జ్ఞాపకం-35 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

ఆమెకు తెలియకుండానే భయంతో, బాధతో మనసు – శరీరం వణికి పోయాయి.

“వదినా! వదినా!” అంటూ అన్నయ్య వుండే హాల్లోకి వెళ్లింది సంలేఖ.
సంలేఖ ముఖం అప్పటికే ఎర్రబడి ఏదోగా వుంది.
ఎప్పుడూ లేనిది రాజారాంకి బత్తాయి పండ్లు తొనలు ఒలిచి నోట్లో పెడుతోంది వినీల.

“నువ్వు నాగదిలోకి ఏమైనా వచ్చావా వదినా ?” అడిగింది సంలేఖ.

“వచ్చాను ఏం ? రాకూడదా ? రాకూడదంటే చెప్పు! రాను” అంది తెలివిగా వినీల.

“రాకూడదని కాదు. అందులో పుస్తకాలన్నీ కట్ చేసి వున్నాయి” అంది సంలేఖ.

“నేను కట్ చేశాననా నీ డౌట్ ? ఇదిగో ఈ నవల మాత్రమే నీ గదిలోంచి తెచ్చుకున్నాను. బోర్ గా వుందని. అదింకా చదవనుకూడా లేదు. కావాలంటే తీసుకో” అంది వినీల.

సంలేఖకు పిచ్చి కోపం వచ్చింది.

“అన్నయ్యా ! వదిన నా బుక్స్ కట్ చేసింది. బైండింగ్ కోసం పెట్టుకున్న పేపర్లన్నీ ఒక దానిలో ఒకటి కలిపేసింది. ఇప్పుడెలా అన్నయ్యా ! ప్రూఫులు దిద్దుకున్న డి.టి.పి. పేపర్స్ కన్పించడం లేదు. దాని సి.డి. కూడా నా దగ్గరలేదు” అంది.

రాజారాం భార్య వైపు అసహ్యంగా చూసాడు.

“అదేం చేసిందే నిన్ను? దాని పాటికి అది రాసుకుంటుందే కాని నీ జోలికేమైనా వస్తుందా? ఈ రోజుల్లో చదువుకుంటున్న కొందరు విద్యార్థులు తమ అప్లికేషన్ ను కూడా సరిగా రాసుకోలేక పోతున్నారు. అలాంటిది అది జీవితాలను కథలుగా రాసి మంచి పేరు సంపాయించుకుంటోంది. చూసి గర్వపడాలి కానీ ఇలా చేస్తారా ఎవరైనా?” అన్నాడు.

వెటకారంగా నవ్వి “గర్వపడాలా ? తను రాసిన కథలన్నీ మా వూరిలో వాళ్ల జీవితాలకి దగ్గరగా వున్నాయని తిట్టుకుంటున్నారు. అదేం పేరో ! ఆ పేరు చూసుకొని మీరంతా తెగ మురిసి పోతున్నారు. చేసేవేవో మంచి పనులు చెయ్యమని చెప్పొచ్చుగా! చూడగానే ముఖం మీద తిట్టే పనులెందుకు చెయ్యడం? రాయడం ఆపెయ్యమని చెప్పలేరా ? అదేదో గొప్పపని అయినట్లు మీరంతా బ్రహ్మరథం పట్టేస్తుంటే ఆవిడగారింకా రెచ్చిపోయి ‘ఎంతయినా నా అంత గొప్ప పేరు నీ కొస్తుందా వదినా ?’ అంటూ నన్ను మొన్న దెప్పి పొడిచింది. అయినా కాలక్షేపం చెయ్యటానికి రాయడమే దొరికిందా?” అంది.

“నీకు చేతకాని పని ఇంకెవరు చేసినా నువ్వు తట్టుకోలేవు. నీ కంటూ ఓ పని లేదు. తృప్తిలేదు. తింటున్నా ఏడుపే. పడుకున్నా ఏడుపే. ఎప్పుడు చూసినా ‘నా కర్మ ఇలా తెల్లారిందే’ అంటూ దుఃఖించటం తప్ప ఇంకేం చేతకాదు నీకు” అన్నాడు.

చెల్లెలు బాధపడుతుంటే భార్యమీదకోపం వస్తోంది రాజారాంకి.

“ఊరుకున్నాను కదాని నోరు లేపకండి ! నాక్కూడా మొగుడు, బాధ్యత లేకుంటే నేను కూడా అలాంటి వెన్నో రాసెయ్యగలను” అంది రోషంగా.

రాజారాం ఆమె మాటల్ని పట్టించు కోకుండా “మరిప్పుడు దాని పుస్తకాల మాటేమిటి ? అలాంటి వెదవపని ఎందుకు చేశావ్ ?” అని అడిగాడు.

వినీల కళ్ళు పెద్దవి చేస్తూ “ఆ పని చేసింది నేను కాదు ఆవిడ గారి పుస్తకాలన్నీ మా వూరి ఆదిగాడి కొడుకు చదివి తెచ్చిస్తానని పట్టుకెళ్తుంటాడు. ఆవిడగారు రాసిన వాక్యాలపై మోజుపడి వాడే కట్ చేసి వుంటాడు. వాడ్ని వదిలేసి నన్ను అనడం మీకు బాగా ఆనందంగా వుంది. వాడ్ని మరీ అంత నెత్తి నెక్కించుకోకండి! ఒకసారి పిలిచి వార్నింగ్ ఇవ్వండి! లేకుంటే అభిమానం అంటూ, ఆరాధన అంటూ కొంపకే ఎసరు తెస్తాడు” అంది.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.