జ్ఞాపకం-31 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

రాఘవరాయుడు వెళ్లొద్దన్నాడు. తిలక్ వినలేదు. బ్యాగ్ ని భుజానికి తగిలించుకొని ఎంత చెప్పినా వినకుండా ఇంట్లోంచి అడుగు బయట పెట్టబోతుంటే రాఘవరాయుడు తిలక్ బ్యాగ్ ని వెనక నుండి పట్టుకొని ప్రాధేయపడ్డాడు.

“ఆ పని వద్దురా! నోటికాడి చదువు పోగొట్టుకొని అదేం పని? నా మాట విను. అంతగా పని చెయ్యాలని వుంటే మన పొలం ప్రక్కనే ఓ నాలుగు ఎకరాలు పొలం కౌలుకి తీసుకొని చేసుకుందాం. గౌరవంగా వుంటుంది” అన్నాడు.

తిలక్ కి మండింది. అడ్డుగా ఉన్న తండ్రిని కిందపడేలా నెట్టి విసురుగా తన బ్యాగ్ లాక్కున్నాడు.
“నువ్వు నన్నుఎందుకు వుండమంటున్నావో నాకు తెలుసు. నీమాట విని ఇక్కడే వుండి నీ పెద్ద కొడుక్కి సేవ చెయ్యలేను. ఆయన్ని కన్నందుకు నువ్వూ, అమ్మా చెయ్యండి! లేకుంటే ఆయన్ని కట్టుకున్నందుకు వదిన్ని చెయ్యమనండి! మద్యలో నాకేం కర్మ? ఆ పీడ వద్దనే నేను వెళ్లేది.
అడ్డులేయ్!” అన్నాడు. తిలక్ మాటలు ఆ ఇంట్లో అందరికి విన్పిస్తున్నాయి.

రాజారాంలో చచ్చు బడిన నరాలు తమ్ముడి మాటలతో ఇంకా చచ్చుబడిపోయాయి.

సులోచనమ్మ భర్తను గట్టిగా పట్టుకొని “రెక్కలొచ్చిన పక్షిని కాళ్లు పట్టుకుని ఆపాలన్నా ఎగిరి పోవాలన్న కాంక్షతో ముక్కుతో పొడుస్తుందండీ!

వదిలేయ్యటమే మంచిది” అంది.
ఆమె అలా అంటున్నప్పుడు ఆమెలోని తల్లి పేగు తల్లడిల్లిపోయింది.

”వదిలెయ్యటానికి మనం మనుషులమా? పక్షులమా ?” ఆవేశంగా అన్నాడు రాఘవరాయుడు.

“ఇప్పుడీ ప్రశ్నలు ఎవరికోసం వేస్తున్నారు? ఎవరు వాటికి సమాధానం చెబుతారని? ఒక్క క్షణం మౌనంగా వుండి నా మాట వినండి! వాడికి మట్టి తట్టలు మోసుకునే రాత రాసి పెట్టి వుంటే మనం ఆపగలమా! వాడికా రాత రాసింది మనం కాదుగా! వాడిని పుట్టించాం. అంతే! కాళ్లు, చేతులు లక్షణంగానే వున్నాయి.

వెళ్లి బ్రతుకుతాడు. కానీ మన కళ్లముందే రాజారాం అవిటి వాడయ్యాడు. తిలక్ చెప్పినట్లు రాజారాంని మనమే చూసుకోవాలి.

మనకి తోడుగా సంలేఖా, వినీలా వున్నారుగా!” అంది. అలా అంటున్నప్పుడు ఆమె గొంతుకి దు:ఖపు పొర అడ్డు పడింది.

రాఘవరాయుడు కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. బెడ్ మీద పడుకొని ఉన్న రాజారాంని చూసి కదిలిపోయాడు.
అందరూ చూస్తుండగానే తిలక్ వెళ్లి పోయాడు.

తిలక్ వేగానికి, దూకుడుకి అడ్డుగా ఎవరు వెళ్లినా అవమానపడాల్సిందే. అందుకే ఆ ఇంట్లో అందరూ తిలక్ కి భయపడతారు. ఒక్క వినీల తప్ప.

భారతదేశాన్ని చదవాలంటే వివేకానందుడ్ని చదివితే చాలన్నది ఎంత సత్యమో తనకంటూ ఓ వ్యక్తిత్వం వుంటే ప్రపంచం మొత్తం తన ముందు మోకరిళ్ళు తుందన్నది అంతే సత్యం.

‘ఇప్పుడు తనకి వ్యక్తిత్వం వుందా ?’ అని తనను తను ప్రశ్నించుకుంది సంలేఖ. వుంటే వదిన అనే మాటలకి ఎందుకు చలించదు? తనకేమైనా అన్నయ్యలాగా కాళ్లు లేవా? ‘మంచంలో వుండి ఆయనకు మతి పోయింది’ అని వదిన ఎన్నిసార్లు అన్నా చలించకుండా వుండటానికి?

అయినా పంటలు పండకపోవడానికి కారణం ప్రకృతి వైపరీత్యాలేకాని తన పెళ్లి కాదుగా! ఎంత దారుణంగా మాట్లాడింది? సంలేఖ ఇంకా షాక్ లోనే వుంది. అన్నం తినాలన్నా ఆమెకు ఆకలనిపించలేదు.

మొన్నో రోజు వినీల మామగారితో పొలం వెళ్లి గడ్డి కొయ్యకముందే వేలికో కట్టుకట్టుకొని ‘వేలు తెగింది ఇంటికెళ్తాను మామయ్య’ అని అబద్దం చెప్పి ఇంటికి రావడం సంలేఖ చూసింది. ఇంటికొచ్చిన వినీలను చూసి సులోచనమ్మ కూరగాయలు తరిగి పెట్టమంటే ‘అయ్యో ! అత్తయ్య నాకు వేలు తెగింది ‘ అంటూ వేలు చూపించి “సంలేఖతో చేయించుకోండి అత్తయ్యా! తను వంటలో మీకు హెల్ప్ చేసి చాలా రోజులు అయిందిగా” అంది.

సులోచనమ్మ కంగారుగా చూసి “వద్దు సంలేఖను పిలవొద్దు, దాన్ని రాసుకోనియ్! అదేదో పత్రిక వాళ్లు సీరియల్స్ పోటీ పెట్టారట. ఒకవైపు కాలేజీకి వెళ్తూనే రాత్రీ, పగలు నిద్రలేకుండా కూర్చుని రాసుకుంటోంది. రాసిన దాన్ని డి.టి.పి. చేయించుకుని ప్రూఫులు దిద్దుకుంటోంది. దాన్ని డిస్టర్బ్ చెయ్యకు” అంది.

“డి.టి.పి. అంటే మాటలా ? బోలెడు డబ్బులు కావాలి. ఎలా వస్తున్నాయో !” అంటూ కళ్లు చక్రాల్లా తిప్పింది.

సులోచనమ్మకి అర్థంకాక “ఎలా రావడమేంటి ? దాని కథలు కొన్ని ప్రత్యేక సంచికల్లో బహుమతులు గెలుచుకున్నాయిగా. ఆ డబ్బుల్ని డి.టి.పి.కి వాడుకుంటున్నానని నాతో చెప్పింది” అంది.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.