గజల్-1ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ని ఆదరిస్తున్న పాఠకులకు నమస్సుమాంజలి. విజ్ఞులతో చేసే స్నేహం , అవివేకులతో చేసే స్నేహం గురించి ఒకసారి జరిగిన చర్చలో అసంకల్పితంగా నోట్లోంచి ఈ మత్లా వచ్చేసింది. భాష లేకపోతే భావాలను చెప్పలేం కదా, అలాగే విభిన్నమైన భావాలతో మిగిలిన షేర్లు వ్రాయడం జరిగింది. తుఫాన్ వచ్చినా ,సునామీ వచ్చినా భయపడకుండా ఎదురునిలిచే ధైర్యం ఉంటేనే అసాధ్యాల సాగరాన్ని దాటగలం అంటూ ప్రేరణాత్మకంగా ఈ షేర్ వ్రాయడం జరిగింది. మక్తాలో … ప్రేమతత్వాన్నే ప్రేమించే వారు పగతో జీవించే వారిమీద విజయం సాధిస్తారని సాధికారంగా చెప్పే షేర్ వ్రాయడం జరిగింది. గజల్ కి శీర్షిక (హెడ్డింగ్) అనేది ఉండదు.

విజ్ఞులు చూపే త్రోవన నడవకుండ ఉండలేను
మూర్ఖుల సావాసము ‘నే’ వదలకుండ ఉండలేను

భాషన్నది లేనినాడు భావాలను తెలుపలేను
అక్షరాలతో మైత్రిని చేయకుండ ఉండలేను

కోరినవన్నీ తప్పక ఇస్తుందని నమ్ముతాను
రాలుతున్న తారకొరకు చూడకుండ ఉండలేను

దివ్యమైన వలపు ఒకటి గుండెలోన వాలినది
వలచిన దేవికి కోవెల కట్టకుండ ఉండలేను

జాబిలంటి రూపముతో రేయిని శాసిస్తుంది
చకోరమై చెలికాంతిని తాగకుండ ఉండలేను

తూఫానే ఎదురైనా వెనుదిరుగుట తెలియదుగా
అసాధ్యాల సాగరాన్ని ఈదకుండ ఉండలేను

ప్రేమించే తత్వానికి ప్రతినిధి’నే’ “నెలరాజా”
ద్వేషించే పగవారిని మించకుండ ఉండలేను.

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

One Response to గజల్-1ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

  1. అనిత గౌరీ says:

    నమస్తే ….శ్రీనివాస్ గారు …
    మీరు రాసిన గజల్ చాలా బాగుంది .
    ప్రేమించే తత్వానికి ప్రతినిధి’నే’ “నెలరాజా” ” ఈ వాక్యం . అద్భుతం .