జ్ఞాపకం-32 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

“అవునా అత్తయా! నేను ఇంకోలా అనుకున్నానే! ఈ మధ్య కాలేజీకి వెళ్లే కొందరమ్మాయిలు ఇంట్లో వాళ్లు డబ్బు లివ్వకపోతే బాయ్ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని మేనేజ్ చేసుకుంటుంటారట. మీరెలాగూ తనకి డబ్బులివ్వరు కదా తనుకూడా అలాంటి పనే చేస్తుందేమో అనుకున్నాను” అంది.

ఆ మాటలు వినగానే సులోచనమ్మ కోపంతో, బాధతో విలవిల్లాడింది.

రోజు రోజుకి వినీల మరీ ఘోరంగా తయారవుతోంది ? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతోంది.
ఏదో ఒకటి మాట్లాడి ఎదుటి వారిని గాయపరుస్తుంది. కారణం లేకుండానే బాధపెడుతుంది. ఇష్టం వచ్చినట్లు ఇబ్బంది పెడుతుంది. ఈర్ష్యతో, అసూయతో మనసుని పాడు చేసుకొని తనలో లేనిది ఇతరులలో చూసి ఓర్చుకోలేక పోతోంది. ఏదో ఒకటి మాట్లాడి ఎదుటి వారిని గాయపరుస్తుంది. కారణం లేకుండానే బాధపెడుతుంది.

కానీ పరిహాసానికైనా ఎవరి మీదా నింద వెయ్యకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. చేయనిది చేసినట్లు, చూడకపోయినా చూసినట్లు,

వినకపోయినా విన్నట్లు ఆపవాదులు ఆపాదిస్తే వాటిని తప్పించుకోగల సమర్థత అందరిలో వుండదు. అసక్తతో, దు:ఖంతో వాళ్లు విడిచిన వేడి నిట్టూర్పు ప్రభావం బాధ పెట్టిన వారిపై తప్పకుండా వుంటుంది. ఎవరి ఉసురు తగిలిందో తన కొడుకు మంచందిగి నడవలేక పోతున్నాడు.

అత్తగారు మాట్లాడక పోవడంతో “మాట్లాడరేం అత్తయ్యా? డబ్బులుంటే ఏ చిట్టీలు కట్టుకోవడానికో, సినిమాలు చూడటానికో, చీరలు కొనడానికో, నగలు చేయించుకోడానికో వాడుకోవాలి గాని ఈ రాయడమేంటో, ఈ ప్రూఫులేంటో ఓ పట్టాన అర్థమై చావదునాకు. అదేం అంటే ఇంట్లో దగ్గడానికి లేదు. తుమ్మడానికి లేదు. అటూ ఇటూ తిరిగి వస్తువులు సర్దటానికి లేదు. తలుపు కిర్రుమన్నా మామయ్యగారు విన్నారంటే వూరుకోరు ‘అది రాసుకునేది కన్పించట్లే ?’ అంటూ కేకలేస్తారు. హడలి చస్తున్నా!” అంది వినీల.

ఆ మాటలకి సులోచనమ్మతో పాటు పక్కగదిలోవున్న సంలేఖ కూడా ఆశ్చర్య పోయారు.

వెంటనే ముఖం అదోలా పెట్టి “నేను కూడా చదువుకున్న దాన్నే అత్తయ్యా ! సంలేఖ కన్నా రెండు సంవత్సరాలే పెద్దదాన్ని, రాయలేకపోయినా ఏదైనా ఓ నవల చదువుకుంటూ కూర్చుంటే ఒప్పుకుంటారా మీరు ? ఏ ఇంట్లోనైనా కూతురుకో న్యాయం, కోడలిక న్యాయం అంటారే ఇదిగో ఇదే ! వేలు తెగినా పని చెయ్యాలి. కాలు తెగినా పని చెయ్యాలి. ఆయన ఏదో గవర్నమెంట్ టీచరని, తెగ సుఖపడిపోతానని మావాళ్లు నన్నిక్కడిచ్చి చేశారు. నా కర్మ ఇలా కాలింది” అంటూ అక్కడే వున్న వేడి చారు గిన్నె చూడనట్లే ఎత్తి పడేసింది.

వేడి చారు కాళ్లమీద పడి చురుక్కు మనగానే కెవ్వున కేకేసి ఒక్క గెంతుగెంతింది. కిందకి వంగి కాళ్లవైపు చూసుకుని “ఉఫ్ ! ఉఫ్ !” అంది.

వెంటనే లేచి సులోచనమ్మ వైపు చూసి “చూడలేదు అత్తయ్యా ! మీ మీదేమైనా పడిందా ?” అంది.
“నీకూ, నాకూ ఎంత దూరముందని నీ మీద పడినది నా మీద పడదా?” అందామె బాధను ఓర్చుకుంటూ.
ప్రశాంతంగా పడుకొని వున్న రాజారాం ఆ శబ్దానికి లేచి “అమ్మా ! వినీలే కదూ ఆ శబ్దం చేసింది. దాన్నిలా పంపు. నా దగ్గర నిద్ర మాత్రలున్నాయి. వేసుకొని నిద్రపోతుంది. లేకుంటే దాని ఆగడాలు భరించలేకపోతున్నాం” అన్నాడు.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.