జ్ఞాపకం-38 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

చేతిలో వున్న పుస్తకంతో తన నెత్తిమీద కొట్టి “అయితే నాకు కుడివైపున మెదడే లేదానే. అందుకేనా నేను నీలాగా ఉదయాన్నే నిద్రలేచి బాల్కానీలో కెళ్లి కూర్చుని పూలకుండీ వైపు, పొగమంచు వైపు చూడంది” అంటుంది. ముఖం ఏదోలా పెట్టుకుని కూర్చుంటుంది. చాలా సేపు అలిగి మాట్లాడలేదు.

అది గుర్తొచ్చి సంలేఖ నవ్వుకుంటుంటే అప్పుడే తలుపు నెట్టుకుంటూ గదిలోకి వచ్చింది హస్విత.
సంలేఖ చేతిలో వున్న నవలను చూడగానే కోపంగా “తిండిలేదు, నిద్రలేదు. నవల వుంటే చాలు. నేను వెళ్లేటప్పుడు తలనొప్పి అన్నావ్. కాలేజీకి రాకుండా నువ్వు చేస్తున్న పని ఇదా ?” అంది హస్విత.
సంలేఖ ఆత్మీయంగా “ముందు నువ్వు ఫ్రెషప్పయి టీ తాగిరా! ఇవ్వాళ మన హాస్టల్లో టీ చాలా బావుంది. అందులో అల్లం, యాలకులు వేశారట. నేనిప్పుడే తాగాను. ఉదయం నుండి వున్న తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. రిలాక్స్ గా వుంది” అంది.

“అసలు నీకు తలనొప్పే లేదు. కాలేజీకి రాకుండా వుండటానికి ఇదో కుంటి సాకు. అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసానే నీకు?” అంది కాలేజీ బ్యాగ్ ను బెడ్ మీద పెడుతూ.

“అంత తెలియంది నేనేం చెయ్యట్లేదు. టెన్షన్ పడకు”

“ఛ… ఛ… రోజు రోజుకి ఎందుకిలా తయారవుతున్నావ్? అసలేంటి నీ ప్రాబ్లమ్?” అంది హస్విత.
సంలేఖ నవ్వి “అలాంటి సీరియస్ ప్రశ్నలు వెయ్యకు. నాకసలే ఏ క్షణంలో ఏం ప్రాబ్లమ్ వస్తుందో నన్న భయం ఎక్కువ. నా ఫోబియా తో ఆడుకోకు” అంది.

“క్లాసులు చాలా సీరియస్ గా నడుస్తున్నాయి. కాలేజీకి రాకుండా క్లాస్ బుక్స్ చదువు కోకుండా ఎన్ని రోజులిలా?”

“వస్తున్నానుకదే! చదువుతున్నాను కదే!” అంది సంలేఖ.

“ఇలాగేనా రావడం? ఇలాగేనా చదవడం? అయినా క్లాస్ బుక్స్ చదవడం వదిలేసి సాహిత్యం మీద పడ్డావేంటే? ఈ నవలలు ఈ కథలు ఎన్ని చదివి ఏం లాభం? ఇంటర్లో మంచి మార్కులు వస్తాయా? తిండీ, నిద్రా లేకుండా వీటిని చదివి ఏం చేస్తావ్ ?”

“ఏదో చెయ్యాలని మాత్రం వీటిని నేను చదవడం లేదు. కానీ చదవగా చదవగా వీటిపై నాకు మమకారం పుడుతోంది. ఇంకా ఇంకా చదవాలనిపిస్తోంది. చదవకుండా వుండలేక పోతున్నా” అంది.

నచ్చచెబుతున్నట్లు “ఇవి నువ్వు లైఫ్ లో సెటిలయ్యాక కాలక్షేపం కోసం చదువుకో. ఇప్పుడు చదివితే ఎందుకూ పనికి రాకుండా పోతావ్ నా మాట విను” అంది హస్విత.

హస్విత అలా అంటుంటే “నీ మాటలు ఏదైనా కావాలనుకున్న వాళ్లకే అర్థమవుతాయి. నేనేం కావాలనుకుని ఈ పుస్తకాలకి దగ్గరయ్యానో నీకేం తెలుసు?” అంది సంలేఖ.

“చెబితే కదా ! తెలిసేది”
“తెలిసి నువ్వేం చెయ్యగలవు?”

“ఒక స్నేహితురాలు దారి తప్పి నడుస్తుంటే తిరిగి దారిలోకి తీసుకురాగలిగే శక్తి ఇంకో స్నేహితురాలుకి తప్పకుండా వుంటుంది. స్నేహాన్ని నువ్వెప్పుడూ తక్కువగా అంచనా వెయ్యకు. అయినా ఈ మధ్యన నువ్వు నవలలు చదువుకుంటూ సోమరితనానికి బాగా అలవాటు పడ్డావు” అంటూ భుజానికి వున్న కాలేజీ బ్యాగ్ ని తీసి తన బెడ్ కే ఏర్పాటు చేసి వున్న డెస్క్ ని లాగి అందులో పెట్టుకుంది హస్విత.
హస్విత భుజం మీద చేయి వేసి “హస్వీ! నేను పక్కా రైతు బిడ్డను. నాలో సోమరితనం వుంటుందని నువ్వెలా అనుకుంటున్నావ్! నేనేది చేసినా జయంత్ కోసమే చేస్తున్నాను” అంది.

”జయంత్ కోసమా?” షాక్ తో నోరెళ్లబెట్టింది హస్విత.

“ఇదేదో కొత్తగా వుందే!” అంది తేరుకుంటూ.

“అవును జయంత్ కి ర్యాంక్ రావాలంటే నేను నార్మల్ గా చదవాలి. అందుకే నా క్లాస్ బుక్స్ అప్పుడప్పుడు చదువుతూ టైం పాస్ కోసం నవలలు, కథలు చదువుకుంటున్నాను” అంది సంలేఖ.

“అతనికెందుకు ర్యాంక్ రావాలి? నీకెందుకు రాకూడదు? అసలు నువ్వు చేస్తున్న దానికి అర్థం వుందా ?

“అర్థం లేకుండా నేనేదీ చెయ్యను”

“ఏంటా అర్థం ?”“జయంత్ అంటే నాకు ప్రాణం”
ఉలిక్కిపడి “ఇదెప్పటి నుండి?” అంది
“నీకు తెలియదులే!”

“అంత సీక్రెట్టా?” అంటూ బెడ్ మీదకి పూర్తిగా జరిగి కంఫర్ట్ గా వుండేలా కూర్చుంది హస్విత.
సంలేఖ మాట్లాడకుండా తల వంచుకుని తను చదువుతున్న నవల్లో పేజీలను తిప్పుతూ, తనెంత వరకు చదివిందో అంతవరకు తనకి బాగా నచ్చిన వాక్యాలను అండర్లైన్ చేసుకుంటోంది.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.