మేఘసందేశం- 20 వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు చేసిన రచనలు అలనాటి ప్రకృతిని, సామాజిక జీవనాన్ని, రాజకీయ వ్యవస్థను నిక్షిప్తంచేశాయి. ఆయన రచనలు చదవడం అంటే ఆనాటి సమకాలీన పరిస్థితులు తెలుసుకోవడమే. అప్పటి సంస్కృతిని ప్రతిబింబించే కాళిదాసు రచనల్లో ‘విక్రమోర్వశీయం’  కూడా యెన్నదగినది. ఇది  ఒక సంస్కృత నాటకం.

 విక్రమోర్వశీయం నాటకం ఇతివృత్తాన్ని కాళిదాసు ఋగ్వేదంలోని సంవద సుక్త నుండి, మహాభారతం వంటి ఇతిహాసం, బ్రాహ్మణాల్లో ఒకటైన శతపథ బ్రాహ్మణం, విష్ణు పురాణం, పద్మపురాణం, మత్స్య పురాణం, భాగవత పురాణం ,మొదలైన గ్రంధాలనుండి స్వీకరించాడు. ఇందులో కథానాయకుడు పురూరవుడు, కథానాయకి ఊర్వశి. వీరిద్దరి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారమే ఈ నాటకం ఇతివృత్తం. పైన పేర్కొన్న ప్రాచీన ఇతిహాసాలు, పురాణాలు; ఇతర సాహిత్య గ్రంథాలలో లేని అనేక విషయాలను మహాకవి కాళిదాసు తన నాటకంలో సమకాలీన రాచరిక వ్యవస్థలోని వ్యక్తిగత జీవితాలను చక్కగా ప్రతిబింబింపచేశారు. అప్పట్లో బహుభార్యత్వం ఉందని అర్థమవుతుంది. అదే సమయంలో రాజు పట్టపురాణికి ఎంతో మర్యాద ఇస్తాడనీ తెలిపిన నాటకం ఇది. వైదిక ధర్మాన్ని అనుసరించి రాజులు పరిపాలిస్తూ చివరి దశలో వానప్రస్థాశ్రమం స్వీకరించేవారని ఈ నాటకం నిరూపిస్తున్నది. కాళిదాసు మిగతా రచనల్లో మాదిరిగానే ఈ నాటకంలో కూడా ప్రకృతి వర్ణన అద్భుతంగా సాగుతుంది. రకరకాల ఉద్యాన వనాలు, కొండలు, పర్వతాలు, అటవీ ప్రాంతాలను వర్ణించిన తీరును బట్టి ఆకాలంలో ఉద్యానవనాల పెంపకం ఉందని, దట్టమైన అడవులతో భారత భూభాగం పచ్చగా ఉండేదని అర్థంచేసుకోవచ్చు. మొత్తం మీద వేదాలు, ఇతిహాసాలు, పురాణాల్లోని ఇతివృత్తాలను, పాత్రలను తీసుకొని ఆనాటి కవులు, నాటకకర్తలు, గ్రంథరచయితలు రచనలు చేయడం సర్వసాధారణమని కాళిదాసు తన ‘విక్రమోర్వశీయం’ ఇతివృత్తం ద్వారా నిరూపించాడని చెప్పవచ్చు. రఘువంశము, కుమారసంభవము వంటి ఉత్తమ కావ్యాలతో సరితూగే కావ్యం ఇది. మళ్ళీ మనం మేఘ సందేశంలోకి ప్రవేశిద్దాం.

గత మాసం “ఏభిః సాధో హృదయనిహితైర్లక్షణైర్లక్షయేథా” అన్న శ్లోకంతో ముగిస్తూ అలకాపురి పట్టణ వర్ణనను మనోహరంగా ముగించి, యక్షుడు తన గృహం ముందు వున్న అనేక విశేషాలను తెలియజేస్తున్నాడు.

శ్లో. 20. గత్వా సద్య: కలభతనుతాం శ్రీఘ్రసంపాత హేతో:

క్రీడాశైలే ప్రధమకథితే రమ్యసానౌ నిషణ్ణ:

అర్హస్యంతర్భ వనపతితాం కర్తు మల్పాల్పభాసం

ఖద్యోతాలీవిలసితనిభాం విద్యుదున్మేష దృష్టిమ్

భావం:  ఓ మేఘుడా! నీవు మాయింటి వద్దకు చేరిన తర్వాత తొందరగా దిగడానికి నీ శరీరాన్ని కొంచెం తగ్గించుకొని చిన్నదిగా చేసుకో! మా ఇంటిలో అందమైన చరియలున్న క్రీడా పర్వతంపై కూర్చో!  మిణుగురు పురుగులవలె ప్రకాశించే నీ కంటి చూపు కాంతులను మా ఇంటివైపు ప్రసరింపజేయి. తద్వారా నీవు వచ్చావన్న విషయం నా అర్ధాంగి గ్రహిస్తుంది.

 

శ్లో. 21. తన్వీ శ్యామా శిఖరి దశనా పక్వ బింబాధరోష్ఠీ

మధ్యే క్షామా చకితహరిణీ ప్రేక్షణా నిమ్ననాభిః

శ్రోణీభారాదలసగమనా స్తోకనమ్రా స్తనాభ్యాం

యా తత్రస్యాద్యువతి విషయే సృష్టిరాద్యేవ ధాతుః

భావం: ఓ మేఘమిత్రమా! నీవు నా భార్యను ఎలా గుర్తుపట్టాలో చెబుతాను విను!  ఆమె సన్నని దేహం కలది. నడి యౌవనంలో ఉంది. మొనదేరిన పలువరస కలది. దొండపండ్లవంటి పెదవులు కలది. సన్నని నడుము కలది. బెదరిన లేడి చూపుల వంటి చూపులు కలది. లోతైన నాభి కలది. పిరుదుల బరువు వల్ల మెల్లి మెల్లిగా నడిచే నడక కలది. స్తనభారంతో కొంచెం అణిగి ఉండేది. సృష్టి కర్త బ్రహ్మ యొక్క మేలైన సృష్టిగా నా భార్యను నీవు తెలుసుకుంటావు..

 

శ్లో.22. తాం జానీథాః పరిమిత కథాం జీవితం మే ద్వితీయం

దూరీభూతే మయి సహచరే చక్రవాకీమివైకాం

గాఢోత్కంఠాం గురుషుదివసేషు ఏషు గచ్ఛత్సు బాలాం

జాతామన్యే శిశిరమథితాం పద్మినీవాన్యరూపామ్

భావం:  ఓ మేఘమా! నా భార్య పరిమిత భాషి. నేను తనకు శాపం వల్ల దూరం అయ్యాను.  జంట పక్షి యెడబాటుకు గురైన  ఆడు చక్రవాక పక్షివలె  తీవ్రమైన విరహబాధతో ఇన్ని రోజులు గడపిన తర్వాత, దీనురాలై, నాకు రెండవ ప్రాణమైన నా భార్య మంచులో నలిగిన తామర తీవ వలె గుర్తింపరాని దేహంతో ఉండవచ్చునేమో జాగ్రత్తగా గమనించవలసినది అని చెప్తున్నాడు యక్షుడు.

 

శ్లో.23.  సూనం తస్యా: ప్రబల రుదితో చ్ఛూన నేత్రం ప్రియాయా:

నిశ్వాసానా మశిశిరతయా భిన్నావర్ణాధరోష్టహమ్

హస్తన్యస్తం ముఖమసకల వ్యక్తి లంబాల కత్వా

దిందోర్దైన్యం త్వదనుసరణక్లిష్టకాంతే ర్భిభర్తి

 

భావం: ఓ మేఘుడా! ఓ మేఘమిత్రమా! నా భార్యా నా వియోగంవలన సదా రోదిస్తూ ఉండడం వలన ఆమె కన్నులు వాచి ఉండవచ్చు. వేడి నిట్టూర్పులధికంగా విడవడం వలన ఆమె అధరాలు రంగుమారిపోయి ఉండవచ్చు. ఆమె విచారంతో ముఖాన్ని రెండు అరచేతులలో ఉంచుకుని రోదిస్తూ ఉండడం వలన ఆమె ముంగురులు ముఖానికి అడ్డుపడి పూర్తిగ కనబడని మొహం నీవు అడ్డుపడడం వలన మసక బారిన చంద్ర బింబం లాగా కాంతి విహీనయై నీకు దీనవదనయై కనిపించవచ్చు. నీవు ఏ మాత్రం భ్రమలలో పడక ఆమెను గుర్తించవలసి యున్నది.

 

శ్లో.24. ఆలోకే తే నిపతతి పురా సా బలివ్యాకులా వా

మత్సాదృశ్యం విరహతను వా భావగమ్యం లిఖన్తీ

పృచ్ఛన్తీ వా మధురవచనాం సారికాం పఞ్జరస్థాం

కచ్చి ద్భర్తుః స్మరసి రసికే త్వం హి తస్య ప్రియేతి

 

భావం: ఓ మేఘుడా! నీవు మా యింటి దగ్గరకు వెళ్ళిన సమయంలో ఏ దేవతారాధనలోనో ఉండవచ్చు. విరహంతో చిక్కిపోయి  నా చిత్రపటాన్ని పూజిస్తూ ఉండి వుండవచ్చు. లేదా పంజరంలోని గోరువంకను “నీ యజమానిని స్మరిస్తున్నావా? నీవు ఆయనకు ప్రియమైన దానివి కదా?” అని ప్రశ్నిస్తూ ఉండి వుండవచ్చు. అంటూ యక్షుడు మేఘునికి తన ప్రియురాలి స్థితి ఎలా ఉంటుందో చెప్పలేను అంటూ విన్నవిస్తున్నాడు.

యక్షుడు తన యెడబాటు వలన భార్య మనోస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తూ వివరించి చెబుతూ కొనసాగిస్తున్నాడు.ఆవిశేషాలేమిటో వచ్చే మాసం తిలకిద్దాం.

 (ఇంకా ఉంది ).

– వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Comments are closed.