గజల్ – అనువాద సాహిత్యం -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

గజల్ అనేది ఉర్దూ ఫార్సీ హిందీ సాహిత్యాలలో ఎక్కువగా కనిపించే ప్రక్రియ. హలంతాలు ఉన్న భాషలలో గజల్స్ వ్రాయడం సులువని అనిపిస్తుంది ఈ భాషలలోని గజళ్ళను పరిశీలిస్తే. తెలుగులో గజల్‌ ప్రక్రియకు ఆద్యులు ప్రముఖ కవి స్వర్గీయ దాశరథి కృష్ణమాచార్యులు గారైతే అయితే ఈ ప్రక్రియకు ప్రతినిధి డా.సి. నారాయణ రెడ్డిగారు అని నిస్సందేహంగా అనవచ్చును. వేర్వేరు రసాలతో కూడిన వేర్వేరు భావాలను ఒకే ప్రక్రియలో చెప్పడం గజల్ లో తప్ప వేరే ఏ సాహిత్య ప్రక్రియలోనూ సాధ్యం కాదని ఘంటాపథంగా చెప్పవచ్చును. పాటలలో పల్లవి చరణాలు ఉన్నట్లుగా గజల్ లో మొదటి రెండు లైన్స్ ని మత్లా అంటారు. అలాగే చివరి రెండు లైన్లను మక్తా అంటారు. మధ్యలో రెండేసి లైన్లలో వ్రాసేవాటిని షేర్లు అంటారు. ఇవి వేటికి అవే స్వతంత్రంగా ఉంటాయి. ఈ ప్రక్రియలో పల్లవిని మత్లా, అని చివరి చరణాన్ని మక్తా అని, కవి నామ ముద్రను తకల్లుస్‌ అని అంటారు ( ఈ తకల్లుస్ ని మక్తాలో ఎక్కువగా వాడుతూ ఉంటారు కవులు ). మత్లాలో( రెండు పంక్తులో ) ఉండే చివరి పదాన్ని రదీఫ్ అనీ, రదీఫ్ కి ముందు ఉండే పదాన్ని కాఫియా అనీ అంటారు. షేర్ లోని రెండవ పంక్తిలోని చివరి పదంగా కూడా రదీఫ్ ఉంటుంది .రదీఫ్ ఉన్న పంక్తులలో రదీఫ్ కి ముందు కాఫియా కూడా ఉంటుంది. గజల్ లోని రెండేసి పంక్తులలో మొదటి పంక్తిని మొదటి మిశ్రా గానూ రెండవ పంక్తిని రెండవ మిశ్రా గానూ చెప్పడం పరిపాటి. హిందీ ఉర్దూలలో వ్రాసినవి బహర్లలో ఉంటాయి . 32బహర్లు ఉన్నప్పటికీ కొన్ని బహర్లలోనే గజళ్ళు వ్రాస్తుంటారు. ( బహర్ అంటే గురువు లఘువుల క్రమబద్ధమైన అమరిక ). తెలుగులో వ్రాసిన గజళ్ళన్నీ చతురస్ర గతి, తిశ్ర గతి, మిశ్ర గతి ,సంకీర్ణ గతి , ఖండగతులలో ఉంటాయి. గతి ప్రకారం మాత్రలు ( గురువు – 2మాత్రలు , లఘువు – 1 మాత్ర ) రెండేసి పంక్తులలో ఒకేలా ఉన్నప్పటికీ మీటర్ (అంటే నడక ) ప్రకారం వ్రాసిన గజళ్ళు గానయోగ్యంగా ఉంటాయి. గజల్ అంటేనే అంతర్లీనంగా సంగీతం ఉన్న ప్రక్రియ. గజల్ అంటే ప్రియుడు ..ప్రేయసితో చేసే సంభాషణగా పూర్వకవులు చెప్పారు. కాలక్రమేణా వేర్వేరు అంశాలను గజలియత్ ( వ్యక్తీకరించబడిన భావం గజల్ లక్షణాలను కలిగి ఉండడం ) ఉండేలా ఎంతోమంది కవులు వ్రాయడం జరిగింది. ఒకే అంశాన్ని తీసుకొని వ్రాసిన గజల్ ను గజల్ మూసల్ సల్ అనీ ,రెండు మత్లాలు ఒకే గజల్ లో ఉంటే దానిని హుస్న్ ఎ మత్లా అనీ అంటారు. గజల్ లో కనీసం 5షేర్లు(మత్లా , మక్తా లతో కలిపి)ఉండాలి. 7 9 11 13ఇలా బేసి సంఖ్యలో పెంచుకుతూ వెళ్ళవచ్చు .(సరి సంఖ్యలో ఉండకూడదని ప్రత్యేకమైన నియమం లేదు ) . ప్రస్తుతం ఎంతోమంది తెలుగు కవులు గజల్ ప్రక్రియ పట్ల ఆకర్షితులై చక్కటి గజళ్ళు వ్రాస్తున్నారు. వ్రాసిన కవులూ ప్రసిద్ధులైన కవుల గురించి , గజల్ పుట్టుపూర్వోత్తరాల గురించీ ఇక్కడ ప్రస్తావించడం లేదు. గజల్ అంటే ఏమిటన్నది సరళమైన భాషలో అందరికీ కాస్త అవగాహన కలుగజేసే ప్రయత్నంలో వ్రాసిన వ్యాసంగా పరిగణించాలని ప్రార్థన.

అనువాద సాహిత్యంలో భాగంగా …వారం వారం  గజల్స్ ……….వాటి విశ్లేషణ …విహంగ చదువరుల కోసం …………..

                                         -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

రచయిత పరిచయం

పేరు : ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్
కలం పేరు : శ్రీ
తకల్లుస్ : నెలరాజు ( గజల్ లో వాడే కలం పేరుని తకల్లుస్ అంటారు )
స్వస్థలం : కొమరగిరి (తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ )
వృత్తి : ఇంజినీరు , దూరదర్శన్ కేంద్రం , గునా (మధ్య ప్రదేశ్)
బిరుదులు : ఏకవాక్య కవితా విశారద , సాహిత్య శ్రీ , సంస్కృతి భూషణ్ ,
భారత్ భాషా భూషణ్ , గజల్ శిరోమణి , గజల్ సాహితీ రత్న
రికార్డులు : తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ , భారత్ బుక్ అఫ్ రికార్డ్స్ , జీనియస్ బుక్ అఫ్ రికార్డ్స్
వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ , వర్మ( స్టేట్) బుక్ అఫ్ రికార్డ్స్
పబ్లిష్ అయిన రచనలు : శ్రీ వాక్యం , శ్రీ వాక్యం -2, శ్రీ వాక్యసుమాలు , శ్రీ వాక్య చంద్రికలు
(మొత్తం రికార్డుగా 11,111 ఏకవాక్యాలు )
మనసంతా నువ్వే (వచన కవిత్వం ) పున్నమిపూలు (గజళ్ళు)
అముద్రితాలు : నానోలు , రెక్కలు , హిందీలో ఏకవాక్యాలు , 400 గజళ్ళు
సుమారు 60 పుస్తకాలకు ముందుమాటలు , ఎన్నో పుస్తకాలకు సమీక్షలు వ్రాయడం జరిగింది.మహాకవి కాళిదాసు కావ్యాలైన రఘువంశం , మేఘ సందేశం , కుమార సంభవం కావ్యాలపై వెబ్ పత్రికలలో విశ్లేషణతో కూడిన వ్యాసాలు ప్రచురితమైనాయి. అనువదించిన ఓ 40 గజళ్ళతో కలిపి సుమారు 650కి పైగా గజళ్ళ రచన. వచన కవితలు సుమారు 400, నానోలు సుమారు 500, రెక్కలు 100కు పైగా.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.