కథువా(కవిత )- గిరిప్రసాద్ చెలమల్లు

కథువా
కథ నిండా కన్నీళ్ళే
పసి మానం
క్రూరమృగాల దాడిలో
ఛిద్రమౌతుంటే
చేసిన ఆర్తనాదాలకి
గర్భగుడిలో ప్రాణం లేని విగ్రహం సాక్ష్యం

కేసులో ఎన్నెన్నో
ఆటుపోట్లు
న్యాయవాదికీ తప్పని
అవే బెదిరింపులు
పురుషాధిక్యత పంజాలో

ధిక్కార స్వరం కోర్టు ప్రాంగణంలో
మారుమోగగా
చిట్టితల్లి ఘోష ఆలకించిన కోర్టు
నల్లగుడ్డ కళ్ళ ను తొలగించుకుని
బాహ్యప్రపంచ వీక్షణ

శిక్ష ఏదైనా
రుజువైన నేరం
మతం మఠం కోర్టు
మెట్లపై బోల్తా
యావజ్జీవమో
ఉరిశిక్షో
న్యాయమింకా సజీవమే
ముకుళిత హస్తాల తో
దండం న్యాయానికి

– గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.