దేవుడిచ్చిన తోడు-(కథ )-డా. లక్ష్మి రాఘవ

చూపంతా అక్కడే …
ఎదురుగా నిశ్చలంగా పడుకున్న కామేశం…
అతని మీద వాలుతున్న ఒక ఈగపై కసి!
నా కొడుకు మీద వాలుతావా అని చేత్తో గట్టిగా ఊపుతూ దానికి హెచ్చరిక…
అతని ముక్కు లో దూర్చిన దూదిపై కోప౦ “నాకొడుకు శ్వాసను అడ్డుకుంటావా అని…
కట్టివేసిన అతని చేతి, కాళ్ళ బొటన వేళ్ళనీ వెంటనే ఊడదీసి స్వేచ్చ నివ్వాలన్న తపన…
ఒత్తుగా వున్న వంకీల జుట్టు ముట్టుకుంటే బిరుసుగా అయ్యిందే అని బాధ..
“నా జుట్టే నాకందం కదమ్మా” అనే కామేశం ఈ రోజు దాన్ని పట్టించుకోలేదేం??
కామేశం మూసిన కళ్ళ నుండీ కారుతున్న కన్నీళ్ళ లాటి ద్రవం….తుడచబోతే చల్లగా ఐసు లా వున్న అతని శరీరం..
ఆ చల్లదనం సీతమ్మ ను ఒక్క సారి ఉలిక్కి పడేలా చేసింది..
“అయ్యో బాబూ కామేశం చివరకు ఇలా పోయావా ?” సీతమ్మకు ఏడుపు ఉప్పెనలా వచ్చింది.
“ఏడవకమ్మా…తల్లి కడుపుకోత తెలియంది కాదు…”
కడుపుకోతా?? నిజమే కడుపులో ఓ కత్తి గుచ్చికొస్తున్నట్టు వుంది….

“నీ కొడుకు రాము ఎప్పుడు వస్తానన్నాడు సీతమ్మా … పట్నం లో అయితే ఐసు పెట్టె లో పెడతారు.
ఇట్లా బయట వుంటే శవం సాయంకాలం లోపల దానం చెయ్యాలి కదా ..” ఒక పెద్దమనిషి అన్నాడు.
“ఓబులేసుతో కబురు పెట్టినాను ..వచ్చేస్తాడయ్యా…” ఏడుపు గొంతుకతో అంది సీతమ్మ.
మరో గంటలో రాము వచ్చినాడు. అన్ని ఏర్పాట్లు చేసి దానం కార్యక్రమం పూర్తి చేశాడు. ఇంటికి వచ్చి స్నానం చేసి
“అమ్మా, మంచే జరిగింది అనుకో …ఇక నీవు నిశ్చింత గా ఉండచ్చు…వాడు వుండి మనకు మనస్తాపం చేసేదానికన్నా ఇలా పోవడం మేలు అయ్యింది…” అంటున్న రాము ను నిర్వికారంగా చూసింది.
“పది రోజులకు రాగలనో లేదో ఈ డబ్బు ఉంచు..మళ్ళీ తీరిక అయినప్పుడు వస్తాలే” అన్నాడు రాము చెప్పులేసుకుంటూ..
“ఒక పూట ఉండరా…” కష్టం మీద గొంతు పెగల్చుకుని అంది సీతమ్మ.
“అక్కడ సంసారం చూసుకోవాలి గదా..” అంటూ గడప దాటాడు.
అక్కడ వున్నపెళ్ళాం పిల్లలేనా సంసారం? ఇక్కడ వున్న తల్లి ,అన్న ఏమీకారా? అని ప్రశ్నించలేదు సీతమ్మ.
పెళ్లి అయి ఐదేళ్ళు అయినా పల్లె ఇష్టపడని భార్యను పిల్లలను ఎప్పుడూ తీసుకు రాడు రాము.
నీరసంగా వుంటే పడుకుంది సీతమ్మ. వీధి తలుపు తోసుకుని లోపలకు వచ్చిన పక్కింటి సారమ్మ
“సీతమ్మా కొంచెం అన్నం కూర తెచ్చినా …ఎంగిలి పడు …పోయినోల్లతో మనమూ పోము కదా …తింటావు కదా నేను మళ్ళీ వచ్చి నీకు తోడుగా పండుకుంటా…సరేనా?”
“ఆకలి లేదు సారమ్మా…”
“అట్లనే వుంటాదిలే…నేను వస్తాను ఇప్పుడే…” అంటూ వెళ్ళింది సారమ్మ.
కళ్ళు మూసుకుని కామేశాన్ని తలుచుకుంటే గతం గుర్తుకు వచ్చింది…

పెళ్లి అయిన ఏడేళ్ళు పిల్లలు పుట్టలేదు సీతమ్మకు. ఎన్ని దేవుళ్ళకో మొక్కుకుంటే కడుపున పడిన బిడ్డ కామేశం ..
వాడికి నాలుగేళ్ళు వచ్చాక పుట్టినాడు రాము. ఇద్దరు కొడుకులని మురిసిపోయిన సీతమ్మ, కిట్టన్న దంపతులకు ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ఐదు సంవత్సరాలకే కామేశం మూర్చరోగం వచ్చి పడిపోతే ఎంతగానో కుమిలి పోయారు. పట్నం వైద్యం చేయించలేమని తెలిసిపోయింది. అప్పటి నుండీ కామేశాన్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలేది కాదు సీతమ్మ. స్కూలు కు పంపితే ఒక రోజు క్లాసులో పడిపోయినాడని టీచరు చెప్పి పంపితే వెళ్ళింది సీతమ్మ.

“స్కూల్ లో ఇట్లా పడిపోతే కష్టం..జబ్బు నయం చేయించుకుని పంపండి” అనింది టీచర్ .
అలా చదువుకు దూరం అయినాడు కామేశం. కానీ రాము బాగా చదువుకునే వాడు.
ఒకరోజు పొయ్యి దగ్గర పడిపోయినాడు కామేశం…కొంచెం లో తప్పింది కానీ వొళ్ళు కాలిపోయేదే… పెద్దగయినాక నాయన తో బాటు పొలం పనులకు పోయినా భయంగా వుండేది ఎప్పుడు ఏమవుతాడో అని. కష్టం చేసే ఆరోగ్యమూ లేదు.
రాము స్కూలు అయినాక పట్నం వెళ్లి కార్పెంటరు పని నేర్చుకుంటా అని అంటే వద్దన లేదు తల్లిదండ్రులు. వాడైనా బాగుపడి ఇంత సంపాదిస్తాడు అని ఆశ. వున్న అర ఎకరం పొలం లో కొద్దిగా పండించుకుంటూ రోగిష్టి కామేశం తో కాలం గడుపుతూ వుంటే ఒక రోజు పొలం లో పాము కరిచి కిట్టన్న చనిపోయినాడు…
కిట్టన్న పోయినా కొడుకు కోసం తానూ బాగుండాలని కోరుకుంది సీతమ్మ.

పట్నం లోనే పెద్ద కార్పెంటరు కూతురిని పెళ్ళిచేసుకున్నాడు రాము. పెళ్లి అయినాక ఒక్కసారి మాత్రమే వచ్చింది రాము భార్య.
వున్న పొలం కౌలుకు ఇచ్చి వచ్చే డబ్బులతో ఎంత జాగ్రత్తగా చూసుకుంది కామేశాన్ని.
రెండేళ్ళ క్రితం రాము వచ్చి పట్నంలో ఇల్లు కొనాలని పొలం అమ్మితే తప్ప దుడ్లు సరిపోవని మొండికేస్తే ఎంత ప్రతిఘటించింది తను? కామేశాన్ని చూసుకోవడం ఎలా అంటే నేను దుడ్లు పంపిస్తాను మీ బతుకు తెరువుకు అని బేరం పెట్టి వచ్చిన డబ్బులో ఒక ఐదు వేలు చేతిలో పెట్టి పోయిన వాడు…నెల రోజులప్పుడు వచ్చి

“అమ్మా నీకు వయసు అవుతూంది..ఎన్నాళ్ళు చూసుకుంటావు? అందుకని ఒక సంబంధం చూస్తున్నా అన్నకు…అమ్మాయి అంగన్ వాడిలో ఆయాగా పని చేస్తూంది. పెళ్లి చేసేస్తే ఆ పిల్ల నీకూ వాడికీ తోడూ వుంటుంది. సంపాదనా వుంటుంది. వచ్చేనెలలో పెళ్లి చేసేస్తా..” అని అంటే
“పెళ్లి చేసేటట్టు అయితే ఆ పిల్లకు వీడి రోగం గురించి చెప్పాలి రామూ,”
“అట్లా చెబితే మూర్చరోగం వున్న నీ కొడుక్కు పెళ్లి అవుతుందా?…ఇట్లాంటి వాడిని కనడం నీ కర్మ! కాదు కాదు మన కుటుంబానికే పట్టుకున్న శని….ఎన్నాళ్ళు పడతాము ఏదో ఒకటి ఆలోచించాలి కదా…పోనీ నీవు వున్నన్నాళ్ళు చూసుకుని ఇంత బువ్వ వండి పెడతావు…రేపు నీవు పోయినాక వాడు ఏమి గతి పడతాడు? ఆలోచన చెయ్యి..” కచ్చితంగా చెబుతున్న రామును చూస్తూ “మనకు కష్టం అని …రోగం వున్నసంగతి దాచి, చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ పిల్ల జీవితం పాడు గాదా?”
“ నీకు ఏమైనా అయ్యి వాడు మా మీద పడితే నేను ఏమీ చెయ్యలేను. పిచ్చిగా ఆలోచన చెయ్యక …నోరు మూసుకుని వుంటే నేను రేపే వెళ్లి చెప్పి వస్తాను పెళ్లి ఖాయమని…”

“వద్దురా ఇంకొకరి బిడ్డను కష్టపెట్టకూడదు. మళ్ళా వాళ్లకు అసలు సంగతి తెలిస్తే…”
“అందుకే మనకు దూరంగా వున్న కూడూరి పల్లి లో చూసినా సంబంధం…పెళ్లి అయిపోనీ మల్ల ఎవరు చెబితే ఏమి?”
రాము వెళ్ళిపోయినా సీతమ్మ ఆలోచనలు ఆగలేదు. తను పడుతున్న కష్టం చాలు. కామేశం దినానికి రెండు సార్లైనా మూర్చరోగం తో పడి పోతాడు.. లేచినాక చాలా నీరసంగా ఉంటాడు. పట్నం తీసుకెళ్ళి చూపించలేక, నాటు వైధ్యాలన్నే చేసినా బాధలు తప్పలేదు…ఇప్పుడు ఇంకో పిల్ల ని ఈ సంసారం లోకి లాగితే పాపం కాదా ? రాత్రంతా అలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది.
మరురోజు ఓబులేసు ను పిలిచి కూడూరి పల్లి ఎక్కడ వుందో కనుక్కుంది. కొన్ని గంటలు కామేశాన్ని చూసుకోమని ఓబులేసుకు చెప్పి బయలుదేరింది.

ఆ పల్లె చేరడాని కి ఒక గంట పట్టింది..అందరినీ అడుక్కుంటూ అంగన్ వాడి స్కూలుకు వెళ్లి ఆయాగా పని చేస్తున్న ఆమెను చూడాలని అంటే “ఎవరూ” అని రమ అన్న పిల్ల వచ్చింది. “ఎవరమ్మా “అంటూ” పిల్ల ఎత్తు పళ్ళతో కొంచెం వికారంగా వుంది.
“అమ్మా నేను కరిగ పల్లి నుండీ వచ్చినా..నాపేరు సీతమ్మ “ అంటే ఆపిల్ల మొగం లో ఆశ్చర్యం…
“నీకు నా కొడుకు కామేశం తో పెళ్ళికి మాట్లాడు తున్నారు..నీకు తెలుసూనా?” అంది సీతమ్మ
“అవును” తల ఊపింది .

“నీవు ఈ పెళ్ళికి ఒప్ప్పుకోవద్దు…నాకొడుకు కామేశానికి చిన్నప్పటి నుండీ మూర్చ రోగం ..చదువు లేదు ..తల్లిని కాబట్టి కన్నకోడుకును ఎంత కష్టమైనా చూసుకుంటున్నా..నీవు పరాయి బిడ్డవు . నీకు ఈ కష్టం వద్దు..ఏదైనా కారణం చెప్పీ ఈ సంబంధం తప్పించు….” రమ చేతులు పట్టుకుని కన్నీళ్ళ తో వేడుకుంది.
ఇలా చెబుతూ వుంటే ‘నాకోడుకును పెళ్లి చేసుకోవద్దు అని చెప్పే తల్లి తానోక్కతేనేమో ..అనిపించి ఏడుపు వచ్చింది.
“నన్ను ఆలోచించు కోనీ అమ్మా” అంది రమ.

“ఆలోచించ వద్దు తల్లీ మా గురించి మరచిపో…సుఖాన్ని వెతుక్కో…నేను వచ్చి నిన్ను కలిసినట్టు ఎవరితోనూ అనకు” అని రమ భుజం మీద తట్టి వచ్చేసింది సీతమ్మ.

ఇంటికి వచ్చాక మనసు తేలికగా అయ్యింది. సంబంధం తప్పిపోయింది అని రాముకు బాగా కోపం రావచ్చు…ఇది జరిగిన పదిహేను రోజులకు ఒక రోజు పొద్దున్న కామేశం పడుకుని వుంటే దుప్పటి కప్పి పొయ్యి మంటేసి వేడినీళ్ళు కాచుకుని స్నానానికి వెళ్ళింది సీతమ్మ. బయటకు వచ్చేసరికి మూలుగు వినిపించింది…ఏమైందో నని గాబరాగా లోపలి పరిగెత్తింది వంటింట్లో పోయ్యిదగ్గర పడివున్నాడు కామేశం. అతని నోటినుండీ నురగ! చెయ్యి దగ్గరేవున్న పొయ్యి లోని నిప్పుల మీద ..గబా గబా చెయ్యి తీసింది…బాగా కాలి కమిలి పోయింది….నోట్లో నురగ తుడిచింది…

“వూ….” కాస్త గట్టిగా అన్నాడు కామేశం.

“నాయనా ఎట్లా వుందిరా..” అని తలని వొడిలో తీసుకుంది… అమ్మ ఒడిలో తల పెట్టాక వాలిపోయింది అతని చూపు…సీతమ్మకు భయం వేసింది…
“కామేశం….కామేశం…” గట్టిగా పిలిచింది..
చలనం లేకపోవడం తో కామేశం తల కిందపెట్టి బయటకు పోయి
“ఓబులేసూ….సారమ్మా….” గట్టిగా అరిచింది…వాళ్ళు వచ్చి చూసేసరికే ప్రాణాలు వదిలాడు కామేశం..
వాడు ప్రాణాలు పోవడానికి కూడా తనే కారణం అయ్యిందా? కుమిలిపోతూనే వుంది సీతమ్మ.
దానం అయ్యాక నిలవకుండా వెళ్ళిపోయిన రాము గుర్తుకు వచ్చాడు…అన్న పోయిన బాధ కూడా లేదు వాడికి…

నీసంగతి ఏమి ? 

నాతో వస్తావా అని అడిగిన పాపానికి పోలేదు…పైగా పదో రోజుకు రాలేను అని డబ్బులిచ్చి వెళ్ళుతాడా? ఏమిటీ బంధం? కామేశం కాకుండా తను చనిపోయివుంటే వాడిని చూసుకునే దిక్కు ఉండరని దేవుడే ఈ ఏర్పాటు చేసాడా? పెళ్లి జరకుండా పోవటం ఎంత అదృష్టం! ఆ పిల్ల జీవితం ఏమయ్యేది? ఎన్ని ఆలోచనలు సీతమ్మకు…
తొమ్మిది రోజులూ సారమ్మే ఇంత కూడు పెట్టింది. రాము వచ్చే సూచనలు లేవు.
పదోరోజు కనీసం రాములోరి గుడి దగ్గరికి వచ్చే బిచ్చగాళ్ళ కైనా అన్నం పెట్టి రావాల అనుకుంటూ లేచింది సీతమ్మ.
తలుపు చప్పుడైంది.

రాము జ్ఞాపకం పెట్టికుని వచ్చినాడేమో …అనుకుంటూ తలుపు తీసింది.
ఎదురుగా చిన్న బ్యాగ్గు పట్టుకుని నించున్న రమ కనిపించింది!
“నా కొడుకు వెళ్లి పోయాడమ్మా…” అప్రయత్నo గానే రమను పట్టుకుని ఏడ్చింది సీతమ్మ.
“అది తెలిసే వచ్చానమ్మా ..” రమ మాటలు అర్థం కాలా సీతమ్మకు.
“అంటే..”

“అవునమ్మ మీరు వచ్చి వెళ్ళినాక చాలా ఆలోచన చేసినా..పదేళ్ళకే అమ్మా నాయనా పోయిన దాననని మేనమామ చేరదీసినా అది ఇంట్లో పనులకు మా అత్త వేసిన ప్లాన్ అని తెలుసుకున్నా…చదువు ఆపించి అన్ని పనులూ చేయించేవారు. డబ్బులు వస్తాయని ఎవరినో పట్టుకుని ఆయా పనికి కుదిర్చినాడు మామ. వూర్లో అందరూ అడుగుతున్నా పెళ్లి చెయ్యాలన్న ఉద్దేశం లేదు వారికి అప్పుడు మీ కొడిక్కి ఇచ్చి చేస్తే రోగిష్టి వాడు ఎలాగూ పోతాడు..మళ్ళీ నా చాకిరీ చేయించుకోవచ్చు అని మా అత్త మీ సంబంధం ఖాయం చేయడాన్ని మంతనాలు చేస్తుంటే నేను విన్నా. ఇంతలో మీరు వచ్చి నా కొడుకును చేసుకోవద్దు అని చెప్పితే మీరు ఏంతో ఉన్నతంగా కనిపించినారు నాకు. అందుకే ఈ పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చినా కానీ ఇంతలో మీ కొడుకు పోయినాడు…’ పెళ్లి చేద్దామంటే పెళ్ళికొడుకు కూడా గుటుక్కు మన్నాడు…ఇక నీ దురదృష్టం మాకు ఎక్కడ అంటుకుంటుందో…’ అని మా అత్త ఒకటే తిడతావుంటే ఇక్కడకు వచ్చేసినానమ్మా. మీకు తోడులేరు.. నాకూ లేరు..మీరు నన్ను కూతురుగా అనుకుంటారో…కోడలిగా అనుకుంటారో మీఇష్టం. నాకు ఆశ్రయం ఇవ్వండి అమ్మా” అని సీతమ్మ కాళ్ళు పట్టుకుంది రమ.

రమను భుజాలు పట్టుకుని లేవనెత్తింది సీతమ్మ. రమ ఆమెకు దేవుడు పంపిన దూతలా కనిపించింది..
ఇలా పరిష్కారం చూపించాడా దేవుడు? పైకి చేతులెత్తి దండం పెట్టింది.
రమను కావలించుకుని ఏడ్చింది తనివితీరా…

ఆరోజు రమ అన్నం వండింది. సీతమ్మ, రమ రాములవారి గుడికి వెళ్లి బిచ్చగాళ్ళకు అన్నదానం చేసినారు.
కొడుకు పోయాక సీతమ్మ జీవితానికి ఓ చుక్కాని లాటి రమను ఇచ్చిదేవుడు తన నిర్ణయాన్ని చక్కగా తెలిపాడు…కొన్ని సమస్యలను దేవుడు తనదైన శైలిలో సమాధానం చెబుతాడు! అన్నది ఎంత సత్యమో!

-డా. లక్ష్మి రాఘవ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“

కథలుPermalink

Comments are closed.