సమతను కాంక్షించిన కుసుమ ధర్మన్న(సాహిత్య వ్యాసం )–డా .ఎ .ఈశ్వరమ్మ

ISSN 2278-478

కుసుమ ధర్మన్న తొలితరం దళితకవి . స్వాతంత్రయానికి  పూర్వం 1993 లో హరిజన శతకాన్ని రచించారు . అప్పటికి జాషువా గబ్బిలం వంటి కావ్యాలు రాలేదు . ఒక వైపు జాతీయోద్యమం కొనసహుతున్న సంఘంలో కుల వివక్ష కొనసాగడాన్ని కళ్ళారా చూశారు . పరిస్థితులు పంజావిసిరితే నిస్సారమైన మెదడులో కూడా వ్యూహం పుడుతుంది . బలహీనమైన పక్షి కూడా తనగూడు మీద జరిగితే తిరుగుబాటు చేస్తుంది .

ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ , గాంధీజీల ప్రభావాలతో స్ఫూర్తి పొంది అంటరాని తనాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంతో ఈ శతకాన్ని రచించారు . వర్ణ ధర్మం పేరిట భారతీయ సమాజంలో సృష్టించిన హెచ్చు తగ్గులను నిరసించారు . బూటకపు ప్రజా స్వామ్యవాదులకు తన వాదనలను బలంగా వినిపించారు . నోటితో పలకరింపు నుదిటితో వెక్కిరింపు ధోరణులను నిర్మొహమాటంగా ఖండించారు . లక్ష సబ్బులకు కూడా తొలగిపోని కులము పంకిలాన్ని తనజాతి జనుల తలమీద పులిమి ఎన్నటికీ పూడ్చలేని ఆగాదాన్ని సృష్టించిన ఈ వర్ణ సమాజంపై ద్వేషాన్ని రగిలించక , తన జాతి జనులకు ప్రబోధం గావించుటయే ఎంచుకున్న విశాల హృదయాలు .

“మేలుకొనుము నీవు తరుణము మించకుండ
జన్మ హక్కులకై పోరుసల్పు మిపుడే
హక్కుకి ప్రాణమిడుట ద్రోహంబు కాదు
స్వర్గ పదమని నమ్ముము స్వాంతమందు … అంటూ ….

తన జాతీయుల్లో ఆత్మ గౌరవ స్ఫూర్తిని, దాప్తిని రగిలించారు . స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన జాతీయ పార్టీలో సభ్యుడిగా ఉంటూనే వారి వ్యవహార శైలిలోని లోసుగులకు నిరసన తెలియచేస్తూ “మాకొద్దీ నల్ల దొరతనం “ అంటూ గళం విప్పి గానం అభివృద్ధి విషయంలో ఆనాటి నాయకుల ఆశయాలను విశ్వసించి గౌరవించినా వాటి ఆచరణలో లోపాలను ఎలాంటి సంకోచమూ లేకుండా ప్రతిఘటించేవారు .

ధర్మన్న వృత్తి చేత ఆయుర్వేద వైద్యులు . వీరి ప్రవృత్తి సంఘసంస్కరణ . వీరు తాము రచించిన గేయాలను , కథలను సంఘానికి ప్రబోధం కలిగించడానికి ఉపకరణంగా ఉపయోగించారు . దళిత వర్గాలను తొలుత పంచమ వర్గం అనేవారు . 1917 లో అది ఆంద్ర అయింది . 1931 లో హరిజన అయింది . 1936 లో షెడ్యులు కులం అన్నారు . 1976 తర్వాత దళిత వర్గమనే పేరు ఖరారయింది . “హరిజన ‘ పదం ప్రస్తుత నిషేదించినా ఈ పదం శతకంలో మకుటంగా ఉన్నందువల్ల స్వీకరించడం జరిగింది .

ఒకప్పటి సమాజం సుఖశాంతులతో ఎలా ఉండేదో చెబుతూ …..
“ఆదికాలమందు నవనిలో జనులెల్ల
నన్నదమ్ములగుచు నాశనీడి
చీకు చింతలేక చిరంజీవులైరయా
ఆలకింపుమయ్య హరిజనుండ “ అంటూ ….
ఆనాటి సమాజంలో వెల్లివిరిసిన ఆనందాన్ని వివరిస్తూ , నేడు స్వార్ధపరులు సమాజాన్ని ఎలా చీల్చి చండాడారో ధ్వని పూర్వకంగా వివరించారు .

“హక్కు సత్వములును నధికారమును లేదు
నేను నీవను తెగ నీల్గులేదు
మాయబుద్ధి జూడ మచ్చుకైనను లేదు
ఆలకింపుమయ్య హరిజనుండ “ అంటూ ….
మనుషుల మనస్సులో స్వచ్చతను వివరిస్తూ – నేడు
ముందు – వెనుక , కుడి – ఎడమ దగాలకు గురవుతూ సమాజమెలా దిగాలు పడిందో చెప్పకనే చెబుతున్నారు .

“కడుపు నిండి యొకడు కడుపుమండి యొకడు
తొత్తు యొకడు లేడు దొరయు లేడు
భాగ్య వంతు డొకడు బడుగు పేదయులేడు
ఆలకింపుమయ్య హరిజనుండ “ అంటూ –
మానవుల మధ్య సమతా భావం , సర్వజనుల శాంతి సంతోషాలతో చీకు చింతలేక ఆరోగ్యంగా జీవించిన తీరు వివరిస్తూ – నేడు దుఃఖ పూరిత శుష్క జీవనులుగా మనమెందుకుండాలని ప్రశ్నిస్తూ ప్రబోధిస్తున్నారు .

“నరక కూపమాయె నరలోకమెల్లను
సాగిపోయే సుఖము శాంత మెల్ల
బ్రతుకు భారమాయే భ్రమరదూరమాయేరా
ఆలకింపుమయ్య హరిజనుండ “

రానురాను స్వర్ధపెరిగిన మనుషుల వాళ్ళ జీవితాలెంత దుర్భరమైపోయినవో , మనిషికీ మమతకూ అడ్డుగా నిలిచినా ఈ వ్యవస్థలో మనుగడ ఎంత కష్టమో వివరిస్తూ కర్తవ్య బోధ చేస్తున్నారు . మనం నవనాగరిక యుగంలో ఉన్నాం . ప్రచండ వేగంతో ప్రపంచం పురోగమిస్తుంది . నివ్వేరపరచే గుణాత్మక ప్రగతి అన్ని రంగాలలోనూ కనిపిస్తుంది . సర్వ్ సర్వత్రా మానవులు తమ మనుగడ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధ పడుతున్నారు . అయినప్పటికీ నేటికీ వారి ప్రబోధం మన సమాజానికి ఎంతో అవసరం .
“ఉన్నది ఒక్క జీవితమే మానవునిగ వీరునిగ బ్రతుకుము నరుడా
చరిత్ర నీకోసం ప్రసన బాధపడుతున్నది
భవిష్యత్తు నీకోసం పడిగాపులు కాస్తున్నది
ఉన్నది ఒక్క జీవితమే మానవునిగ వీరునిగ బ్రతుకుము నరుడా “

-డా .ఎ .ఈశ్వరమ్మ
రీడర్ &హెచ్ .ఓ .డి తెలుగు విభాగం
మహారాజ కళాశాల (అటామాస్ )
విజయనగరం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.