అమ్మ నది(కవిత )-డి.నాగజ్యోతిశేఖర్,

ఆ నదికి ప్రాణం పొయ్యడమే తెలుసు….
స్వచ్ఛ ఏక కణాలు తుచ్ఛ
వాంఛల బహుదుర్గుణ వ్రణాలుగా విభజన

చెందుతాయని తనకేం తెలుసు!

చీకటిని గర్భాన దాచుకుని
వెలుగు బిందువుల్ని పంచుతూ పోవడమే తనకు తెలుసు….
చెడు గుఱ్ఱపుడెక్క తనపై విస్తరిస్తోంది అని

విసిరేయడం తనకెలా చేతనౌను….!

బతుకుతీరాలను సుతారంగా స్పృశిస్తూ

సస్యశ్యామలాన్ని కానుక చేస్తూ సాగడమే తనకు తెలుసు….
నిశ్చల ఒడ్డు పొరలు పొరలుగా పాకుడు గుణాలను

పోగేసుకొంటుందని తనకేం తెలుసు…!

ఉనికి ఈతకు తెరదించి కన్న పేగులకు
అస్థిత్వ అంతస్థుల మెట్లను
నిర్మించడమే “ఆ అమ్మనదికి” తెలుసు…
ఎదుగుదల పాదాలను నైతిక నెత్తుటితో

కడగడమే తనకు తెలుసు….

తన దేహాన్ని తొలిచి తొడిగిన వ్యక్తిత్వపు తొడుగును
విలువల అట్టడుగుకు తొక్కి
అడ్డదారుల్లో అందలపు జలమేఘాన్ని ఒడిసి పట్టి

పట్టాభిషేకం చేసుకోవాలని చూసే

కాలుష్య మస్తిష్కాలను చూసి
ఎండిన గుండెవడం …..
జారుడు మెట్లపై తూలే
బతుకులకు ఆపద్ధర్మ ఇసుక మేటలు
అడ్డేసి…
శుద్ధ జీవ(జా)జలంగా
మారేందుకు మరో అవకాశం ఇవ్వడం కన్నా…
“ఆ త్యాగనదీమ తల్లికి” ఇంకేం తెలుసు!
తెలుసుకొని తనలో సశ్చీల అంతర్వాహినిగా

మార్పు చెందాల్సింది మనమే!
అంతరాత్మ మెట్లను తొలిచే
చే (తు)తలను, ఎప్పటికప్పుడు

శుభ్రపర్చుకోవాల్సింది మనమే!

– డి.నాగజ్యోతిశేఖర్,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.