జ్ఞాపకం-34 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

“చచ్చేంత సన్నివేశం లేకపోయినా చచ్చిపోతున్నా అని అనడం అలవాటయిపోయింది నీకు అందులోంచి బయటకి రారాదు” అంది ఒకసారి సరదాగా సంలేఖ.

ఉరిమి చూసి “నువ్వు నాకు చెప్పేదానివా? పనీ పాటా లేకుండా కూర్చుని వూహించుకుంటూ రాసుకునే నీలాంటి వాళ్లకేం తెలుస్తుంది నా విలువ?” అంది వినీల.

“వదినా! అంటే బాధ పడతావుగాని ఇంట్లో వాళ్లను సాధించడం కోసం పగలంతా కష్టపడతావ్! ఎలా సాధించాలో ఆలోచించుకుంటూ రాత్రంతా కష్టపడతావ్! నువ్వెంత కష్టపడ్డా నా అంత పేరు నీకు వస్తుందా? నాకున్నంత మంది ఆభిమానులు నీకుంటారా?” అంది సంలేఖ.

ఆ మాటలు వినగానే ఊపిరి బిగబట్టి ఉడుక్కుంది వినీల. ఆ తర్వాత ఏం జరుగుతుందో, దాని పర్యవసానం ఏమిటో అప్పుడు ఊహించలేదు సంలేఖ.

సంలేఖ రాయడమే కాదు. పుస్తకాలు బాగా చదువుతుంది. పత్రికల్లో వచ్చిన గొప్ప గొప్ప కథల్ని, మంచి మంచి సీరియల్స్ ని కట్ చేసి పెట్టుకుంటుంది. రకరకాల పుస్తకాలని సేకరించి పెట్టుకుంటుంది. అప్పుడప్పుడు ఓ గంట రాసుకోవడం ఆపి వాటిని చదువుకుంటుంది.

అలా చదవటం వల్లనే ఎక్కువ విషయాలను తెలుసుకుంది. కొత్త విషయాలను తెలుసుకుంది. విలువైన మాటల్ని మనసులో నోట్ చేసుకుంటూ జ్ఞానాన్ని సంపాయించుకుంది.

చాలా రోజుల క్రితం దిలీప్ “రచన అంటే అక్షరాల కూర్పుకాదు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించగలగాలి. ఆ సృష్టి కూడా అద్భుతంగా వుండాలి” అంటూ తను చదివిన ఒక నవల గురించి చెప్పాడు.
ఆ నవల పేరు ‘కాలాతీత వ్యక్తులు’ డా|| పి. శ్రీదేవి 1950లో రాసిన నవల అది.

“ఆ నవలలో ఇందిర పాత్ర మధ్య తరగతి అమ్మాయికి నిర్భయంగా వుండడం నేర్పే మనోధైర్యపు క్రాష్ కోర్సులాంటిది. నువ్వు తప్పకుండా చదువు. అందులో ‘పూర్తిగా పోగొట్టుకునే దాకా దేనిమీద ఆశ వదులుకోలేం. ప్రయోజనాలు లెక్క చూసుకొని ఆపైన మమతలు పెంచుకోం. అవి ఏర్పడుతాయంతే! ఈ జీవితంలో ఏదీ ఉచితంగా రాదు. మన చుట్టూ వున్న మనుషుల విలువలు మన కష్టదినాల్లోనే తెలుస్తాయి’ అనే వాక్యాలు నాకు బాగా నచ్చాయి. నువ్వు తప్పకుండా చదువు” అన్నాడు దిలీప్.

ఆ నవలను లైబ్రరీనుండి తెచ్చి పెట్టుకుందే గాని రాసుకుంటూ చదవలేదు. ఇప్పుడు చదవాలి అని అనుకుంటూ లేచి పుస్తకాల సెల్ఫ్ ముందు నిలబడింది. ఆ నవలను తను ఎక్కడుంచిందో అక్కడ చూసింది. కన్పించలేదు. చక చక సెల్ఫ్ మొత్తం వెతికింది. ఎక్కడా లేదు. కంగారెక్కువైంది సంలేఖకు. కారణం అది లైబ్రరీ లోంచి తెచ్చిన నవల.

ఆ నవలేకాదు ఏ నవలా తను పెట్టుకున్న స్థలంలో లేదు. వాటిని ఎవరు మార్చారు ? ఆశ్చర్య పోతూ ఒక్కో నవల పేజీలు తిప్పి చూసి షాక్ తిన్నది. ఆ పేజీలన్నీ సరిగ్గా లేవు. కొన్ని గ్రంథాలయాల పుస్తకాల్లో ఎరికి కావలసిన వాక్యాలను వాళ్లు కట్ చేసుకుని వెళ్లినట్లు ఒక్కో బుక్ లో చాలా పేజీలు బ్లేడుతో కట్ చేసి వున్నాయి.

సంలేఖ అంతటితో ఆగకుండా ఇంకా ఏదో అనుమానం వచ్చి తను కట్ చేసి పెట్టుకున్న సీరియల్స్ ని, కథల్ని తిప్పి చూసింది. అవి కూడా అలాగే వున్నాయి. ఒక కథలో పేపర్ ఇంకో కథలో, ఒక సీరియల్ లో పేపర్స్ ఇంకో సీరియల్ లో కలిసిపోయి వున్నాయి. అవన్నీ కావాలనే ఎవరో విడగొట్టి కలిపినట్లే వున్నాయి. వాటిని సరిచెయ్యటం అంత సులభం కాదు.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.