గజల్-2 – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ని ఆదరిస్తున్న పాఠకులకు నమస్సుమాంజలి. ఆరు ఋతువులూ కలిస్తేనే ఒక సంవత్సరం. ఒకదానివెనుక మరో ఋతువు వస్తూనే ఉంటుంది. ఋతువులు మారినప్పుడు ఆ మార్పులకి అనుగుణంగా మన అలవాట్లను మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. శిశిరం తాకని వనం ఉండదు, చీకట్లను మింగేసే వెలుగు దొరకదు , కన్నీటిని కడగగలిగే జలం దొరకదు,వాన లేకున్నా పసిడిపంటలను ఇచ్చే నేల ఎక్కడా ఉండదు. అలాంటి అసంభవాలన్నీ సంభవం కావాలని కోరుకుంటూ ఋణాత్మకాలన్నిటినీ ధనాత్మకాలుగా మార్చాలనుకొనే నా ఆలోచనలకు ఇచ్చిన రూపమే ఈ గజల్ .

వసంతాన్ని వెలివేయని వనమెక్కడ దొరుకుతుంది
ఎండిన ఆకును రాల్చని తరువెక్కడ దొరుకుతుంది

విషంజిమ్ము సమయంలో నాగులనే మించుతుంది
ప్రేమ తప్ప పగయెరుగని మనసెక్కడ దొరుకుతుంది

జగతిలోన కాంతికంటె అంధకారమే ఎక్కువ
చీకట్లను త్రాగివేయు వెలుగెక్కడ దొరుకుతుంది

చుట్టూ చుక్కలు ఉన్నా ఏ చుక్కా ఆపలేదు
గ్రహణాలే మింగలేని వెలుగెక్కడ దొరుకుతుంది

భూమిమీద మూడొంతుల చోటులోన ఉంటుందీ
కన్నీటిని కడిగేసే జలమెక్కడ దొరుకుతుంది

కనిపించని రెక్కలతో రాత్రివేళ ఎగురుతాయి
తీయనికలలను పట్టే కునుకెక్కడ దొరుకుతుంది

నింగినుండి వానచుక్క పడకున్నా”నెలరాజా”
పసిడిపంటనందించే పొలమెక్కడ దొరుకుతుంది

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.