పురోగామి(కవిత )-దేవనపల్లి వీణా వాణి

రోజులు మారుతుంటాయి

తిమిరాన్ని మింగే కిరణం
నిశ్శబ్ద ఆకాశాన్ని చీల్చుకొని
పుట్టే ప్రతి సారీ
రోజులు మారుతుంటాయి

కుత్తుకను బిగబట్టి
కత్తి పీట ముందు పెట్టి
తన గుడ్లను పొదిగినా
కాకిని దోషిని చేసే కోకిలమ్మను ఎట్లా ఎదుర్కోవాలో బోధ పడని గాలి
నేల మీద తర్కపు
మేఖలగా పరుచుకుంటుంది

ఇన్నాళ్లు
కూర్మ మర్మం పాటించిన
బుద్ధుడి
లోలకపు ఆలోచన
లోయలోకి జారిపోయాక
అర్థం అయ్యికానీ
వాక్యాల దాడిలో
నలిగిన పుటలా
చూపు చిక్కు పడిపోతుంది

ముక్కలు కానున్నది
ఏమిటో స్పష్టం అయినాక
గాఢమైన నలుపు
పులుముకుంటున్న ఇంట
నిప్పుకు భయపడి
దీపం వెలిగించకపోతే
చీకటిని నియంత్రించడం ఎవరి తరం

మోహం లేని నడతను వదిలి
మొహం ఎట్లా ఉందో
నిర్ణయించేస్తే
అద్దం అందుకొని …
అది ఎగతాలో
తగవుల తలుగులో
తేల్చి విదుల్చుకోలేకపోతే
నిందను మోసుకుతిరగడం ఎంత భారం..

కుంపటి రగిల్చి
రేపటి రోజును రాహువు
మింగుతుంటే
రోజా పూల పొగడ్తల్లో మునిగిపోయి
దేశాన్ని
ముక్కలు చేసే చేతులను
కట్టడి చేయకపోతే అది ఎంత నేరం

సందిగ్ధాల సంధిని
దాటించే రోజులు వస్తుంటాయి

రోజులు కొన్ని లోకాన్ని అర్థం చేసుకునేటందుకు కొత్త కళ్ళను
మొలిపిస్తూ ఉదయిస్తుంటాయి

రోజులు మారుతుంటాయి

-దేవనపల్లి వీణా వాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.