానీ నేర్చుకుంటారండీ. అందుకే ఈ లోపం గుర్తించి బాగా ఆలోచించి నేను ఒక పుస్తకం రాసానండీ.తెలుగులో ప్రసిద్ధిగాంచిన అన్నమాచార్య సంకీర్తనలు 32 వేల సంకీర్తన లనుండి,30 మాత్రమే తీసుకొని. అయిదు భాగాలుగా చేసి,తెలుగు లిపిలోనూ, ఆంగ్ల లిపి లోనూ.తెలుగు వర్ణన ఆంగ్ల వర్ణననలో వినడానికి వీలుగా ఒక పరికరం చేసాను.వాటిని మీ తెలుగు పుణ్య భూమిలో డిసెంబర్2019 లో విజయవాడలో జరుగబోయే ప్రపంచ తెలుగు రచయిత ల మహాసభల్లో ఆవిష్కరిస్తామండీ.ఆ వేడుకల్లో అందరికీ ఉచితంగా ఆపుస్తకం, మరియు ఆ పరికరం అందిస్తాం.

★ *అదేవిధంగా మీరు రావి ఆకులపై చిత్రాలు గీస్తారని విన్నాము.ఆ కళ గురించి వివరించండి….
అవునండీ…ఆ రావి ఆకుల మీద చిత్రాలు వేసే కళ ఆ భగవంతుని కృప వల్ల నాకు వచ్చిందండీ.నేను ఎవరిదగ్గరా ఆ కళను నేర్చుకోలేదు.తెలుగు మీద ఉన్న మమకారం వల్ల తెలుగు సాంస్కృతిక వారసత్వం అనే శీర్షిక లో సర్వ వర్ణననలతో ఇప్పటి వరకు దాదాపు 1400 ల చిత్రాలను గీసానండీ.

★ *చాలా సంతోషమండి.మీ మారిషస్ ప్రభుత్వం తెలుగుభాషాభివృద్ధికి ఏవిధంగా సహాయపడుతుంది…
*ఇక్కడ మా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించకపోతే మేము ఏ విధమైన తెలుగు కార్యక్రమాలు జరిపించలేము.మా మాతృభాష “క్రియోల్”అయినప్పటికీ తెలుగును ద్వితీయ భాషగా మా ప్రభుత్వం గుర్తింపు నిచ్చి,పాఠశాలల్లో తెలుగు బోధన జరిపిస్తుంది.మా దేశ జాతీయ దూరదర్శన్ కేంద్రంలో ప్రతీరోజూ నాలుగు గంటల పాటు, తెలుగు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు జరుగుతున్నాయండీ.ప్రతీ సంవత్సరం తెలుగు నాటిక రచన పోటీలు నిర్వహిస్తారు.ప్రతీ సంవత్సరం జాతీయ తెలుగు నాటక పోటీలు ఏర్పాటు చేస్తారు.నేను అపోటీలో పాల్గొని అనేక నాటకాలు రాసాను.ప్రథమ బహుమతులు కూడా అందుకున్నానండీ.మా ప్రభుత్వం సహాయ సహకారాలు లేకపోతే ఈ కార్యక్రమాలు జరపలేమండీ.

★ *మీ ప్రభుత్వ కృషి అభినందనీయండీ.అసలు తెలుగు భాష అంటే ఎందుకు మీరు ఇంత ఆదరణ చూపిస్తున్నారో చెప్పండి..
*మీరు ఆ మాట అడిగితే నా దగ్గర సమాధానం లేదండీ.ఎందుకంటే ఏదయినా ఆసక్తి ఉంటేనే కదా చేస్తాము.ఆసక్తి లేకపోతే ఏ పనీ చేయాలేము.మాకు తెలుగు భాష అంటే పిచ్చి ప్రేమ.తెలుగు భాషకు మంచి గుర్తింపు ఉంది. అది మా పూర్వీకులు మాకు అందించిన గొప్ప ఆస్తి.తెలుగు కోసం ఏదైనా చేయలనిపిస్తుంది.విదేశాలలో తెలుగుభాషను గూర్చి మేము చేస్తున్న కార్యక్రమాలు.అందరూ చూసి,చూడండి మీకులాగా నాకు మాట్లాడటం రాదండీ.మా తెలుగులో ఎన్నో అక్షర దోషాలు ,వ్యాకరణ దోషాలు దొర్లుతాయి.మా మాటలు వింటే విజ్ఞులు ఏమంటారు. అనేటువంటి ఆలోచన దూరంగా పెట్టేసి,నేను మాట్లాడుతాను.ఎవరు ఏమన్నా పట్టించుకోను.చాలా మంది మా తెలుగు విని ఆశ్చర్య పడతారండీ. నా ద్వారా ఒక స్పందన కలుగుతుందని ఆశ.ప్రపంచంలో ఎక్కడ తెలుగు మహాసభలు జరిగినా నన్ను ఆహ్వానిస్తారండీ. అసభలో ఉన్న ఆహుతులకు మా తెలుగు మాటలు వినిపించే ప్రయత్నం చేస్తారు. ఎదుకంటే దానికి ఒక కారణం ఉంది.నేను విదేశీయుడిని. తెలుగు నా మాతృభాష కాదు.కానీ తెలుగు చక్కగా మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి అందరిలో ఒక స్ఫూర్తి కలిగించడానికి నాతో మాట్లాడిస్తారు.అటువంటి తెలుగు మహాసభల్లో పాల్గొని తెలుగుభాషామతల్లి సేవ చేస్తున్నండీ.

★ *అలాగే మరొక ప్రశ్న అండీ. తెలుగు వారి ఆత్మీయ వారధి TORI అనే కార్యక్రమం ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఏకంచేసి తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తూ,భాషావేత్తలను,రచయిత లను, కళాకారులను పరిచయం చేస్తున్నారు.తెలుగు బాషాభిమానం చాటుకుంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి….

అంటే నేను గొప్ప గొప్ప వాళ్ళతో మాట్లాడటం నా ఉద్దేశ్యం కాదండీ.వాళ్ళు ఏవిధంగా మాట్లాడుతారో, వాళ్ళతో నా సంభాషణలు ఎలా ఉటుందో,మా శ్రోతలు విని ఆనందిస్తారు.TORI సంస్థవారు శ్రీ కంఠమనేని రవిశంకర్ గారు.(Mlc)వారు telugulone.com లో తెలుగు కార్యక్రమాలు 24 గంటలు ప్రసారం చేస్తున్నారు.వారు నన్ను సంప్రదించారు.ప్రపంచంలో TORI అనే రేడియో కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా దాదాపు 35 మందిని ఎంచుకున్నారు.వారిలో నేను ఒకడిని.ఆఫ్రికా ఖండానికి 58 దేశాల్లో ఒక మారిషస్ ను ఎన్నుకొని,సంజీవ నరసింహ అప్పడు అనే నన్ను వ్యాఖ్యాతగా ఎన్నుకున్నారు.రవిశంకర్ గారు నన్ను ఈ కార్యక్రమంలో చేస్తారా….?అని అడిగినప్పుడు, ఒక షరతుతో చేస్తానని చెప్పానండీ.అదేమిటంటే ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా చేస్తాను.అలా ఐతే చేస్తా అని చెప్పాను. ఎందుకంటే తెలుగు భాష అంటే మాకు ఎనలేని ప్రేమ.తెలుగు భాష అభివృద్ధికి ఈ సంస్థ లో ఎనిమిది సంవత్సరాలుగా పని చేస్తున్నానండీ.

*★తెలుగు భాషకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం.మీ మారిషస్ దేశ తెలుగు ప్రజలపై ఇప్పటి వరకు ఏమైనా పరిశోధనలు జరిగాయా….
*ఆ జరిగాయండీ…మా దేశంలో రామ భజన అనే కార్యక్రమం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం.శనివారంనాడు రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు,సుమారు 12 గంటల సేపు ఈ రామ భజన చేస్తామండీ.పెద్ద పందిర్లు వేసి అన్నమాచార్య సంకీర్తనలు,కొల్లాటలు,భక్తి పాటలు నృత్యాలు కూడా చేస్తారు. మన తెలుగు సంప్రదాయం మాదేశంలో సజీవంగా ఉంది.అన్ని భాషల ప్రజలు ఇక్కడ అన్నదమ్ముల్లా,కలిసి మెలసి ఉంటారు.క్రైస్తవుల పండుగ కార్యక్రమాలలో మేము పాల్గొంటాము.వారు మా పండుగ వేడుకల్లో పాలుపంచుకుంటారు.ఇక పరిశోధన విషయానికి వస్తే,మీ తెలుగు పుణ్య భూమి నుండి వలసవెళ్లి స్థిరపడిన మేము ఏమి చేస్తున్నాము. మన సంస్కృతి, సంప్రదాయాలు ఎలా కాపాడుకుంటున్నామో అని తెలుసుకోవడానికి,హైదరాబాద్ నుండి ‘శ్రీ చల్లా రామఫణి’ గారు మాదేశం వచ్చి, మా దగ్గరే ఉండి మా తెలుగు భాష గురించి, మా తెలుగు సంప్రదాయం గురించి మా మారిషస్ తెలుగు ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని పెద్ద పరిశోధన చేసి Ph.D పొందారండీ.

★ *రాబోయే కాలంలో తెలుగు భాషను మరింత ముందుకు తీసుకుపోవడానికి ఏ విధమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారో వివారిస్తారా…
*తప్పకుండానండీ….మాదేశంలో తెలుగు సాహిత్యం,తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు సజీవంగా ఉజ్వలంగా ఉందని సగర్వంగా చెప్పగలను.ఎదుకంటే ఈ రోజు ఉన్న విద్యార్థులు ఆదర్శ పౌరులుగా తయారవుతారు.ఇంతకు ముందు తెలుగు చలన చిత్రాలు చూడటానికి,ఆంగ్లానువాదంతో చూసేవారు.కానీ నేడు ఆ పరిస్థితి లేదు.ఎందుకంటే అందరూ తెలుగు చాలా చక్కగా నేర్చుకున్నారు.ఇదంతా మేము మా విద్యార్థులకు తెలుగుభాష నేర్పడంవల్లనే ఇది సాధ్యం కాగలిగింది.తెలుగు కవితలు,పాటలు కూడా రాస్తున్నారు.రబోవుకాలంలో మా మారిషస్ ప్రభుత్వ సహాయ సహకారాలతో మరింతగా ముందుకు తీసుకుపోగలం. తెలుగుభాషను అందలమెక్కిస్తాం.

★ *మంచిదండీ….మీరు మా భారత దేశంలో ఇప్పటి వరకూ ఎన్ని సార్లు పర్యటించారు* .
*ఆ….అవునండీ ఇప్పటి వరకూ భారత పుణ్యభూమిని యాభై సార్లు సందర్శించానండీ.

★ *మీరు మా తెలుగు రాష్ట్రాలను సందర్శించి నపుడు తెలుగుభాషకు బ్రహ్మోత్సవాలు జరిపిస్తారని విన్నాము.వాటి వివరాలు తెలియ జేస్తారా….సంజీవ గారు….
*తప్పకుండానండీ….ఈ భూమి మా పూర్వీకులు నడయాడిన నేల. అందుకే మాకు భారతదేశమన్నా,తెలుగు పుణ్యభూమి అన్నా అమితమైన ప్రేమ. నేను ఇప్పటివరకు అంటే 1985 నుండి మొన్న ఏలూరు లో జరిగిన అంతర్జాతీయ సెమినార్ వరకు యాభై సార్లు వచ్చానండీ…నేను బ్రతికి ఉన్నంతవరకూ వస్తూనే వుంటానండీ.ఇక బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే,ఎక్కడ అయితే తెలుగు మహాసభలు జరుగుతాయో, ఆ సభల దగ్గర తెలుగు బ్రహ్మోత్సవాలు అనే పెద్ద తెరలను ఏర్పాటు చేసి,ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. మూడుగంటల సేపు ఆ కార్యక్రమం చేస్తాను.పిల్లలు, పెద్దలు,భాషాభిమానులు,సాహితీవేత్తలు,అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.ఆ సభలో తెలుగు భాష గొప్పదనాన్ని, తీయదనాన్ని,తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను,వాటి విశిష్ట తను పెద్దలు వివరించిన తర్వాత చివరిగా నేనుకూడా ప్రసంగిస్తాను.అటు తరువాత ఆ సభలో ఉన్న ఒక పెద్ద వయసు ఉన్న ముసలి వారిచే వారి దోసిట్లో గుప్పెడు మన్ను తీసుకోమని,ఆ గుప్పెడు మట్టిని నా దోసిట్లో కి తీసుకొని, ఒక కుండలో దానిని భద్రపరిచి మా దేశం తీసుకువెళ్లి, మా పూజ మందిరంలో పెట్టుకొని పూజలు చేస్తామండీ…ఎందుకంటే తెలుగు నేల అన్నా,తెలుగు భాష అన్నా మాకు ఎంతో ఇష్టమండీ.

★ *ఇక చివరిగా మా తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం…
*పెద్దగా ఏమిలేదండీ.పండితులనుండి పామరుల వరకు మీరందరూ తెలుగు భాషను మరింత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని నా ఆశ అండీ.ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రివర్ర్యులు కూడా తెలుగు భాషను పరిపాలనా భాషాగా చేస్తారని ఆశిస్తున్నాము.భాష సజీవంగా నిలబడాలంటే ప్రభుత్వ సహాయ సహకారాలు చాలా అవసరం ఉందండీ… తెలుగుభాషామాతల్లికి వందనం.జై తెలుగు తల్లీ!జై జై తెలుగు తల్లీ!!

                                                                                        -వెంకటేశ్వరరావు కట్టూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖిPermalink

Comments are closed.