జ్ఞాపకం-39 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

హస్విత తిన్నగా సంలేఖ ముఖంలోకి చూస్తూ “చూడు లేఖా! నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ని. నాతో కూడా షేర్ చేసుకోలేని సీక్రెట్స్ వున్నాయా నీకు?” నెమ్మదిగా అడిగింది.

సంలేఖ నవ్వి “ఫ్రెండ్ దగ్గర ప్రతీది షేర్ చెయ్యనక్కర్లేదు. కొన్ని అర్థం చేసుకోవాలి. మరి కొన్ని అడిగి తెలుసుకోవాలి” అంది. ఆమె తలవంచుకొని కొద్దిగా సిగ్గుపడుతూ మాట్లాడింది.

“అయితే నేనిప్పుడు ఏది అడిగి తెలుసుకోవాలి? ఏది అర్థం చేసుకోవాలి? అడిగినా నువ్వు చెప్పట్లేదు కదా!”

తలెత్తి “చెప్పాను కదా! నేను నార్మల్ గా చదువుతున్నది జయంత్ కోసమని నువ్వెన్నిసార్లు అడిగినా నేను ఇదే చెబుతాను” అంది.

హస్వితకు అర్థమై “చూడు ! లేఖా ! పరిగెత్తే నీ కాళ్లకి నీ చేతులతోనే నువ్వు తాళ్లను కట్టుకుంటున్నావ్. పడిపోతావు. అయినా అతనెవరే నువ్వు నార్మల్ గా చదవటానికి. ర్యాంకులేమైనా అతనికే చెందిన ఆస్తులా? అతనొక్కడికే రావాలన్న రూలేమైనా వుందా?”

“రూలేం కాదు. ఒకరోజు అతనే నాతో ‘సంలేఖా! నువ్వు మన కాలేజీలో లేకుంటే నేనే నంబర్ ఒన్ ర్యాంకర్ ని. ఏంచేద్దాం. నాబ్యాడ్లక్’ అన్నాడు. అతన్ని లక్కీ ఫెలోని చెయ్యాలంటే నేనేం చేయాలో బాగా ఆలోచించాను. ఇప్పుడు మానాన్నగారి కన్నా జయంతే నాకు ఎక్కువగా అన్పిస్తున్నాడు. అతనికి ర్యాంక్ రా వాలంటే నేను అతనితో పోటీపడి చదవడం తగ్గించుకోవాలనుకున్నాను. ఇది నేను అతని మీద వున్న ప్రేమతో చేస్తున్నాను. చదువు ముఖ్యమా? ప్రేమ ముఖ్యమా? అంటే నాకు ప్రేమే ముఖ్యమనిపించింది. ఎందుకంటే ప్రేమ అనేది ప్రతిక్షణం గుండెను లయబద్దంగా, పరిపూర్ణంగా, సంతృప్తిగా కొట్టుకునేలా చేస్తుంది. భరోసాను, నిశ్చింతను కలిగిస్తుంది. అదే లేకుంటే ఏముందే మనిషికి? అతనెప్పటికైనా నామనిషేగా! ఆర్యాంకేదో అతన్నే తెచ్చుకోనీయ్! అది నావల్లనే వచ్చిందన్న కృతజ్ఞత జీవితాంతం నాపట్ల అతనికి వుంటుందిగా” అంది. ఆ మాటలు అంటున్నప్పుడు సంలేఖ ముఖం చాలా ప్రశాంతంగా వుంది.

హస్వితకి అయోమయంగా వుంది.
అందుకే “అతను నిన్ను ప్రేమిస్తున్నట్లు, నిన్నే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎప్పుడైనా చెప్పాడా? అలా అని మాట ఇచ్చాడా ?” అని సూటిగా అడిగింది.

“అలాంటిదేం లేదు. అతను నాతో వుండే క్లోజ్ నెస్ ని బట్టి నాకే అలా అన్పించింది. అయినా ఒక మనిషి పట్ల ఓ భావం కలగటానికి వాళ్లు మనపట్ల చూపే చిన్న మూమెంట్ చాలు”

“చిన్న మూమెంట్ కే అంత ఎక్సయిట్ అవకు. ఆ తర్వాత ఏడ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అబ్బాయిలు కొందరు అమాయకులైన అమ్మాయిలకి ‘ప్రాణంలా’ అన్పించేందుకు దొంగల్లా పొంచి వుంటున్నారట. అదను చూసి కాసిన్ని తీపి మాటల్ని గిఫ్ట్ కవర్లో చుట్టి అమ్మాయిల ముఖం మీద విప్పుతున్నారట. అమ్మాయిలు ఆ మైకంలో మునిగి వున్న సమయం చూసి అబద్దాలు చెప్పి వాళ్ల దగ్గర వున్న గోల్డ్ చెయిన్లు, డబ్బులు తీసుకుంటున్నారట. అవి లేని అమ్మాయిల చేత వేరే ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేయిస్తున్నారట. అమ్మాయిలు కూడా వాళ్ల బాయ్ ఫ్రెండ్స్ కి ఎంత ఎక్కువగా డబ్బులు ఇస్తే అంత గర్వంగా ఫీలవుతున్నారట. ఇవన్నీ నాకెలా తెలుసనుకుంటున్నావా? మొన్న ఓ బి.టెక్. అక్కయ్య చెప్పింది. నువ్వేమో జయంత్ కోసం డబ్బులు కాదు, చెయిన్లు కాదు ఏకంగా ర్యాంక్ నే వదులు కుంటానంటున్నావ్ ! ఇదేం పిచ్చే ?” అంది హస్విత.

“అతను అలాంటివాడు అని నేను అనుకోవడం లేదు” అంది సంలేఖ ఎటో చూస్తూ.

“ఇది జోక్ కాదు జీవితం! ముందు నీ కెరీర్ గురించి ఆలోచించుకో?” అంది హస్విత అసహనంగా చూస్తూ.

“అబ్బా! కెరీర్ ది ఏముందే అది మనిషికన్నా ముఖ్యమా? నా కెరీర్ ని జయంత్ కెరీర్ గా భావిస్తున్నాను. అతను డెవలప్ అయితే నేను అయినట్లే అనుకుంటున్నాను”

“అది కరెక్ట్ కాదు లేఖా! ఎందుకంటే నీలాగా నాకు ర్యాంకులు రావు కాబట్టి వాటి విలువ నాకు తెలుసు. ర్యాంక్లు రావడమనేది పూర్వజన్మ పుణ్యఫలం. ఒక క్లాసులో ఎందరో విద్యార్థులు వుంటారు. వాళ్లలో చదువుకోవటానికి మాత్రమే అర్హులవుతున్నారు కాని ర్యాంకులు సాధించగలుగుతున్నారా? దీన్ని నువ్వెందుకింత క్యాజువల్ గా తీసుకుంటున్నావో నాకర్థం కావడం లేదు”

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.