జ్ఞాపకాల వానలో(కవిత )-ఎండ్లూరి సుధాకర్

నీ సమాధిని
కాపలా కాయడానికి
కాటి కాపరినైనా బావుండేది
అసలే వర్షాకాలం
నువ్వు తడవకుండా
ధనుర్దాసులా
గొడుగు పట్టడానికి
నీ కిష్టమైన
అల్లం చాయి పెట్టడానికి
ఒక్కసారి లేచి వస్తావా?
నేను మూసీ ఒడ్డు నుంచి
నిన్ను గౌతమీ తీరానికి తీసుకెళ్లాలి
గోదావరి గట్టు మీద
వేడి వేడి బజ్జీలు తినాలి
పిడత కింద పప్పు
ఆ రుచి
ఎలా మరువగలం చెప్పు?
నిమ్మకాయ రుద్దిన
మొక్క జొన్న పొత్తులంటే
నీ కెంత మక్కువో తెలుసు కదా!
ఆదాము హవ్వలా
మన రోజువారీ పాపంలో
ఎంత పుణ్యం దొరికేదో
ఏదేను వనాలకు
ఏమి ఎరుక?
వెచ్చ బడడానికి
ఒక దేహం దొరుకుతుందేమో కానీ
చల్లబడడానికి
దాహం తీరుతుందేమో గానీ
నీ ఆత్మ లభిస్తుందా?
నీ రూపం ప్రభవిస్తుందా?
ఈ జీవన దండకారణ్యంలో
శాశ్వతంగా తప్పిపోయాం గానీ
నా గుండె కుటీరంలో
నువ్వు పదిలంగానే ఉన్నావులే!
ఎందరు దేవతలు ఏకమైతే
ఒక హేమలత కావాలి
అమ్మతోడు నీకోసం
ఆస్తికుడిగా మారిపోతాను
ఏ దేవుడైనా
నిన్ను మళ్ళీ
నా కళ్ళముందు ప్రత్యక్షం చేస్తే
వాడి కాళ్లు పట్టుకొని
ఇలా వేడుకుంటాను
మళ్లీ!
జననం అంటూ ఉంటే
ఇద్దరినీ కలిపి
ఖననం చేయమని కోరుకుంటాను.

-ఎండ్లూరి సుధాకర్

(రాజమండ్రిలో సమాధి చేయబడిన సహచరి హేమలత కోసం)

ధనుర్దాసు వైష్ణవ భక్తుడు నిరంతరం భార్యకు గొడుగు పట్టే వాడు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.