కోత(కవిత)- గిరిప్రసాద్ చెలమల్లు

అమ్మకి
ఆయువు
అండాశయాలు
గర్భసంచులు

అవేమీ ఒద్దంటూ
శస్త్రచికిత్సలకై
ఎగబడుతున్న అమ్మలు
ముప్పై దాటకముందే

ముప్పూటలా
ముద్దకై
మురిపాలు తీరకముందే
కత్తెర్ల కోతకి
అమ్మ అవయవాలు

తెగి పడుతున్నాయ్
మాంసపుముద్దలై
డబ్బుమూటలు
వైద్య శాలల్లో దండిగా

అవయవ స్పృహ
ఎరుగని అమ్మ
దీర్ఘకాలిక సమస్యల
ఉహించని అమ్మ

తెగ్గోసుకుంటున్న
బహిష్టు మూలాలు
పనికి అడ్డం
ఆ ఐదు రోజులు
ఎగ్గొడితే జరిమానా
గుత్తేదార్ల హుకుం

అమ్మానాన్నలవ్వగానే
పరస్పర అంగీకారం
మూటాముల్లె సర్దుకుని
అవయవ ఛేదనం
నిస్సంకోచంగా

ఎటువైపు పయనమో
ఎందాకో పయనం
చెరుకు ముఠా పనిలో
జీవితమే బలి

చెరుకు దట్టి
మధ్య పశ్చిమ మరాట్వాడా
మసైపోతున్న అమ్మతనం
అమ్మల గోస
తీరేదెన్నడో
అవే లేకపోతే
గుత్తేదార్ల జననం ప్రశ్నేగా?
ప్రశ్నిస్తే
అమ్మ పని గాయబ్
నోటికాడి ముద్ద చేజారే !

ఎలా అమ్మలు
మీ వెతలు తీరేదెట్లా ?!
ద్రవ్య వినిమయ విపణిలో
అమ్మ అవయవాల కోత
చెరుకు కోతకై

(మహారాష్ట్ర బీడ్ సోలాపూర్ ప్రాంతాల్లో ఘటనలకు స్పందన )

– గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.