జ్ఞాపకం-36 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

అప్పటికే అక్కడికి వచ్చిన రాఘవరాయుడు, సులోచనమ్మ ఆ మాటలు విని నిశ్చేష్టులయ్యారు.
“ఏం మాట్లాడుతున్నావమ్మా వినీలా? మాట్లాడే ముందు ఆలోచించవా?” అన్నాడు రాఘవరాయుడు.
“ఈ రాసేవాళ్లకి కీర్తి దాహం మామయ్యా! అభిమానులంటే పడి చస్తారు. చిన్న వయసులో వున్నారు కాబట్టి నలుగురు నాలుగు రకాలుగా అనుకోవచ్చు. అది నేను ముందే వూహించి అన్నాను” అంది.
రాఘవరాయుడు ఉరిమి చూస్తూ “ఇంకెప్పుడూ అలా ఊహించి అనకు” అన్నాడు.

రాజారాంకి భార్య వైపు చూడ బుద్దికాక పక్కకి తిరిగి పడుకోలేక అలాగే పడుకొని గట్టిగా కళ్లుమూసుకున్నాడు.

సులోచనమ్మ వినీల భుజం పట్టుకొని “చూడమ్మా ! నువ్వూ ఆడపిల్లవే కదా! నీ ఇంట్లో ఆడపిల్లనే ఇలా వూహించి మాట్లాడొచ్చా ? పాఠకుల అభిమానం ఏ రైటర్ కైనా ప్రాణంతో సమానం. దానికి నువ్వు మసి పూసి చూడొచ్చా ?” అంది.

అత్తయ్య చేతిని తన భుజం మీద నుండి నెమ్మదిగా తొలగించి లేచి నిలబడింది వినీల. ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా “అత్తయ్యా ! ఎప్పటికీ ఈ ఇంట్లో వుండేదాన్ని నేను. వెళ్లి పోయే సంలేఖకి సపోర్టు ఇచ్చి మాట్లాడతారేంటి? నేను ఆడపిల్లను కాబట్టే సాటి ఆడపిల్ల గురించి సరిగ్గా అర్థం చేసుకొని మాట్లాడుతున్నాను. ఆ మాత్రం అర్థం చేసుకోరేం?” అంది.

రాజారాం కళ్లు తెరిచి “నీ కసలు ఏం తెలుసని వాగుతావే ! నోరు తప్ప బుద్ది వుందా నీకు ?” అన్నాడు.
“మీరుండండీ! నేను వాగడం లేదు. మాట్లాడుతున్నాను. అయినా మీకేం తెలుసని నాకు బుద్ధి లేదంటున్నారు. మంచంలోంచి లేపి నిలబెట్టి పట్టుకున్నా గట్టిగా నాలుగు అడుగులు వెయ్యలేరు. బయట సంగతులు మీకెలా తెలుస్తాయి?” అంది నోటి మీద కొట్టినట్లు.

వెంటనే అత్తయ్య వైపు తిరిగి “ఇదే విషయంపై ఈ ఇంట్లో చాలా సార్లు గొడవలు జరిగాయి. అయినా మీరేం పట్టించుకోరు. కూతురైనంత మాత్రాన ప్రతిదీ కడుపులో పెట్టుకోవాలా? మందలించరా? భయం చెప్పరా?” అంది వినీల.

“అదేం చేస్తుందని భయం చెప్పాలి?” కోపంగా అరిచింది సులోచనమ్మ. ఆమెలో అంత కోపం ఎప్పుడూ చూడలేదు.

వినీల ఏ మాత్రం తొణక్కుండా ”చేసేవన్నీ కళ్లకు కన్పిస్తాయా? సంలేఖ ఆలస్యంగా ఎన్ని సార్లు ఇంటికి రాలేదు. మీరేమైనా అడిగారా తనని ?”

“అడిగాను సమాధానం కూడా చెప్పింది. ఇప్పుడవన్నీ ఎందుకు ?”

“మీరేమడిగారో తనేం చెప్పిందో నాకు తెలుసు. ఏవో సాహిత్య సంస్థలతో సంబంధం వున్న ఒక లెక్చరర్ సిటీలో జరిగే సభలకి తనని తీసికెళ్ళాడని అందుకే ఆలస్యమైందని చెబుతుంది. ‘ఈ వయసు నుండే సాహిత్య సభలు ఎందుకు నీకు ?’ అని మీరు అడగరు. ఎప్పుడు చూసినా సభలు, చర్చలు, పెద్ద పెద్ద రైటర్స్ తో పరిచయాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలు, సెల్ఫోన్ లేకపోయినా కమ్యూనికేషన్ కేం తక్కువ లేదు. ఇంట్లో వాళ్ల పేరు చెడగొట్టి తనొక్కతే ఉన్నత శిఖరాలను ఎక్కాలని చూస్తోంది. ఇవేమి మీకు తెలియవు. అందుకే త్వరగా పెళ్లి చేసి పంపండి! ఆ ఏడుపేదో అక్కడే ఏడుస్తుంది” అంటూ కడుపులో విషాన్నంతా వెళ్లగ్రక్కింది.

ఆ మాటలు వింటుంటే రాజారాంకి వస్తున్న కోపానికి వినీల చెంపపగిలి పోయేదే! కానీ బెడ్ మీద నుండి అతను అంత సులభంగా లేవలేడు.

వదిన మాటలు ఎక్కడనుండి ఎక్కడికి పాకుతున్నాయో సంలేఖకు అర్థమై అయోమయంగా చూస్తూ “వదినా ! నీకు నేనంటే అసూయ, ఈర్ష్య, నువ్వేం చేసినా నన్ను ఇబ్బంది పెట్టాలనే చేస్తుంటావ్!” అంది.

“నువ్వలా అంటావని నాకు తెలుసు. వీళ్లెలాగూ నీకు పెళ్లి చెయ్యరు. కనీసం ఆ తిరుగుళ్లయినా మానుకో !” అంది వినీల.

“నేను తిరుగుతున్నానా ? ఏం మాట్లాడుతున్నావ్ వదినా నువ్వూ ?” అంది సంలేఖ. వదిన మాట్లాడే మాటలు వింటుంటే నరాలు తెగుతున్నంత బాధగా వుంది.

కోడలి మాటల్ని రాఘవరాయుడు సహించలేక పోతున్నాడు. కూతుర్ని ఓదార్చ లేక, కోడల్ని భరించలేక ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థంకాక పక్కనే వున్న భార్య చెంపచెళ్లు మనిపించాడు.

ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. గాలి ఆగినట్లు వూపిరి బిగబట్టారందరు.

ఊహించని ఆ దెబ్బకి చెంపను చేత్తో పట్టుకొని భర్తనే చూస్తోంది సులోచనమ్మ.

“నువ్వసలు మనిషివేనా ? వంట ఇల్లు తప్ప ఇంకేం పట్టించుకోవా? ఏం చేస్తున్నావ్ ఇంట్లో వుండి ? మీ మాటలు వింటుంటే పెద్దా, చిన్నా తేడా లేకుండా పోతోంది. బొత్తిగా భయం లేకుండా పోతోంది” అని కోపంతో వూగిపోయాడు.

అప్పటికప్పుడే ఆ వాతావరణం భీభత్సంగా మారింది.

వదిన ముందు తండ్రి తల్లిని కొట్టడం తట్టుకోలేక పోయింది సంలేఖ. దుఃఖాన్ని ఆపుకుంటూ గద్గద స్వరంతో “నాన్నా! ఇదంతా నా వల్లనేగా జరుగుతోంది. వదిన అన్నట్లు నేను పెళ్లి చేసుకొని వెళ్లి పోతే ఇంతటితో ఈ సమస్య వుండదు కదా !” అని అక్కడి నుండి పరిగెత్తుతున్నట్లే తన గదిలోకి వెళ్లి గట్టిగా తలుపు వేసుకుంది.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.