అమెరికా అణుశక్తి కమిషన్ అధ్యక్షురాలైన -డిక్సీ లీ రే(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

అమెరికా శాస్త్రవేత్త ,రాజకీయ నాయకురాలు ,వాషింగ్టన్ గవర్నర్ ,అణుశక్తి ని సమర్ధించి,అణుశక్తి కమిషన్ అధ్యక్షురాలైన ధీర వనిత డిక్సీ లీ రే . వాషింగ్టన్ లోని టకోమాలో ‘’మార్గరెట్ రే ‘’గా ఫ్రాన్సిస్ ఆడమ్స్ రే,ఆల్విస్ మారియన్ రే దంపతులకు 1914 సెప్టెంబర్ 3 న జన్మించింది .12వ ఏట నే గర్ల్స్ స్కౌట్ లో చేరిన అతి తక్కువ వయసులో చేరిన బాలికగా రికార్డ్ సృష్టించింది .16వ ఏట స్వయంగా తనపేరును రాబర్ట్ ఈ లీ స్మృత్యర్ధం డిక్సి లీ గా మార్చుకొన్నది .కాలిఫోర్నియా ఒక్ లాండ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్1937లో పూర్తి చేసి ,వైట్రెస్ గా, జానిటర్ గా స్కూళ్ళలో పని చేసి౦ది .1938లో మాస్టర్ డిగ్రీ కోసం జీవశాస్త్ర పరిశోధన చేసి ‘’కంపారటివ్ స్టడి ఆఫ్ ది లైఫ్ హాబిట్స్ ఆఫ్ సమ్ స్పెసీస్ ఆఫ్ బర్రోయింగ్ యూమలే కాస్ట్రికా’’అనే థిసీస్ రాసింది .తరువాత నాలుగేళ్ళు ఓక్ ల్యాండ్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో సైన్స్ బోధించింది .జాన్ ఫిట్జర్ ఫెలోషిప్ తో స్టాన్ఫోర్డ్ యూని వర్సిటి లో బయాలజీలో డాక్టోరల్ కోర్స్ చేసింది . లాంటేర్న్ చేప కు సంబంధించిన ’’పెరిఫెరల్ నెర్వస్ సిస్టం ఆఫ్ లా౦ఫనిక్టస్ లూకోప్సారస్ ‘’అనే పరిశోధన పత్రాన్ని రాసి సమర్పించి 1945లో కాలిఫోర్నియాలోని ఫసిఫిక్ గ్రూవ్ లో ఉన్న హాప్కిన్స్ మెరైన్ స్టేషన్ నుంచి పిహెచ్ డి పొందింది .

1945లో వాషింగ్టన్ యూనివర్సిటిలో జువాలజీ ఇన్ స్ట్రక్టర్ గా చేరి,1947లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయి ,అయి దేళ్ళ తర్వాత విశిష్టమైన ‘’జాన్ సైమన్ గుగెన్ హీం మెమోరియల్ ఫౌండేషన్’’గ్రాంట్ పొంది కాల్టెక్ లో పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ చేసింది .1957లో వాషింగ్టన్ యూనివర్సిటి అసోసియేటెడ్ ప్రొఫెసర్ గా పనిచేసి౦ది .ఆ కాలం లోనే ఇంటర్నేషనల్ ఇండియన్ ఓషన్ ఎక్స్పెడిషన్ కు చీఫ్ సైంటిస్ట్ గా ఉన్నది .క్లాసులలో సైన్స్ ను అమితాసక్తి కలిగేట్లు బోధించటం ,బయట అనేక రకాల పరిశోధనలతో అలరించటం తో ఆమె పేరు ప్రఖ్యాతులు బాగా వ్యాపించాయి .దీనితో ఆమెకు మెరైన్ బయాలజీలో వీక్లీ టెలివిజన్ షో చేయటానికి ఆహ్వానం వచ్చింది .దీన్ని ‘’యానిమల్స్ ఆఫ్ ది సీషోర్’’పేరుతొ రూపొందించి ప్రదర్శనలు చేస్తేసూపర్ డూపర్ హిట్ చేసి , మరింతగా కీర్తిపొందింది .ఫసిఫిక్ సైన్స్ సెంటర్ లీ రేను ఆహ్వానించి అప్పటికే దివాళా స్థితిలో ఉన్న సైన్స్ మ్యూజియం ను నిలబెట్టే బాధ్యతను ఏడాదికి 20 వేల డాలర్ల జీతం తో అప్పగించింది .తన ఆలోచనా, ఆచరణ విధానాలతో లీ రే దాన్ని ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెంటర్ గా మార్చి అభి వృద్ధి సాధించి చూపించింది .తానూ అనుక్షణం శ్రమించి తనతోటివారినీ శ్రమి౦పజేస్తూ ఉత్సాహపరుస్తూ ఈ విజయం ఆమె సాధించింది .ఆమె కృషి పట్టుదల సమాజంలోని వారందర్నీ ఆకర్షించి ఆమె ఒక సేలిబ్రేటి అయింది .

అటామిక్ పవర్ అవసరాన్ని గుర్తించి,ప్రచారం చేస్తున్న డిక్సీ లీ రే ను 1973లో ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ గుర్తించి అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా ఉండమని ఆహ్వానించాడు .మొదట్లో ఉండటానికి ఇష్టం లేకపోయినా, చిరకాల మిత్రుడు లూ గుజ్జో నచ్చచెప్పటం తో చేరింది .ఇందులో రిసెర్చ్ ప్రోగ్రాం లతోపాటు ,అమెరికన్ మిలిటరికి న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసి ఇవ్వటం కూడా ఉండేది .ఒక్క ఏడాదిమాత్రమే పనిచేశాక ఆ కమిషన్1975లో రద్దు అయింది .

1975 ప్రెసిడెంట్ జరాల్డ్ ఫోర్డ్ ఆమెను ‘’అసిస్టెంట్ సెక్రెటరి ఆఫ్ స్టేట్ ఫర్ ఓషన్స్ అండ్ ఇంటర్ నేషనల్ ఎన్విరాన్ మెంట్ అండ్ సైంటిఫిక్ అఫైర్స్ ‘’గా పదవి అందజేశాడు .అప్పుడే ఆమె ‘’ప్రైవేట్ సెక్టార్ బాగా చేయగలిగిన దాన్ని పబ్లిక్ సెక్టార్ పూర్తిగా నాశనం చేస్తుంది ‘’అన్నది .1975లో వాషింగ్టన్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నానని చెప్పి అందర్నీ ఆశ్చర్య పరచింది .ఎందుకు పోటీ చేస్తున్నావు అని అడిగితె ‘’ఈ వయసులో అట్టడుగు నుంచి ప్రయత్నించ లేక ,పైనుంచే నరుక్కోద్డామనిపించి’’అని తెలివిగా సమాధానమిచ్చింది .అనుభవం ,రాజకీయపార్టీల మద్దతు ,పత్రికల సపోర్ట్ , చేతిలో చిల్లిగవ్వా లేకపోయినా పెళ్ళికాని ఆవిడ కు గవర్నర్ పదవి ఏమిటి అని ఈస డి౦చినా డిక్సీ లీ రే మేయర్ గా గెలిచి పొలిటికల్ పండిట్ లకు మైండ్ బ్లాంక్ చేసింది .వాషింగ్టన్ గవర్నగ్ గా పని చేస్తూ జీతాలు ,ప్రోగ్రాములపై ఆడిట్ విధించి ,ప్రాధమిక విద్యకోసం బాగా ఖర్చు చేసింది .గవర్నర్ భవనం లో ఫస్ట్ లేడీ లేకపోయినా ,తనపెద్ద అక్క మెరియన్ రీడ్ ను తన అఫీషియల్ హోస్టెస్ గా ఏర్పాటు చేసుకొన్నది.తనకు ముందున్న గవర్నర్124మందికి ఇచ్చిన ఉద్యోగాలను ఊడగొట్టి ముసలి ముఠా తో నింపింది .’’ఎస్ మెన్ ‘’తో నింపింది అని చెవులు కోరుక్కునారు గిట్టనివాళ్ళు .అటామిక్ పవర్ ప్రాముఖ్యతను బాగా ప్రచారం చేసింది .దాదాపు ప్రజలందర్నీ ఉపయోగకరమైన పనులతో ఆకర్షించి ‘’వండర్ ఫుల్ లేడి .ప్రెసిడెంట్ పదవికి ఈమె పోటీ చేస్తే బాగుంటుంది ‘’అనే అభిప్రాయం కలిగించింది .

1980ఏప్రిల్ 3 న మౌంట్ సెయింట్ హేలెన్స్ అగ్నిపర్వతం బ్రద్దలై భీభత్సం సృష్టించినపుడు అన్నిజాగ్రత్తలు తీసుకొని రాష్ట్రం లో ఎమర్జెన్సి విధించింది .అమెరికా ఫారెస్ట్ సర్వీసెస్ సహాయంతో చావు అంచున ఉన్న 30వేలమందిజనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలింప జేసింది .గవర్నర్ పదవిలో ఉండగా ఆ అగ్నిపర్వతాన్ని విమానం మీద చుట్టి త్వరలోనే మళ్ళీ బ్రద్దలౌతుందని సైంటిఫిక్ ఆలోచనతో చెప్పింది . అలాగే మళ్ళీ మేనెల 18న బ్రద్దలై 57మందిని కబళించింది .1980లో మళ్ళీ గవర్నర్ పదవికి పోటీ చేసింది కాని ఓడిపోయింది .

పదవీ విరమణ తర్వాత ఫాక్స్ లాండ్ ఫారం హౌస్ కు చేరి అక్కడే ఉన్నది .మిత్రుడు గుజ్జో తో కల్సి రెండుపుస్తకాలు 1-ట్రాషింగ్ ది ప్లానెట్ పుస్తకం లో పర్యావరణ శాస్త్రవేత్తలు మాటలమనుషులేకాని చేతల వాళ్ళు కారు అని చెప్పింది .పర్యావరణ పరిరక్షణకోసం జీవితాంతం కృషి చేసింది .వరుసగా రెండు సార్లు ఎన్నికలలో వోటు వేయనివారి వోటు హక్కు తొలగించాలని ప్రచారంచేసింది .వాతావరణ (క్లైమేట్ ) మార్పుల శాస్త్రవేత్తలగురించి చెబుతూ ‘’వాళ్ళు సగటు గాళ్ళు .వాళ్ళకు దూరంగా ఉండండి .వాళ్లకు ఒకే బ్రెస్ట్ ఒకే కిడ్నీ ఉంటాయి ‘’అని చమత్కరించింది .

ప్రతిభకు తగిన పురస్కారాలు గుర్తింపులు డిక్సీ పొందింది .1958లో మెరైన్ బయాలజీలో ‘’క్లాప్ అవార్డ్ ‘’,1973లో కన్జర్వేషన్ సర్వీస్ కు ‘’ఫ్రాన్సెస్ కె.అచిన్సన్ మెడల్ ,అమెరికా పీస్ మెడల్ ,1974లో ఫ్రాన్సిస్ బోయర్ సైన్స్ అవార్డ్ లు లభించాయి .ఇంతటి విద్యా వేత్తను గవర్నర్ గా ఎప్పుడూ చూడలేదు అని సెనేటర్ గార్డన్ వాల్ గ్రెన్ కీర్తించాడు .అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ సంస్థ ఆమె పేరిట అవార్డ్ ఏర్పరచి ప్రాతి ఏడాదీ పర్యావరణ పరి రక్షణకు విశేష సేవచేసినవారికి అందిస్తున్నారు . ఆమె రాసిన పేపర్లు ,పుస్తకాలు ఆమె జ్ఞాపికలు అన్నిటిని 190 బాక్సులలో భద్రపరచి ,స్ట్రాన్ఫోర్డ్ యూని వర్సిటి లోని హోవర్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ లైబ్రరి అండ్ ఆర్కైవ్స్ ‘’లో జాగ్రత్త చేశారు .

సమర్ధ గవర్నర్ గా ,పాలనా దక్షురాలిగా ,పర్యావరణపరిరక్షురాలిగా ,ప్రజాస్వామ్య వాదిగా ,జీవశాస్త్ర వేత్తగా ,అణుశక్తి సంఘాధ్యక్షురాలిగా బహుముఖీన ప్రతిభ కనబరచిన డిక్సీ లీ రే 2-1-1994 న 80వ ఏట మరణించినది.

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Comments are closed.