గాయం వాసన(కవిత )- నక్క హరిక్రిష్ణ

ఎందుకో ఇవ్వాల

ఆకాశం తల్లడిల్లుతూ

జోల పాట పాడుతుంది

చెవులు రిక్కించి విను

నీలాల్లాంటి కళ్ళు రెండు

చేతిలో ఎర్రటి గోటీలయ్యాయి

నెలవంకల వంకర చూపులు

తెల్లటి పాత్రలో

మదపు దాహంతో ఉన్నయి

ఎవరైనా ఇనుప గొట్టం తెండి

ఈ రెండు కాళ్లు అడ్డమొస్తున్నయి

శ్వాసనాళాల్లో కొంత పొగను పెట్టు

మూడేళ్ల మెరుపు దేహం కదా

రుచి సరిగ్గా సరిపోతుంది

మిగిలిన ముద్దను మోరీలో వెయ్యి

దృశ్యమాలికలకు చెప్పండి

దాని అవసరమిప్పుడు లేదని

గాయం వాసన పీల్చుకొని

ఒంటి కన్ను రాకాసులు తృప్తిపడతారు

చిట్టచివరిగా

ఇంకొక్క ఘనకార్యం మిగిలింది

నిద్రవస్తను పరిపించి

నాలుకలపైన వాతలు పెట్టాలి

కడుపుకోతల మీద

శాంతి కాముకుల వేషం కట్టాలి

కవితలుPermalink

Comments are closed.