జ్ఞాపకం-33 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

 

వినీల అది వినగానే నలిపిన కాగితంలా ముఖం పెట్టి “ఆయన వుండేది మంచంలో అయినా ఆ బెదిరింపులు చూడండి అత్తయ్యా! మనిషి పక్కన లేకుంటే ఒక్క పని కూడా చేసుకోలేడు. అంటే అంటారంటారు కాని సంలేఖ రాసుకునేది ఆపేసి వాళ్ల అన్నయ్య పనులు చూడొచ్చుగా. తిలక్ లేడు. నాకు వేలు తెగింది. ఎప్పుడు చూసినా కాగితాలు ముందేసుకుని కూర్చుని అంతగా రాసే రామాయణం ఏముందని? అక్షర దాహం పట్టుకున్న దానిలా రాసి రాసి ఆవిడగారు తెచ్చే అవార్డులతో ఈ కుటుంబం ఖర్చులేమైనా వెళ్లిపోతాయా?” అంటూ వ్యంగ్యంగా అక్కడో క్షణం కూడా నిలబడకుండా కిందవున్న చారు గిన్నెను తన్నుకుంటూ వంటగదిలోంచి పెరట్లోకి వెళ్లింది. అక్కడ సంలేఖ నాటిన మొక్కల్ని కసిగా పీకింది. మళ్లీ నాటింది.

సులోచనమ్మ మనసు గాయపడింది. ఎంత గాయపడినా ఆమెకు ప్రేమించటం మాత్రమే తెలుసు. ఎలాంటి పరిమితులు లేకుండా ఆ ప్రేమను కుమ్మరించడం తెలుసు. మేఘం కూడా అంతే! ఎలాంటి అర్హతలు చూడకుండా పర్వతాలపై, రాళ్లపై, భూమిపై కురుస్తూనే వుంటుంది. సులోచనమ్మ మేఘం లాంటిది. ఇలాంటి మేఘాలు ఎన్ని కుటుంబాల్లో వున్నాయి?

సంలేఖకు వినీల ప్రవర్తన ఏ మాత్రం నచ్చడం లేదు. ఎందుకంటే తనేమో రాత్రీ పగలు తేడా లేకుండా రాసుకుంటూ దానిమీద నుండి ఆలోచనలు కదిలిపోకుండా, ప్రవహించే నీటి ధారను పంటచేలకు మళ్లించినట్లు ఒక్కో అక్షరాన్ని తన మనోక్షేత్రం నుండి బయటకి తీసుకుని కాగితాలపై నింపుకుంటుంటే – ఆమె కావాలనే తేనె తుట్టెను రాయితో కొట్టినట్లు ఏదో ఒక శబ్దం చేస్తూనే వుంటుంది. ఎప్పుడు చూసినా అన్నయ్యతో ఘర్షణ పడుతూ వుంటుంది.

ఆయన ఏదైనా అవసరం వుండి ‘ఒక్కసారి ఇలారా వినీలా !’ అని పిలిచినా అక్కడే వుండి కూడా పలకదు. తర్వాత ఎప్పుడో సడన్ గా ‘ఆ వస్తున్నా !’ అంటుంది. ‘అబ్బబ్బా తలనొప్పి నీతో ! వచ్చే లోపలే ఎన్నిసార్లు పిలుస్తావ్ ? సోది మేళం, సోది మేళం’ అంటూ విసుక్కుంటుంది.

ఆయన స్కూల్ కి వెళ్తున్న రోజుల్లో ఎంతో గౌరవంగా ‘మీరు’ అని సంభోదించేది. ఇప్పుడా పిలుపు మాయమైంది. “నోరుమూసుకొని పడివుండు. రోజంతా నీ దగ్గరే వుండాలా ? నీ వల్ల నాకేంటి ? నా కింకేం పనులుండవా ? ఇదో పెద్ద దేశసేవ అయిందినాకు” అంటూ గట్టిగా అరుస్తుంది.

ఆ అరుపులకి తలనొప్పి వస్తుంది. రాయాలనిపించదు. అలా అని ఎక్కువ సేపు రాయకుండా వుండలేదు. తనకి రచనలు చెయ్యాలన్న ఆలోచన వచ్చిన క్షణాలు ఎంత బలమైనవో కాని రాసిన ప్రతి అక్షరం ప్రజాదరణ పొందుతోంది. పాఠకులు తమ హృదయానికి వాటిని హత్తుకుంటున్నారు.

అలాంటప్పుడు ఆ పాఠకులకి ఏం కావాలో అది అందివ్వాల్సిన బాధ్యత తన మీద వుంది. పాఠకులే లేకుంటే తను చేస్తున్న ఈ అక్షర యజ్ఞానికి ప్రయోజనమే వుండదు.

పాఠకులే దేవుళ్లు, పాఠకులే హీరోలు. అందుకే ఆ పాఠకులు తనతో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు స్టైల్ పోకుండా చక్కగా మాట్లాడుతుంది.

అది చూసి “నీతో మాట్లాడేది మా ఊరి ఆదిగాడి కొడుకు. వాడితో మాటలేంటి ? ఎప్పుడు చూసినా పేపరో, పత్రికో పట్టుకుని తిరిగే పిచ్చివెదవ వాడు. వాడు చదవటం నువ్వు రాయడం. నువ్వు రాసింది మేం చదివామని ఎవరు చెప్పినా చాలు ముఖంలో బల్బు వెలిగించుకుని మాట్లాడుతుంటావ్! నువ్వు మాట్లాడగానే జన్మేదో ధన్యమైనట్లు అదో పెద్ద ఆరాధన వాళ్లలో. చూడలేక చచ్చి పోతున్నా!” అంటుంది వినీల.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.