తెలుగు పరిమళాల వ్యాపకుడు-అక్షర భూమికల స్వాప్నికుడు డా.వూటుకూరి(సాహిత్య వ్యాసం )-

ISSN 2278-478

ఆయన కలం పడితే కవిత్వం గోదావరి జలపాతంలా జాలువారుతుంది.చినుకు చినుకు కలిసి పాయలా మారినట్లు,పదం పదం కలసి కవితా ఝరిలా ప్రవహిస్తుంది.ఆయనే డా.వూటుకూరి వరప్రసాద్.వారి కలం నుండి జాలువారిన,మరో ఆణిముత్యం *అక్షరభూమిక* తెలుగు సాహితీ జగత్తులో తనకంటూ,ఒక ప్రత్యేకతను చాటుకున్నారు వూటుకూరి.ఉపాధ్యాయుడుగా,పరిశోధకుడిగా,కథా రచయిత గా,కవిగా, విమర్శకుడిగా సమాజానికి తనవంతుగా సాయపుతున్నారు.ముఖ్యంగా తెలుగు భాషోపాధ్యాయుడుగా,ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపారు.ఉత్తమ ఆదర్శ ఉపాధ్యాయుడుగా కీర్తి గడించారు.అనురాగం ఆప్యాయత కలబోసి,పిల్లలకు విద్యాబుద్ధులు భోధించంలో నేర్పరి.సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, అసమానతలు,అంటరానితనం, పడుపువృత్తి లో మ్రగ్గిపోతున్న యువతుల ఆవేదన, స్త్రీ కి చదువు ఎంత అవసరమో,సమాజంపట్ల యువత గౌరవంగా మెలగాలని,ఉత్తమ పౌరులుగా జీవించాలని,పెద్దలను చూసి పిల్లలు ఎంతో నేర్చుకోవాలని,ఆర్థిక అసమానతలు రూపుమాపాలని,వీటన్నింటిపై తన కలం ఎక్కుపెట్టి తన గళం వినిపించి,సమాజ మార్పుకోసం పరితపిస్తూ జీవిస్తున్నారు.రచనావ్యాసంగం చేస్తున్నారు వరప్రసాద్.

ఇంతకు ముందే వెలువరించిన *తెలుగు పరిమళం* దీర్ఘకావ్యం తెలుగుభాషా చరిత్ర,తెలుగువారి పుట్టుక, తెలుగువారి ప్రయాణం, ఏవిధంగా సాగిందీ, తెలుగుభాషగా ఎలా రూపుదిద్దుకుందీ చక్కగా వివరించారు ఆ కావ్యం లో…మండలి బుద్ధప్రసాద్ గారు తెలుగు పరిమళం కావ్యం గురించి,వూటుకూరి వారి రచనా పటిమ గూర్చి ఈ విధంగా చెప్పారు.”వచనం ద్వారా ఇంత చక్కగా చరిత్రను,అందులోనూ తెలుగు ఉన్నతిని వివరించవచ్చునా!అన్పిస్తుంది. గుఱ్ఱం జాషువా “గబ్బిలం”సాగినట్లుగా ఎన్నో అంశాలను ఈ కవిత సృజించింది.అని వరప్రసాద్ కావ్యం గురించి వివరించారంటే,ఆయన రచనా పాటవ మేపాటిదో,ఎంతటి లోతైన విశ్లేషణ కల్గివుందో బుద్ధప్రసాద్ గారి మాటల ద్వారా మనం గమనించవచ్చు.

ఇక “అక్షర భూమిక”కవితా సంకలనం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అన్పిస్తుంది. కవి సమాజంలో జరుగుతున్న, సంఘటనలు గమనించి తన పదునైన అక్షర మూటలను, విల్లంబులుగా మార్చి మాటల ఈటెలుగా గుచ్చుకునేట్లుగా,ప్రజల్లో పరిపాలకుల్లో మార్పు తీసుకు వచ్చేలా,ఆలోచింప చేసేలా తన రచన కొనసాగించారు.వరప్రసాద్ రచనల్లో సామాజికాంశాలనే ఎన్నుకున్నారు…
అందమైన పావురాళ్లు అనే కవితలో మనదేశంలో మహిళలు ఎలా బ్రతుకుతున్నారో వివరించారు.స్త్రీ కి వ్యకిగత స్వేచ్ఛ లేదని వివరించారు.

నాదేశంలో ఇప్పటికీ
గడపదాటి రాలేక…..
…………………….
స్వేచ్చా రెక్కలు తెగి
సంసార పంజరంలో…..
………………………
ఈ కవితలో స్త్రీజాతి ఈ ఇరవైఒకటో శతాబ్దంలో కూడా, వంటింటి కుందేలుగా జీవనం కొనసాగిస్తున్నారని.నాలుగ్గోడల మధ్య జైలులో ఖైదీలా జీవితం వెళ్ళాదీస్తున్నారని,వారి దీనస్థితిని వివరించారు.సంసార పంజరంలో అందంగా ఆడుకునే పావురాళ్లు అంటూ,పంజరంలో ఉన్న పావురం ఎలా బందీయై ఉందో నేటి ఆధునిక మహిళ కూడా తన కోరికలు చంపుకొని,భర్తకు ఎదురు చెప్పలేక జైలు పక్షిలా, జీవచ్ఛవం లా,బ్రతుకుతుందని ఉపమానరీతిగా వివరించారు. పదాల పొందిక చక్కని పలువరుస కూర్పులా గుదిగుచ్చి మనకందించారు.

మరియొక కవితలో ఉన్నత చదువులు చదువుకొని,మనదేశంలో ఉద్యోగాలు చేయకుండా, పరాయి దేశంలో తమ తెలివి తేటల్ని,మేధావులు అమ్ముకుంటున్నారని.డాక్టర్లు, సాప్ట్ వేర్ ఇంజనీర్లు,సైoటిస్ట్లు తమ తెలివి తేటల్ని విదేశాలకు,అమ్ముకుంటున్నారని ఆవేదన చెందుతూ రాసారు.

డబ్బుకోసం
వేశ్య ఒళ్లమ్ముకున్నట్లు
మేధావులు తమ
తెలివితేటల్ని
వినయంగా విక్రయిస్తున్నారు….
ఇక్కడ పూజకు
నోచుకోని పూలు
మరోచోట మేధోపరమైన
పరిమళాలు
ప్రపంచానికి వెదజల్లి
ప్రశంసలు వెల్లువెత్తేలా
కృషి చేస్తున్నారు…….
……….
వేశ్య తన కడుపు నింపుకోవడంకోసం,కుటుంబాన్ని బ్రతికించుకోవడం కోసం,తన ఒళ్ళు అమ్ముకొని బతుకీడ్చుకొస్తుందో,గొప్ప గొప్ప ఉన్నత చదివి తమ తెలివితేటలు,విదేశాలకు అమ్ముకొని,అక్కడ కీర్తి గడిస్తున్నారని,మేధావులను గూర్చి చెప్పారు.మనదేశం ఇలాంటి మేధావుల్ని గుర్తించలేకపోవడం వల్ల,విదేశాలకు వెళ్లి తమ తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తూ ఉన్నారు.అని కవి తెలియజేస్తూ,అటువంటి ప్రతిభావంతులైన వారిని ప్రభుత్వం గుర్తించి దేశ సేవకు వినియోగించాలని,చెబుతున్నాడు.డబ్బుకోసం ఒళ్ళు అమ్ముకొని బ్రతికే వేశ్యలాగా, మేధావులు తమ తెలివితేటల్ని అమ్ముకుంటున్నారని పోలిక చూపారు.

అలాగే ‘టీచర్ ‘అనే కవితలో ఉపాధ్యాయుడు అంటే ఏమిటి.అతని విలువ ఏమిటి.అని ఈ కవితలో వివరించారు.
“అజ్ఞానం
బ్లాక్ బోర్డమీద
వెలుగు అక్షరాలు
రాసి
బతుకును దిద్దే
సూత్రధారి.”
విద్యార్థుల్లో ఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి,వారి జీవితాల్లో అక్షర దీపాల్ని వెలిగించి,వారి బతుకుల్లో వెలుగు రేఖలు ప్రసాదించే నిస్వార్ధజీవి టీచర్.అని చక్కటి పొందికను గుదిగుచ్చారు.

మరొక కవితలో అమ్మ తర్వాత అమ్మలాంటి నర్సును గురించి వివరించారు.
“చీకటి గాయాన్ని
దూదిలాంటి
మనస్సుతో
వేపనం రాసి
కట్టు కట్టే సుమస్వి”…
ఏ తల్లీ చేయలేనటువంటి గొప్ప సేవ ఒక “నర్సు”మాత్రమే చేస్తుంది.మన దేహమంతా నుజ్జు నుజ్జు లా మారినా,కుళ్లు పట్టి కంపు గొట్టినా, అంతు చిక్కని రోగమేదో సోకిందని, నా అనుకున్నవాళ్ళు దగ్గరకు రావడానికి, ఇష్టపడక పోయినా సరే అటువంటి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ,కన్నా బిడ్డల్లా వారికి సేవ చేసే దయార్థురాలు నర్సు.అటువంటి నిస్వార్థ జీవిని ఆమె సేవను గొప్పగా తెలియజెప్పారు కవి.

క్రైస్తవ సాహిత్యాన్ని గుడా సవివసరంగా వివరించారు వూటుకూరి.క్రిస్మస్ అనే కవితలో
“పామరుడు
పండితుడైతే
అది ఉషస్సు
పండితుడు
పరిశుద్దుడైతే
అదే క్రిస్మసు”
చదువుకోనివాడు జ్ఞానం లేని వాడు,జ్ఞానసంపన్నుడైతే అతడి జీవితంలో వెలుగు రేఖలు ఉదయిoచినట్లే.పండితుడు వేదాలను పటించి సత్యాన్ని తెలుసుకొని,పరిశుద్ధ వాక్యాన్ని గ్రహించి సత్యవాక్య పరిపాలకుడైన వేళ, క్రీస్తు తత్వాన్ని తెలుసుకుని, అందరినీ సమానంగా ప్రేమించిన నాడే నిజమైన క్రిస్మసు అని వివరించారు.

సామాజిక నేపద్యంలో ప్రభుత్వ పనితీరును తెలియజేస్తూ,పతనానికి గురుతులంటూ…..
ప్రస్తుత ప్రభుత్వ
హాయములో వేసిన
పునాదిరాళ్లు…….
…….
అవి సకాలంలో
పూర్తి చేయలేనపుడు….
……………………………
అసమర్థతకు
గురుతులుగా
మిగిలిన ఆనవాళ్లు”….
ప్రభుత్వ పనితీరు ఆరంభ సూరత్వంలాగా,ఆడంబరాలకు పోకుండా, ప్రభుత్వహయాంలో వేసిన పునాదిరాళ్లు, శిలాఫలకాలుగా మిగిలి పోకుండా,సకాలంలో నిర్మాణాలు జరిగించి పూర్తి చేసి,ప్రభుత్వ ఫలాలు బడుగు బలహీనులకు, సకాలంలో అందించగలిగితే సామాన్య జనులకు ఎంతో ఉపయోగపడతాయని.అలా కాకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పునాది రాళ్లుగా,మిగిలిపోతే,ప్రభుత్వ అసమర్థత్వానికి గురుతులుగా ఆ శిలాఫలకాలు గుర్తులుగా మారిపోతాయని గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

ఈ విధంగా సమాజంలో నిత్యం జరిగే సమస్యలను,ప్రజల సాధక బాధలను,ఆవేదనను,ఆక్రోశాన్ని,తెలియజేస్తూ స్త్రీజాతి విముక్తికీ,అనాథలను ఆదుకోవాలని,ప్రతిఒక్కరూ సాటిమనిషితో స్నేహంగా మెలగాలని,సమసమాజ స్థాపన జరగాలని,ప్రతి వ్యక్తికి అక్షర జ్ఞానం ఎంతో అవసరమని,తమ అక్షరభూమిక ద్వారా వివరించారు.

వూటుకూరి వరప్రసాద్ కవిగా,సామజిక స్పృహ కలిగిన మనిషిగా,సమాజంలో జరుగుతున్న అసమానతలను,తన కలం ద్వారా మనముందుంచారు.చక్కటి రచనా పాటవం కలిగిన వారు డా.వూటుకూరి వరప్రసాద్.ప్రసాద్ గారి గురించి ఆచార్య. ఎండ్లూరి సుధాకర్ గారు మాట్లాడుతూ…”ఊరగాయ నుంచి కందనగాయ వరకు కమ్మగా తెలుసుకున్నాడు.”అంటూ.మంచి భావుకుడు గనుక, భాషాదృష్టి పదాల కండపుష్టి వున్నవాడు వూటుకూరి.అంటూ వారి రచనావిధానాన్ని మెచ్చుకున్నారు.

అక్షరభూమిక కవితా సంకలనంలో రైతు ఏవిధంగా తన పొలంలో విత్తనాలు వెదజల్లుతాడో,ఆవిధంగా *అక్షరభూమిక* కవితాసంకలనంలో సువర్ణాక్షరాలను తెలుగు సాహితీ లోకంలో వెదజల్లారు వూటుకూరి.సమాజాభ్యుదయాన్ని,మానవుని ఎదుగుదలకు ప్రభుత్వ పనితీరును,మహిళాభ్యున్నతిని,వ్యక్తిగత స్వేచ్ఛ, మేధావుల తెలివితేటల్ని,మనదేశం ఏవిధంగా ఉపయోగించుకోవచ్చునో,వాడుకోవాలో వివరించారు.మేధావులను గుర్తించకపోతే జరిగేనష్టం కూడా తెలియజేసారు.ఈ అక్షర భూమిక చదువుతున్నంతసేపూ లోకాన్ని మైమరిపించింది.ఒక నదీ ప్రవాహంలా సాగిపోతుందీ అక్షరభూమిక…..

-వెంకటేశ్వరరావు కట్టూరి
పరిశోధక విద్యార్థి
తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.