ఆక్రందన (కవిత ) – గిరిప్రసాద్ చెలమల్లు

నవమాసాలు
తల్లి గర్భంలో
అలవోకగా
హాయిగా హుషారుగా
నీకిష్టమొచ్చిన రీతిలో
ఊపిరి పోసుకున్నావే
ముఖ్యంగా రక్షణ కవచకుండలమైన
ఆ గర్భం లో

నిన్ను మోయలేకో
కాల పరిమితి ముగిసిందనో
నిన్ను ఇముడ్చుకునే సత్తా లేకనో
బయటికి నెట్టేసిన గర్భం

నీకేం తెల్సులే
ఇలలో
ఇలాకాలో
నీ అంగాలణచివేత
పద్దెనిమిదేళ్ళ ముందు
నీలాగే బయటపడ్డ మరో అంగం దాడిలో

ఆధిక్యత
బలాదూర్ ఒరవడి
ఒరుసుకుంటూ అరుచుకుంటూ
ఆరుబయట నిదురించే
అదృష్టాన్ని చిదిమేస్తూ
కుసంస్కార క్రీడలో
నవమాసాలకే జననేంద్రియాల ఛిద్రం

ఎందుకు ఏమిటి ఎలా
ప్రశ్నించ రాని
దండం కాల్మొక్తా బాంచెన్
బ్రతిమాడలేని
పరిగెత్త నడకే రాని
అఘాయిత్య ఓనమాలెరుగని
కొడవలి రాయి బాడిసె
ఆయుధంగా చేసుకోలేని
పసికూన ఆక్రందన
ఏ మాతా వినలేదా !
వినబడినా
మాత గోస పసికూన చెవిలో వేసిందా ?!

– గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~~

కవితలుPermalink

Comments are closed.