జ్ఞాపకం-37 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

ఆ తలుపు శబ్దానికి రాజారాం ఉలిక్కిపడి “నాన్నా ! సంలేఖ అలా వెళ్లి ఏమైనా చేసుకుంటుందేమో! వెళ్లి ఆపండి !” అన్నాడు.

కొడుకు భయాన్ని చూసి, తన కోపాన్ని తగ్గించుకుంటూ “అదంత పిరికిదేం కాదులేరా! ఆత్మహత్య మహాపాపం అని నాకెన్నోసార్లు చెప్పి నన్ను బ్రతికించింది” అంటూ అక్కడ వుండకుండా, భార్యకు ముఖం చూపించలేక పొలంవైపు వెళ్లాడు రాఘవరాయుడు.

మామగారి విశ్వరూపం చూసి బిత్తరపోయిన వినీల నోటి మాట పడిపోయిన దానిలా అయింది. వెంటనే కిందకి వంగి అంతకు ముందే మార్చిన రాజారాం బెడ్ షీట్ ని వుండలా చుట్టుకొని ఉతకటానికి వెళ్లింది. పైకి మామూలుగా వున్నా లోపల మాత్రం మామగారు అత్తగారిని కొట్టినందుకు మహదానందంగా వుంది వినీలకు.

గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్న సంలేఖకి భూమి, ఆకాశం ఏకమై తిరుగుతున్నట్లు, దిక్కులు నాలుగు ఒక్కటై ఘర్షిస్తు న్నట్లు తలంతా తిరిగి తిరిగి జయంత్ దగ్గరకి వచ్చి ఆగింది.

జయంత్ గుర్తు రాగానే నీటి చుక్క గచ్చు మీదపడి టప్పున చిట్లినట్లు ఆమె గుండె చెరువులో ఏదో అల. ఆ అలను చేత్తో తాకి జ్ఞాపకాలను కదిలించుకుంటూ నెమ్మదిగా గతంలోకి వెళ్లింది సంలేఖ.
అది ఇంటర్ కాలేజీ….

ఆ కాలేజీ క్యాంపస్ లోనే గర్ల్స్ హాస్టల్ ఎదురుగా బాయ్స్ హాస్టల్ వుండే బ్లాకు వుంటుంది. ఇంటర్ చదివే అబ్బాయిలు బాయ్స్ హాస్టల్లో, అమ్మాయిలు గర్ల్స్ హాస్టల్లో వుంటారు. అన్ని గ్రూపుల వాళ్లు వుంటారు.
ఇంటర్ తో పాటే ఆ కాలేజీలో ఎం.పి.సి. వాళ్లకి ఇంజనీరింగ్ కోసం ఎంసెట్, ఐఐటి, ఎఇఇఇ లాంటివి. బి.పి.సి. వాళ్లకి మెడిసిన్ కోసం ఎం సెట్. అలాగే సి.ఇ.సి./ ఎం.ఇ.సి. వాళ్లకి సి.ఎ., ఐ.సి.డబ్ల్యూ .ఎ. ఫౌండేషన్ వుంటాయి. ఎందుకంటే ఆ కాలేజీ జిల్లాలోనే అతి పెద్ద కాలేజి.

సంలేఖ తండ్రే కాదు. ఏ తండ్రి అయినా తమ పిల్లల్ని ఆ కాలేజీలో చేర్పించాలని కలలు కంటారు. కలల్ని నిజం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. ప్రయత్నం ఎంత చిన్నదైనా అది విశ్వం కన్నా పెద్దది కదా!

తిలక్ వుండేది బాయ్స్ హాస్టల్ బ్లాక్ లో థర్డ్ ఫ్లోర్ రూం నెంబర్ 9 లో. జయంత్ వుండేది ఫస్ట్ ఫ్లోర్ రూం నెంబర్ 1 లో. దిలీప్ చదివేది నార్మల్ ఇంటరే అయినా వుండేది మాత్రం జయంత్ రూంలో. నిజానికి దిలీప్ ఇప్పుడు డిగ్రీలో వుండాల్సింది. కానీ అతను టెన్త్ క్లాసులో ఆర్థిక లేమి వల్ల పొలం పనులు చూసుకోవలసి వచ్చి రెండు సంవత్సరాలు చదువులో వెనకబడిపోయాడు. వాళ్ల తండ్రి మాత్రం ఎప్పుడు చూసినా వాళ్ల ఊరి చివరన చెట్ల నీడలో చాప వేసుకుని కూర్చుని తీరిగ్గా కార్డ్స్ ఆడుకుంటూ ఉంటాడు. సంలేఖ అన్నయ్య తిలక్ ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తూ సరిగా చదవక రెండు క్లాసులు వెనక బడి సంలేఖతో కలిసిపోయాడు. తిలక్ ది, దిలీప్ ది ఒకే వయసు.

వాళ్లతో పోల్చుకుంటే జయంత్ ఒక్క సంవత్సరం చిన్నవాడు. హస్విత సంలేఖ క్లాస్ మేట్. ఇలా ఆ ఐదుగురి ఊర్లు వేరయినా ఇంటర్ చదువుతున్నది మాత్రం ఒకే కాలేజీలో.

రోజులు గడిచిపోతున్నాయి…
ఇంటర్ వాళ్లకి క్లాసులు చాలా వేగంగా నడుస్తున్నాయి.

ఒంటరిగా కూర్చొని చదువుకుంటోంది సంలేఖ. ఆమె చదువుతున్నది క్లాస్ బుక్ కాదు. నవల. ఆ నవల రాసిన రచయిత ఎవరోకాని చదువుతున్నంత సేపు ఉత్కంఠగా వుంది. రెండు రోజుల క్రితం చదివిన వడ్డెర చండీదాస్ రాసిన ‘హిమజ్వాల’ నవలకన్నా గొప్పగా రాయాలన్న భావావేశంతో రాసిన నవలలా అన్పిస్తోంది. ఎడతెగని ఆవేశం, స్పర్ద, మెలితిప్పే ఆలోచన హీరో పాత్రలో కన్పిస్తున్నాయి. పట్టుకున్న క్షణం నుండి ఏకాగ్రతతో చదివింది.

ముఖ్యంగా ఆ నవలలోని ఒక పాత్ర యుద్ధ భూమిలో ఇరుక్కున్న సైనికుడిలా, ఘోషిస్తున్న సముద్రపు ఒడ్డున కూర్చున్న భావకవిలా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. క్షణానికి, క్షణానికి మధ్య వున్న క్షణాన్ని సైతం వదలకుండా విలపిస్తుంది. ఏకాంతం, నిరాశ అనే ఒకానొక స్థితి నుండి బయటకి రాలేక బయటకొస్తే ఆ స్థితిలో తను దర్శిస్తున్న సూక్ష్మ మార్మిక రూపాన్ని వదిలి రావలసి వస్తుందేమో నన్న భయంతో అక్కడే వుండి పోతోంది. జీవితం కాలం సంధించి వదిలిన బాణంలా దూసుకుపోతున్నా ఆ పాత్ర మాత్రం అర్థం కాని ఉద్విగ్నతతో ప్రణవాక్షర వాకిట్లో నిలబడి తను కోరుకున్న పాదాల స్పర్శకోసం ఎదురు చూస్తూ వుంటుంది.

ఆ ఎదురు చూపుల్లోంచి జీవితం జారిపోతుంటే చివరికి ఆ పాత్ర అంటుంది కదా ‘మనిషికీ – మనిషికీ మధ్య సాగే ఈ భావ సాంద్రతే లేకుంటే జీవితంలో మనిషి హృదయాన్ని బంధించే శక్తి దేనికుంటుంది ? అసలు వేదన అనేదే లేని జీవితంలో రసానుభూతి ఎక్కడ వుంటుంది? దుఃఖం లేకుండా సాధించే విజయంలో నిజమైన తృప్తి దొరుకుతుందా?’ అని… అలా ఎంతో అద్భుతంగా సాగిన ఆ పాత్ర నవల మొత్తంలో ఎక్కడా తన హుందాతనాన్ని కోల్పోలేదు. అది బాగా నచ్చింది సంలేఖకు. ఇంతకుముందు ఆమె ఏ నవల చదివినా నార్మల్ గా చదివేది.

ఇప్పుడలా కాకుండా ఏ పాత్ర ఎలా నడుస్తోంది. సరిగ్గా నడుస్తుందా? లేదా? ఏ రైటర్ ఏ పాత్రను ఎలా నడుపుతున్నారు? అలా నడపడం వల్ల వచ్చే ఫలితాలేంటి? చదివే పాఠకులపై ఆ పాత్ర ప్రభావం ఎంతవరకు వుంటుంది? ఎంత మేలు చేస్తుంది? ఇలా విశ్లేషణ చేసుకుంటూ చదువుతుంది. ఇదంతా ఆమెకు తెలియకుండానే జరుగుతున్న మార్పు.

అంతేకాకుండా అసలు ఈ రాసేవాళ్లు ఇంత అద్భుతంగా ఎలా రాయగలుగుతున్నారు? ఇంతటి ప్రత్యేకతను ఎలా సాధించగలుగుతున్నారు? వేల లక్షల మందిలో ఒక్కరిగా ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. బహుశా ఈ సృజనాత్మకత అనేది చదువులాగా కొనుక్కుంటే వచ్చేది కాకపోవటం వల్లనేమో అది కొందరికే పరిమితం అవుతోంది. ఊహ అన్నది దైవిక శక్తి అని కూడా తనో చోట చదివింది. అంతే కాదు తరానికి ప్రాధాన్యమిస్తూ అంతా లెక్కల ప్రకారం వుండాలంటూ భాషను నియంత్రించే మనిషి ఎడమ మెదడు కన్నా కుడి మెదడు పూర్తి భిన్నంగా వుంటుందట. రంగుల్ని, సంగీతాన్ని, ప్రకృతిని
ఇష్టపడుతూ ఊహల్లో తేలిపోతూ, సృజనాత్మకంగా ఆలోచిస్తుందట. భిన్నమైన ఆలోచనలతో, భిన్నమైన పనులు చేయిస్తుందట. ఇలా చేసే వాళ్లను పెద్దగా పట్టించుకోరనే గాని మేధా శక్తిలో 20 శాతం ఎడమ మెదడులో వుంటే 80 శాతం కుడి మెదడులో వుంటుందట. ఇదే విషయాన్ని ఒక రోజు హస్వితతో చెప్పింది.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.