రజిత చూపు -గర్భసంచులు నిషేధమైన ఊళ్ళు- రజిత కొమ్ము

స్త్రీల శరీరాల పై హక్కు వారికెప్పుడూ లేదు.అందులో నిరుపేద, దారిద్ర్య రేఖ కు దిగువన ఉన్న స్త్రీల గర్భాల పై సామాజిక కట్టుబాట్లు ,కుటుంబాల పెత్తనం, ఆర్ధిక భారం మరీ ఎక్కువ.అయినా వారు అనాదిగా అన్నీ మౌనంగా నే సహిస్తున్నారు.

ఒకప్పుడు నిరుపేద కుటుంబాల్లో ఎంతమంది పిల్లలుంటే సంసారానికి అన్ని చేతుల సహాయం అన్న నానుడిలా..పది మంది దాకా పిల్లల్ని కనేవాళ్ళు.అన్ని కాన్పులతో శుష్కించి జీవచ్చవాల్లా మారి తనువు చాలించేవాళ్లు.

తర్వాత వరకట్న దాహాలకు , విపరీత పోకడలకు ఆడపిల్లలని కనడం నేరమైపోయింది.మధ్యతరగతి ప్రజల్లో కూడా మగపిల్లవాడు ప్లెస్సూ.. ఆడపిల్ల అంటే మైనస్సూ అన్న ఆలోచన పెరిగిపోయింది.మనుషుల మూర్ఖత్వానికి తగినట్లు స్కానింగ్ మెషిన్ లు వచ్చి వేలల్లో భ్రూణ హత్యలు జరిగాయి.

ఇప్పుడు మహారాష్ట్ర లోని కొన్ని జిల్లాల్లో గ్రామాలు విచిత్ర పరిస్థితి లో ఉన్నాయి.

“,బీడ్ ” జిల్లాలోని ‘ హాజిపూర్’ లాంటి గ్రామాల్లో దాదాపు స్త్రీలకు ఎవరికీ గర్భసంచి లేదు..
కారణం పేదరికం.నివ్వెరపరిచే వాస్తవాలు..

మధ్య మహారాష్ట్ర నుండి పడమర వైపు ‘ షుగర్ బెల్ట్ ‘ గా పేరుగాంచిన బీడ్ ,సోలాపూర్, కొల్హాపూర్, సాంగ్లి , సతారా జిల్లాలకు ప్రతీ సంవత్సరం 5 లక్షల మంది ఆడా, మగా చెరుకు కోతలకు వలస వెళ్తారు.

సెప్టెంబర్ నెల మొదలుకొని మార్చ్ వరకూ దాదాపు ఆరునెలల పని ఉంటుంది.చెరుకు పండించే రైతులు చాలా పెద్ద ఎత్తున జరిగే కోత పనులకు కాంట్రాక్టర్లను నియమించుకుంటారు.

ఈ కాంట్రాక్టర్లు భార్య ,భర్త ఇద్దరిని కలిపి ఒక యూనిట్ గా పరిగణిస్తారు. వేరువేరు గా కాకఇద్దరికి కలిపి కూలీ టన్నుల చొప్పున చెల్లిస్తారు.ఇద్దరిలో ఏ ఒక్కరు ఒక్క రోజు చెరుకు కోతలకు రాకపోయినా 500 రూపాయల జరిమానా కాంట్రాక్టర్ కు తిరిగి చెల్లించాలి.లేదా వాళ్లకు ఇవ్వాల్సిన కూలీ నుండి తగ్గిస్తారు.

ఈ చెరుకు పనులకు స్త్రీలకు నెలసరి రావడం ,వాళ్ళు ఒకటి రెండు రోజులు పని మానడం కాంట్రాక్టర్లు సహించలేకపోతున్నారు.

దీనికి ఆ అమాయక జనం ఆశ్రయించేది ” hysterctomy” .
ఒకరు ఇద్దరు పిల్లలు పుట్టేసాక ఇక గర్భసంచి అవసరం లేదని కోతలు మొదలుకాకముందే గర్భసంచి తీసేయించుకుంటున్నారు.

ఊళ్ళల్లో ఉన్న RMP డాక్టర్లు , టౌన్ ల లో ఉన్న నర్సింగ్ హోమ్ డాక్టర్లు , కాంట్రాక్టర్ల కు ఉన్న టై అప్ తో అమాయక , నిరక్షరాస్య పేద స్త్రీలు బలి అయిపోతున్నారు.సగటున 25 సంవత్సరాలు ఉన్న స్త్రీలు గర్భసంచి , ఓవరీలు కూడా తీయించేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ తెలుస్తుంది.

ఇంకా ఘోరం ఏమిటంటే అడ్వాన్స్ గా 30, 000 ఆపరేషన్ కోసం ముందుగా నే ఇచ్చి గర్భసంచి తీయించేసుకుని రమ్మని ఇస్తాడు..ఫలానా RMP ప్రిస్క్రిప్షన్ పై ఫలానా నర్సింగ్ హోమ్ లో చేయించుకోవాలి అని బాండ్ రాసుకుంటారు.

చిన్న వయస్సులో నే గర్భసంచి తీయించేసుకోవడం వల్ల కలిగే నష్టాలు , యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, బోన్ డీప్లేషన్ వంటి వి , అనేక శారీరక ,మానసిక సమస్యల గురించి వాళ్లకు అవగాహన లేదు.

దాదా పటేల్ అనే కాంట్రాక్టర్ మాట్లాడుతూ,
” మాకు ఇది టైం బౌండ్ టార్గెట్ ఉన్న పని , సకాలంలో కోతలు కంప్లీట్ కాకుంటే మేము చాలా నష్టపోతాం.అందుకే బహిష్టు అయిన స్త్రీలను రావొద్దు అంటున్నాం.రెండ్రోజులు మానేసినా మాకు నడవదు ” అని నిక్కచ్చిగా చెప్తున్నాడు.

హాజిపూర్, వంజన్ వాడి గ్రామాల స్త్రీలల్లో 60 శాతం మంది 40 ఏళ్ళ లోపలి వాళ్ళే.వాళ్ళెవరికీ ఇప్పుడు గర్భసంచులు లేవు.

ఆ కుటుంబాలు ఐదు నెలలు దారుణమైన పరిస్థితుల్లో చెరుకు మిల్లుల దగ్గర కాపురం ఉంటారు. చిన్న పిల్లల్ని ఊళ్ళల్లో వదిలేసి, ప్లాస్టిక్ గుడిసెల్లో , మిల్లుల దగ్గర నుండి వచ్చే దుర్గంధం భరిస్తూ ,ఎటువంటి బాత్రూం ,నీటివసతి లేని దగ్గర ఉండాల్సివస్తుంది.

బహిష్టు వస్తే ఇంకా కష్టం అని అన్ని బాధలకూ ఒకే పరిష్కారం అని కనుగొన్న ఈ ఆపరేషన్ ఉపాయం వాళ్ళ శరీరాలపై జీవితాలపై ఎంత దుష్ప్రభావం చూపిస్తుందో వాళ్ళకు కనీస అవగాహన లేదు.

మూడు నుంచి ఐదు నెలల చెరుకు కోతల కాలంలో ఒక భార్య భర్త కలిసి 300 నుండి 400 టన్నుల చెరుకు పని చేస్తారు.కూలీ టన్నుకు 250 నుండి 300 వరకు ఉంటుంది.అంటే అయిదు నెలల లో ఒక భార్య భర్తకు కలిపి సగటున మూడు లక్షల
సంపాదన.

ఈ విషయం పై అవగాహన కల్పించడానికి ఆయా గ్రామాలకు వెళ్తున్న NGO ల పై , వ్యక్తుల పై దాడులు జరుగుతున్నాయి.’తథాపి ‘ అనే సంస్థ కు చెందిన అచ్యుత్ బోరగొఅంకార్ మాట్లాడుతూ..

” విచక్షణా రహితంగా జరుగుతున్న ఈ ఆపరేషన్లు వాటి దుష్ప్రభావాల పట్ల అవగాహన కల్పించాలనుకుంటున్నాం.కానీ అందుకు గ్రామస్థులు ఒప్పుకోవడం లేదు. కూలీలు వాళ్ళ కుటుంబాలు 3 నుండి 4 లక్షల సంపాదన గురించే ఆలోచిస్తున్నారు.మిగతా ఆరు నెలలు వాళ్లకు వేరే పనులు ఉండవు.కాబట్టి చెరుకు కోతల పైనే ఆధారపడతారు .”

ఆపరేషన్ తర్వాత కూడా ఫిజికల్ ఇంటెన్స్ పనులు , బరువైన పనులు చేయకూడదన్న డాక్టర్ల మాట పెడచెవిన పెడుతున్నారు.కిడ్నీ యూరినరీ ఇన్ఫెక్షన్లు తదితర కొత్త సమస్యలతో చితికిపోతున్నారు.
ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. పెద్ద పెద్ద షుగర్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ,MLA లు ఎంపీ లు ,రాజకీయనాయకులు అయినప్పుడు లాభనష్టాల లెక్కలు తప్ప కూలీల ఆరోగ్యం సంగతి ఎవరికీ పట్టదు.

మహారాష్ట్ర అంతటా యధేచ్ఛ గా జరుగుతున్న ఈ ఆపరేషన్ల పై అందరూ స్పందించాలి. పెద్ద ఎత్తున నిరసన తెలపాలి.

-రజిత కొమ్ము ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

రచయిత్రి పరిచయం :

పేరు : రజిత కొమ్ము,

స్వస్థలం : నిజామాబాద్ .

వృత్తి : Principal, govt  .junior college,  peddemul , వికారాబాద్ .

రచనా వ్యాసంగం :

పలు కథలు , కవితలు  అనేక పత్రికలలో ప్రచురితం అయ్యాయి .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

కాలమ్స్Permalink

Comments are closed.